వినదగునెవ్వరు చెప్పిన...
రమేష్ బాబు
కృష్ణమూర్తి, రామకృష్ణ ఇద్దరూ స్నేహితులు, ఉత్త స్నేహితులే కాదు. ఒకే ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ కొన్ని నెలల తేడాతో రిటైరైన సహోధ్యోగులు కూడా. ఇద్దరివీ చిన్న కుటుంబాలే. కృష్ణమూర్తికి ఇద్దరు ఆడపిల్లలు, రామకృష్ణకు ఇద్దరూ మగపిల్లలే. ఇద్దరూ కష్టపడి పనిచేసే రకమే ఐనా ఇద్దరి ప్రవర్తనలో మాత్రం తేడా కనిపించేది.
కృష్ణమూర్తి స్వతహాగా కష్టజీవి. మధ్యతరగతి నేపథ్యం నుండి వచ్చినవాడు. ఉత్త గ్రాజుయేషన్ ముగించి ఈ కంపెనీలో గుమాస్తాగా చేరి అంచెలంచలుగా తన తెలివితేటలు, నడవడితోనే ఒక స్థాయి ఆఫీసర్ గా రిటైరయ్యాడు. రామకృష్ణ అలా కాదు. కాస్త ఉన్నవాళ్ళ ఇంటినుండి వచ్చినవాడు. కాకపోతే ఆ ఉన్నదేదో ఇతడి వద్దకు వచ్చేసరికి అంతా పోయి మధ్యతరగతి స్థాయికే వచ్చింది. ఇంట్లో కాస్త రాజరికపు పాలు ఎక్కువ. అదీగాక ఆయన భార్య రమామణి కూడా మంచి ఆర్థిక తాహతుగల కుటుంబం నుండి వస్తూ కాస్త ఎక్కువగానే కట్నం తెచ్చింది. దానికి తోడు ఇద్దరూ మగ పిల్లలే కలిగేటప్పటికి రామకృష్ణకు కాస్త టెక్కు అలవడింది. చేరటం కూడా ఆఫీసర్ గానే చేరాడు ఈ కంపెనీలో. కానీ ఈయన నడవడిని గమనించిన పై అధికారులు ఇతడికి ప్రమోషన్లు ఇవ్వడం ఆలస్యం చేశారు. దాంతో స్నేహితులిద్దరూ ఒకే లెవెల్లో రిటైరయ్యారు.
కృష్ణమూర్తి కంపెనీలోనైతే నేమి, తన స్వంత జీవితంలోనైతే నేమి క్రొత్త ఒరవడి ఏదొచ్చినా ఆసక్తి కనబరచి దాన్నినేర్చుకునేవాడు. దాంతో కంపెనీలో కంప్యూటర్స్ కోసం ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కృష్ణమూర్తికి ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో కంపెనీ అకౌంట్స్ గురించి మేనేజ్ మెంట్ వారు ఏదైనా అడగాలంటే ఆయననే అడగడం జరిగేది. అలా కంపెనీలో కృష్ణమూర్తికి మంచి పేరు వచ్చింది. అలా తనకు కంపెనీ పుణ్యమా అని అబ్బిన కంప్యూటర్ జ్ఞానాన్ని ఇంట్లో కూడా కొనసాగిస్తూ లోన్ తీసుకుని ఇంట్లో కూడా ఒక సిస్టమ్ కొని తనకు కావలసిన పనులను కంప్యూటర్ పైన చేసుకునేవాడు. ఇలా ఆయన ఇంటికి సిస్టమ్ తీసుకోవడం వలన అది ఆయన అమ్మాయిలకు కూడా చాలా ఉపయోగపడింది.
