బాధ్యత
గిరిజ పీసపాటి
కారులో విశాఖపట్నం నుండి బొబ్బిలి వెళుతున్న మహిత చాలా దుఃఖంలో ఉన్నట్లు ఆమె కళ్ళనుండి కారుతున్న కన్నీరు చెప్తోంది. సీటు వెనక్కి చారబడి కళ్ళు మూసుకుని కూర్చున్నా ఆ మూసిన కళ్ళవెనుక చిన్ననాటి జ్ఞాపకాలు ఒకదాని వెంట మరొకటి దాడి చేస్తున్నాయి. అవన్నీ జగన్నాధం మాస్టారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఆయన ఇక లేరన్న నిజాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి.
రోజూలాగే ఆరోజు కూడా ఉదయం తొమ్మిది గంటలకల్లా హాస్పిటల్ కి వెళ్ళి ముందు ఓపీ పేషెంట్స్ ని చూడబోతుండగా తన మొబైల్ రింగ్ అవడం, ఎవరా అని చూస్తే జగన్నాధం మాస్టారి దగ్గరనుండి అని అర్ధమయి కాల్ ఆన్సర్ చేస్తూనే "నమస్కారం మాస్టారూ! ఎలా ఉన్నారు?" అని పలకరించింది. కానీ, అటునుండి ఎవరిదో కొత్త గొంతు వినిపించి "మాస్టారు కాసేపటి క్రితమే మరణించారండీ. పద్మావతి గారు మీకు ఫోన్ చెయ్యమంటే చేస్తున్నాను" అని చెప్పడంతో, తను విన్నది నిజమేనా! అబధ్ధమైతే ఎంత బాగుంటుంది అనుకుంది. "ఒకసారి ఫోన్ అమ్మగారికి ఇవ్వండి" అని అతను ఫోన్ పద్మావతి గారికి ఇచ్చాక "అమ్మగారూ! నేను వెంటనే బయలుదేరుతున్నాను. నేను ఆఖరి చూపు చూసేవరకూ దయచేసి కార్యక్రమం ఆపుతారా!?" అని అభ్యర్ధించడం, అందుకు ఆవిడ ఏడుస్తూనే "ముందు నీకే ఫోన్ చెయ్యమన్నాను. బంధువులకి, స్నేహితులకి ఎవరికీ ఇంకా విషయం తెలియపర్చలేదు. నువ్వు రాకుండా ఎలా?" అంటూ ఇక మాట్లాడలేనట్లుగా ఫోన్ పెట్టేసారు. దాని పర్యవసానమే ఇప్పటి ప్రయాణం.
***
మహితకి ఐదేళ్ళు నిండి ఆరవ ఏడు రాగానే బొబ్బిలి పాఠశాలలో ఒకటవ తరగతిలో జాయిన్ చేసారు. పాఠశాలలో చేరేలోగానే అమ్మమ్మ దగ్గర తెలుగు అఆలు, గుణింతాలు, నూరు అంకెలు నేర్చుకుంది. మహిత తల్లిదండ్రులు ఇద్దరూ విశాఖపట్నంలో ఉద్యోగస్తులవడం వలన మహితను అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంచి వెళ్ళారు. మహిత ఒకటవ తరగతి క్లాస్ టీచర్ జగన్నాధం మాస్టారు. చాలా మంచి వ్యక్తి. పిల్లలను ఏనాడూ తిట్టడం, కొట్టడం కాదు కదా కనీసం గోడకుర్చీ కూడా వేయించేవారు కాదు. అందుకే పిల్లలందరూ ఆయనంటే చాలా ఇష్టపడేవారు.
