భగవంతుడిపై వదిలేయాలా?
ఆండ్ర లలిత
“ఏమండీ కాఫీ” అంటూ పద్మ కాఫీ కప్పు భర్త సదాశివరావు కూర్చున్న కుర్చీ చేతి మీద పెట్టింది. లేప్టాప్లో నిమఘ్నమై, అసలు ఆ కాఫీ కేసి కానీ, తన కేసి కానీ చూస్తే కదా! పద్మకి ఉక్రోషం వచ్చింది. తను ఊరుకోలేక మాటలు కలుపుదామని “కాఫీ ఒలికిపోతుంది చూసుకోండి” అంటూ ఆ లేప్టాప్లోకి తొంగిచూసింది. ఏదో దీర్ఘాలోచనలో నిమఘ్నమై గూగులమ్మలో ఏదో వెతికేస్తున్న భర్త సదాశివరావుని “ఏం చేస్తున్నారండీ?” అని అడిగింది. సదాశివరావు ఏదో చాలా అనరానిమాట అనేసినట్టు ముఖంచిట్లించి పద్మకేసి చూస్తూ “ ఆ గొంతు ఏమిటి? ఏం కావాలి నీకు? ఆ ప్రశ్న ఏమిటి?” అన్నాడు.
“అలా కాదండి ..అంత tension ఎందుకు? మనం మన శాయశక్తులా చేస్తాం. ఆ తరువాత ఫలితం ఆ భగవంతునికే వదిలేయటమేగా. ఎంత ఎత్తు ఎదిగినా అందరం ఆయనచేతులలో పావులమే కదా. అసలు ఏమైందో చెప్పండీ?” అంది పద్మ తన వేదాంతం ఏదో ఉపదేశించేద్దామని.
“ఎంతసేపూ నీ పిచ్చి వేదాంతం, దేవుడూ దేవుడూ అంటూ. ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి. అవన్నీ ఆపేసి, దేవుడా దేవుడా అని గాలిలో దీపంపెట్టనా నేను? లేక సాధ్యమైనంత వరుకూ నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాలా?”
“అలా కాదండి. ఒక్కసారి నా మాట వినండి” అని భార్య పద్మ అర్థించింది సదాశివరావు చేతులు పట్టుకొని.
“చాల్లే ఊరుకో! అన్నీ నిన్ను అడిగే చేయ్యాలా? నీ పని నువ్వు చేసుకోలేవా? నన్ను విసికించకు, వెళ్ళు. నీ పనేదో నువ్వు చూసుకో” అన్నాడు సదాశివరావు.
సదాశివరావు చీదరించుకుంటూ అన్న మాటలకి వీరభద్ర పళ్ళెంలాంటి పద్మ మొహం వడిలిపోయింది. అసలు తనని ఏమి అడిగాననీ… అసలు ఆయనతో మాట్లాడే అర్హత లేదా నాకు? వంటింట్లో ఆడదాని జీవితం మగ్గిపోవల్సిందేనా! ఏమిటో! నా వైఖరీ, మాటా కూడ నచ్చవు. ఇలా నేను బాధపడుతూ ఉంటే నా జీవితం చేదవ్వదూ! అనుకుంటూ తనకి తానే ధైర్యం కూడబల్కుంది. ఎంతైనా, మనిషి ఆశా జీవి కాదా. ఆఖరికి మనకి వేపాకు చేదని తెలియదా ఏమిటి? దాని ఔషధ విలువలు తెలుసుకొని సంతోషంగా ఏరి కోరి నములుతే, నమలగా నమలగా వేపాకు కూడా తీయ్యబడదా! వేపాకు తీయబడినట్లు వాళ్ళ జీవితాలు, వాళ్ళ జీవితాలతో పాటు నా జీవితం కూడా ఎప్పటికో మధురంగా మారవా! ఏమిటో, నా మాట వినరు! అలా వినరని నేను ఊరుకుంటే ఎలా! పట్టు విడవని విక్రమార్కునిలా ప్రయత్నించటానికి నడుముకట్టాలనుకుంది.