రామకృష్ణకు పని చేయించుకోవడం చాలా బాగా చేతనయేది. మంచి మాటకారి కావడం, ఆఫీసర్ హోదాలో ఉండడం వలన తన క్రింది వారితో తనకు కావలసిన పనులను చేయించుకునేవాడు. తనకు కంప్యూటర్ నేర్చుకోవాలసిన అవసరం లేదు అనుకునేవాడు. అలా ఆయనకు కంప్యూటర్ల గురించి అసలు తెలిసి రాలేదు. కొడుకుల బలవంతానికి ఇంట్లో సిస్టమ్ కొనుక్కున్నా తను దానిని తాకిన పాపానికి పోలేదు. “ మేము నేర్పిస్తాము డాడీ “ అని పిల్లలు ఎంత పోరినా “ అది నా చేతకాదు లేరా ! అయినా అన్నిటికీ కంప్యూటర్లే కావాలా ఏవిటీ ! “ అని కొట్టి పడేసే వాడు. ఆ పిల్లలు నేర్పడం వలన వాళ్ళమ్మ నేర్చుకుని ఫేస్ బుక్ అకౌంట్ పెట్టుకుని వీళ్ళంతా ఆఫీసుకి, కాలెజీలకి వెళ్ళినాక తన ఫేస్ బుక్ స్నేహితులతో కాలం గడిపేది. స్మార్ట్ ఫోన్ వచ్చాక దానికి షిఫ్ట్ అయ్యింది కానీ అది వేరే సంగతి. రామకృష్ణ ఫేస్ బుక్ కానీ వాట్సప్ కానీ వాడేవాడు కాడు. తనేదో అందరికంటే వేరు అనే భావనను వెలిబుచ్చేవాడు అందర్లో ఉన్నప్పుడు. కానీ పిల్లలు పోరీ పోరీ పోరగా వాట్సప్ వాడడం మొదలెట్టినా ఏదో వానాకాలపు చదువులాగా ప్రతిదానికీ పిల్లల్నో, భార్యనో పీడించేవాడు. దేనికైనా అంతే. కరెంటు బిల్లు కట్టాలన్నా, వాటర్ మీటర్ బిల్లు కట్టాలన్నా, ఇంటి పన్నుకట్టాలన్నా తన క్రింది వారెవరికో చెప్పడమో లేదా పిల్లలకో భార్యకో పురమాయించడం లాంటివి చేసేవాడే కానీ తను స్వతహాగా చేసేవాడు కాడు. అలాగని అన్నీ సరిగ్గా కట్టారో లేదోనని పరీక్షించి చూసుకునేవాడు. మొత్తానికి ఆఫీసులోనూ, ఇంట్లోనూ కూడా ఆఫీసర్ దర్పాన్నే చూపేవాడు.
ఇలా తన పనులు తన ప్రమేయం లేకుండా అవడం చూసిన రామకృష్ణకు కృష్ణమూర్తంటే చిన్నచూపే ఉండేది. అనవసరంగా కష్ట పడతాడు అని ఆయన భావన. కొన్ని సార్లు చెప్పికూడా చూశాడు. “ ఎవరికైనా చెప్పెయ్యి. వాళ్ళు చేస్తారు కదా “ అని. కానీ కృష్ణమూర్తికి తన పరిమితులు తెలుసు. ముందంతా తనే వెసులుబాటు చేసుకుని బిల్లులన్నీ కట్టేవాడు. ఆన్ లైన్ సదుపాయాలు వచ్చినాక బిల్లులన్నీ వాటి ద్వారానే కట్తూ తన పని సులభం చేసుకున్నాడు. రామకృష్ణ ఆన్ లైన్ కట్టడాన్ని నమ్మేవాడు కాదు. “ వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు కట్టిన రశీదులు అడుగుతారు బాబూ . ఆన్ లైన్ వి ఒప్పుకుంటారో లేదో “ అనేవాడు. దాంతో వాళ్ళ ఇంట్లో ఈయన అంటే తేలిక భావం ఏర్పడిపోయింది. పిల్లలైతే “ ఏంటమ్మా ! నాన్న ఇంకా బిసిల్లోనే ఉన్నాడు. కొత్తవి అస్సలు నేర్చుకోడు. దేశమంతా డిజిటల్ ఇండియా ఐతే మన ఇల్లు మాత్రం ఇంకా శిలాయుగం లోనే ఉండిపోయింది “ అనేవారు. ఆమె కూడా తనవంతుగా చెప్పి చూసింది. ఊ హూ మని షి ఇసుమంతైనా మారలేదు. అలాగే రోజులు కొనసాగుతున్నాయి.
