వరదరాజ శతకము - గుండ్లపల్లి నరసమ్మ
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం
కవి పరిచయం:
వరదరాజ శతకకర్త్రిణి నరసమ్మ గారు చిత్తురు సమీపమున ఉన్న గుండ్లపల్లి అనే గ్రామములో నివసించేవారు. ఈమె భర్త అప్పాసామి రెడ్డి. ఈమెకు పదకొండవఏట మాతృవియోగము, పన్నెండొవఏట పతి వియోగము పదమూదవఏట సోదర వియోగము సంభవించుటచే అప్పతినుండే దైవధ్యానమునందు లీనమై భారత భాగవత రామాయణాది పురాణములన్నింటిని క్షుణంగా ఆకళింపుచేసికొనినది. ఈక్రమంలోనే ఈమె వరదరాజ శతకం రచించటం జరిగిందని ఈశతకారంభంలో కవియిత్రి స్వయంగా చెప్పుకొన్నారు. ఈమె ఇతరరచన భక్తిరస ప్రధానమైన హరిసంకీర్తనలు అనృ గ్రంధం.
శతకపరిచయం:
"పుడమి శ్రీవల్లివేడు సత్పురవాస, వనితనరసాంబఁ బ్రోవుమా వరదరాజ" అనే మకుటంతో 107 సీసపద్యాలతో అలరారే ఈశతకం భక్తిరస ప్రధానమైనది. ఈశతకములో నీతిపద్యములు,దశావతారవర్ణనము, రామాయణ, భారత, భాగవత కథా సంగ్రహములు, పాతివ్రత్యాది సాంసారిక ధర్మములు, జ్ఞానమార్గ పద్యములు ఉన్నవి.
తాను బాల్యము నుండి అనుభవించిన కష్టములు ఏకవురు పెట్టుకొన్నది.
సీ. జయరామ నేభువిన్ జన్మమెత్తినదాది, తల్లిదండ్రులఁ బాసి తల్లడిల్లితిఁ
బతితపావన బాల ప్రాయంబునందునేఁ, బతినిఁగోల్పడిచాలఁ బాటుపడితి
అమరవందితనిన్ను నర్చించనేరక, యన్నలబాసినే నధమనైతి
నిన్నియునెడఁబాసి నిన్నునేమఱవక, ధైర్యంబుతో నుండి ధన్యనైతి
నెన్ని కష్టంబులుండిన నెపుడుమిమ్ముఁ
దలచువారలపాపముల్ తొలఁగుటరుదె || పుడమి ||
కొన్ని పద్యాలు చూద్దాము.
సీ. నీమోహనాకృతి నీలకంఠుఁడెఱుంగు, లలితసౌందర్యంబు లక్ష్మియెఱుఁగు
నీరాజభుజసక్తి మారీచుఁడెఱుఁగునా, భీలశరపటిమ వాలియెఱుఁగు
ధైర్యశౌర్యంబులు దశకంఠుఁడెఱుగును, సత్యవాక్యము విభీషణుఁడెఱుఁగు
నీమ్రుచ్చుపనిగొల్ల నెలఁతలెఱుఁగుదురు, నీదంటతనము యశోదయెఱుఁగు
నీమహామహిమముభక్త నివహమ్ర్ఱుఁగు
నిన్నునెఱుఁగంగ నేనెంత నిర్మలాత్మ ||పుడమి||
దశావతార పద్యములు
సీ. మచ్చమైజలధిలోఁ జొచ్చిసోమకుఁద్రుంచి, వేదముల్ బ్రహ్మకర్పించినావు
కూర్మమైమందర కుధరంబుదాల్చి దే, వతలకునమృతంబుఁ బంచినావు
శ్రీవరాహంబవై యీవసుంధరఁజుట్టి, కొనిపోవుకనకాక్షుఁ గూల్చినావు
స్తంభమందుదయించి డింభకురక్షింపఁ, గాహిరణ్యకశిపుఁ గడపినావు
నీదుభక్తులవైరుల నీరుసేయ
నీవుగాక మఱెవ్వరు నేరరయ్య ||పుడమి||
సీ. వటుఁడవై జన్మించి వాసవురక్షింప, బలినిసామంబున గెలిచినావు
జమదగ్నిసుతుఁడవై జగతిరాజులఁగొట్టి, జనకాజ్ఞతలిఁజంపి మనిపినావు
రఘుకులజుండవై రమణిఁగోల్పోయి రా, వణుఁద్రుంచి సీతతోఁదనరినావు
కృష్ణుఁడవై దుష్టకృత్యంబులను జేయు, చెడుగుకంసునిఁబట్టి చెండినావు
యిట్టి యవతారములఁదాల్చు టెంచిచూడ
ధర్మమునునిల్పుటకెకదా! దనుజవైరి ||పుడమి||
అధిక్షేప పద్యములు కూడా ఈ శతకంలో చూడవచ్చు.