ఇలా పద్మ మనసులో పొంగుతున్న ఆలోచనలు గ్యాస్ స్టౌవ్మీద పాలపొంగుతో ఆగిపోయాయి. ఎంతైనా, మనిషి తాపత్రయాలు-బంధాలతో పెట్టిపుట్తాడన్న నిదర్శనంగా పక్క గదిలో ఉన్న సరసిజ పొద్దున్నుంచి ఏమీతినలేదనీ, నిద్ర లేచినవెంటనే తలనొప్పందనీ గుర్తు వచ్చి “సరసిజా తలనొప్పి అన్నావు, కాఫీ కలిపివ్వనా!” అని వంట గదిలోంచి ఒక్క కేక పెట్టింది కూతురుతో పద్మ.
“ఊ...” అంది సరసిజ. ఇంతలో “సరసిజ అసలు చదువుతోందో లేదో, ఏమి పిల్లలో” అనే routine dialogue తో దృష్టి తన సుపుత్రిక మీద పడింది. సరసిజ గదిలోకి వేడి కాఫీ కప్పు తీసుకెళ్ళి “సరసిజా ఇదిగో కాఫీ. వేడిగా తాగు. తలనొప్పి పోతుంది” అని సరిసిజ తల నిమురుతూ లేప్టాప్లో తొంగిచూసింది పద్మ. ఇంకేముంది ఊరుకోలేక “బంగారూ ఏమి చేస్తున్నావే?” అని అడిగింది.
“Nothing! Just browsing!”
“ఏమీలేదు, ఇవాళ పరీక్ష ఏదో ఉందని అన్నావుకదా!” అంది పద్మ సరసిజ మనసులో ఏముందో పరికించుదామనీ
“తెలుసు, చేస్తానులే” అని సరసిజ నిర్లక్ష్యంగా ఇచ్చిన సమాధానానికి ఒళ్ళు జలదరించింది పద్మకి. తన ఆవేశం బయటపెడితే మళ్ళీ ఏం తుఫాను రేగుతుందోనని తనని తాను తమాయించుకుంటూ కంఠం సవరించుకొని “ఏమీ లేదు, తోందరగా plan చేసుకొని చేసేసేయ్” అంది పద్మ. ఒక్క క్షణానికి “అమ్మా సీతమ్మా సరసిజని చూసుకోవమ్మా అని అప్పగిస్తూ” మనసులో సీతమ్మవారిని తలచుకుంది.
“నాకన్నీ చెప్తూ ఉండకు. నాకు అన్నీ తెలుసు. ఏదో కాస్త relax అయ్యి చేస్తాను. Don’t eat my head. అసలే tensions లో ఉన్నాను” అంటూ కందిపోయిన మొహం వేసుకుని పూనకం వచ్చినదానికిమల్లే ఊగిపోతూ అనకూడనీ, భరించలేనీ మాట వినట్టు feel అయిపోతున్న expressions ఇస్తూ అంది సరసిజ అమ్మ పద్మతో.
తన excited behaviour కి వచ్చిన ముచ్చెమటలలో సరసిజ తడిసి ముద్దైపోతున్నదని పద్మ గమనించింది. ఆ tension ఏదో తగ్గిద్దామని “అదేమిటే సరసిజా! ఇప్పుడు నేనేమన్నాను? పరీక్షలు ముందుపెట్టుకుని ఆ చెవ్లో ear plugs ఏమిటీ? ఆ english tv serials ఏమిటీ?”
“నేనంతే! చదువు గురించి నాకేమీ గుర్తు చెయ్యకు. నువ్వు గుర్తు చేసేమాటైతే, please go out from here” అని ఆవేశంతో ఒక్క నమస్కారం పెట్టింది సరసిజ. “సర్లే ముందు కాఫీ తాగు, తర్వాత మాట్లాడుకుందాం” అంది పద్మ దిక్కుతోచని పరిస్థితి కానచూస్తూ.