ఇద్దరూ పాత స్నేహితులు సహోద్యోగులు కాబట్టి కూడ బలుక్కుని ఒకే కాలనీలో సైట్లు కొని ఇళ్ళు కట్టుకున్నారు. కృష్ణమూర్తి పని మొదలుపెట్టిన ఎనిమిది నెలలకు గృహప్రవేశం చేసి ఇంట్లో చేరిపోయాడు, ఇంకా కావలసిన పనులు ఉన్నప్పటికీ. అద్దె కలిసొస్తే ఆ మిగులు డబ్బులతో మిగతా పనులు పూర్తి చేసుకున్నాడు. పెళ్ళి కావలసిన ఆడపిల్లలు ఉన్నారు మరి. ఆయన అదృష్టానికి ఇద్దరు ఆడపిల్లలూ మంచి చదువులు చదువుకుని చదువుకు తగిన ఉద్యోగాలు దొరికి తండ్రికి చేదోడు వాదోడుగా నిలబడ్డారు.
రామకష్ణ ఇల్లు కట్టేటప్పుడు జరిగిన తతంగానికి భార్యా, పిల్లలు విసుగెత్తి పోయారు. ఏదీ ఒక పట్టాన ఒప్పుకునే మనిషి కాడు రామకృష్ణ. చాదస్తం ఎక్కువ. పదహారు నెలల పట్టింది ఇల్లు పూర్తవడానికి. కానీ ఇల్లు మాత్రం చాలా బాగా తయారయ్యింది. తన గృహ ప్రవేశానికి వచ్చిన కృష్ణమూర్తితో “ అన్నిటికీ తొందర పడితే ఎలాగోయ్ ! నువ్వేమో సగం ఇల్లు పూర్తయేటప్పటికి ఇంట్లో చేరిపోయావ్. ఎలా ఉండేదని అది ? మనవాళ్ళంతా నాతో చెప్పుకుని నవ్వుకున్నారు. కొద్దిగా ఆలస్యం అయినా నా ఇల్లు చూడు. ఎలా తళతళలాడి పోతుందో ?”అని గొప్పలు చెప్పుకున్నాడు. తరువాత ఆయన పెద్దకొడుకు కృష్ణమూర్తితో చెప్పుకుని బాధపడ్డాడు. “ అంకల్ ! మేం అనుకున్న బడ్జెట్ కి డబల్ అయింది ఇల్లు పూర్తయేటప్పటికి. నాన్న చాదస్తానికి మేస్త్రీ విసిగిపోయాడు. కానీ అమ్మా నాన్న ఫుల్ హ్యాపీ లెండి “ అని. రామకృష్ణ కొడుకులు కూడా బాగానే చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుని స్థిరపడ్డారు. ఒకడు అమెరికా వెడితే మరొకడు పుణెలో ఉంటున్నాడు.