మహిత ఏకసంతాగ్రాహి కావడంతో ఏ పాఠం ఇచ్చినా గంటలో తిరిగి అప్పచెప్పేసేది. తనలోని చురుకుతన్నాన్ని గ్రహించిన మాస్టారు తనకి ఇంగ్లీషు, హిందీ అక్షరాలు నేర్పసాగారు. అవి కూడా చాలా త్వరగా నేర్చుకునేసరికి మాస్టారు మహి తాతగారిని కలిసి "పాపని ఉదయం పూట ట్యూషన్ కి పంపండి. తనకి హిందీ, ఇంగ్లీషు, లెక్కలు, జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన పాఠాలు చెప్తాను" అనడం తాతగారు సరేననడంతో మహి రోజూ ఉదయం మాస్టారి ఇంటికి వెళ్ళాక మాస్టారు తన ఒళ్ళో మహిని కూర్చోపెట్టుకుని అమ్మగారు ఇచ్చిన గ్లాసుడు పాలు పట్టి, వేరుశెనగ కాయలు స్వయంగా వలిచి మహితకి తినిపించాక పాఠం మొదలుపెట్టేవారు.
ఆయన చెప్పిన పాఠాల వల్ల సాన పట్టిన వజ్రంలా ప్రకాశించసాగాయి మహిత తెలువితేటలు. పిల్లలు లేరని పద్మావతి గారు బాధ పడితే "ఇదిగో మన బిడ్డ" అంటూ మహిని చూపించేవారు. "చాల్లేవయ్యా సంబడం. నాలుగు అక్షరం ముక్కలు నేర్పుతున్నావని మనింటికి పంపిస్తున్నారు కానీ... పెద్దింటోళ్ళ బిడ్డ మన బిడ్డ ఎట్టా అవుతుందయ్యా!" అనేవారు ఆవిడ. మహిత ఒక్కొక్క క్లాసు పాసయి తరువాతి క్లాస్ కి వెళ్ళడం, అనుకోకుండా జగన్నాధం మాస్టారే ఆ క్లాస్ టీచర్ గా ప్రమోట్ అవడం జరిగేది. ఈవిధంగా వారిద్దరి మధ్య అనుబంధం ఇంకా పెరిగింది. ఆయన మహితతో ఎప్పుడూ ఒకేమాట చెప్పేవారు. "అమ్మా మహీ! దేవుడు నీకు మంచి తెలివితేటలు ఇచ్చాడు. నువ్వు పెద్దయాక డాక్టర్ అవాలి. ఇదొక్కటే నేను కోరుకునేది" "తప్పకుండా మాస్టారూ! నేను పెద్ద డాక్టర్ ని అవుతా" అనేది అమాయకంగా.
**************
మహిత హైస్కూల్ చదువుకు రావడం, తల్లిదండ్రులు తనని వైజాగ్ తీసుకెళ్ళి అక్కడి స్కూల్ లో ఆరవ తరగతిలో జాయిన్ చెయ్యడం జరిగింది. తనకు పరీక్షలలో ఫస్ట్ రాంక్ వచ్చినప్పుడల్లా మాస్టారికి మనసులోనే భక్తిగా నమస్కరించేది.
ఆరవ తరగతి పరీక్షలు అయాక వేసవి సెలవులకి బొబ్బిలి వెళ్ళి ఆ సాయంత్రమే మాస్టారి ఇంటికి వెళ్ళిన మహికి ఇంట్లో ఉయ్యాలలో పడుకుని ఉన్న మూడు నెలల బాబుని చూసి చుట్టాలు వచ్చారేమో అనుకుని పెరట్లో మనిషి అలికిడి వినిపిస్తే అటు వెళ్ళింది.
