తొలిరేయి - అచ్చంగా తెలుగు
 తొలిరేయి
 లక్ష్మణ్ భరద్వాజ్

         
విశ్వనాథం గారికి ఎనిమిది మంది మగపిల్లల మధ్యన ఒక అమ్మాయి రాధిక పుట్టింది.
          రాధిక అన్నదమ్ములతో సరదాగా ఉంటూ బాగానే చదువుకున్న అల్లరి అమ్మాయి.
               రాధిక బాగా చదువుకునే రోజుల్లో మంచి సంబంధం రావడంతో విశ్వనాధం గారు చాలా దూరమైనా సరే వేరే ఏమి ఆలోచించకుండా,మురళీ మంచివాడని, బాగానే సంపాదిస్తున్నాడు, మన స్తోమతకు సరిపోతాడని,రాధికను,ఇచ్చి వివాహం జరిపించాడు.
         మురళి హరిద్వార్ లో ఓ ప్రవేటు కంపేనీలో అసిస్టేంట్ మేనేజరుగా ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. మురళీ,రాధికలకు పుట్టిన గారాల పట్టి సుచిత్ర.
              సుచిత్రను గారాభంగా పెంచి పెద్ద చేసారు. సుచిత్ర బాగా అల్లరి, చిల్లరగా, తిరుగుతూ,మగరాయుడులా తయారైంది.అలాంటి అల్లరి పిల్ల, సుచిత్రను,మన తెలుగు భాషకి, మన సంస్కృతికి దూరం చేయడం ఇష్టం లేని రాధిక, భర్త మురళీతో పట్టుపట్టి మరీ, పుట్టింటి దగ్గర, విశ్వనాధం గారి పర్యవేక్షణలో డిగ్రీ చదివించడం కోసం ఉంచింది.
          సుచిత్ర తాతగారి దగ్గర ఉండి చదువుతోంది కానీ, తన మనస్సంతా హరిద్వార్ లోనే ఉంది. ఎందుకంటే తను ప్లస్- టూ, వరకూ ఒకే స్కూలులో చదవడం వల్ల తన సీనియర్ విద్యార్ధి సాకేత్ తో ప్రేమలో పడింది. సాకేత్ తో పబ్ లకి,డిస్కోలకి వెళ్ళడం, డేటింగు, చాటింగులు,మీటింగులు,పార్టీలకు అలావాటు పడింది.
           ఈ అలవాట్ల వలన సుచిత్ర కొన్ని వ్యసనాలకు,బానిసై, చిత్ర,విచిత్రంగా ప్రవర్తిస్తోంది.ఈ విషయం తల్లి,రాధిక గమనించి, చాలా సార్లు మందలించింది.

అయినా సుచిత్ర,మానసిక ప్రవర్తనలో మార్పు రాలేదు అందుకే డిగ్రీ చదువని, తెలుగు భాష, సంస్క్రృతనే నెపంతో పల్లెటూరైనా సరే బలవంతంగా పంపించింది సుచిత్రను, రాధిక.
       రాధిక తండ్రి ,విశ్వనాధం వద్దమ్మా ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉండటమే మంచిది, మీ దగ్గరే ఉండనీ, ఆ చదువేదో అక్కడే పూర్తి చేయ్యనీయని  వారిస్తున్నా వినిపించుకోలేదు.
        అలా సుచిత్ర హరిద్వార్ నుండి, హరిపురం చేరింది. సుచిత్ర కంటే ఓనాలుగేళ్ళు పెద్ద, ఆఖరి మేనమామ వంశీక్రీష్ణ. వంశీ డిగ్రీతో పాటు, కంప్యూటర్ డిప్లమో పూర్తి చేసి, ఉన్నత ఉద్యోగ పరీక్షలకై ఇంటి దగ్గరే ఉండి చదువుతున్నాడు.
             విశ్వనాధం తల్లి,నరసమాంబ, ఊరుకోక, ఓ రోజు సాయంత్రం వేళ మాటల్లో,మాట,కలుపుతూ, ఒరే అబ్బాయి విస్సూ, విసుక్కోక నా మాట వినరా ! మనవాడు,వంశీక్రిష్ణకి, సుచిత్ర, తగిన ఈడు,జోడూను. వాడికి సంబందాలు వెతకడం కష్టం లేకుండా, ఆ భగవంతుడు ఈ సుచిత్రను పంపించాడు. కాబట్టి, నువ్వు, ఓ సారి మీఅల్లుడు, మురళీతో ఈ విషయం మాట్లాడు. అమ్మాయి రాధిక, మనమ్మాయే గాబట్టి ఒప్శుకుంటుంది. అల్లుడి గారు,ఊ,ఆ,అని దాటవేసినా, ఒప్పిస్తుంది. ఏమంటావ్?
       ఇక నేనా, ముసలిదాన్నైపోయాను.