సీ. ఆదివిష్ణుండవై యఖిలంబునిండిన, వానికినవతార వరములేల?
మణిమయంబగు చిత్రమందిరంబులుగల్గి, క్షీరాబ్ధినుండెడి చింతయేల?
వాయుసమానమౌ వాహనంబులుగల్గి, వైనతేయునినెక్కు వాంఛయేల?
పట్టెమంచముదిండ్లు పఱుపులుగల్గియుఁ, బన్నగేంద్రునిమీదఁ బండుటేల?
యిట్టిచిత్రంపువర్తన లిందిరేశ
నీకు లీలలుగాఁదోఁచెనే మహాత్మ? ||పుడమి||
సీ. పక్షివాహన! లక్ష్మి వక్షమందుండగ, బిక్షమెత్తితివేల బిడియపడక
పాలసంద్రపువెన్నఁ బంచిపెట్టెడునాఁడు, స్త్రీరూపమెత్తితి సిగ్గుపడక
ధరజీవతతిబ్రోచు దొరవయ్యునడవుల, గోవులఁగాచితి కొంచపడక
గొల్లనెలంతల యిల్లిల్లుతిరుగుచు, వెన్నమెక్కితికదా వెలితియనక
యిట్టికారానివగుపను లిందిరేశ
యెట్టులొనరించినావహో! యెగ్గులేక ||పుడమి||
వేమన, బద్దెన మొదలైన శతకకర్తల ప్రభావం ఈశతకంలో మనకు అనేక పద్యాలలో కనిపిస్తుంది.
సీ. చదలనక్షత్ర సంచయమెంచఁగావచ్చుఁ, దవిలిశేషుని తలఁదట్టవచ్చు
నావలీవలిదరి కబ్ధినీదఁగవచ్చు, గాలినైనను బట్టి కట్టవచ్చు
నెఱ్ఱ్ఁగాగాచిన యినుము మ్రింగఁగవచ్చుఁ, గార్చిచ్చువడి మూటగట్టవచ్చు
గిరులనచ్చనగుండ్ల కరణినాడఁగవచ్చుఁ, దెంపుగావసనాభిఁ దినఁగవచ్చు
మూఢమతులను సద్ధర్మమునమెలంగు
నటులఁజేయబజునకైన నలవికాదు ||పుడమి||
అనే పద్యం చదువగానే తివిరి ఇసుమున తైలంబు అనే వేమనపద్యం గుర్తుకురాక మానదు.
సీ. కాశికిఁబోవఁగాఁ గర్మంబుదీఱునా, కాశికిఁబోవవే కాకులెపుడు
జలములఁగ్రుంక, రాజాలునా మోక్షంబు, జలములనుండవే జలచరములు
తపముచేఁదనువును దపియింపఫలమౌనె, తలక్రిందువ్రేలవే ధరఖగములు
వనబీలములనుంద వశుఁడౌనెదేవుండు, బీలములందుండవే యెలకలెపుడు
ఇట్టికష్టమౌవిద్యల నెల్లవిడిచి
బుద్ధినీయందునిలిపినఁ బొందుముక్తి ||పుడమి||
పోతన గారి "మందారమకరంద" శైలిలో రచించిన ఈ పద్యం చూద్దాము.
సీ. అత్తమామలమాట కడ్డమాడనికాంత, కాంతయేరతనాల దొంతిగాని
బావమఱుఁదులకు బదులుపల్కనిబాల, బాలయేయదివిరిగోలగాని
పతిసేవకెన్నండు బ్రతిమాలనియింతి, యింతియేయదిపూల బంతిగాని
పతిబంధువునఁ బ్రేమ భావించెడునతివ, యతివయే యపరంజి ప్రతిమగాని
యిట్టిసద్భుద్ధిగలిగిన యింతితోడఁ
గూడుకొన్నట్టిపతికి వైకుంఠమదియె ||పుడమి||
ఇటువంతి ఎన్నో నీతి, జ్ఞాన, భక్తి పద్యాలతో అలరారే ఈశతకం అంచరు చదివి ఆనందించదగినది.
మీరు చదవండి. మీ మిత్రులతో చదివించండి.
***
No comments:
Post a Comment