పెరట్లో జాజులు ఏరుతున్న అమ్మగారు "బాగున్నావా మహీ! రా రా" అంటూ ఇంట్లోకి తీసుకెళ్ళి మంచం వాల్చి కూర్చోపెట్టి తినడానికి చేగోడిలు, జంతికలు, మినపసున్ని ఉండలు పెట్టి, "ముందు ఇవి తిను. మీ మాస్టారు బజారుకి వెళ్ళారు. ఈపాటికి వస్తూ ఉంటారు" అనేసరికి మౌనంగా ప్లేట్ ఖాళీ చెయ్యడం మొదలెట్టింది. ఐదు నిముషాల్లో సరుకులు తీసుకుని మాస్టారు వచ్చారు. ఆయనను చూడగానే గబుక్కున లేచి నిలుచున్న మహితో "కూర్చో మహి ! ఎంతసేపయింది వచ్చి? బాగా చదువుతున్నావా! మళ్ళీ చెప్తున్నాను నువ్వు డాక్టర్ అయి తీరాలి" అన్నారు నవ్వుతూ. అలాగే అన్నట్లుగా మౌనంగా బుర్ర ఆడించింది. కానీ దృష్టి అంతా బాబు మీదే ఉంది. వేరే చుట్టాలెవరూ లేరు. మరి పక్కవాళ్ళ బాబుని ఇక్కడ పడుకోబెట్టారా? అనుకుంది.
ఈలోగా బాబు నిద్రలేచి ఏడుపు మొదలెట్టగానే మాస్టారు ఉయ్యలలో నుండి బాబును ఎత్తుకుని ఊరుకోబెడుతూ "నాన్నా కృష్ణా! ఎవరొచ్చారో చూడు. మన మహి అక్క వచ్చింది చూడు చూడు" అంటూ మహిని బాబుకి చూపించారు. ఈలోగా అమ్మగారు పాలు కలిపి సీసాలో పోసి బాబుని తీసుకుని పట్టసాగారు. "ఎవరు మాస్టారూ! ఈ బాబు?" అని అడిగింది ఇక ఆగలేక. ఆయన నవ్వి "నీకు తమ్ముడు మహీ! మేము ఈ బాబుని దత్తత తీసుకున్నాం. వీడి పేరు కృష్ణ. బాబు పుట్టగానే తల్లి చనిపోయింది. తండ్రి నెల తిరక్కుండానే మళ్ళీ పెళ్ళికి సిధ్ధపడితే, ఆ రెండో భార్య బాబును మాత్రం చూడనని తెగేసి చెప్పేసరికి మాకు దత్తత ఇమ్మని అడిగాము. అతను వెంటనే అంగీకరించి దత్తత ఇచ్చేసాడు. ఇక వీడు మా కొడుకే" అన్నారు. కాసేపు బాబుని ఆడించి ఇంటికొచ్చేసిన మహిత అక్కడ ఉన్నన్నాళ్ళూ ప్రతీరోజూ వెళ్ళి బాబును ఆడించి వచ్చేది.
**************
సెలవులు వచ్చిప్పుడల్లా బొబ్బిలి వెళ్ళి, మాస్టారి ఇంటికి కూడా వెళ్ళి వస్తూ ఉండేది మహి. మహి పదవ తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం, బైపిసి గ్రూప్ తీసుకుని కాలేజ్ లో జాయిన్ అవడం, ఎమ్సెట్ లో కూడా మంచి రాంక్ రావడం, MBBS పూర్తి చేయడం, తరువాత గైనకాలజీలో పిజి చేసి, ఒక హాస్పిటల్ లో గైనకాలజిస్ట్ గా చేరడం ఒకదాని తరువాత ఒకటి జరిగిపోయాయి.
తను ఉద్యోదంలో చేరిన కొద్దిరోజులకి బొబ్బిలి వెళ్ళి మాస్టారి కాళ్ళకు నమస్కరించి "మీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను మాస్టారూ! నేను డాక్టర్ గా మీ ముందుకు వచ్చాను" అనేసరికి ఆయన నీరు నిండిన కళ్ళతో మహిని లేపి ఎప్పటిలాగే తల నిమిరి "మా దగ్గర ఎందరో చదువుకుని వెళతారు తల్లీ! కానీ నీలాగా ఎప్పుడో చిన్నప్పుడు పాఠం చెప్పిన మాస్టారిని ఎవరూ గుర్తుంచుకోరు. నువ్వు, కృష్ణ ఎప్పటికీ సొంత అక్కా తమ్ముడిలాగే ఉండాలి. కృష్ణా! అక్క చూడు శ్రధ్ధగా చదివి అనుకున్నది సాధించింది. నువ్వు కూడా అక్కలాగా బాగా చదివి ఇంజనీర్ కావాలి. అదే నా కోరిక" అన్న తండ్రి మాటలకు "అలాగే నాన్నా!" అని కృష్ణ అంటే, తప్పకుండా మాస్టారూ! కృష్ణ ఎప్పటికీ నా తమ్ముడే. నామీద నమ్మకం ఉంచండి" అని చెప్పి తిరిగి వైజాగ్ వచ్చింది మహి.