కాలక్రమేణ కృష్ణమూర్తి తన కూతుళ్ళకు పెళ్ళిళ్ళు చేశాడు. మంచి సంబంధాలే వచ్చాయి. బంధువర్గంలోనూ, మిత్రవర్గంలోనూ ఆయన పైన మంచి అభిప్రాయం ఉన్నందువల్ల ఆయన పిల్లల్ని వెతుక్కుంటూ వచ్చాయి సంబంధాలు. ఇద్దరి పెళ్ళిళ్ళూ అయినాక ఒకసారి రామకృష్ణతో “అబ్బచాలయిపోయిందనుకో ఇద్దరి పెళ్ళిళ్ళు చేసేసరికి ! మగ పెళ్ళివారికి అదెంత వంగి వంగి దండాలు పెట్టాల్సొచ్చిందో “ అన్నాడు. అప్పుడు రామకృష్ణ “ మేం దండలేయించుకునే పార్టీ కదా ! మాకలాంటివి ఉండవులే “ అన్నాడు. కృష్ణమూర్తి పాపం బాధపడ్డాడు
రామకృష్ణ కొడుకుల పెళ్ళిళ్ళకి కొద్దిగా ఆలస్యం అయింది. అమెరికా వాడికి తొందరలోనే సంబంధం దొరికినా, పుణె అబ్బాయికి వెయిట్ చేయాల్సొచ్చింది. అప్పుడప్పుడు కృష్ణమూర్తితో అనేవాడు. “ ఈ ఆడపిల్లల తండ్రులకి అదెంత టెక్కనుకున్నావ్ ఈ మధ్యన. ఎన్ని కండిషన్లు పెడుతున్నారో తెలుసా ? మగపిల్లాడి తరుఫున ఉన్న మాకే తల తిరిగిపోతోంది తెలుసా ? “ అని. కృష్ణమూర్తి నవ్వేవాడు. చివరికి ముప్ఫై సంవత్సరాల వయస్సుకి ఒక సంబంధం ఖాయమయ్యింది. ఇలా ఇద్దరికీ పెళ్ళిళ్ళయి స్థిరపడి వాళ్ళ వాళ్ళ సంసారాల్లోకి మునిగిన తర్వాత ఆ పిల్లలిద్దరికీ అమ్మా నాన్నల అవసరాలను కనిపెట్టి ఉండడం కష్టమై పోయింది. అప్పుడు మొదలైంది రామకృష్ణ కష్టాల పర్వం.
అంత వరకూ అన్నిటికీ తన అబ్బాయిల పైన ఆధార పడడం మూలాన రామకృష్ణకు తన పనులు తాను చేసుకోవడం అంతగా అబ్బలేదు. కానీ ఇప్పుడు తామిద్దరమే ఉండడం వలన అన్ని పనులకూ తానే వెళ్ళి రావాల్సొచ్చేది. బిల్లులు కట్టడంకానీ, పన్నులు చెల్లించడానికి గానీ బండి మీద వెళ్ళి రావడం, అక్కడ క్యూలలో నిల్చోవడం విసుగ్గా అనిపించేది. ఒకసారి సాయంత్రం వ్యాహ్యాళిలో కలిసినప్పుడు కృష్ణమూర్తితో అంటే “ అదేమిటి ?
నువ్వు ఆన్ లైన్ పేమెంటు చేయడం లేదా ? నేనయితే ఎక్కడికీ వెళ్ళను. అంతా ఇంట్లోకూర్చునే ఇంటర్నెట్ ద్వారా ముగించేస్తాను. “ అన్నాడు. ఇదేదో తన కొడుకులను కనుక్కుంటే సరి అనుకున్న రామకృష్ణ పుణెలోని కొడుకుకు సమస్య గురించి చెప్పాడు. వాడు “ ఆ వివరాలేవో పంపండి నాన్నా ! నేను కడతాను. “ అన్నాడు. సరే అనుకుని కావలసిన వివరాలన్నీ పంపి ప్రశాంతంగా ఉండవచ్చుననుకున్నాడు. కానీ ఆ ముచ్చట ఒక రెణ్ణెల్లే జరిగింది. తన పనుల ఒత్తిడిలో పడి కొడుకు మరచిపోవడం, దానికి పెనాల్టీ పడడం జరగసాగింది. ఫోన్లో చెపితేనేమో కొడుకు
“ఫర్లేదులే నాన్నా ! పెనాల్టీ ఏమంత పెద్ద మొత్తం కాదు కదా ! “ అని చప్పరించేశాడు. మళ్ళీ రామకృష్ణగారి తిరుగుళ్ళు మొదలు.