ఊరుకోలేక తన పసికూన భవిష్యత్తు బాగుచేయాలనే ఉద్దేశ్యంతో Second try ఇద్దామని, మళ్ళీ సరసిజ కూర్చున్న కూర్చీ దగ్గరకి వెళ్ళి “ఏమైయిందే! Dishearten అవ్వకు. You can do it. దేముడిని నమ్ముకో అంతా బావుంటుంది. Confidence loose అవ్వకు” అని ఇంకా ఏదో చెప్పబోయింది. “ఇంక ఆపు. ఎంతసేపూ దేముడూ…దేముడూ. అంతే తెలుసు నీకు. నా చిన్నప్పుడు దేముడికి దణ్ణం పెట్టుకుని రోజూ మొదలు పెట్టాలి. మన నమ్మకమే దేముడు. కాని మన జీవితాల Architects మనమే అనేదానివి. మనసులో పెట్టుకున్నాచాలు అనే దానివి! మరి ఇప్పుడు నీకు చాలట్లేదా లేక నీ దేముడికి చాలదా! ఇప్పుడు సతాయించేస్తున్నావమ్మా. బయటకే దణ్ణం పెట్టాలా? అది మన మనశ్శాంతి కోసమా లేక ఆర్భాటం కోసమా! నువ్వు మారిపోయావమ్మా. అమ్మా! నువ్వే చెప్పావు, గుర్తు తెచ్చుకో! గాలిలో దీపంపెట్టి దేముడా దేముడా అంటే ఏమీ అవ్వదని. మరి ఇప్పుడు… ఈ వాదనకి ఇంక ముగింపు ఇవ్వు. stop it” అంటూ వీరావేశంతో రెచ్చిపోతూ అంది, IAS preliminaries కి prepare అవుతూ వున్న 23 ఏళ్ళ సరసిజ అమ్మ పద్మతో.
“అలా కాదే” అంటూ మళ్ళీ పద్మ అక్కడే నుంచుని ఉందని గమనించి “అమ్మా I am sorry. If I have hurt your feelings. Do not feed me with what I should speak or think. Or what I should do. I need some calm time. I know what I should do. Do not make me tensed up” అంది సరసిజ గట్టిగా, ఏదో జీవితభారమంతా తనే ఈ లోకంలో ఏకాకిలా మోస్తున్నట్టు మొహం పెట్టి.
ఇంకేముందీ పక్కగదిలో లేప్టాపూ సెల్ఫోన్లతో తల పగలగొట్టుకుంటున్న భర్త సదాశివరావు వీరావేశంతో “పద్మా ….పద్మా… అని సరసిజ గదిలోకి వచ్చి నన్ను రాచి రంపాన పెట్టింది చాలదా! ఇప్పుడు సరసిజ బుర్ర తింటున్నావు. ప్రశాంతంగా ఉండనీయవా ఈ కొంపని!” అని సదాశివరావు పద్మ భుజాలమీద చేతులుంచి తనని ఉపేస్తూ అంటుంటే; “చూడండి నాన్నా, ఎంత సేపు అమ్మ, దేముడు ….దేముడు అంటుంది. She is spoiling my mood” అంది సరసిజ తన friend, philosopher and guide అయిన నాన్న సదాశివరావు కేసి చూస్తూ.
ఇంక భర్త సదాశివరావూ సరసిజ మాటలకి పడక గది ద్వారపు గోడకి బిగిసి పోయి బిక్కచచ్చిన అయోమయ పరిస్థితిలో ఉన్న జీవి పద్మని ఉద్ధేశించి “మీ అమ్మకి ఆ దేముడు తప్పలేడు. తన పధ్ధతే సరైనదంటుంది. తన మూఢత్వంతో ఇల్లు నరకంగా మార్చి మనం సర్వనాశనం అయిపోతే కాని, తన మనసు కుదుటపడి సంతోషించదు. ఏం చేస్తాం నాతోపాటు సరసిజా, నువ్వూ బలైపోతున్నావు.” అన్నాడు సదాసివరావు.
