అలనాటి జ్ఞాపకాలలో ఒకటి,"మర్ఫీ రేడియో"
అంబడిపూడి శ్యామసుందర రావు
1960-70 కాలములో అంటే టివిల ప్రభంజనము మొదలు కాకమునుపు టివి అనేది ధనికుల ఇళ్లలో ఉండే ఒక విలాసవంతమైన వస్తువు అని భావించే రోజుల్లో రేడియో మధ్య తరగతి ప్రజలకు వినోదాన్ని ఇచ్చే వస్తువుగా ఉండేది అప్పట్లో రేడియో ఇళ్లలో ఉండటం ఒక స్టేటస్ సింబల్ గాఉండేది అటువంటి రేడియో ప్రస్తుతము కనుమరుగయింది రేడియో అంటే ఫోన్ లో వచ్చే ఎఫ్ ఎం రేడియో మాత్రమే అప్పట్లో వార్తలు వినాలన్న సినిమాపాటలు వినాలన్న నాటకాలు వినాలన్న రేడియో మీద ఆధారపడేవారు ఒక ఇంట్లో రేడియో ఉంటె చుట్టుపక్కల ఇళ్ల వాళ్లు ప్రోగ్రామ్స్ వినటానికి ఆ రేడియో చుట్టూ చేరేవారు బినాకా గీత్ మాల వంటి ప్రోగ్రామ్స్ కోసము ప్రజలు రేడియో చుట్టూ చేరేవారు అంటే రేడియో ప్రజలను దగ్గరకు తెచ్చేదిగా ఉండేది
అటువంటి రేడియో బ్రాండ్లలో మర్ఫి ,బుష్ ఫిలిప్స్ వంటివి ఆనాటి పాపులర్ బ్రాండ్లు ప్రస్తుతము ఒకనాటి మధుర స్మృతులు అంటే అలనాటి జ్ఞాపకాలుగా మిగిలిపోయినాయి టివిల ప్రభంజనంలో అవన్నీ కొట్టుకుపోయినాయి అటువంటి అలనాటి జ్ఞాపకంగా మిగిలిన మర్ఫి రేడియో గురించి ఆ రేడియో వాణిజ్య ప్రకటనలో ఉండే మర్ఫి బేబీ గురించి తెలుసుకుందాము.ఈ రేడియో ఆపరేషన్ ఇంటి పెద్ద చాలా జాగ్రత్తగా చేసేవాడు రేడియో పై కప్పి ఉన్న గుడ్డను తీసి రేడియోకు ఉండే ఏరియల్ ను సరిచేసి ట్యూనింగ్ చేసి వివిధ భారతో రేడియో శ్రీలంకనో ట్యూన్ చేసి ప్రోగ్రాం లను వినేవారు స్వాతంత్రము వచ్చినప్పుడు జవహర్ లాల్ నెహ్రు ఉపన్యాసము గాని యుద్ధ సమయాల్లో వార్తలు వినాలంటే రేడియో ఒక్కటే మార్గము.
మర్ఫీ రేడియోను ఫ్రాంక్ మర్ఫీ మరియు ఈ జె పవర్ అనే వ్యక్తులు 1929 లో స్థాపించారు ఈ రేడియో కంపెనీ మొదట రేడియో సెట్లను బ్రిటిష్ సాయుధ దళాల కోసము రెండవ ప్రపంచ యుద్దములో వాడుకోవటానికి తయారు చేసేవారు కానీ తరువాత రేడియో సెట్లను గృహోపకరణముగా మార్చి వాడుకోవటానికి మిలిటరీ సాంకేతికత అవసరము లేకుండా ఉత్పత్తి చేశారు. 1931 "మీ వైర్ లెస్ సెట్ (రేడియో) మీఇంట్లో తండ్రి మాత్రమే పని చేయించే వస్తువు కాదు ఇంట్లో ప్రతివాళ్ళు వాడుకోదగిన ఆనందించదగిన వస్తువు" అని మర్ఫీ కంపెనీ వారు వాణిజ్య ప్రకటన ఇచ్చారు. ఆ విధముగా మర్ఫీ రేడియోలు చాలా సింపుల్ గా చౌకగా వాడుకొనేదిగా నమ్మకమైనదిగా మార్కెట్ లో ఉత్పత్తిదారులు మర్ఫీ రేడియోను తెచ్చారు. మర్ఫీ కంపెనీ వ్యవస్థాపకుడు 1937 లో ఆ కంపెనీని వదలి ఫ్రాంక్ మర్ఫీ రేడియో ను స్థాపించినప్పటికీ మర్ఫీ పేరు అలాగే ఉండిపోయింది.
