అసమాన ప్రతిభాశాలి, ధీర - పద్మప్రియ - అచ్చంగా తెలుగు

అసమాన ప్రతిభాశాలి, ధీర - పద్మప్రియ

Share This
అసమాన ప్రతిభాశాలి, ధీర - పద్మప్రియ 
వి. యశోద 


ఆమె... రెండు కాళ్లు లేకపోయినా.. రెండు రాష్ట్రపతి అవార్డులను అందుకున్నారు. తన కాళ్లపై తాను నిలబడలేకపోయినా.. ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ.. వాళ్లకాళ్లపై వాళ్ళు నిలబడేలా శిక్షణ ఇస్తున్నారు. అంగవైకల్యంతో అవస్థలు పడుతూ.. తన తోటి వికలాంగులను అవార్డులతో సత్కరిస్తున్నారు.. 
ఆమే..."పద్మావతి ఇనిస్టిట్యూట్ ఫర్ ది డిసేబుల్డ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు" పద్మప్రియ. 
నటనలోనూ.. సామాజిక సేవలోనూ జాతీయ అవార్డులను అందుకున్న కళాకారిణి, సామాజ సేవకురాలు. తమకు సానుభూతి వద్దని.. తమ హక్కులు తమకు కల్పిస్తే చాలని, ఆమె అంటున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినా.. తెలుగురాష్ట్రాలు మాత్రం తమకు తగినంత గుర్తింపు ఇవ్వడం లేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం...

బాల్యం...
ఖమ్మంలోని మధ్యతరగతి నేత పనివారి కుటుంబంలో పుట్టాను. నాన్న సత్యం, అమ్మ కుసుమ. ఏడాది వయసులోనే పోలియో వచ్చి రెండు కాళ్లు చచ్చుపడి పోయాయి. అక్క, తమ్ముడు పరుగులు పెడుతుంటే నన్ను మాత్రం అమ్మో, నాన్నో భుజంపై ఎత్తుకుని తీసుకువెళ్లేవారు. నడవడానికి ప్రయత్నించినప్పుడల్లా ఎముకలు విరిగిపోయేంతగా బాధ. తోటి పిల్లలంతా ఆడుకుంటుంటే నడవలేని నా స్థితిని చూసి ఎన్నో సార్లు ఏడ్చాను. నా కంట్లో నీళ్లు చూసిన ప్రతిసారి అమ్మనాన్న ఓదార్చేవారు. కాళ్లు నడవడానికి సహకరించకపోయినా.. కండ్లు మాత్రం కళలను ఆస్వాదించేవి. మా అమ్మ పాటలు బాగా పడేది. ఆమె పాటను అనుకరించేదాన్ని. ఆమే నా తొలిగురువు.

ఆత్మస్టైర్యం నింపిన ఆస్ట్రేలియన్ 
ఒంటరిగా ఉంటే నేను పడే బాధను చూడలేక నన్ను స్కూలులో చేర్చించారు. ఖమ్మంలోని 'సెయింట్ మేరీస్ పోలియో రిహాబిలిటేషన్ సెంటర్ ' నా లాంటి వారికోసమే నిర్వహిస్తున్న స్కూలు. అక్కడ ఆస్ట్రేలియా మహిళ కార్లహీటస్ ఫిజియోథెరపిస్ట్ గా పనిచేసేవారు. ఆమె మాటలు నాకు కొత్త ఊపిరిని పొసాయి. చదువుతో పాటు పాటలు పాడటం, నాటికలు వేయడం, బొమ్మలు గీయడం వంటి కళలలో శిక్షణ ఇచ్చేవారు. నేను పాటలు బాగా పాడేదాన్ని. మా టీచర్ ఇచ్చిన ప్రోత్సాహంతో మొదటిసారిగా నేను స్కూల్ ఫంక్షన్లో నాటకం వేశాను. కుర్చీలో కూర్చొనే మేరీమాతగా నటించాను. నాటకం చూసిన వారు ఎంతో మెచ్చుకున్నారు. అలా నాటకాలు వేయడం ప్రారంభమైంది. 

జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నాను. ఒకవైపు కళలు.. మరోవైపు చదువు కొనసాగిస్తూనే, డిగ్రీ పూర్తిచేశాను. కె.వి. సుబ్బారావు గారి దగ్గర లైట్ మ్యూజిక్, వై. రామచంద్రర్ గారి దగ్గర కర్నాటక సంగీతం, పృధ్వి  వెంకటేశ్వరరావు గారి దగ్గర మ్యూజికల్ డ్రామా నేర్చుకున్నాను. 

అమ్మ పాటతో అవకాశం.. 
పాటలు బాగా పాడటంతో స్కూల్ ఫంక్షన్స్ తో పాటు పోటీలలో కూడా పాల్గొనేదాన్ని. కొన్నాళ్ళు Vegesna సంస్థ లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం చేశాను. హైదరాబాద్లో  వంశీ ఇంటర్నేషనల్ సంస్థ నిర్వహించిన పాటల పోటీలో చిన్నప్పుడు నేర్చుకున్న పాట  పాడాను. ఆ ప్రోగ్రామ్ కు వచ్చిన వంశీ ఇంటర్నేషనల్ సంస్థ అధ్యక్షుడు వంశీరామరాజుగారు తమ సంస్థలో సంగీతం టీచర్ గా ఉద్యోగం ఇచ్చారు. టీచర్ గా పనిచేస్తూనే ఎన్నో నాటకాలలో నటించాను. పద్య నాటకం నాకు వంశీ రామరాజు గారు నేర్పించారు.   పార్వతి, చంద్రమతి, సత్యభామ, శ్రీకృష్ణుడు,  పాండురంగడు, వెంకటేశ్వరుడు, శ్రీనివాసుడు వంటి అనేక పాత్రలు వేశాను. సత్యభామగా నా నటన చూసి జమునగారు మెచ్చుకోవడం నా జీవితంలో మరిచిపోలేని ఘట్టం. దాదాపు మూడు వందల మ్యూజికల్ లైవ్ షోలు, దూరదర్శన్, ఇతర టీవీ ఛానల్స్ తో కలిపి దాదాపు ఐదు వందల నాటక ప్రదర్శనలు ఇచ్చాను. 

నాలాంటి వారికి కళలు నేర్చించాలనే…
అంగవైకల్యం అనగానే.. వీరికి ఏ పని చేతకాదు అంటూ జాలిగా చూస్తారు. ఆ జాలి చూపులు.. 'అయ్యో పాపం అనే సానుభూతి మాటలు నాకు అసలు నచ్చవు. నాలాగే ఎందరో అంగవైకల్యంతో బాధపడుతున్నారు. సమాజం చూసే జాలి చూపులు తట్టుకోలేక ఆత్మనూన్యతాభావంతో బతుకుతున్నారు. మా అమ్మలాంటి అమ్మ, నాకు దొరికిన గురువు వంటి గురువు, అందరికీ ఉండరు కదా! అందుకే డిసేబుల్డ్ వారికోసం ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటుచేయాలన్న ఆలోచన వచ్చింది. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో "పద్మావతి ఇనిస్టిట్యూట్ ఫర్ డిసేబుల్డ్" సంస్థను 1999లో ప్రారంభించాను. ఇక్కడ చేరేవారికి చదువుతో పాటు కళలలో శిక్షణ ఇస్తాం. వృత్తి నైపుణ్యంతో కూడిన కోర్సులను కూడా అందిస్తున్నాం. వీటితో పాటు మెడికల్ క్యాంప్స్, కల్చరల్ మీట్స్ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేస్తున్నాం.

రెండుసార్లు జాతీయ అవార్డులు.. 
జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నో సంస్థల నుంచి అవార్డులు అందుకున్నాను. అయితే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నాటక రంగం నుంచి 2009లో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆ తర్వాతి సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం ఇచ్చిన "రాణి ఝాన్సీ లక్ష్మీబాయి" అవార్డు నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినా ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లేదు. ఆటల్లో గెలిచేవారికి కోట్లాది రూపాయలను ఇచ్చే ఈ ప్రభుత్వాలు.. మాలాంటి కళాకారులను మాత్రం పట్టించుకోవడం లేదు.