వెంటనే పద్మని ఉద్దేశించి “అమ్మా మహాతల్లీ మంట పెట్టావుకదా. నా జీవితం ఎలాగైనా తగలపెట్టావ్. ఇంక మన సరసిజ జీవితం పాడుచేయకు” అన్నాడు నిప్పు కణికల్లాంటి కళ్ళతో చేతులు జోడించి.
భర్త సదాశివరావు అన్న మాటలకి జలజల ప్రవహించే కన్నీళ్ళు తన చీర కొంగుతో తుడుచుకుంటూ..”అవును నేను మూర్ఖురాలినే… ఇంక ఆపండి మీరిద్దరూ! కానీ సరసిజా, మన జీవతాలకి మనమే Architects! మన ప్రయత్నం మనం చేయ్యాలి. కానీ సృష్టి స్థితి లయ కారకుడు వాడున్నాడే, ఆ పైన కూర్చుని ఉన్నవాడు వాడే మన అసలైన Boss. జగన్నాటకసూత్రధారి, ఆ పరంధాముడు. He is the big Architect of our roles. Designated job తో మనని ఇక్కడికి పంపి, దానికి తగ్గట్టు నాటకం రచిస్తాడు. దానికి నిదర్శనాలు మన రామాయణ భారతాల పాత్రలు. అందుకని మనం చేయవలసిన కర్తవ్యాలు నిర్వర్తించి మీగతాది ఆయన మీద నమ్మకంతో ఆయనకి అప్పగించాలి మనస్ఫూర్తిగా. ఆ సర్వేశ్వరుడే చూసుకుంటాడు. అది తెలుసుకున్న మరుక్షణం మన జీవితమే అందంగా మారుతుంది. కంటినిండా నిద్రా వస్తుంది. ప్రశాంతత చేకూరుతుంది. చంటి పాప అమ్మ భుజాలమీద ఆదమరచి హాయిగా పడుకున్నంత హాయిగా ఉంటుంది. అది ఎవరంతట వారు experience చేయాలి. ఇంకొక విషయం సరసిజా నీకు చాలా ముఖ్యం. There is a term in English “Effort and Resignation”. పెద్దౌతున్నకొద్ది మనం మన గురించి, ఈ సృష్టి గురించీ, ఇంకా ఎన్నో అన్వేషణలు చేస్తాము. అలాగే మనకు నచ్చిన వస్తువులు మననుంచి ఎక్కడ దూరమెళ్ళిపోతాయో అనే భయమేసి కొంచం, ఇంకా మనకి నచ్చిన బంధాలు ఎక్కడ దూరమౌతాయో అనే ఆందోళనతో కొంచం వాటిని ముందే మననుంచి దూరం పెట్తాం కొన్నిసార్లు. అవి దూరమౌతే కలిగే ఎడబాటు భరించలేక, మనని మనం జగత్తు లోని అందాలు…బంధాలు…అనుబంధాలకు దూరమై బతుకుతాము. మనకి మనం గిరిగీసుకొని మన whatsapp లోనో ఇంకా ఏవేవో యాంత్రిక సాధనాలలో బతుకుతాం, ఒకే ఇంట్లో ఉంటున్నా తామరాకు మీద నీటి బొట్లలా. మన solitude యే ఉత్తమమైనదని అనుకుంటాం. కానీ అది కాదు సరసిజా జీవితం. అన్నీ ఆనందించాలి. భగవంతుని మీద మన పరిధిలో లేనిది ఇంకా మన హావభావలకు అర్థంకాని విషయాల భారం వేస్తూ” అంటూ పరుగున వెళ్ళి దేవుడి గూటిలో తన మనోవ్యధను అర్థంచేసుకొనే సీతమ్మవారి కళ్ళలో చూస్తూ, సీతమ్మవారి కాళ్ళు తన రెండు చేతులతో పట్టుకొని మూగభాషలో ఎదో విన్నవిస్తూ సీతారాముల విగ్రహలముందు చంటి పిల్లైపోయి మౌనంగానే విలపించసాగింది.