ఇవన్నీ ఒక ఎత్తైతే తామిద్దరూ కలిసి వారణాసి, ప్రయాగ, గయ,నైమిశారణ్యం ట్రిప్ వేసుకున్నారు. కండక్టెడ్ టూర్ లలో వెళ్ళండి అంటే “ అబ్బే వాళ్ళు సరిగ్గా చూసుకోర్రా ! నువ్వు అన్నిటికెట్లు, హోటల్ బుకింగ్ లు చేసిపెట్టు. “ అని కొడుకుకి చెప్పారు. సరే నన్న వాడు ఎన్నాళ్ళయినా చేయలేదు. మళ్ళీ మళ్ళీ ఫోన్లో చెప్తేనేమో విసుగు. “నేను ముందే చెప్పానుగా నాన్నా ! కండక్టెడ్ టూర్లలోవెళ్ళమని. వాళ్ళకి ఒక్కసారి డబ్బులు కడితే అయిపోయేది. ఊరకే మీ చాదస్తం . నేను కాస్త తీరిక చేసుకుని చేస్తాలెండి. పని ఒత్తిడి చాలా ఉంది. మీ కోడలిక్కూడా “ అన్నాడు. అప్పుడు అనిపించింది రామకృష్ణకి. తాను ఇవన్నీ నేర్చుకునుంటే ఎంత బాగుండేది అని.
మరుసటి రోజు కృష్ణమూర్తిని పార్కులో కలిసినప్పుడు ఈ మాట చర్చకు వచ్చింది. రామకృష్ణ అప్పుడు తన ఇబ్బందిని చెప్పుకున్నాడు. “ నేనేమో మా వాడికి తేదీలతో అన్నీ చెప్పాను. నోట్ కూడా చేసుకున్నాడు. కానీ ఇంతవరకు రిజర్వేషన్లు చేయలేదు. అడిగితేనేమో విసుక్కుంటాడు. పని ఒత్తిడి అంటాడు. నాకేమో విపరీతమైన టెన్షన్ గ ఉంది. మా ఆవిడ కూడా హైరనా పడిపోతోంది. నాకేమో చెయ్యను రాదు. “ అని గోడు వెళ్ళబోసుకున్నాడు. కృష్ణమూర్తి దానికి “ దానికెందుకు అంత కంగారు పడతావు ? ఈ సారికి నేను చేసి పెడతాను. మా ఇంటికి పద. “ అని బయలుదేరదీసి తన కంప్యూటర్ పైన అన్ని ప్రయాణాలకీ రిజర్వేషన్లు చేయించాడు. అదే చేత్తో అక్కడ ఉండడానికి బస ఏర్పాట్లు కూడా చేసిపెట్టాడు. సంబంధించిన ఫోన్ నంబర్లు రామకృష్ణకు ఇచ్చి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళను సంపర్కించి వివరాలను తెలుసుకోవచ్చు అని చెప్పాడు. రామకృష్ణకు నెమ్మదిగా అనిపించింది. ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాడు.
