శారదాప్రసాద్-రచయత/కవి - అచ్చంగా తెలుగు

శారదాప్రసాద్-రచయత/కవి

Share This
శారదాప్రసాద్-రచయిత/కవి
శారదాప్రసాద్ 



(ఇది ఇంతకు  ముందర క్లుప్తంగా కొందరికి చెప్పినట్లు గుర్తు!మిగిలిన వారికోసం మళ్ళీ చెబుతున్నాను!ఇది పునరుక్తి కాదు,అనురక్తి!రచన నాకు ఇష్టమైన వ్యాసంగం. నేను రచయితను కావటానికి ప్రేరణ నా శ్రీమతి ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే! అదెలానో కథలోపలికి వెళ్లి చదవండి!  )
*******
నా  చిన్నతనంలో మా మేనత్త నేను డాక్టర్ ని కావాలని తెగ ముచ్చటపడింది. చిన్నతనం నుండి'చికిత్స'చేయటం నా ప్రవృత్తి కావటం చేత బహుశా:ఆమె అలా  కలలు కనివుండవచ్చేమో! కానీ పెద్దయ్యాక వృత్తిరీత్యా నేనొక బ్యాంకు ఉద్యోగినయ్యాను.బ్యాంకులో చేరాను గానీ, ఆ ఉద్యోగం నా ప్రవృత్తికి సరితూగలేదు. అందుచేతనేమో కూడా నా 50 వ ఏటనే ఆ ఉద్యోగానికి స్వఛ్ఛందంగా పదవీ విరమణ చేసాను.అంటే 10 ఏళ్ళ ముందుగా నన్నమాట! (స్వఛ్ఛందంగా పదవీ విరమణ చేసిన తరువాత కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాను. వాటిని గురించి రసవత్తరంగా ఈ మధ్యనే చెప్పాను!.)నాలో ఇద్దరు బలమైన వ్యక్తులున్నారు. ఒకడు-కవి/రచయిత,మరొకడు-నటుడు/ప్రయోక్త.మొదటినుండి నాకు పఠనాసక్తి ఎక్కువ.ఏదైనా మంచి పుస్తకాన్ని చదివిన తరువాత ,చక్కని అనుభూతులను పొందటమే కాకుండా అటువంటి పుస్తకాలను వ్రాయాలనిపించేది.అయితే ఉద్యోగంలో ఉన్న సమయంలో ఆ కోరిక  తీరలేదు. నాకు 21 వ ఏటనే వివాహం కావటంచేత ఉద్యోగ బాధ్యతలతో పాటుగా కుటుంబ బాధ్యతలను మొయ్యటం,బదిలీలు ... లాంటి అనేక సమస్యసల వలన నాలోని రచయిత నన్ను దాటి బయటకు రాలేకపోయాడు.చిన్నతనంలో వివాహాలు జరగటం వలన కొన్ని లాభాలు కూడా ఉన్నాయి.50 ఏళ్ళ వయసుకే నా పిల్లలకు వివాహాలు చేసాను,వారందరూ జీవితంలో సౌకర్యవంతంగా కూడా స్థిరపడ్డారు. నేను పదవీ విరమణ చేయటానికి అది కూడా ఒక ముఖ్య కారణం.పదవీ విరమణ చేసిన తరువాత ఇల్లాలి కోరిక మీద చాలా పుణ్యక్షేత్రాలను సందర్శించాము.పిల్లల కోరిక మీద 2011 Febలో అమెరికాకు వెళ్లాం.ఒక 6 నెలలు పిల్లలతో అక్కడ సరదాగా గడిపాం.2011 Aug చివర్లో గుంటూరుకు చేరాం! పనివాళ్ళు ఇల్లంతా శుభ్రం చేస్తున్నారు.స్నేహితులు వచ్చి పిచ్చాపాటీ మాట్లాడి వెళ్ళుతున్నారు.నేను వారికోసం తెచ్చిన కానుకలను వారికి అందచేస్తున్నాను,నా శ్రీమతి వారికి కాఫీలు అందిస్తూ సరదాగా తిరుగుతుంది. ఆవిడ నా పక్కనే కూచొని మా సంభాషణలను ఆసక్తిగా గమనిస్తుంది. ఒక్కసారి పెద్ద వాంతి చేసుకొని,నా ఒడిలోకి జారింది.స్పృహలోనే ఉంది కానీ, కొన్నిUnusual Symptoms కనబడటం చేత,స్నేహితుల సహాయంతో Ambulance లో గుంటూరులోని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు తీసుకొని వెళ్లాం. వైద్యులు అక్కడ ఆమెకు అన్ని వైద్య పరీక్షలను చేసి,ఆమెకు Brainలో హామరేజ్ వల్ల ఒక Clot ఏర్పడిందని,సకాలంలో తీసుకొని రావటం వలన పెద్ద ప్రమాదం తప్పిందని ,సరైన చికిత్స  చేసి ఆమెను మళ్ళీ మామూలు మనిషిగా చేసారు వైద్యులు. ఆ క్షణంలో మళ్ళీ నా మేనత్త నేను డాక్టర్ ని కావాలని ఎందుకు కోరుకుందో గుర్తుకొచ్చింది. నా భార్యను హాస్పిటల్ నుండి  డిశ్చార్జ్ చేస్తూ,డాక్టర్లు నాకు కొన్ని జాగ్రత్తలను చెప్పారు. అందులో ముఖ్యమైనది--ఒక 6 నెలలపాటు అనుక్షణం ఆమెను కనిపెట్టి ఉండటం.