శివం - 56 - అచ్చంగా తెలుగు
                                               శివం - 56
                                                                                           రాజ కార్తీక్



(కల్పన భారతి కథ .. గ్రహణం రోజున గుడిలో ఇరుక్కుపోయింది కల్పన భారతి. గుడిలో తనకి మళ్లీ తన కొడుకు కనపడడంతో తన కొడుకేనేమో అని చూసింది .అంతలో తన కొడుకు గర్భగుడిలోకి ప్రవేశించాడు ..... గర్భగుడి తలుపులు తెరుచకున్నాయి..)

కల్పన ఆశ్చర్యం గా ఒక అడుగు వెనక్కి వేసింది.

తనకి ఏమి అర్దం కావడంలేదు. ఏదైనా, అది మాయ అయినా, తన బిడ్డ తనకి కనపడడంతో పులకించిపోతోంది.

ఒక స్వరం "అడుగు వెనక్కి వేయకు కల్పన భారతీ ముందుకి వెయ్యి ఎప్పటిలాగా" అని వినిపించింది.
కల్పనకు తన అడుగుల ముందుకు కదిలిన జ్ఞాపకాల తెరలు తెరలగా జ్ఞప్తికి వచ్చాయి. అడుగు అడుగుకూ, తన అడుగుల ఆలోచనల వెల్లువ గుర్తుకు వచ్చింది. 
ఈపాటికే మీకు అర్దం అయ్యి ఉంటుంది ..వచ్చిందీ నేనే అని! కాకపోతే కల్పన భారతీ మాత్రం ఆ ఆలోచనలో లేదు.

కల్పనకి ఏ మాత్రం వేరే ఆలోచన లేదు.

కల్పన భారతి "ఎవరు నాతో మాట్లాడుతుంది ? నా బిడ్డ ఏమి అయ్యాడు?" అని అడిగింది.

తలుపులు పూర్తిగా తెరుచుకున్నాయి.

ఎదురుగా కల్పన కనుల ముందు నేను త్రిశూలధారి అయ్యి నిలిచాను. కల్పన కనుచూపు మేరంతా నేనే. 

కల్పన మొహంలో ఆశ్చర్యం... చేతులు ఎత్తి మొక్కుబడిగా నమస్కారం చేసింది.
నేను "తల్లి, ఏదో అడగబోతున్నవు అడగవా?"అని అడిగాను.

కల్పనా -  "నా బిడ్డ ఎక్కడ ?"

నేను - "నా దగ్గరే ఉన్నాడు ."

కల్పన - "అయితే నా బిడ్డను నాకు మళ్లీ ఇచ్చేయండి." 

నేను -"తల్లి, లోకాల అంతు చూడాలి అనుకునే నాకు, నిన్ను చూడాలి అనిపించి వచ్చాను." 

కల్పన ఏడుస్తూ- "కనీసం నా బిడ్డనయినా నాకు ఇచ్చే అవకాశం ఉందని చెప్పు స్వామి !" అని అర్ధించింది.

నేను "తల్లీ, నువ్వలా నీరసంగా ఉండటం చూడలేక, నీ చేత అన్నం తినిపించటానికి అలా చేశానమ్మ" అన్నాను.

కల్పన "నాకు తెల్సు. ఆశ వల్ల మోసపోయాను. లేకపోతే నేను .." అని ఆగింది.

నేను "కల్పన భారతి, తల్లి! విధి నియమాలకి ఎవరూ అతీతులు కాదు. నీ ఋణాను బంధం అనే అప్పు వారితో తీరిపోయింది .." అన్నాను.

కల్పన "ఎంత బాగా చెప్తావు ...నీతో వాదించి గెలవలేని  పరిస్తితిలో ఉన్నాను. నీ కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతో మంది తపస్సు చేస్తూ ఉంటారు. పుట్టక నుండి అనాధను, మధ్యలో పొగరుబోతును, అహంకారిని ... స్వార్థ ప్రయోజనాల కోసం ఉండే అందరితో జగడం అడే నాతో నీకు ఎందుకయ్య ?" అని అడిగింది.

