గుణపాఠం - అచ్చంగా తెలుగు
గుణపాఠం
యలమర్తి అనురాధ



అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో పెద్ద చెట్టు. గుబురుగా ఆకులుండి వత్తుగా ఉండటంతో కాకి అక్కడ తనకో గూడు కట్టుకుంది. ఎన్నో నెలలు ఎక్కడి నుంచో రోజూ గడ్డిపరకలు తెచ్చుకోవటానికి బాగా శ్రమ పడింది. గూడు సిద్ధమయ్యాక అప్పుడు గుడ్లు పెట్టింది. ఇదంతా ఓ కోకిల గమనిస్తూనే ఉంది. తను కూడా గుడ్లు పెట్టి పిల్లలను కనాలనుకుంది. అప్పుడు దాని తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
“గుడ్లు పెట్టటం వరకే నీ వంతు. పొదగటం లాంటి పిచ్చి పనులు నెత్తిమీద వేసుకోకు. కాకి గూట్లో తెలివిగా నీ గుడ్లను పెట్టు. అది పొదిగితే నీ పిల్లలు తయారు. మా అమ్మ నాకు ఇదే చెప్పింది. మా అమ్మకు వాళ్ళ అమ్మ ఇదే చెప్పిందట. అర్థమయ్యిందా” అని తనకు చెప్పిన మాటలు గుర్తుచేసుకుని అలాగే చెయ్యాలనుకుంది.
అలాగే చేసింది కూడా. కానీ కాకీ గుడ్లు పిల్లలయ్యాయి కానీ కోకిల గుడ్లు అలాగే ఉండిపోయాయి. ఏ రోజుకారోజు కాకి బయటకు వెళ్ళగానే గూడు దగ్గరకి వెళ్ళటం చూసుకురావటం కోకిల దినచర్యగా మారిపోయింది. కాకి పిల్లలు పెద్దవై గూటిలోంచి ఎగిరిపోయాయి.
అప్పటిదాకా ఎలాగో అడగకుండా ఆపుకున్న కోకిల తన అనుమానాన్ని కాకి దగ్గర వెళ్ళగక్కింది. అప్పుడు కాకి “నువ్వడిగినప్పుడే చెబుదామనుకుని ఆగాను. మోసం కలకాలం సాగేది కాదు. ఎప్పుడో ఒకప్పుడు బయటపడిపోతుంది. మీ మోసాన్ని అందరూ చెప్పుకుంటూ ఉండటంతో గ్రహించాను. పరోపకారం చెయ్యటంలో తప్పులేదు.
కానీ బద్ధకస్తులను పెంచకూడదనుకున్నాను. బద్దకం అన్నిటికన్నా పెద్ద జబ్బు. ఆ జబ్బును వదలగొట్టడం నా చేతుల్లోనే ఉందనుకున్నాను. అందుకే నేను గడ్డిపరకలు తెచ్చుకొనే చోట ఓ స్కూలు ఉంటే అక్కడ నుంచీ రంగు చాక్ పీసులు తెచ్చి దాచుకున్నాను. నేను గుడ్లు పెట్టగానే దాని మీద ఆ చాక్ పీసుతో గుర్తు పెట్టుకొని వాటినే పొదిగాను. నిజంగా నువ్వు గుడ్లను పిల్లలు చేసుకోలేకపోతే సహాయపడే దాన్నే. కానీ అతి తెలివితో ఎన్నో తరాలుగా ఇలా గుడ్లను మా గూటిలో పెట్టి పిల్లలుగా తయారు చేయటం నాకు తప్పనిపించింది. అదే సమయంలో నీకు సరైన గుణపాఠం చెప్పాలనిపించింది” అంది కాకి.
అలా కాకి చెప్పగానే కోకిల సిగ్గుతో తలదించుకుంది.

నీతి : బద్ధకం వదలాలి. శ్రమపడటం నేర్చుకోవాలి.

***

No comments:

Post a Comment

Pages