 నీ భార్య,చనిపోయిందగ్గరనుండి అన్ని పనులు నేనే చేసుకుంటూ వస్తున్నాను. ఇక నా వల్లగాదు.నేను కూడా రేపో, మాపో పిలుపొస్తే ఆయన సన్నిదికి చేరాల్సిన దాన్నే! కదరా? నీ మనవరాలు సుచిత్రకి ఈ ‌లోగా వంటా, వార్పు నేర్పిస్తాను. సుచిత్ర, వంశీ వాళ్ళిద్దరకి ముడేసి ఓ ఇంటి వాళ్ళను చేస్తే, వాళ్ళిచ్చే, మునిమనవడితో కాలక్షేపం చేస్తాను. అని తన మనస్సులో మాట కొడుకుతో బైట పెట్ఞింది ముసలావిడ, నరసమాంబ.
        విశ్వనాధం, ఔను నిజమే ! చంకలో పిల్లిని పెట్టుకుని, ఊరంతా తిరిగినట్టు, నా మనవరాలు సుచిత్రనే, నా కోడలిగా చేసుకోక ఎవర్నో వెతకడం ఎందుకని మనస్సులోనే అనుకొని, వెంటనే కూతురు, రాధికకు ఫోన్ చేసి, మాట్లాడి అల్లుడు మురళీగారి,అభిప్రాయం తెల్సుకో మన్నాడు.
           రాధిక ఈ విషయం చెప్పగానే చాలా సంతోష పడింది.సుచిత్రను మా వంశీగాడు చేసుకుంటేనే దాని తిక్క కుదిరి చక్కగా ఉంటుందనుకుని,భర్త రాగానే చెప్పింది
          మురళీ గారు ఓ మంచిరోజు చూసుకుని ఉదయాన్నే ,విశ్వనాధం గారికి, మావగారు వంశీక్రిష్ణకు, నా కూతురు సుచిత్రను, ఇచ్చి వివాహం చేయడంలో నాకేం అభ్యంతరం లేదు. కానీ అది బాగా అల్లరిపిల్ల,ఏ పనులు చేతగావు మరి వంశీ ఇబ్బంది పడతాడేమో? ఆలోచించుకుంటే సరి లేదంటే మంచి ముహూర్తం చూడండని ఫోను చేసాడు.
             విశ్వనాధం సంబర పడుతూ, మంచి ముహూర్తం నిర్ణయించి కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే, మంచిదని, కార్తీక పౌర్ణమి రోజున, సుచిత్రను, వంశీ క్రిష్ణకు ఇచ్చి, వివాహం ఘనంగా నిర్వహించారు.
           విపరీతమైన చలికాలం, దానికి తోడు మంచు బాగా పడుతున్న రోజులు, గజ,గజ వణికే కాలం అలాంటి సమయంలో వంశీకి, సుచిత్రలకు తొలిరేయి.
               సుచిత్రకు తురిమిన మల్లెల సుగంధ,పరిమళాలతో పాటు గది నిండుగా వివిధ పుష్ప సౌరభాల గుబాళించే సెంటు వాసనలు

వెదజల్లుతున్న సమయంలో ఇద్దరు ఒక్కటయ్యే వేళ, ఏదైతే జరగాలో అది జరగలేదు.ఇలా ఆ ఒక్కతొలిరేయి, రోజే కాదు. ఏ ఒక్కరోజు వాళ్ళిద్దరూ ఒక్కటిగా కలుసుకోలేదు.
              అందరికి చాలా అన్యోన్యంగా ఉంటున్నట్టుగా కనబడుతూ, ఎవరికివారే,యమునా తీరే అన్నట్టుగా గా ఉంటున్నారు.
ఈ విషయం ముసలావిడ,నరసమాంబ కనిపెట్టేసింది. వాళ్ళకు పెళ్ళై ఇన్ని రోజులైనా,వాళ్ళు శారీరకంగా దగ్గరవలేదనే సంగతి,ఒకర్నొకరు

