సుబ్బుమామయ్య కబుర్లు!
పిల్లలూ బావున్నారా!
ఇప్పుడు మీకో విషయ చెబుదామనుకుంటున్నానర్రా! అదేమిటంటే, మీరెప్పుడైనా గాలిని గమనించారా? అది ఎప్పుడూ నిశ్చలంగా ఉండదు. వీస్తూనే ఉంటుంది. అలాగే నీళ్లు కుదురుగా ఉండవు. ప్రవహిస్తూనే ఉంటాయి. గాలి వీయక పోతే మనకు ఊపిరాడదు. నీళ్లు ప్రవహించకపోతే, పాకుడు పట్టి పాడైపోతాయి. ఇది మనకు ప్రకృతి చెప్పే పాఠమర్రా! మనం కూడా ఎప్పుడు ఉత్సాహంగా, ఉళ్లాసంగా, ఉత్తేజంగా ఉండాలి. మార్కులు తక్కువ వచ్చాయనో, టీచర్ తిట్టిందనో మనసు చిన్నబుచ్చుకోకూడదు. కుమిలిపోకూడదు. కాస్త శ్రమించి అలాంటివి ఇంక భవిష్యత్తులో ఎదురవ్వకుండా చూసుకోవాలి.
మనం చిన్న విత్తనం నేలలో పాతుతాం, నీళ్లు పోస్తాం. అది చిన్నగా మొలకెత్తి, మొక్కై, మానై, పూలు కాయలూ ఇస్తుంది. అలాగే మనం విద్యాభ్యాసం చేస్తూ..ఎదుగుతూ..చక్కని పనిమంతులమవ్వాలి. మన పని చూసి అందరు మురిసిపోవాలి. పెద్దయ్యాక అంతటి పేరు రావాలంటే, ఇప్పుడు చక్కగా చదువుకోవాలి. మన మంచి కోరే పెద్దలు చెప్పే మాటలు శ్రద్ధగా వినాలి. ఆచరణలో పెట్టాలి.
గాంధీజీ, వివేకానందుడు, సైంటిస్ట్ జగదీశ్ చంద్రబోస్, మదర్ థెరెస్సాలు చిన్నప్పట్నుంచి అలా పెరిగినవారే!
చిన్నప్పుడు ఎంత నేర్చుకుంటే అంత ఉపయోగం. ఒక్క విషయము కాదర్రా! ఎన్నయినా, ఎంతయినా నేర్చుకోవచ్చు.
తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉండాలి. చెయ్యాలన్న తపన ఉండాలి. సాధించాలన్న దృఢ సంకల్పం ఉండాలి.
వనరుల్లేకపోతే పనులవ్వవు. ఒక్కోసారి వనరులున్నా పనులవ్వవు. ఎందుకంటే ఎలా ఉపయోగించుకోవాలో తెలియనితనం. నిర్లక్ష్యం.
మనకు అన్నీ అమర్చే అమ్మనాన్నలున్నారు, పాఠాలు చెప్పే టీచర్లున్నారు. చదువుకుని ఎదగడానికి ఇంకేం కావాలి. కాని చాలామంది పిల్లలు చిన్నప్పటి సమయాన్ని ఆట పాటలతో గడిపేసి, పెద్దయ్యాక బోలెడన్ని బాధలు పడతారు.
అందుకే మీరు ఇప్పటి నుంచే చక్కగా చదువుకోవాలి. పైకి రావాలి. సరేనా!
ఉంటానర్రా!
మీ సుబ్బుమామయ్య
***
No comments:
Post a Comment