అలానే అని డాక్టర్లకు చెప్పి ఇంటికి వచ్చాం.అయితే, ఆ ఆరు నెలలు ఎలా గడపాలో నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో నా నెచ్చెలికాడు, నాలోని రచయిత బయటకు వచ్చాడు.మొదటిసారిగా మా నాన్నగారిని గురించి కొన్ని సంఘటనలను వ్రాసి,నా కుటుంబ సభ్యులందరికీ  పంపాను. నా తొలి రచన అదే!2011లో విజయదశమి రోజు అది వ్రాసాను.అందరూ చాలా బాగుంది,రచనలను చెయ్యటం కొనసాగించమని పోత్సహించారు. (వీలుచూసుకొని దానిని మీ కోసం మళ్ళీ సరిచేసి అందచేస్తాను.)అప్పటినుండి  వివిధ పత్రికలలో,వెబ్ పత్రికలలో దాదాపుగా షుమారుగా ఒక 600 రచనలు ప్రచురించబడ్డాయి. అలా నేను రచయితగా మారటం వెనక ఉన్నబలీయమైన కారణం--నా భార్యను రక్షించుకోవటమే! వీటన్నిటినీ మించి ఆ శారదామాత కటాక్షం." అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలురా! పదాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి" అన్న గురుతుల్యులు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారన్న మాటలు నా పట్ల కూడా నిజమయ్యాయి. సరే,రచయిత నయ్యాను.ఆర్ధికంగా పెద్ద ఉపయోగం లేకపోయినప్పటికీ,హార్దికంగా నాకు పరిపూర్ణ తృప్తినిచ్చింది ఈ జీవితం.రచయితనైన తరువాత నాకొక కోరిక కలిగింది.'శారదాప్రసాద్--రచయిత/కవి'అనేName Plate ను ఇంటిముందు ఉంచుకోవాలని!నా కోరికను నా భార్యకు వెంటనే చెప్పాను. ఆమె,"వద్దండి ,దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. నా మాట వినండి" అని బతిమిలాడింది.కోరికలు బలీయమైతే, ఆఖరికి భార్య చెప్పిన  మాటలు కూడా చెవికెక్కవు. ' శారదాప్రసాద్--రచయిత/కవి'అనే Name Plate ను చాలా ఖర్చు పెట్టి Brass Metal తో తయారుచేయించి ,ఒక మంచిరోజు చూసి దానిని ఇంటిముందు ఉంచాను.మంచి పని చేయటానికి మంచిరోజు చూసినంత మాత్రం సరిపోదు. కష్టాలు రావటానికి మంచి-చెడు రోజులనే తేడా ఉండదు. ఇక నా కష్టాలు ప్రారంభమయ్యాయి. ఒక్కొక్కొటి మీకు ఏకరువు పెట్టుకొని కొంతవరకైనా నా బరువును దించుకుంటాను. వారానికొకసారి Name Plateను తళతళా మెరిసేటట్లు పనిమనిషి చేత తోమించమని నా భార్యకు చెప్పాను.ఆవిడ అలాగేనని దానిని తోమించటానికి పనిమనిషికిచ్చేది. పనిమనిషి, "అమ్మగారూ"!ఈ బోర్డులో ఏమి వ్రాసి ఉంది?" అని అమాయకంగా అడిగింది."అంటే,అయ్యగారు వ్రాస్తారన్న మాట" అని నా భార్య చెప్పింది. వెంటనే పనిమనిషి,"అయ్యగారికి ఇంతకు ముందు వ్రాయటం చేతకాదా? మా ఆయనే నయం!తెలుగు బాగా వ్రాస్తాడు." అని అందుకుంది. "వ్రాయటం అంటే అది కాదే!ప్రియురాలి మీద కవితలు లాంటివి వ్రాస్తారు." అని నా భార్య పనిమనిషికి చెప్పింది.