***********
ఇంతలోనే ఈ ఫోన్. సుస్తీ ఏమిటో?! ఇలా ఆలోచనలు సాగుతుండగానే డ్రైవర్ "మేడమ్ బొబ్బిలి వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళాలి?" అని అడగడంతో ఈ లోకంలోకి వచ్చి పడింది. పాత బస్టాండ్ దగ్గర అంటూ అడ్రస్ చెప్పిన పది నిముషాలలోనే ఇల్లు వచ్చింది. కారు దిగాక ముందు వరండాలో ఉన్న మాస్టారి పార్ధివ దేహాన్ని చూడగానే అడుగు పడనట్లయి స్థాణువులా నిలబడిపోయింది. ఎవరిది ఈ బాడీ! మాస్టారిది కాదే. అసలు మాస్టారి రూపమే లేదు. పూర్తిగా క్షీణించిన శరీరంతో ఎముకల మీద చర్మాన్ని అంటించినట్లు ఉంది కానీ... ఎక్కడా కండ అనేదే లేదు. పుర్రె ఆకారాన్ని స్పష్టంగా తెలిజేస్తోంది తలను కప్పి ఉంచిన చర్మం.
మాస్టారికి వచ్చిన అనారోగ్యం ఏమై ఉంటుంది? ఇలా ఆలోచిస్తుండగానే "అక్కా" అంటూ కృష్ణ వచ్చి మహిని పట్టుకుని ఏడవసాగాడు. "నువ్వు ధైర్యంగా ఉండాలి కృష్ణా. అమ్మకి మనమే ధైర్యం చెప్పాలి. మనం ఏడిస్తే అమ్మ ఇంకా ఏడుస్తారు" అంటూ అమ్మగారి దగ్గరకు వెళ్ళి ఆవిడని ఓదార్చి "మీరు ధైర్యంగా ఉండాలమ్మా. లేకపోతే కృష్ణ ఇంకా బెంబేలు పడతాడు" అని చెప్పింది. ఊరిలో వాళ్ళు వచ్చారు. ఇంకా దూరపు చుట్టాలు రాలేదు. ఈలోగా కృష్ణను పక్కకి పిలిచి "కృష్ణా! నాన్నగారికి వచ్చిన అనారోగ్యం ఏమిటి? మనిషి బాగా పాడైపోయారు. ఏ హాస్పిటల్ లో చూపించుకున్నారు? ఆ రిపోర్ట్స్ ఉన్నాయా" అని అడిగింది.
