చిగురుటాశ
శ్రీనివాసన్ శ్యామ్
ఇంకొక పది రోజుల్లో ఉగాది. ఈ లోపల చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. కాస్త అలసటగా అనిపించి కళ్లు మూసుకున్న నన్ను జ్ఞాపకాల దొంతరలలోకి తీసుకెళ్లింది మనసు. అన్నయ్యలు బాబాయిలు పెద్దనాన్నలు మామయ్యలు అక్కలు చెల్లెళ్ళు పిన్నులూ పెద్దమ్మలూ అత్తయ్యలూ పిల్ల పీచు కలిసి మెలిసి ఉన్న రోజులవి. కనీసం రోజుకి ఒక్కసారి అయిన కలుసుకునే వాళ్లం. మా మామ్మ మహాత్యమో ఏమో కాని వచ్చేపోయే బంధువులకు ఊతములా ఉండేది మా ఇల్లు. మంచి సలహాదారు అయిన మామ్మ "ఏమ్మా అందరూ బావున్నారా ఇబ్బందులు ఏవి లేవు కదా" అంటూ ఆప్యాయంగా పలకరించి తనకు తోచిన సాయం చేసేది. చన్నీళ్ళకి వేన్నీళ్ళు కన్నీరుకి పన్నీరు మొత్తానికి గోలగా ఉన్నా ఆ జీవితమే బాగుండేది. కష్టనష్టాలలో కూడ అందరూ కలిసి ఉన్నపుడు కలిగే ఆనందం మనోబలాన్ని ఇస్తుంది.
యుగాది పండుగ రోజు మాకు మామ్మకూ మధ్య కాస్త యుద్ధం జరగాల్సిందే. లేని కోపం నటిస్తూ రుసరుసలాడే మామ్మ ని చూస్తే బలే సరదాగా ఉండేది. "ఒరేయ్ మామిడిముక్కలు అరటిపండు ముక్కలు బెల్లం ఎక్కడ తగలేశారురా.. ఇప్పుడే గా తరిగిపెట్టాను!!" అని అంతలేసి కేకలు పెట్టేది. ఏం పోయిందిలే మామ్మ చిటికెలో అన్నీ నీ ముందుంటాయి అని మళ్ళీ తెచ్చినవాటిల్లో సగం తినేసేవాళ్ళం. ఇవ్వాళ నేను పచ్చడి చేసినట్టే మీరు తిన్నట్లే. అన్నీ తినేసి చివరకు చేదు మిగిల్చేట్టు ఉన్నారురా అని వాపోయేది. అప్పుడు అన్నీ తినేసినా చేదుగా ఉండని ఉగాది పచ్చడి ఇప్పుడు అన్నీ వేసి చేసినా చేదే.
చేదు పులుపు తీపి కారం రుచులను చూపించేది కదా జీవితం. మరి అవి అందరూ కలిసి ఉంటేనే కదా తెలిసేది. ఒకే రక్తం పంచుకు పుట్టిన పిల్లల్లో కూడ ఆ సఖ్యత లేకుండా పోయింది ఇప్పుడు. ఎంత మారిపోయింది జీవన విధానం.
అన్నీ దొరుకుతున్నా అల్లరి చేసి తినేవాళ్ళు లేరు. వేప చెట్ల చుట్టూ పూత కోసం పోటీపడే వాళ్లు లేరు. ఆ మాటకు వస్తే వేప చెట్లేవి. మన అన్న భావం మాసిపోయింది. ఆనందంగా జరిగిపోయిన రోజులు కలలా ఉన్నాయి. గతంలోకి జారుకున్న నన్ను.. అమ్మగారండి!! అన్న లక్ష్మి పిలుపు మళ్లీ ఈ లోకంలోకి తెచ్చింది.
"ఏ లక్ష్మీ పని అయ్యిందా? మన ఇల్లు దులిపే పని ఉంది నువ్వు భోం చేసి వచ్చెయ్యి" అన్నాను. సరే అమ్మా అని ఇస్త్రీ బట్టల మూటనెత్తుకొని వెళ్లి పోయింది. ఇల్లు దులుపుకొని సర్దడానికి అట్టే సమయం పట్టలేదు. పిల్లా పీచూ ఉంటే కదా ఏవైనా అల్లరి చేసి పాడు చేయడానికి. అందరూ అమెరికా లో ఉన్నారాయె.