కలుసుకోలేదనే విషయం గ్రహించింది.
         ఓక రోజు సుచిత్ర కాలేజీకి వెళ్ళిన సమయంలో ఏరా వంశీ,మీ ఇద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారా? లేదా? ఏ ఒక్కరాత్రి వ్రృధా, కానీయడం లేదుకదా ? దేవుడు మీ నాన్నకు నవరత్నాల్లాంటి మీ అందర్నీ ఇచ్చాడు. నీకు మంచి బిడ్డలను ప్రసాదిస్తాడు
         ఐనా,నాకెందుకో అనుమానంగా ఉందిరా. మీ ఇద్దరూ, కలుసుకున్నట్టు లేదు. లేదంటే ఈ పాటికి నా ముని మనవరాలు సుచీ పులుపు కావాలని కోరుకునేది. లేదంటే తనేం తినాలనుకుంటోందో, వాటిని అడిగి మరీ చేయించు కునేది. కానీ అలాంటిదేం కనబడటం లేదు.
            ఏమిరా ! నాకు తెలియక అడుగుతాను, నీలో ఏదైనా లోపం ఉంటే, ఎవరి తెలియక ముందే,సరైన డాక్టరుకి చూపించుకో, లేదంటే సమాజం ఏవేవో మాటలంటుంది, నువ్వు తట్టుకోలేవు.నీకస్సలే కోపం ఎక్కువ. మీ పడక గదిలో,రాధా క్రిష్ణుల,శ్రృంగార భంగిమలో ఉన్న పోటో ఉంచుకుని, రోజూ పడుకునే ముందు ఆయనకు ఓ సారి దండం పెట్టుకుని పడుకో మేలు జరుగుతుంది.
         వంశీకి, బామ్మతో, ఏం చెప్పాలో తెలియక అలాగేలే బామ్మ అనేసాడు. కానీ సుచిత్ర ప్రవర్తన గురించిన అస్సలు విషయం చెప్పలేదు.
               ఒకరితో,ఒకరు కలిసి,ఇద్దరన్న సంగతి తెలియనీయకుండా పడుకునే అవకాసం కల్పించే, భయంకరమైన చలికాలం,బైటకు వస్తే మంచు పడే రోజులుండే కాలం.ప్రక్కన వెచ్చనైన తోడున్నా కాలం  అంతా వ్రృధాగా కరిగి పోయింది కానీ వంశీ, సుచిత్రలకు తొలిరేయి జరగలేదు.
           రధసప్తమి పోయి, మండే ఎండల కాలం వచ్చింది. సుచిత్ర పరీక్షలై పుట్టింటికని దిగబెట్టమంటే, వంశీ హరిద్వార్ దిగబెట్టి వచ్చాడు.
        కొద్ది రోజుల తర్వాత, వంశీక్రీష్ణకు, ఒక అన్- నోన్ నంబరు నుండి ఫోన్ వచ్చింది.సుచిత్ర,తన మనస్సు మార్చుకుని ఫోన్ చేసి ఉంటుందని, ఆనందంతో ఫోన్ తీస్తే,అటునుండి హలో ! నేను సాకేత్ ని, నా సుచిత్రను నువ్వు ముట్టుకోనందుకు థ్యాంక్సు చెబుదామని ఫోన్ చేసాను.
         సుచిత్ర నా ప్రాపర్టీ,తిరిగి నా దగ్గరకే ఇంత త్వరగా పంపిస్తావని కలలో కూడా అనుకోలేదు. ఎనీహౌ ! థ్యాంక్యూ,బ్రో! అని ఫోనులో సారాంశం !
           వంశీకి ఒక్కసారిగా భూమంతా గిర,గీరా తిరిగినట్లైంది.సుచిత్ర అంత పని చేస్తుందని ఊహించలేదు.
         ఫోను నంబరు ఆధారంగా. సాకేత్ ఎవరో, ఎక్కడ ఉంటాడో వివరాలన్నీ సేకరిస్తే అతను హైదరాబాదులో ఓ మోటారు వాహనాలు అమ్మే, కంపేనీలో మెకానిక్ గా పనిచేస్తున్నాడు.
          సాకేత్ ప్లస్- టు ఫెయిలవడంతో ఇంట్లోంచి వాళ్ళ తల్లి,తండ్రులు పంపించేసారు. ఆ సమయంలో ఏం చేయాలో తోచక, వ్యసనాలకు బానిసై ఉండటం వల్ల చేతిలో డబ్బులు లేక పోవడంతో సుచిత్ర సలహాతో, బైకు మెకానిక్ గా చేరాడు.
         సుచిత్ర, ఒక బలహీనమైన పరిస్థితిలో సాకేత్ కి,తను లొంగిపోయి, సర్వస్వం అప్పగించింది. అప్పటికే తను నెల కూడా తప్పింది.అంతేగాక చాలా వ్యసనాలకు బానిస కావడం వల్ల,తల్లి రాధిక మాట విన్నట్టు నటించి హరిపురం వచ్చింది.
               వంశీతో,సుచిత్ర ఒక్కరోజు కూడా కాపురం చెయ్యలేదు సరికదా, వంశీని కనీసం,చేత్తో తాకనీయక, నానా, దుర్భాషలాడేది.వంశీని చాలా సార్లు తన గోర్లతో రక్తం వచ్చేలా రక్కడం,ముట్టుకోబోతే దూరంగా త్రోసేయడం చేసేది.
    ఇదంతా వంశీ, ఎవ్వరికి చెప్పకుండా పోనీలే పాపం సుచీదంతా,ఇంకా చిన్నతనం. కొన్ని రోజులకి,తనే స్వయంగా అర్ధం చేసుకుంటుందని ఊరుకున్నాడు.ఇలా వంశీ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు
      కానీ జరిగిన అస్సలు విషయం ఏమిటంటే సుచిత్ర, హరిధ్వార్ నుంచి, హరిపురం వెళ్తున్నానని,తల్లి తండ్రులతో అబద్ధం చెప్పి, హైదరాబాదు సాకేత్ వద్దకు వెళ్ళింది
  ఈ విషయం మురళీ,రాధికలకు తెల్సి, నచ్చ జెప్పి, వంశీకి,సుచిత్రను అప్పగించాలని ప్రయత్నించి, సుచిత్ర వినక పోవడంతో, ఏం చేయాలో తెలియక వెనుదిరిగారు.
      వంశీకి మరో అమ్మాయితో వివాహం జరిపించటమే మేలని భావించారు