"మీరుండగా ,ప్రియురాలు ఏమిటమ్మ గారు! అయ్యగారు త్వరలో చిన్నిల్లు పెట్టపోతున్నారన్నమాట! కొంతమందికి ఈ వయసులో ఇటువంటి పాడుబుద్ధులు పుడుతాయి.మీ జాగ్రత్తలో మీరుండండి అమ్మగారు!మా ఇంటిదగ్గర కూడా ఒకాయనకు ఈ వయసులోనే ఇటువంటి పాడుబుద్ధి పుట్టి,ఇల్లంతా గుల్ల చేసాడు." అని దానికున్న పరిజ్ఞానాన్ని అంతా నా భార్య వద్ద ప్రదర్శించింది.అంతవరకూ తండ్రిలాగా చూసిన పనిమనిషి నావంక అదోరకంగా హీనమైన చూపులు చూడటం మొదలుపెట్టింది. అలా పనిమనిషి దగ్గర నా శీలం పోయింది.ఆ అవమానాన్ని ఎలాగో దిగమింగుకొని కవిగా బతుకును బరువుగా ఈడుస్తున్నాను.ఇంతలోకి మరొక ఉపద్రవం వచ్చి మీద పడింది.అది ఏమిటంటే,నగరంలో ఏ పనికిమాలిన వెధవకు సన్మానం చేసినా ,సన్మాన పత్రం వ్రాసి,ప్రధానవక్తగా ఆ సభలో పాల్గొనాలి. పాల్గొనకపోతే,నా గురించి చెడుగా ప్రచారం చేస్తారు. దీనికన్నా సన్మాన సభలలోనే పాల్గొనటమే ఉత్తమం అనిపించి , మనసు చంపుకొని అటువంటి సభల్లో కూడా పాల్గొన్నాను.
 ఇలా దినదినగండంగా మారింది నా 'కవి జీవితం'.ఇంతలోకి మరొక పెద్ద ఉపద్రవం ముంచుకొచ్చింది.మా వీధిలో ఒక తాగుబోతు, రౌడి కార్పరేటర్ గా పోటీ చేయబోతున్నాడట.  ఉదయాన్నే 6 గంటలకే మా ఇంటికి వచ్చాడు. రాత్రి బాగా పొద్దుపోయిందాకా మందు కొట్టాడేమో, భరించలేని వాసన వస్తుంది.భీకర రూపంతో, ఎర్రని కళ్ళతో,'' ఏయ్ పంతులు!నీవు బాగా వ్రాస్తావని నాకు తెలిసింది.మా పార్టీ వాళ్ళందరి గురించి ,నీవే కరపత్రాలు వ్రాయాలి. నీవేమి ఊరికనే వ్రాయనక్కరలేదు,నీకు తగిన పారితోషికం ముట్టచెబుతాం!!ఆలోచించుకో!!" అని బెదిరింపు స్వరంతో చెప్పి వెళ్ళిపోయాడు.ఆ కరపత్రాలను వ్రాస్తే ,నాకు కూడా ఆ పార్టీ ముద్ర పడుతుంది, వ్రాయకపోతే, మక్కెలిరగతంతారు. ముందు నుయ్యి,వెనక గొయ్యి- ఇదీ నా పరిస్థితి. రచనలు చేయటం మానేసాను.ఇటువంటి బేవార్సు పనులు చేయటానికి కూడా టైం సరిపోవటం లేదు.