"ముందు పచ్చకామెర్లు వచ్చి తగ్గిపోయాయి అక్కా. ఇప్పుడు ఎయిడ్స్ వచ్చింది అంటున్నారు " "ఎయిడ్సా? ఏ డాక్టర్ చెప్పారు?" "డాక్టర్ చెప్పలేదు. మేం అడిగినా నేను ట్రీట్‌మెంట్ ఇస్తున్నాను కదా! అనేవారు". "మరి ఎయిడ్స్ అని ఎవరు చెప్పారు?" "నాన్నకి విపరీతంగా విరేచనాలు అయేవి. తిండి కూడా పూర్తిగా పడిపోయింది. అప్పుడు విజయనగరంలోని హాస్పిటల్ లో జాయిన్ చేస్తే కోలుకున్నారు. తిరిగి ఇంటికి వచ్చాక మళ్ళీ మొదలయ్యాయి. మళ్ళీ హాస్పిటల్ లో అడ్మిట్ అవడానికి నాన్న ఇష్టపడలేదు. దానితో ఇంటికే డాక్టర్ ని తీసుకొచ్చి ఇంజక్షన్లు, సెలైన్ పెట్టించాము. కానీ, మనిషి క్రమేణా నీరసించిపోయేరు. దాంతో చూడడానికి వచ్చిన వాళ్ళు ఎయిడ్స్ అన్నారు. అందరూ అలాగే అనేవారు. మొదట మా ముందు అన్నవాళ్ళు తరువాత నాన్న ముందే అనసాగారు. దానితో నాన్న చాలా బాధ పడేవారు. డాక్టర్ తో నాకు ఎయిడ్స్ వచ్చిందా!? అని అడిగితే ఆయన నవ్వి అదేం కాదు. మీరు ధైర్యంగా ఉండాలి. ఇలా డీలా పడకూడదు అన్నారు. నాన్న రిపోర్ట్స్ ఫైల్ అమ్మ దగ్గరే ఉంది" వివరించాడు కృష్ణ. "సరే నాన్నా! విషయం నేను కనుక్కుంటాను. నాన్న దగ్గర ఉందాం పద" అంటూ మళ్ళీ మాస్టారి పార్ధివ దేహం వద్దకు వచ్చి కూర్చుంది.
కార్యక్రమం పూర్తయాక బాగా దగ్గిర బంధువులు తప్ప అందరూ వెళిపోయారు. అమ్మగారిని గదిలోకి పిలిచి మాస్టారి మెడికల్ రిపోర్ట్స్ ఫైల్ అడిగి తీసుకుంది మహి. "అమ్మా మహీ! అందరూ ఆయనకి ఎయిడ్స్ వచ్చిందని, ఆయన చెడ్డవాడని అంటుంటే చాలా ఏడ్చేదాన్ని. అలాగని చూడడానికి వచ్చిన వాళ్ళను పొమ్మనలేము కదా! నువ్వైనా నిజం చెప్పి అందరి నోళ్ళూ మూయించి మీ మాస్టారి ఆత్మకి శాంతి కలిగించు తల్లీ. ఒకవేళ ఆయనకి వచ్చింది ఎయిడ్స్ అయినా నాకాయన దేవుడే. నాకు కావలసింది నిజం మాత్రమే" అన్న అమ్మగారితో సరే అన్నట్లుగా తల ఊపి ఫైల్ లో ఉన్న రిపోర్ట్స్ ని, ప్రిస్క్రిప్షన్స్ ని పరిశీలించసాగింది.
అన్నీ పరిశీలించాక మాస్టారికొచ్చిన వ్యాధి ఏమిటో అర్ధమయి, అమ్మగారికి, కృష్ణకి కూడా విషయం చెప్పి "నేను మాస్టారి పెద్ద కర్మకి వస్తాను. అంతవరకూ మీరు ఎవరేమన్నా మాట్లాడకండి. ఆరోజు అందరూ వస్తారు కనుక అప్పుడు అందరికీ నిజం తెలియజేద్దాం. కృష్ణా! అమ్మ జాగ్రత్త. అమ్మగారూ! మీరు ధైర్యంగా ఉండాలి. ఈ ఫైల్ జాగ్రత్తగా పెట్టండి.నేను మళ్ళీ వచ్చేవరకూ ఖర్చులకి ఉంచండి" అంటూ హాండ్ బేగ్ లోంచి పాతికవేలు తీసి ఆవిడ చేతిలో పెట్టి, కారెక్కింది మహిత.
