శివం - 55
రాజ కార్తీక్
(కల్పన భారతి కథ కొనసాగుతుంది ..తన కుటుంబాన్ని పోగొట్టుకున్న తర్వాత తన ఆహం కారం పక్కన పెట్టి కేవలం సంగీతమే తన కు అన్నీ అని జీవితాన్ని మొదలు పెట్టింది .)
కల్పన భారతి అలా తన సంగీత సాధన కొనసాగిస్తుంది. రోజులు అలాగే గడుస్తున్నాయి...
ఆ గుడిలో జరిగే కచేరీలకు తను ఎంతోమంది గాయని గాయకులకు మంచి తర్ఫీదు ఇప్పించ వల్సిందిగా రాజాజ్ఞ.. ముభావమైన తను ఆ పనిలో ఉంది .
ఆమె స్వరం, గాత్రంతో పాట రాని వారికి సైతం
కళలపట్ల ఆసక్తి కలుగుతుంది. సంగీతం గురించి ఏమీ తెలియని వారికి కూడా దానిలోని మాధుర్యం తెలిసేది. తన సంగీత పాఠాలలో మిగతా సంగీత పరికరాలు వాయించే వారు కూడా మాధుర్యంలో మైమరచి స్వరం తప్పేవారు. అలా అందరినీ సంగీతంలో లీనం చేసేది ఆ కల్పన భారతి.
ఇలా సాగుతుండగా, కచేరీలు, ఉత్సవాలు మొదలు అవ్వసాగాయి. అక్కడ ఉన్న నా ఆలయ ప్రాంగణంలో జరుగుతోంది ఆ వేడుక...
గ్రహణం రావటంతో తర్వాత జరిగే గ్రహణ శుద్ది కార్యక్రమాలు పూర్తి చేసుకొని మొదలుపెడదాం అనుకున్నారు.
తలా ఒక పని చేస్తున్నారు. ఆ గుడిలో
ఎవరో "రేయ్ త్వరగా ఎక్కడ సామానులు అక్కడ జాగ్రత్త చేయండి. కాసేపటిలో గ్రహణం, గుడి మూసేస్తారు. ఆలయ ప్రాంగణం లో చిన్న దేవాలయాలు కూడా ఉండటం వల్ల ఈ ఆలయం అంత మూసి వేస్తారు. ఇక అన్ని రేపు ఉదయాన్నే " అంటూ అందరూ అన్నీ సర్దుకొని అందరూ బయటకు వస్తున్నారు.
తన పాఠం అయిపోగానే కల్పన కూడా తను తెచ్చిన సంగీత వాయిద్యాలు లోపల పెట్టటానికి గుడిలోకి వెళ్ళింది. ఆ అలయాంలో మూల విరాట్ గా ఉన్న నా ప్రతిమను చూసి, వేదాంతపు నవ్వు నవ్వి వెళ్ళింది.
గుడిలోని లోపల గదిలో పెట్టటానికి వెళ్లింది.
ఆ పరికరం పెట్టిన తను ఒక్కసారిగా వెనక్కి చూసింది. అంతే, ఎంతో పెద్దదయిన నా నటరాజ విగ్రహం చూసి ఉలిక్కి పడింది.
ఎప్పుడు తిందో ఏమో చిట్టి తల్లి, అలాగే స్పృహ తప్పు పడి పోయింది.
అక్కడకు వచ్చిన ఆలయ సిబ్బంది 'ఎవరయినా ఉన్నారా?' అని గట్టిగా అడిగినా జవాబు రాకపోయేసరికి వెళ్లిపోయారు.
వాకబులో కల్పన భారతీ వెళ్లిపోయిందేమోనని అందరూ వెళ్ళిపోయారు.
చిన్నగా ఆలయం అంతా ఖాళీ అవ్వ సాగింది.
చివరిగా ప్రధాన ద్వారాలు కూడా మూసి, మళ్లీ మహాదేవుడు మనకి దర్సనం ఇచ్చేది రేపు సూర్యోదయమప్పుడే అని గ్రహణం సందర్భంగా మూసివే స్తూ చెప్తున్నారు.
ఇక ఆలయంలో,గర్బ గుడి ప్రాంగణంలో ఉంది కల్పన భారతీ, నేను మాత్రమే...
అవును, అన్ని చోట్ల ఉన్న నేను, ప్రత్యక్షంగా కొన్ని చోట్లకు వస్తాను.
చీకటి పడింది ...
కళ్ళు తెరిచింది కల్పన భారతీ. ఒక్కసారిగా లేచి చూసుకుంది. తనకు అర్దమయ్యింది, తను ఆలయంలో ఇరుక్కు పోయిందని. ఒక్కసారిగా ఆ గదిలో నుండి బయటకు వచ్చి, అన్ని తలుపులు మూసి ఉండటంతో తనకు ఏమి చేయాలో పాలుపోలేదు.
