నెత్తుటి పువ్వు - 13
మహీధర శేషారత్నం
(జరిగిన కధ :రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు. రాజు చెల్లెలు వసంత అతని ఇంటికి వస్తుంది. )
“ఏమిటి, అందులో తప్పేముంది? అంత విసుగెందుకు?”
“నిజమే లక్ష్మీ! పోవలసిన వాళ్ళమే. కాని ఉన్నన్నాళ్ళు, ఉన్నవాళ్ళ మాటేమిటి? వాళ్ళని చూసేదెవరు? ఉన్నన్నాళ్ళు కొడుకు ముసలి తల్లిని పట్టించుకోలేదు. ఇప్పుడు మరో ఇద్దరు పసిప్రాణాలు. నేననేది వాళ్ళ సంగతి... సరే! సరే! నే వెళ్ళి ఇంకో పాలపాకెట్టు తెస్తాను. కాస్త కాచి ఆ ముగ్గురికీ ఇయ్యి పాపం. ముసలిది, పసివాళ్ళు.” షర్టు తగిలించుకుని బయటికి వెళ్ళాడు. లక్ష్మి కాస్త ఉప్మాకూడా చేసి టిఫిన్ పెట్టి, పాలు ఇచ్చింది. “నీ ముద్దా నేను తింటున్నానురో! కొడకా! దేవుడింకా నాకా ఆయస్సు పోసాడురో! పాపిష్టి ముండా దేవుడు నన్ను తీసుకుపోయి నాబాగా వుండు”రాగాలు పెడుతూనే ఉంది కాశింబి.
పోగయిన నలుగురూ ఏదో ఓదారుస్తూ అక్కడే ఉన్నారు. నాగరాజు పిల్లల్ని తెచ్చి నాయన దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకున్నాడు.” ఏవో చిట్లు కడతారండి. ఏమయిందో మాకూ సరిగ్గా తెలియదు. నిన్న సాయంత్రం మొగుడూ, పెళ్ళాలు అరుచుకున్నారు. చాలాసేపు తెల్లవారు ఝామున కడుపులో మంట భరించలేక బయటికివచ్చి పక్కింటివాళ్ళ తలుపుకొట్టి పడిపోయారుట. నురగలు కక్కుతున్న వాళ్ళని చూసి కంగారుపడి నలుగురిని పోగేసి ఆటోలో గవర్నమెంటు ఆసుపత్రికి తీసుకెళ్ళారు. నేను పిల్లల్ని నా దగ్గర ఉంచుకున్నాను. ఇంతలో ఆసుపత్రికెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి అప్పటికే పోయారని పోలీసుకేసు, పోస్టుమార్టము చెయ్యాలని మార్చురీలో పెట్టారు అని చెప్పారు. నేను పిల్లల్ని తీసుకు ఇక్కడికి వచ్చాను. ఎంతయినా తల్లికదా! చెప్పాలిగా!” అన్నాడు విచారంగా నాగరాజు లోపలికెళ్ళి తన పనులు చేసుకుని టిఫిన్ తిని, టీ తాగేడు.
“లక్ష్మీ! నేను గవర్నమెంటు హాస్పటల్ కి వెళ్ళివస్తాను. వివరాలు తెలుసుకొస్తాను.” అంటూ బయటికొచ్చి ముసలావిడ దగ్గర కొచ్చాడు. “మామ్మా! మీ వాళ్ళెవరికి చెప్పాలి. నెంబర్లు ఉంటే ఇయ్యి” అన్నాడు. ఇంతట్లో ఆ ముసలి ఆవిడ మనవడు జేబులోనుంచి సెల్ఫోన్ తీసాడు.
“అంకుల్! మా నాన్న ఫోన్!” అందించాడు.
“అవసరం అవుతుందేమోనని నే తెచ్చానంకుల్!”అన్నాడు మళ్ళీ ఏడేళ్ళ పిల్లాడి తెలివికి ఆశ్చర్యపోయాడు నాగరాజు మాట్లాడకుండా ఫోన్ తీసుకు కాంటాక్ట్స్ చూసాడు. పేర్లన్నీ చదువుతూ కాసింబీ చెయ్యిమన్న వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అట్నుంచటే ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. తమ జ్యూరిస్ డిక్షన్ కాకపోయినా ఒకటే డిపార్ట్ మెంటు కాబట్టి ఏదో సహాయంచేసి డెడ్ బాడీస్ ఇంటికి వచ్చేట్లు చేసాడు. ముసలావిడ ఒకటే ఏడుపు. డెబై యేళ్ళ ముసల్ది ఎక్కడ పోతుందోనని భయపడ్డాడు. మరునాటికి కోడలువైపు బంధువులంతా కూడా వచ్చారు. కాశింబీ కూతురు వచ్చింది. మీరే కారణమంటే మీరే కారణమంటూ కొట్లాట.
పిల్లల విషయం మాకు సంబంధం లేదని ఎక్కడివాళ్ళక్కడ తప్పుకున్నారు. ఈ గొడవ, హైరాను కాని ముసల్దకాని, పసివాళ్ళు కాని తిన్నారా! అని పట్టించుకున్న వాళ్ళేలేరు.
తాడూ, బొంగారం లేని వాడికిచ్చి చెయ్యడం వల్లే తమ చెల్లెలు ఇలా అర్ధాంతరంగా చచ్చిందని కోడలి అన్నగార్లు తిట్లు, ముసలిది కాసింబీ ఏడ్చి ఏడ్చి నోట్లోంచి మాటరాని స్థితిలో పడుంది. కూతురు తక్కువది కాదు. ఆ అమ్మాయి అంది పుచ్చుకుంది, తాడూ బొంగరం లేని వాడికిచ్చి చేసారంటే మీరెంత లేనోళ్ళో అంటూ.
పోగయిన నలుగురూ కేకలేసి ముందు కార్యక్రమం చూడండి. అంటూ కేకలేసారు. పోయిన వాళ్ళ కథ ముగిసి మిగిలిన వాళ్ళ కథ మొదలయింది.
పేదోళ్ళకిచ్చిన పట్టా భూముల్లో ఎప్పుడో నలభై ఏళ్ళ కింద కాశింబీ మొగుడు కట్టించిన రేకుల ఇల్లు. పెద్దకొడుకు మిలట్రీకి వెళ్ళి చనిపోవడం, రెండో కొడుకు వేరుపడిపోవడం, మొగుడు పోవడంతో కాశింబీ ఒకతే ఉంటోంది. వితంతువుల కిచ్చే వృద్ధాప్యపు పింఛను వస్తుంది. దానితోనే ఏదో నెట్టుకొస్తోంది. ఉండడానికి గూడు ఉంది కనుక తన పిడికెడు మెతుకులు ఇన్నాళ్ళూ సమస్య కలేదు. ఇప్పుడు పిల్లలు జీవితపు చరమదశలో మళ్ళీజీవితాన్ని మొదలెట్టాలి. ఏదైనా సంస్థలో చేరుద్దామా అనుకున్నాడు నాగరాజు. వద్దులే బాబూ! ఏదో నేనున్నన్నాళ్లు నాకాడనే ఉంటారు. తరువాత వాళ్ళ తలరాత ఎలా ఉంటే అలా అవుద్ధి అనేసింది కాశింబీ. లేని ఓపిక తెచ్చుకుని నాలుగిళ్ళల్లో పాచిపని మొదలెట్టింది. గవర్నమెంటు బళ్ళో వేసింది పిల్లల్ని పిల్లల మధ్యాన్న భోజనం అక్కడే. సాయంత్రం ఏదో నాలుగు మెతుకులడకేసి ఇళ్ళల్లో ఇచ్చేవాటిలో కడుపు నింపుకొనేది. ఏ ఆదివారం పూటో పిల్లలు ఆడుకోడానికి వచ్చేవారు. వాళ్ళని చూస్తే నాగరాజుకి ముచ్చటగా ఉండేది. లక్ష్మి ఏ బిస్కట్లో పెడితే తిని ఆడుకునేవారు. కాలం ఎవరికోసం ఆగదు. ఈనాటి దుఃఖము రేపటి కుండదు.
(సశేషం)
No comments:
Post a Comment