శాస్త వైభవం - 5
శ్రీరామభట్ల ఆదిత్య
3.జ్ఞాన శాస్త:
అష్టశాస్త స్వరూపాలలో జ్ఞానశాస్త రూపం మూడవది. పేరుకు తగ్గట్టుగానే జ్ఞానశాస్త రూపం విద్యకు, జ్ఞానానికి ప్రతీక. శివ స్వరూపమైన దక్షిణామూర్తి లాగానే ఈయన కూడా వీణ పట్టుకొని మఱ్ఱి చెట్టు కింద కూర్చుని ఉంటాడు. ఆకాశభైరవ కల్పంలో స్వామికి సంబంధించిన విషయాలు ఉన్నట్టుగా చేప్తారు.
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో తిరువళ్ళకావు అనే ఊరిలో ఈ స్వామి ఆలయం ఉంది. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా వేడికరంపాళయంలోని 'విద్యా శాస్త' ఆలయం కూడా ఈ స్వామిదే.
4. కళ్యాణ వరద శాస్త:
వివాహ సంబంధమైన సమస్యలు ఉంటే ఈ స్వామిని తప్పక పుజించాలి. స్వామి మనకు పూర్ణా దేవి, పుష్కళా దేవి సమేతుడై కనిపిస్తారు. భూతనాథ చరితం మరియు గుహ్య రత్న చింతామణి మొదలైన గ్రంథాలలో మనకు స్వామి వారి గురించిన వివరాలు తెలుస్తాయి.
నేపాల్ మహారాజు పలింజన్ ఒకసారి తన కుమార్తె అయిన పుష్కళను మహాకాళికి బలివ్వాలని నిర్ణయించాడట. ఇది తెలుసుకున్న ధర్మశాస్తుడు ఆ అమానవీయ చర్యను ఆపాడట. తన తప్పు తెలుసుకున్న మహారాజు తన కుమార్తెను శాస్తకిచ్చి వివాహం జరిపించాడట. మరోకసారి బేతాళ భూతాలచేత పీడింపబడుతున్న పింజక రాజ్య ప్రజలను భయముక్తులుగా చేసాడట ధర్మశాస్త అది మెచ్చిన ఆ రాజు తన కుమార్తె పూర్ణను శాస్తుడికిచ్చి వివాహం జరిపించాడట. ఇలా స్వామికి ఇద్దరు దేవేరులు ఉన్నారు. వీరివలన శాస్తుడికి 'సత్యక' అనే కుమారుడు కూడా ఉన్నాడు.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ధర్మాచరణ వలన అజ్ఞానం, అంధకారం, జడత్వం తొలగి పూర్ణత్వం లభిస్తుంది ఇంకా ధర్మాచరణ వలన భయం, దుఃఖం, నిరాశ లాంటివి నశించి పుష్కలత్వం లభిస్తుంది. అంటే ధర్మాచరణ వలన 'పూర్ణత్వం' మరియు 'పుష్కలత్వం' సిద్ధిస్తాయి. పూర్ణం అంటే భక్తి మార్గం, పుష్కలం అంటే జ్ఞాన మార్గం. ధర్మం వలన వచ్చిన పుష్కలపూర్ణత్వాలు సత్యానికి మార్గం చూపిస్తాయి. సత్యం అంటే ' పరబ్రహ్మం 'పరబ్రహ్మాన్ని' చేరుకోవడానికి పూర్ణత్వం, పుష్కలత్వం అనే రెండు దారులన్నాయి.
ఇక్కడ ధర్మశాస్త అంటే ధర్మాచరణకు ప్రతీక.
పూర్ణత్వం అంటే భక్తి మార్గం
పుష్కలత్వం అంటే జ్ఞాన మార్గం
సత్యకుడు సత్యానికి ప్రతీక.
ధర్మాన్ని ఆచరిస్తూ ఈ మార్గాలని అనుసరించి సత్యాన్ని ( పరబ్రహ్మాన్ని ) చేరుకోవడమే స్వామి యొక్క ఈ అవతార సందేశం.
( ఇంకా వుంది )
No comments:
Post a Comment