జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 22
చెన్నూరి సుదర్శన్
(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి అనుభవాలను వారితో పంచుకుంటూ ఉంటాడు.)
ఏకాంబరం వారం రోజులు సెలవు పెట్టాడని తెలిసింది. వారం రోజులు హాయిగా గాలి పీల్చుకోవచ్చు అనుకున్నాను. స్టాఫ్‍రూమ్ నిద్రావస్థలో ఉన్నట్లుంది. సునీత ఆరోజు కాలేజీకి రాలేదు. బహుశః సెలవు పెట్టిందేమో అనుకున్నాను. హిస్టరీ లెక్చరర్ మనోహర్ నేను మాత్రమే మిగిలాం.
మనోహర్ చాలా నెమ్మదస్తుడు. ‘పలుకు బంగారం.. కునుకు సింగారం’లా ఎప్పుడు చూసినా నిద్రావస్థలో ఉన్నట్లుంటాడు. కాని టీచింగ్‍లో మంచి పేరుంది. క్లాసు రూంలో చాలా ఆక్టివ్.. అని అనుకుంటారు మాస్టాఫంతా..
నమ్మశక్యం గాక ఒక రోజు నేను మనోహర్ క్లాసు గమనించాను. నిజమే.. హృదయానికి హత్తుకునేలా పాఠం చెబుతున్నాడు. పిల్లలు మైమరచి వింటున్నారు. నాకు ఆశ్చర్యమేసింది. కాని బయట ఎందుకలా ఉంటాడో అర్థంగాక పోయేది.. కుటుంబ సమస్యలేమో అనుకున్నాను.
ఈ రోజు కాస్తా చొరవ తీసుకొని విషయం తెలుసు కుందామని “మనోహర్ సార్.. టీ తాగొద్దాం రండి..” అంటూ కుర్చీ నుండి లేచాను.
మనోహర్ కప్‍బోర్డులో టీచింగ్ మెటీరియల్ సర్దుకొని బయలు దేరాడు. కాలేజీ వెనక గేటు దాటగానే ఎదురుగా టీ కొట్టు. అందులో అల్లం టీ మంచి రుచికరంగా ఉంటుంది.
“మనోహర్ సార్.. సిటీలో ఎక్కడుంటారు” అంటూ మెల్లిగా మాటల్లో దించాను.
“కూకట్‍పల్లి దగ్గర ప్రశాంత్ నగర్లో ఉంటాను సార్.. మీరు?” అంటూ తిరిగి నన్ను ప్రశ్నించాడు.
చెప్పాను.
ఫరవాలేదు.. లైన్లో పడ్డాడు. ఇక ప్రొసీడ్ అవ్వొచ్చు.. అనుకున్నాను.
ఇంతలో మా అటెండర్ కొండయ్య మాకెదురయ్యాడు. నేను సహజంగా అందరితో కలివిడిగా ఉంటాను.
పాపం..! కొండయ్య ఒక్కడే కాలేజీకి దిక్కు. ఆఫీసు, ప్రిన్సిపాల్ చివరికి స్టాఫ్ స్వంత పనులు సైతం చేసి పెడ్తుంటాడు. ఒళ్ళు దాచుకోకుండా..
“కొండయ్యా..టీ తాగుదాం పద ” అంటూ పిలిచాను.
వెంటనే మనోహర్ “సార్ నన్ను ప్రిన్సిపాల్ రమ్మన్నాడు.. జ్ఞాపకం లేదు.. మీరు పదండి. నేను వస్తాను” అంటూ వెనుతిరిగి చూడకుండా వడి, వడిగా అంగలు వేస్తూ వెళ్ళిపోయాడు నా నోట మాట వినకుండా.. లిప్తకాలం నిలిచి పోయాను ఆశ్చర్యంగా..
కొండయ్య నేను టీ కొట్టుకు వెళ్లాం.
“మూడు టీ లు స్పెషల్” అంటూ చెప్పాను.
“మూడేందుకు సార్.. రెండు చాలు. మనోహర్ సార్ రాడు”
“ఎందుకు రాడు.. వస్తానన్నాడుగా..”
“ రాడు సార్.. నాకు తెలుసు”
“అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావ్..”
“ప్రిన్సిపాల్ కాలేజీలో లేడు సార్.. ఎప్పుడో ఇంటికి వెళ్లి పోయాడు”
“ప్రిన్సిపాల్ లేడంటే.. వెంటనే తిరిగి వస్తాడు.. రాడని ఎలా చెబుతున్నావ్..”
“రాడు సార్..” అంటూ చిన్నగా నవ్వాడు కొండయ్య.
టీ లు రెండు చాలంటూ టీ చేసే అతడికి చేతి వేళ్ళతో చూపిస్తూ..
“అదే నాకర్థం గావటం లేదు.. ఏది ఏమైనా పాపం మనోహర్ సార్ చాలా కాంగోయింగ్..” అన్నాను.
“కాం గోయింగా..! కాలాంతకుడు సార్..” ఠక్కున అన్నాడు కొండయ్య దీర్ఘాలు తీస్తూ. నేను ఆశ్చర్యపోయాను.
“కాలాంతకుడా.. నేను నమ్మను” అన్నాను.
“నేను స్వయంగా చూసిన.. అందుకే నేనంటే మనోహర్ సార్‍బుగులు పడ్తడు. ఎప్పుడైనా మనోహర్ సార్ నాకు పని చెప్పంగ సూసిండ్లా..” అంటూ టీ లు అందుకున్నాడు. నాకొక గ్లాసిచ్చాడు.
తనూ తాగుతూ విషయానికొచ్చాడు.
“మనోహర్ సార్ ఐదేండ్ల కిందట ఇక్కడ పని చేసి నప్పటి సంగతి. పోయినేడాదే ఈడికి మల్ల వచ్చిండు”
“అసలు సంగతి చెప్పు” ఉద్వేగంగా అడిగాను.
(సశేషం)
No comments:
Post a Comment