"వస్తానమ్మా నా ఇల్లు బాగు చేసుకోవాలి తల్లీ... పిల్లా జెల్లా ఉన్నారు కదా పాకకి వెదురు బొంగులు వేయించాలి ఎండ తాకిడికి కష్టంగా ఉంది" అని హడావిడిగా వెళ్తున్న లక్ష్మితో వెళ్ళిరా, అంటూ నా మెరుస్తూ బోసి పోయిన ఇంటిని చూసి నవ్వుకున్నాను.
భావోద్వేగాల మధ్య ఊగిసలాడుతున్న నా మనస్సుకి లక్ష్మి ని చూస్తే ఊరట కలుగుతుంది." ఏమోయ్ కాస్త కాఫీ ఇస్తావా??...". అన్న మా వారి పిలుపు తో నా ఆలోచనలు కట్టిపెట్టి వంట గది వైపు నడిచాను. కాఫీ అందిస్తున్న నన్ను చూసి "ఏమైందో య్ మళ్ళీ ఆలోచనల దుమారం లేచిందా. వాటిని కాస్త ఊరుకోబెట్టు, ఏమీ ప్రయోజనం లేదు. ఈనాడు పిల్లల ప్రవర్తన కు మనమే కారణం అని ఎన్నిసార్లు నిందించుకుంటాం. వాళ్ళకీ ఆలోచన శక్తి ఇచ్చాడుగా భగవంతుడు నెమ్మదిగా గ్రహించుకుంటారులే" అని తన పాటికి ఈవినింగ్ వాక్ కి వెళ్లిపోయారు. అదృష్టవంతులు....బాధ్యతలు బాధలు అన్ని తల్లి కే నేమో. మరునాడు ఉదయాన్నే పిల్లల ఫోన్ కాల్స్. అన్య మనస్కంగా నాలుగు ముక్కలు మాట్లాడేసి పెట్టేసాను. పిల్లలు కలసి మెలిసి ఒకరికొకరు తోడు గా ఉంటే కదా తల్లితండ్రులు ఆనందించేది. ఉన్న ఇద్దరూ అమెరికా పోతిరాయె. ఏదో చిలవలు పలవలు వచ్చి ఒకరితోఒకరు మాటామంతీ లేకుండా ఉండిపోయారు. దీనికి తోడు విజ్ఞానం పెంచే సోషల్ మీడియా వాదోపవాదాలకు ఇల్లు అయ్యింది. కలిసి ఉంటే వచ్చే గొడవలకంటే ఇవి చాల సుధీర్ఘం. గబుక్కున వాదించడానికి ఐడియా రాక పోయినా తరువాత మెసేజ్ ఇవ్వచ్చు. కాలాన్ని ఇంతగా దుర్వినియోగం చేస్తూ బంధాల విలువనే తెలియకుండా సాగిస్తున్న ఈ జీవన శైలి ని ప్రశ్నించే హక్కు కూడ తల్లికి లేకుండా పోయింది. అవును మరి అంతా మా ఇష్టం మాకు అనిపించిందే కరెక్ట్ అని అభిప్రాయం ఉన్నవారికి చెప్పేదేముంటుంది.
ఇంతలో లక్ష్మి వచ్చింది. "నీ పాక పని అయ్యిందా లక్ష్మీ?" అని అడిగా.. "అవుతోంది అమ్మగోరు, మా చిన్నాడు పాల ప్యాకెట్టులు వేసి వచ్చిన డబ్బుతో వెదురు బొంగులు తెచ్చాడు పెద్దాడు రాగానే పనులు మొదలు పెడతామమ్మా మీరు వచ్చి చూడాలి తల్లీ" అంది.