వంశీతో మాట్లాడి,మరో అమ్మాయితో, వివాహం జరిపించారు.
   వంశీ ఆ,అమ్మాయితో ఏకాంతంగా

 మాట్లాడి, ఆమే ,ఇష్టాలు, అయిష్టాలు అన్నీ తెల్సుఠున్నాక కొద్దిరోజులు ప్రేమించుకుని, ఒకరిని, ఒకరు బాగా అర్ధం చేసుకున్నాక  వాళ్ళిద్దరూ,  తొలిరేయి మండు వేసవిలో ఒక్కటయ్యారు !
           పెళ్ళిళ్ళు చేసేటప్పుడు,ఇరువురి, గుణగణాలు, ప్రేమ వ్యవహారాలు అన్నీ రహస్య దర్యాప్తు చేసుకున్న తర్వాత రెండువైపుల కుటుంబాల వారు సమ్మతించాక వివాహం జరిపిస్తే మేలు ! లేదంటే పెళ్ళైన కొన్ని రోజులకే సుచిత్రలా వెళ్ళిపోతే పెద్దవాళ్ళు తట్టుకోలేరు. ఏ అఘాయిత్యమో, చేసుకుంటే పరువూ పోతుంది.పరపతి పోతుంది. బందాలు, బందుత్వాలు తెగిపోతాయి. మనుషులను దూరం చేసుకుని బ్రతికినంతకాలం బాధలను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి వివాహాల విషయంలో జాగ్రత్త !
***

No comments:

Post a Comment

Pages