ఈ బ్రాండ్ 1948 నుండి భారతీయ కుటుంబాలలో చాలా సుపరిచితమైన పేరుగా అయింది. అప్పటి నుండి వార్తలకు వినోదానికి ముఖ్యమైన సోర్స్ గా మర్ఫీ రేడియో ప్రసిద్ధి కెక్కింది ఆ రోజుల్లో క్రికెట్ కామెంటరీ వార్తలు బినాకా గీత్ మాల వంటి ప్రోగ్రాము లు వినటానికి రేడియో ముందు కూర్చునేవారు ఇంట్లో రేడియో లేకపోతె రేడియో ఉన్న ఇంటికి వెళ్లి వాళ ఇష్టమైన ప్రోగ్రాం వినేవారు. ప్రస్తుతము 70 ఏళ్ల వయస్సు పై బడిన వాళ్ళను పలకరిస్తే రేడియోలు ముఖ్యముగా మర్ఫీ రేడియోతో వారికి ఉన్న అనుబంధాన్ని ఆనందముగా పంచుకుంటారు. మర్ఫీ రేడియో క్యాలెండర్ మంచి ఆకర్షణ కలిగినది ఆ క్యాలండర్ ఆకర్షణ మర్ఫీ కంపెనీ వారి మస్కట్ మర్ఫీ బేబీ లేదా మర్ఫీ మున్నా పెదాల దగ్గర వేలు పెట్టుకొన్న బూరె బుగ్గల చిన్నవాడు రింపోచే క్యాలండర్ ను ఇంట్లో ఉంచుకోవాలి అని చాలామంది కుటుంబాల వాళ్ళు ఆసక్తి చూపేవారు
క్యాలెండర్ మీద ఉన్నమూడేళ్ళ మున్నా అసలు పేరు కగ్యూర్ తుల్కు రిన్ పొచే. ఆ రోజుల్లో అటువంటి పిల్లవాడు మనకు ఉంటె బావుంటుంది అని తల్లులు కాబోయే వారు, తల్లులు కోరుకునేవారు. ఈ మర్ఫీ బేబీ హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి వాస్తవ్యుడు మొదట్లో మర్ఫీ బేబీ ఒరిజనల్ గా ఆడపిల్ల ఆ ఆడపిల్ల చనిపోయినాక ప్రచారానికి క్యాలెండర్ పై ముద్రించటానికి ఇంచుమించు ఆదే పోలికలు ఉన్నఈ బేబీని సెలక్ట్ చేశారు ఈ కుర్రవాడు పెద్దైనాక మందాకినీ అనే సినీ నటిని వివాహమాడి ఆ తరువాత సన్యాసిగా మారాడు .
మర్ఫీ రేడియో ప్రచారానికి ఈ క్యాలెండర్ తో పాటు ప్రముఖ గాయకుడు మహమ్మద్ రఫీ పాడిన పాట కుడా అదనపు ఆకర్షణ ఈపాట హిందీలో,"మర్ఫీ ఘర్ ఘర్ కి రౌనాక్ తార తార కె మర్ఫీ రేడియో లా దేతే హై ఘర్ మే జాన్(మర్ఫీ ఇంటింటికి గర్వకారణము మర్ఫీ రేడియో ఇంటికి జీవాన్ని తెస్తుంది) ఈ పాటతో పాటు ఆనాటి ప్రముఖ నటి షర్మిల టాగోర్ కూడా మర్ఫీ రేడియో ప్రకటనలలో పాల్గొంది ఈ మున్నా బొమ్మ వల్ల ప్రకటనల వల్ల పిల్లలు కూడా మర్ఫీ రేడియోనే కొనమని గోలచేసేవారు చాలా రోజులు టివిలు వచ్చినాక కూడా చాలా మంది ఇళ్లలో రేడియో సెట్ ఉండేది అది ఒక జ్ఞాపకముగా ఉంచుకొనేవారు క్రమముగా రేడియో చోటును బ్లాక్ అండ్ వైట్ టి వి దానిని కలర్ టివి దానిని ఇంటర్ నెట్ ఆక్రమించేశాయి ప్రస్తుతము రేడియో కబుర్లు ముఖ్యముగా మర్ఫీ రేడియో పిల్లవాడి బొమ్మ కబుర్లు అలనాటి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి
***
No comments:
Post a Comment