అయ్యో అమ్మని ఏడిపించానే నా tensions లో అని సరసిజా, అయ్యో పద్మని ఏడిపించానే అనకూడని మాటలన్నానే నా office ఒత్తిళ్ళలో, అని సదాశివరావు బాధ పడ్డారు. ఎవరి గదులలోంచి వారు బయటకు వచ్చి పద్మకి sorry చెప్పారు. వాళ్ళుకూడా పద్మ వెనకాల నుంచుని ఆ సీతారాముల విగ్రహాలకు నమస్కరించారు.
ఆ సీతారాములకి నమస్కరిస్తున్నప్పుడు సదాశివరావుకి ఒక విషయం గుర్తు తెచ్చింది. మామూలుగా ఈ మధ్య కాలం మాల్స్ కి వెళ్తే చిన్నపిలల్లు battery operated cars and scooters నడుపుతూ కనబడతారు. వాళ్ళు అవి నడుపుతున్నప్పుడు వాళ్ళలో ఆత్మవిశ్వాసం, ధీమా చూస్తుంటే భలే ముద్దువేస్తుంది. ఏదో వాళ్ళే నడిపేస్తున్నట్టు అనుకొని సంబరపడతారు కానీ, నిజానికి నడిపించేవాడు remote control పట్టుకొని వెనకాల నడిచే ఆపరేటర్; అయితే మన జీవితాలలో ఆపరేటర్ ఆ భగవంతుడే కదా.
మా అమ్మకీ తెలుసేమో మనందరి remote control ఆ భగవంతుని చేతులలో ఉందని. అందుకే ఎప్పడూ దణ్ణం పెట్టుకో శివా అనేది. నాలో ఈ భావనను సరసిజకి కూడా చెప్పి తనలోనూ ఈ భావానికి జీవం పోయాలి.
మన సరసిజ ఎంత సేపూ పోటీ ప్రపంచంలో పరుగులు తీసేస్తోంది. అదీ కాకుండా ఈ తెలిసీ తెలియని వయస్సులో ఎన్నో భావోద్రేకాలకి గురౌతూ ఉండి ఉంటుంది సరసిజ. ఇవన్ని సరసిజ మనోవికాశానికి ఆటంకాలు కాకూడదు..
ఆ సృష్టికర్త భగవంతుడి మీద నమ్మకం చాలా అవసరం మనశ్శాంతికి. నిజమే కదా! ఆ భగవంతుడు ఎవరు? వెంఠనే తనకి ఇష్టమైన, తనకి ఆదర్శమైన భావనలకు ఎంతో దగ్గరైన పోతనగారి, “ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై ఎవ్వడి అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరునినే శరణంబు వేడెదన్....” పద్యం గుర్తు వచ్చింది. పద్మకూడా ఆ భగవంతుడి గురించేగా చెబుతోంది, పేరేమైతేనేమిటి. సరసజకి నేను ఈ భవాలను తనకర్ధమయ్యే విధంలో అందచేయాలి కదా. ఏమిటో నా పని ఒత్తిళ్ళలో బొత్తిగా మర్చిపోయాను. ఈ తలపులు సదాశివరావుకి తన బాధ్యతని గుర్తు చేసాయి తన బుజ్జి తల్లిపట్ల.. సరసిజ కూడా తన జీవితంలో ఏ పరిస్తితిలో, ఎప్పుడు, చేయగలిగినంత కృషి చేస్తూనే ఫలితాన్ని భగవంతుడిమీద భారంవేసి మానసిక ఒత్తిడికి గురికాకుండా తనని తాను సమతుల్యతతో ఎలా వ్యవహరించుకోవాలో నేర్చుకోవాలి కదా!
సరసిజ తల నిమురుతూ మా మాంచి పద్మ అంటూ సరసిజనీ పద్మని దగ్గరికి తీసుకున్నాడు సదాశివరావు.
***
No comments:
Post a Comment