************
పెద్ద కర్మ రోజు ఉదయం బొబ్బిలి వెళ్ళగానే కృష్ణని అడిగి మాస్టారి మెడికల్ రిపోర్ట్స్ ఫైల్ తీసుకుంది మహిత. మాస్టారి ఫోటోకి దండ వేసింది. వచ్చిన బంధువులను, స్నేహితులను అందరినీ ఫోటోకి ఎదురుగా ఐదు వరుసల్లో వేసిన కుర్చీలలో కూర్చోమని మస్టారితో తనకున్న అనుబంధాన్ని చెప్పి, మాస్టారి మృతికి సంతాపంగా ఒక్క నిముషం మౌనం పాటిద్దామని చెప్పింది. తరువాత అందరినీ కుర్చీలలో కూర్చోమని చెప్పి, మాస్టారి ఫోటో పక్కన వేసిన మూడు కుర్చీలలో కృష్ణ ని, అమ్మగారిని చెరో కుర్చీలో కూర్చోబెట్టి, తను మూడవ కుర్చీలో కూర్చుంది.
"ముందుగా మీ అందరూ మాస్టారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. మీ అందరికీ మాస్టారంటే గౌరవం, అభిమానం ఉండబట్టే ఈరోజు ఇక్కడికి వచ్చారు కదా! మరి మాస్టారు ఎయిడ్స్ వచ్చి చనిపోయారు అని మీలో ఎంతమంది నమ్ముతున్నారు? ధైర్యంగా చెప్పండి. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇంటికొచ్చి ఆయన పరిస్థితిని కేవలం కంటితో మాత్రమే చూసి ఎయిడ్స్ అని రోగ నిర్ధారణ చేసిన వారు, ఆయనని బతికుండగానే మానసికంగా చంపేసినవారు కొందరు ఉన్నారుగా. ఇప్పుడు ధైర్యంగా ఎందుకు చెప్పట్లేదు?
ఇదిగో మాస్టారి మెడికల్ రిపోర్ట్స్ ఫైల్. మీలో మెడికల్ నాలెడ్జ్ ఉన్నవారు ఎవరైనా దీనిని స్టడీ చెయ్యొచ్చు. రోగ నిర్ధారణ కోసం రక్త పరీక్షలు, ఎక్స్ రేలు, స్కేనింగ్ లు ఇలాఎన్నో రకాల పరీక్షలు చేస్తాము కానీ... ఇలా ఒక మనిషిని కళ్ళతో చూడగానే రోగనిర్ధారణ చేస్తారని ఇప్పుడే తెలిసింది. నీటికి నాచు తెగులు, నోటికి మాట తెగులు అని పెద్దలు ఊరికే అనలేదు. దయచేసి నిజాలు తెలుసుకోకుండా ఎవరి మీదా నిందలు వేయకండి. ఆయనకి వచ్చింది ఎయిడ్సే అయినా కూడా ఆయన చెడుపని చేయడం వల్లే వచ్చిందని ఎలా అనగలరు? ఎయిడ్స్ చాలా రకాలుగా వ్యాపిస్తుంది అని, ఎయిడ్స్ వచ్చిన పేషెంట్స్ ని ముట్టుకున్నంత మాత్రాన, వారి దగ్గరగా కూర్చుని మాట్లాడినంత మాత్రాన, ఆఖరికి వారు తిన్న కంచంలో ఇతరులు తిన్నంత మాత్రాన ఆ వ్యాధి వ్యాపించదని ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి మరీ ప్రజలలో అవేర్ నెస్ కోసం ఎన్నో ప్రకటనలను ప్రసార మాధ్యమాలలో ఇస్తోంది. అయినా మనలో మార్పు రాకపోతే ఎలా?