అన్నదమ్ములిద్దరూ కలిసి మెలిసి ఇల్లు సరిచేసుకుంటున్నారు అని సంతోషపడుతూ అలాగేలే, ఆడపిల్లలికి బట్టలు కొన్నావా అని అడిగాను. ఎక్కడమ్మా మీకు తెలుసు కదా అని దీనంగా చూసింది. సరేలే నేను చూస్తాను అని చెప్పి వంట పనిలో పడ్డాను. యుగాది రానే వచ్చింది. ఉదయానే అమెరికా నుంచి ఫోన్ కాల్స్ కూడా. హ్యాపీ యుగాది పలకరింపులు మెసేజ్ లు అయిపోయాయి. దానితో వాళ్ళకి పండుగ కూడా అయ్యేపోయింది. పూజ చేసుకుని కాస్త పాయసం, పులిహోర, బొబ్బట్లు అమ్మవారికి నైవేద్యం పెట్టి కాసిని తీసుకుని లక్ష్మి ఇంటికి వెళ్లాను. మామిడాకులు కట్టి అందంగా ఉన్న పాక చూడముచ్చటగా వుంది. ఆడపిల్లలు సిగ్గుపడుతూ వచ్చారు నేను కుట్టించిన పరికిణీలు వేసుకుని. దేవుడి పటం ముందు నైవేద్యంగా పెట్టిన ఉగాది పచ్చడి ప్రసాదాన్ని అమృతం లా తింటున్నారు. ఏ లక్ష్మీ ఉగాది పచ్చడి లో వేపపూత తప్ప ఏమీ కనిపించట్లేదు చెప్మా అని అడిగాను. అవునమ్మగోరూ అదే కదా కాణీ ఖర్సులేకుండా దొరికేది అందుకే ఆ పాలు ఎక్కువుంది అని నవ్వేసింది. పిల్లాజెల్లా కలిసి ఉండి తోడుగా ఉంటే అదే తీపి కదమ్మా అని మాట్లాడుతున్న లక్ష్మి నా కంటికి మసక గా కనిపించింది. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుని, వస్తాను లక్ష్మి అని పిల్లల్ని దీవించి ఫలహారం ఇచ్చేసి వచ్చేసాను. అప్పుడు తెలిసింది బాగా బెల్లం వేసి ఉప్పు కారం పులుపు మామిడిముక్కలు అరటిపండుముక్కలు వేసి ఎంతో రుచిగా చేసుకున్నానని అనుకున్న ఉగాది పచ్చడి నాకు చాలా చేదుగా అనిపించిందేమిటా!! అని.
మనస్పర్ధలతో సంబంధాలని దూరం చేసుకునే వ్యక్తిత్వం ఉన్న పిల్లలకు తల్లిగా మిగిలి పోతానా అన్న బాధ నన్ను తినేస్తోంది. పెంపకం.. సంస్కారం.. చదువు... అహంకారం ఇలా ఎన్ని కారణాలు వెతికానో. కాస్త తెలివితేటలు, ఆలోచనలూ ఎక్కువై అహంకారంతో మాటల గారడి చేస్తూ, సవాళ్లు విసురుకుంటూ గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ, గతాన్ని ఈసడించుకుంటూ సమస్యలు, దూరాలు పెంచుకుని ఎవరికి వారు తామే గెలిచాము అని గర్వించే మేధస్సుకి జన్మనిచ్చానా అనిపిస్తోంది. టెక్నాలజీ మానవ విజ్ఞానం పెంచే ఒక శక్తి కావాలి కానీ మానవ సంబంధాలు కూల్చేసే సాధనం కూడా అయ్యింది అని ఇంకోసారి రుజువు చేసింది. అవును మరి WhatsApp లు Facebook లు వచ్చింతరువాత వివాదాల పర్వం సాగి మరుగునపడుతున్న అనుబంధ బాంధవ్యాలకు పట్టిన వగరుతనం మన మంచి వేప పూవుకి కూడ లేదు. షడ్రుచుల మేళవింపు తో జీవిత పరమార్థాన్ని తెలియజేసే యుగాది రాగద్వేషాలు లేని ఆనందమయమైన జీవనానికి నాంది కావాలి. అందరూ సఖ్యంగా తోడు నీడగా కలసి ఉండాలి .... కలిసే ఉండాలి....అని దేవదేవుని కోరుతూ మదనపడుతున్న నా మనస్సుకు ప్రశాంతత ఇస్తూ రేడియో లో... "కొమ్మ మీద కోయిలమ్మ కుహూ అన్నది కుహు కుహూ అన్నది అది కూన విన్నది ఓహో!! అన్నది" ... అన్న పాట సన్నగా వినిపిస్తోంది..... కూన వింటోంది అనుకుంటా!!! ..
***
No comments:
Post a Comment