ఒకరోజు నిద్రపోకుండా బాగా ఆలోచించి,ఎవరికీ చెప్పాపెట్టకుండా మేము చెన్నైకు వచ్చాం. రెండురోజుల తరువాత నా మొబైల్ కు ఒక అపరిచితవ్యక్తి ఫోన్ చేసి," ఏయ్ పంతులు!నీవు చెప్పకుండా చెన్నైకు వెళ్లావు కదూ,రేపు ఉదయంలోపు నా మెయిల్ కి కరపత్రాన్ని పంపావా సరి ,లేకపోతే నీ పేరుమీద మేమే ఇక్కడ మరో కరపత్రాన్ని విడుదల చేస్తాం!గుంటూరు వచ్చిన తరువాత నీ పని చూస్తాం!"అని ఫోన్ లో మాట్లాడి పెట్టేసాడు.చచ్చినట్లు,ఆ వెధవను గురించి కరపత్రాన్ని వ్రాసి మెయిల్ లో పంపాను.గుంటూరు రాగానే'శారదాప్రసాద్--రచయిత/కవి'అనే Name Plate ను పీకి అవతల పారేసాను.హాయిగా
 స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాను.పిల్ల చచ్చినా పీతి కంపు పోదు/ఇంగువ కట్టిన గుడ్డకు వాసన పోదు- అనే సామెతలు నూటికి నూరుపాళ్ళు నిజం.ఈ సారి నా భార్య నుండే ఒక ఇబ్బందికరమైన సమస్యను ఎదుర్కొన్నాను. అదేమిటంటే, ఆవిడ స్నేహితురాలి మనవరాలు'రజస్వల' అయిందట! ఆ సందర్భంలో ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తూ ఒక మంచి వచన కవిత వ్రాసుకొని పేరంటానికి వెళ్లి అక్కడి వారందరి ముందు నేనా కవితను చదవాలట! దయచేసి మీలో ఎవరైనా 'రజస్వల' ను గురించిన కవిత వ్రాసి నా మెయిల్ కి వెంటనే పంపి, నన్నీ యమగండం నుంచి తప్పించరా! ప్లీజ్!!
******
నీతి--నీవు రచయితవైతే కావచ్చు,కానీ ఆ విషయానికి పెద్ద పబ్లిసిటీ ఇచ్చుకుంటే, నా లాంటి తిప్పలు తప్పవు!స్వానుభవంతో చెబుతున్న ఒక 'భర్తహరి' సుభాషితం ఇది. ఆశయం మంచిదైతే అక్షరాలే ఆయుధాలు అవుతాయి అనేది నా విషయంలో నిజమైంది!నాకు స్ఫూర్తిప్రదాత,గురుతుల్యులు  కీర్తి శేషులు శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి  గారి  దివ్య స్మృతికి సభక్తిక సమర్పణ  !
                ******                  

No comments:

Post a Comment

Pages