మాస్టారికి వచ్చిన వ్యాధి హెపటైటిస్ బి. ఈ వ్యాధి వలన ఇటీవలి కాలంలో చాలా మంది చనిపోతున్నారు. ఈవ్యాధి రాకుండా వేక్సిన్ అందుబాటులోకి వచ్చింది. మూడు నెలలు నెలకి ఒకటి చొప్పున మూడు డోస్ లు ఇంజక్షన్ రూపంలో తీసుకోవాలి. ఇప్పుడైతే పిల్లలు పుట్టినపుడే ఈ వాక్సిన్ ప్రభుత్వ ఆసుపత్రులలోను, మెడికల్ సెంటర్స్ లోనూ ఫ్రీగా వేస్తున్నారు. ఈ వ్యాధి కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది. దీనికి ట్రీట్‌మెంట్ తీసుకునేటప్పుడు కొన్ని తినకూడని పదార్ధాలు తింటే బాగా ముదిరిపోతుంది. ముఖ్యంగా మాంసాహారానికి దూరంగా ఉండాలి. మాస్టారికి మాంసాహారం అంటే చాలా ఇష్టం. బహుశా అపత్యం వల్ల మళ్ళీ వ్యాధి తిరగబెట్టి ఉండొచ్చు. మామూలుగా కూడా తగ్గినట్లే తగ్గి మళ్ళీ విజృంభించడం దీని లక్షణం.
ఈ వ్యాధి వలన ముందుగా దెబ్బతినేది కాలేయం. అందుకే మాస్టారికి తిన్నది అరగక విరేచనాలు అవడం, తిండి తినలేకపోవడం జరిగింది. నరం లేని నాలుకతో మీరన్న మాటలకు అసలే శారీరకంగా బలహీనపడిన మాస్టారు మానసికంగా కూడా ఎంత కృంగిపోయి ఉంటారో అర్థం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న మనిషికి మీరు సాంత్వన వచనాలు చెప్పకపోతే పోయారు, కనీసం మీ మాటలతో ఎందుకు బతికి ఉన్నానురా దేవుడా అనుకునేలా చెయ్యకండి. చనిపోయిన వాళ్ళ గురించి చెడుగా అసలు మాట్లాడొద్దు. ఇది నా విన్నపం. ఇటీవలి కాలంలో చనిపోయిన వారిని కించపరుస్తూ మాట్లాడడం ఒక జాడ్యంగా మారింది. ఇది మంచి పరిణామం కాదు.
మీరందరూ వచ్చినందుకు మాస్టారి ఆత్మ చాలా సంతోషిస్తూ ఉంటుంది. నా మాటల వల్ల ఎవరి మనసైనా నొచ్చుకుని ఉంటే మన్నించండి. మీలో మాస్టారి అనారోగ్యంపై ఉన్న అనుమానాలు పోగొట్టాలనే నా ప్రయత్నం. అంతే కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. అందరూ మాస్టారి ప్రసాదం తిని వెళ్ళండి" అంటూ ముగించింది మహిత. భోజనాల అనంతరం అమ్మగారిని పక్కకి పిలిచి, కృష్ణ ఇంజనీరింగ్ పూర్తయి ఉద్యోగంలో స్థిరపడేదాక కృష్ణ బాధ్యత తనదేననీ, మాస్టారి పెన్షన్ డబ్బులో ఇంటి ఖర్చులు పోను మిగిలినవి బేంక్ లో జమ చేసుకోమని, ఎప్పుడు ఎలాటి సమస్య వచ్చినా, డబ్బు అవసరం వచ్చినా సొంత బిడ్డలా భావించి వెంటనే తనకి ఫోన్ చెయ్యమని జాగ్రత్తలు చెప్పింది. ఇద్దరినీ అర్జంటుగా హెపటైటిస్ బి వాక్సిన్ మూడు నెలల పాటు నెలకి ఒకటి చొప్పున వేయించుకోమని మరీ మరీ చెప్పింది. బయలుదేరే ముందు మాస్టారి ఫోటోకి నమస్కరించగా మాస్టారి చేతి స్పర్శ ఎప్పటిలానే తన తలని ఆప్యాయంగా నిమిరినట్లు అనిపించి మాస్టారూ! మీరు నన్ను ఆశీర్వదించారు. నా బాధ్యతను నెరవేర్చగలననే నమ్మకం కలిగింది ఇప్పుడు అనుకుని కొంత భారంగానూ, ఆత్మ సంతృప్తితోనూ గమ్యం వైపు సాగిపోయింది మహిత.
***
No comments:
Post a Comment