మరుసటి రోజు మళ్ళీ పార్కులో కలసినప్పుడు కృష్ణమూర్తితో రామకృష్ణ “ నాకు కూడా కొద్దిగా నేర్పించవా మిత్రమా ఇవన్నీ. ఇక పై నుండి నేను స్వంతంగా చేసుకోవలనుకుంటున్నాను. “అన్నాడు. “ దానికేం భాగ్యం ! భేషుగ్గా నేర్పుతా. ఎలాగూ సిస్టమ్ ఉందిగా. మీ ఇంటికి వచ్చి నేర్పుతాను. “ అన్నాడు కృష్ణమూర్తి. అలాగే కొనసాగిస్తూ
“ మిత్రమా ! నువ్వేమనుకోనంటే ఒక మాట విను. మనం మన పనులను స్వతహాగా చేసుకుంటేనే బావుంటుంది. ఎంత పిల్లలైనా వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి. ఆ ఒత్తిడిలో వాళ్ళు కావాలని కాకపోయినా మరచిపోతే మనకు బాధగా ఉంటుంది. మన టైముకు పనులు జరగకపోతే మనం చికాకు పడతాం. అది వాళ్ళకు నచ్చదు. ఇలా కొన్ని సంఘటనల తర్వాత అగాధం ఏర్పడనూ వచ్చు. అలా కాకుండా మన పనులు మనం చేసుకున్న రోజున మన పిల్లలకు మన మీద గౌరవం ఏర్పడుతుంది. ఎప్పుడో అడపాదడపా అడిగితే తప్పకుండా చేసిపెడతారు. ఇంకా నీ పిల్లలు మీతో లేరు. కలసి ఉంటే ఇంకా అలాంటి అపార్థాలు జరిగే అవకాశాలు ఎక్కువ. వాళ్ళు మన మందులు తెచ్చివ్వలేదనో, డాక్టర్ వద్దకు తీసుకెళ్ళడం ఆలస్యం చేశారనో, బంధువుల ఇళ్ళకి తీసుకువెళ్ళలేదనో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. అలా కాకుండా మనమే ఇవన్నీతెలుసుకుని ఆ పన్లు మనమే చేసుకుంటే వాళ్ళకు మన అవగాహన, అనుభవం రెండూ కలిసి పనికొస్తాయి.
ఇంకో సంగతి. తంత్రజ్ఞానం అభివృద్ధి చెంది మన పనులను ఎంతో సులువు చేసింది. దానికి ఉదాహరణలు ఆన్ లైన్ పేమెంట్లు, ఆన్ లైన రైల్వే రిజర్వేషన్లు, హోటల్ బుకింగులు లాంటివి. ఇంట్లో కూర్చునే అన్నీ చిటికెలో చేసుకోవచ్చు. దాని లాభం మనం పొందాలి. మనలాంటి వయసయినవాళ్ళకు అవన్నీవరాలు. రాను రాను మన శక్తి సన్నగిల్లుతుంది. మనం తిరగలేము. ఇలాంటివన్నీ సులువుగా చేసేసుకుంటే మన ఎనర్జీని, సమయాన్ని మనం మరి దేనికైనా వినియోగించుకోవచ్చు. ఈ కంప్యూటర్లవీ మనకెందుకు అని అనుకోవడం మనకే నష్టం. ఇప్పుడు వాట్స్ అప్ తీసుకో. కొన్ని చిన్న చిన్నసమాచారాలని మనం పంచుకోవచ్చు, కావలసిన వారికి పంపవచ్చు. పంపాల్సిన విషయం పెద్దదైతే మెయిల్ లో పంపవచ్చు. ఇలా ఈ తరం వాళ్ళతో పాటు మనం కూడా అప్ టు డేట్ కావచ్చు.
ఇదేదో నీకు నేను బోధిస్తున్నానని అనుకోవద్దు. నీకు దీని ప్రాముఖ్యతను చెప్పాలని ఎన్నో సార్లు అనుకున్నాను. కానీ తగిన సమయం, అవకాశం వచ్చినప్పుడు చెప్తే అది మనస్సుకు నాటుకుంటుందని వాయిదా వేస్తూ వచ్చాను. ఈ రోజుకి ఆ అవకాశం వచ్చింది. ఇలా చెప్తున్నందుకు అన్యథా భావించవద్దు. “ అన్నాడు.
మరుసటి రోజు నుండి రామకృష్ణకు ప్రైవేటు ప్రారంభం అయ్యింది.
***
No comments:
Post a Comment