నేను "హా హా" అని నవ్వాను.

కల్పన "నాకు ఆనందం, బాధ, దిగులు, చింత, కోరిక, ఆశ, భయం, వ్యామోహం, ఏమి లేవు. నీ దర్శనం కోసం ఎదురు చూసే వారికి వెళ్లి ఇవ్వు నీ ఆశీర్వాదం .."అంది.

నేను " నీ బాధనిలా వెళ్ల గక్కు తల్లి "అన్నాను.

కల్పన " చూడు స్వామి ! కనీసం మీ దర్శనంతో నాకు ఏమి ఆనందం లేదు . అలా తయారు చేశావు నన్ను. నీ విధి నియమాల నాటకంలో " అంది బాధగా.

నేను"అవును తల్లి. ప్రపంచ భక్త చరిత్రలో మొట్ట మొదటి సారిగా నన్ను చూసిన ఆనందం లేని దానివి నువ్వే."

కల్పన"నాకు ఏమి ఆనందం లేదు ..నాకు నా పాటలు తప్ప ఏమీ అవసరం లేదు. వెళ్ళు మహాదేవా ..నేను కోరుకునే కోరికను తీర్చవని నాకు తెల్సు. నాకు వేరే కోరికలు లేవని నీకు తెల్సు .." అంది.

నేను "తల్లి నా మీద కోపమా "అని అడిగాను.

కల్పన "లేదు స్వామి ..నియమాలకు ఎవరయినా అతీతులు కారని అర్దం చేసుకోగలను. నా తలరాత కి నువ్వు ఏమి చేస్తావు .." అంది.

నేను "తల్లి "అన్నాను ఆర్తిగా.

కల్పన " నా చిట్టి తండ్రీ నన్ను తల్లి అని పిలవటానికి లేనప్పుడు ..నాకు ఎందుకు ఆ పిలుపు " అంది కోపంగా.
నేను "అందరూ నాలోనే ఉన్నారు ..అంత నేనే.."అన్నాను.
కల్పన - "వద్దు స్వామి ..నాకు ఏ వేదాంతం వద్దు."

నేను - "తల్లి నా మాట వినవా ..ఇంత కోపం చూపిస్తావా?."

కల్పన కళ్ళ వెంట నీరుతో ఇలా అంది, " నా  మీద నువ్వు చూపించిన కోపం తో పోల్చుకుంటే నా కోపం ఏమి అంత పెద్దది స్వామి?"

నేను "నాకు నీ మీద కోపం ఏమీ లేదమ్మ. అందుకే నువ్వు పిలవక ముందే నీ కోసం వచ్చాను .." అన్నాను.

కల్పన "పిలవక ముందే వచ్చిన స్వామి ..ఆయుష్షు తీరకుండా నా ప్రాణం తీసుకొని పోయి నాకు ప్రశాంతత ఇవ్వు" అని అడిగింది.

నేను "తల్లి అలా అనకు అమ్మ ..' అన్నాను.

కల్పన - "హరుడివి కదా అందుకు నా ప్రాణం హరించ మని చెప్పాను"

నేను- "తప్పు తల్లి, అమంగళం  మాటలు మాట్లాడవద్దు," అన్నాను.

కల్పన "ఏ అమంగళాలు నేను చూడలేదు స్వామి. అవునులే నేను చేసుకున్న వాటికి నువ్వేమి  చేస్తావు? నా ప్రాణం హరించు, నన్ను విముక్తురాలిని చెయ్యి ..అదే నా కోరిక ..." అంది.

నేను" నీ కోరిక నేను తీర్చను ..కానీ నా కోరిక నువ్వు తీర్చాలి " అన్నాను గాంభీర్యంగా...
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages