బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య కీర్తనలు-10 ( సర్వభూపాల వాహనము) - అచ్చంగా తెలుగు

బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య కీర్తనలు-10 ( సర్వభూపాల వాహనము)

Share This
బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు-10 ( సర్వభూపాలవాహనము)
డా.తాడేపల్లి పతంజలి


2019 బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగవరోజు 03-10-2019 గురువారం రాత్రి గం08.00ని. నుండి గం10.00నిలవరకు  అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడైన వేంకటేశునికి సర్వభూపాల వాహన సేవ జరుగుతుంది.

సేవాపరాః శివసురేశ కృశాను ధర్మ
రక్షోంబునాథ పవమాన ధనాధినాథాః
బద్ధాంజలిప్రవిలసన్నిజ శీర్షదేశాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం||
ఈ శ్లోకం సర్వభూపాల వాహన సేవలో వినబడుతుంటుంది.
(ఎనిమిది దిక్కులను పాలించు  శివుడు,  ఇంద్రుడు,  అగ్ని,  యముడు,  నిరృతి, రావణుడు, వాయువు, కుబేరుడు నిన్ను సేవించుటకై  అత్మ శిరస్సులపై చేతులు జోడించినారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగుగాక!)
సర్వభూపాలవాహనంలో స్వామి  సాధారణంగా కృష్ణుని రూపంలో దర్శనమిస్తాడు. (ఈ అలంకారం అప్పుడప్పుడు మారుతుంటుంది).
సర్వ భూపాలాధిపతి అయిన ఆ ప్రహ్లాద వరదుడైన   స్వామిని వినుతిస్తూ అన్నమయ్య  చేసిన ఒక కీర్తనను తాత్పర్యంతో తెలుసుకొని ఆ స్వామి పదాలకు నమస్కరిద్దాం. 
.
రేకు: 0328-04  సం: 04-163
పల్లవి:
కొలువైతా నల్లవాడె కూచున్నాడు గద్దెమీద
బలవంతు డితడు ప్రహ్లాదవరదుడు
చ.1:
 చిడుముడిగోళ్లతోడ సింహపుమోముతోడ
తొడమీదగూచున్న తొయ్యలితోడ
కడలేనినవ్వుతోడ కడురాజసముతోడ
అడరించీ బంతము ప్రహ్లాదవరదుడు
చ.2:
సంకుజక్రములతోడ చాయలమేనితోడ
సంకెదేర్చేయభయహస్తముతోడ
బింకపుమీసాలతోడ పెనువదనముతోడ
అంకె వరములిచ్చీ బ్రహ్లాదవరదుడు
చ.3:
 వనితకౌగిటతోడ వామకరముతోడ
ననుపైన తమలోనానందముతోడ
యెనయుచు శ్రీవేంకటేశుడై యీడా నాడా
అనిశము వెలసె బ్రహ్లాదవరదుడు
భావం
పల్లవి:
అదుగో..  గద్దెమీద ప్రహ్లాదునికి వరములిచ్చిన బలవంతుడైన  నరసింహస్వామి కొలువుచేస్తూ కూర్చున్నాడు.
చ.1:
కోపం కలిగిన గోళ్లతో, సింహపుమోముతో, తొడమీద కూచున్న అమ్మవారు లక్ష్మీదేవితో,అంతంలేని నవ్వుతో ,రజోగుణమువల్ల కలిగిన గర్వముతో ( విలాసముతో),పౌరుషాన్ని వ్యాపింపచేస్తూ ప్రహ్లాదునికి వరములిచ్చిన బలవంతుడైన  నరసింహస్వామి ఉన్నాడు.
చ.2:
శంఖచక్రములతో, ప్రకాశించే శరీరముతో,అభయహస్తముతో,బిగువైన మీసాలతో, పెద్ద మోముతో, మనస్సును తన
సమీపంలో ఉంచిన వారికి  వరములిచ్చిన బలవంతుడైన  ప్రహ్లాద నరసింహస్వామి కొలువుచేస్తూ ఉన్నాడు.
చ.3:
ఉత్తమమైన చేతులతో  చుట్టిన  లక్ష్మీదేవి కౌగిలిలో,అనురాగంతో, తమలోని ఆనందముతో ప్రకాశిస్తూ  శ్రీవేంకటేశుడై ఇక్కడక్కడ (ఇక్కడ అహోబలంలో, అక్కడ తిరుమలలో) ఎప్పుడు ప్రహ్లాదునికి వరములిచ్చిన బలవంతుడైన  ప్రహ్లాద నరసింహస్వామి  ప్రకాశిస్తున్నాడు.(ప్రసిద్ధికెక్కాడు)
  స్వస్తి
 
***

No comments:

Post a Comment

Pages