దూరం నుండే నా గర్భ గుడి తలుపు వైపు చూస్తోంది. బాగా నీరసించి ఉంది. అక్కడ ఉన్న పెద్ద పెద్ద ప్రమిదల వెలుగులో కనపడుతూ ఉంది ఆ అంతః ప్రాంగణం.
శుష్కించుకు పోతున్నాయి కల్పన కనులు...
నిలబడలేక కూల బడి పోతోంది. పక్కనే ఉంది నాకు నివేదించిన ప్రసాదం. దాని వైపు చూసిన కల్పన, 'మహా అయితే ఈరోజు తన ప్రాణం పోతుంది. ఇప్పుడు తాను ఎవరి కోసం ఉండాలి? పోతే పోయింది నా ప్రాణం పరమేశ్వరుడి సన్నిధిలో,' అనుకుంటున్నది. కానీ మనిషిగా పుట్టిన ఎవరి కైనా ఆకలి దప్పిక బాధ తప్పదు కదా. బతుకు మీద ఆశలేని తను ఈరోజు ఉపవాసం చేసి, తన ప్రాణాన్ని త్యజిం చాలి అని అనుకుంటున్నది.
ఇంతలో...
కల్పన భారతి కొడుకు స్వరం వినిపించింది.
"అమ్మా, నువ్వు అన్నం తినవా? నువ్వు తినకపోతే నాకు ఆకలి వేస్తోంది."
కల్పన మాత్రం ఇది తన మనసులో వచ్చిన మాయ అనుకుంటున్నది.
చనిపోయిన తన చిట్టి తండ్రి గొంతు వినపడటంతో తనకు చాలా రోజులకు మంచి స్ఫురణ వచ్చింది అని అనుకో సాగింది...
తన మొహం నేలకు ఆనించి, అలాగే పడుకొని ఏడవ సాగింది
మళ్లీ స్వరం "అమ్మా, అక్కడ ఉన్న ఆ ప్రసాదం నువ్వు తినమ్మ, అప్పుడే నాకు ఆకలి తీరుతుంది." అంటూ వినవచ్చింది.
కల్పన "చిన్నా, నువ్వేనా? నిజంగా నా కనుల ముందుకురా. నన్ను వదిలి వెళ్లిపోలేదు కదా" అంటూ పిచ్చి ఆనందంలో అరవసాగింది.
స్వరం "సరే నువ్వు తిను నేను వస్తాను, " అంది
అలాగే అలాగే అంటూనే అక్కడ ఉన్న ప్రసాదం మొత్తం తిని, అక్కడ ఉన్న నీరు అంతా తాగింది.
నా చిట్టి తల్లికి మళ్లీ ఓపిక వచ్చింది.
కల్పన భారతీ "మొత్తం తిన్నాను, తొందరగా రా తండ్రి ..."అంటూ నిజంగా తన బిడ్డ ఏమో అని చూడ సాగింది.
అటు పక్కన నిజంగా కల్పన కొడుకు పరిగెడుతూ ఆడుతున్నాడు.
కల్పన కనులు చమ్మ గిల్లాయి...
ఆమె మనసులో ఆనందం పరుగులు పెడుతోంది...
కల్పన తన బిడ్డను చూసేసరికి మళ్లీ మామూలుగా అయ్యింది. ఆమెకు తన బిడ్డ వచ్చాడేమోనని ఎంతో సాంత్వనగా ఉంది.
కానీ తన కొడుకు తనకు చిక్కకుండా ఆట పట్టిస్తున్నాడు. తను కూడా తన బిడ్డ వెంట పరిగెడుతోంది. ఏదో తల్లి తన కొడుకుతో సరదాగా అడుతునట్టు, కల్పన వెళ్ళిన ప్రతి వైపు, అక్కడ దేదీప్యానంగా ప్రమిదలు, దీపాలు వెలుగూ మొదల అవ్వసాగాయి.
అటు తిరిగీ, ఇటు తిరిగి, మళ్లీ కల్పన ప్రసాదం తిన్న చోటుకి వచ్చింది.
అక్కడ బారుగా తన బిడ్డ పరిగెత్తి గర్బగుడిలోకి ప్రవేశించాడు. తలుపులు వేసి ఉన్నాయి.
ఒక్కసారిగా కల్పన తన చుట్టూ పక్కల చూసింది. అక్కడ ఇది వరకు లేని వెలుగు... చీకటిలో కూడా పగటి వలె వెలుగూ!
తాను అనుకున్నట్టు జరిగిందంతా మాయే!
అడుగు ముందుకు వేసుకుంటూ గర్బ గుడి వైపు రా సాగింది...
గర్బ గుడి తలుపులు తెరుచకున్నాయి.
కల్పనా ఆశ్చర్యంగా ఒక అడుగు వెనక్కి వేసింది.
(సశేషం)
No comments:
Post a Comment