ప్రతి ఏటా స్ఫూర్తి అవార్డులు.. 
సెన్సార్ బోర్డు సభ్యురాలిగా, నంది అవార్డుల కమిటీ సభ్యురాలుగా పనిచేశాను. వికలాంగులు సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. వివిధ రంగాలలో రాణిస్తున్న వారిని గుర్తించి ప్రతి ఏటా వారికి స్ఫూర్తి అవార్డులను అందిస్తున్నాం. ఇప్పటివరకు వందలాది మందిని గుర్తించాం. ఇకమీదట కూడా ప్రతి సంవత్సరం ఈ అవార్డులను అందిస్తాం.

సానుభూతి వద్దు..
అయ్యో పాపం అన్న సానుభూతి మాకు వద్దు. మాలో ఉన్నత విద్యావంతులు ఉన్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుతున్న క్రీడాకారులు, కళల్లోనూ అంతర్జాతీయ కీర్తిని ఆర్జించిన వారూ ఉన్నారు. ప్రభుత్వంలో మాకు ఉన్న కోటాలో ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నాం. వికలాంగుల సంస్థలో కూడా మాకు తగిన న్యాయం జరగడం లేదు. మేం కోరేది ఒక్కటే మాకు మీ సానుభూతి వద్దు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మాకు దక్కనివ్వండి.

అందుకున్న అవార్డుల్లో కొన్ని... 
1996లో ఆంధ్ర సత్యభామ అవార్డు, 1997లో మధుర గాయని అవార్డు ,1998లో అభినవసత్య అవార్డు, 2009లో ఔట్ స్టాడింగ్ క్రియేటివ్ ఇండివిజ్యువల్ విత్ డిసెబులిటీ జాతీయ అవార్డు, 2010లో కేంద్రప్రభుత్వ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి స్త్రీశక్తి పురస్కార్, 2017 లో తెలంగాణ ప్రభుత్వం రోల్మోడల్ అవార్డు, 2019లో అబ్దుల్ కలామ్ ఎక్స్లెన్స్ అవార్డు, 2019లో  ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ(జర్మనీ), పాండిచేరి శాఖ నుంచి గౌరవ డాక్టరేట్.

గౌరవ డాక్టరేట్ ఎందుకంటే...
నేను దివ్యాంగురాలిగా ఉంటూనే, గత 30 సం.గా కళాకారిణిగా వివిధ దశల్లో, వివిధ రూపాల్లో 100 % చేసిన కృషికి గుర్తింపుగా ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ(జర్మనీ), పాండిచేరి శాఖ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నాను.

ప్రస్తుతం...
'తెలంగాణా దివ్యంగకళాయాత్ర' అనే పేరుతో Wheel Chair Using Artists తో 10 ఉమ్మడి జిల్లాల్లో 10 కార్యక్రమాలు నిర్వహించాము.
విద్యార్ధులు, మహిళలు, రైతులు ఎవరైనా చిన్న విషయాలకు జీవితాలు బలి చేసుకోవద్దంటూ మాలో ఉన్న కళల ప్రదర్శన ద్వారా స్పూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నాము. అనూహ్య స్పందన వస్తోంది. మళ్ళీ మళ్ళీ రమ్మని అడుగుతున్నారు. 

ఒక చిన్న ఆశ...
ఇన్ని సాధించిన తెలంగాణా బిడ్డను  రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, జీవనాధారం కోసం ఏదైనా ఏర్పాటు చేస్తే, మరిన్ని సాధించగలను. తెలంగాణా ముద్దుబిడ్డ 
ను తెలంగాణా ప్రభుత్వం గుర్తించి తగిన సహకారం అందిస్తే, నాకే కాదు, మరికొందరు దివ్యాంగుల్లో కూడా నూతన స్పూర్తి కలిగి, విజయ పథంలో పయనిస్తాం.

పద్మప్రియ గారికి మరిన్ని విజయాలు దక్కాలని, ఆమె ఎందరికో స్పూర్తిగా, ఆదర్శవంతంగా నిలవాలని మనసారా కోరుకుందాము.

1 comment:

Pages