నారాయణుడి నరరూపం - అచ్చంగా తెలుగు
  నారాయుణిడి నరరూపం 
  ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్


మా నాన్నగారు దాదాపు నలబై ఏళ్ళు ఒక సేట్ దగ్గర ఎంతో నమ్మకంగా  పని చేసి ,ఇక చేయలేక మానేసారు.  ఉద్యోగం విరమణ సమయం లో సేట్, నాన్నగారికి, కనీసం ఎంతో కొంత ధన రూపం లో ఇస్తాడనుకున్నారు నాన్నగారు .కానీ అతను  ఒక శాలువ కప్పి,నాలుగు పూవులు ,పళ్ళు చేతులో పెట్టాడు. కానీ డబ్బు రూపం లో ఏమీ ఇవ్వలేదు. అడగటానికి నాన్నగారి మొహమాటం,పైసా విదల్చని సేట్ మనస్తత్వం కలిసి నాన్న గారు రిక్త హస్తాలతో ఉద్యోగం లోంచి బయటకు వచ్చారు.
గుడ్డిలో మెల్లగా అప్పడికే  నేను చిన్నదో ,చితకదో ఉద్యోగం లో చేరడం వలన పరిస్థితి మరీ అంత అన్యాయంగా లేదు.
నాన్నగారు పట్టుమని పదిహేను రోజులు కూడా పదవి విరమణ  కాలం ఆస్వాదించలేదు.అయన ఆరోగ్యం పాడయ్యింది .అమ్మ ఇంట్లోనే  ఏవో గచ్చాకు,పుచ్చాకు మందులు ఇచ్చింది. నాన్నగారి  ఆరోగ్యం బాగు పడినట్టే అనిపించింది. అలా కనీసం నెల రోజులు కూడా గడవలేదు.
ఈ మధ్య తరుచుగా గుండెల్లో నెప్పి ,ఆయాసం అని అంటున్నారు.అయన బాధ పడుతున్నారని ఒక పక్క, నేనేమి చేయలేకపోతున్నానని భావన ఒక పక్క  నన్ను కుంగ దీస్తున్నాయి.
నేను ఒక ప్రైవేటు కంపనీ లో పని చేసే గుమాస్తా గాడిని.నేను అతి కష్టం మీద పాసయిన డిగ్రీ చదువుకి ఆ ఉద్యోగం ఎక్కువని మా ఓనర్ అస్తమాను అంటూ ఉంటాడు.నాకు కూడా అప్పుడప్పుడు అది నిజం అనిపిస్తుంది.ఉదయం ఎనిమిది గంటలనుంచి రాత్రి  తొమ్మిది గంటల వరకు  నానా బండ చాకిరీ చేస్తే నాకు వచ్చేది పది వేలు.దానితోనే అమ్మ, నాన్నగారు,నేను,నా భార్య ,ప్రభుత్వ పాఠశాల  లో చదువుతున్న నా కొడుకు ........అందరం బతకాలి.ఈ రోజులలో అది అసాధ్యమే!
అయితే నాన్న గారికి వంశ పారంపర్యంగా వచ్చిన పాత  కాలం నాటి పెంకుటిల్లు ఉండడం వలన ఏదో బతుకు ఈడుస్తున్నాను.అద్దె లేదు.ఇంట్లో భావి,బోరింగ్ ఉన్నాయి.కనుక వాటర్ కనెక్షన్ చార్జులు,నెలసరి వాటర్ చార్జులు లేవు .ఎల్ .ఈ.డీ.బల్బుల ధర్మమా అని ఎలక్ట్రిసిటీ బిల్ కూడా తక్కువే.
నా భార్య లత బీ.ఏ.వరకు చదివింది.పెళ్ళికి ముందు,మా పెళ్ళి అయ్యాక కూడా చాలా  ఉద్యోగ ప్రయత్నాలు చేసింది.అయినా ఎక్కడా ఉద్యోగం రాలేదు .కానీ  పాపం ఒక పక్క  ఇంట్లో చాకిరీ చేసుకుంటూ,మరొక పక్క  పదవ తరగతి వరకూ  చదివే పిల్లలికి ప్రైవేట్లు చెపుతోంది.నాలుగు రాళ్ళు సంపాదించి నాకు వేన్నీళ్ళ కు , చన్నీళ్ళు గా సహాయ పడడంతో ,కొంతలో కొంత ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. అలా ఏదో రోజులు గుట్టుగా గడుపుకు వస్తున్నాను.
నిజం చెప్పాలంటే మా ఇంట్లో  ఆడంబరాలను అవతల పెడితే ,అవసరాలకే డబ్బుసరి పోవడం లేదు.
డబ్బు సర్దు బాటు కాక చుట్టాల ,స్నేహితుల ఇళ్ళకి  మంచికి చెడుకి కూడా వెళ్ళక పోవడం తో మా కుటుంబాన్ని అందరూ వెలి వేశారనే చెప్పాలి.అయితే దానికి నాకు బాధ పడే అవకాశం ,అవసరం లేవు.డబ్బు ఖర్చు కానిది ఏది అన్నా నన్ను బాధ పెట్టదు అని చెప్పవచ్చు !! దానికి కారణం నా లోభత్వం కాదని,పేదరికమని తెలిసి అందరూ క్షమించేస్తారని నా ఆశ!!??
అటువంటి పరిస్థితులలో తల మునకలుగా ఉన్న నాకు ,నాన్నగారికి ఈ మధ్య తరచుగా అనారోగ్యం చేయడం తో , కాలు చేయి ఆడడం లేదు.
ఆయనని మంచి డాక్టర్ కి చూపించి,మంచి వైద్యం కూడా చేయించలేని దౌర్భాగ్యపు కొడుకుని నేను .ఏ అప్పో సస్పో చేసి డాక్టర్ కి చూపించి,అయన చెప్పిన టెస్టులు చేయించినా,తరువాత కన్న తండ్రికి కనీసం మందులు కూడా ఇప్పించిలేని పరిస్థితి నాది.
సరిగ్గా అలాంటి సమయం లో మా ఊరి కార్పొరేట్ ఆసుపత్రి కి కార్డియోలోజిస్ట్ గా మా నాన్న గారి బాల్య మిత్రుడు కామేశం రావడం జరిగింది.నాకు వెయ్య కోట్ల లాటరి తగిలినట్లయ్యింది.
కామేశం వచ్చిన రోజునే ఆసుపత్రికి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకున్నాను.నా పేరు శేఖరం అని ,మా నాన్నగారు రామరాజు అని చెప్పాను.నా మాటలు వినగానే తన బాల్య స్నేహితుడు,అది కాక చిన్నప్పుడు ఎంతో చనువుగా తిరిగి,వృత్తి రీత్యా ,ఉద్యోగ రీత్యా దూరం అయిపోయిన స్నేహితుడు,ఆ ఊళ్ళోనే ఉన్నాడని తెలుసుకున్న కామేశం బ్రహ్మానంద పడిపోయాడు.
“ఏమయ్యా మీ నాన్న బాగున్నాడా?  ఆరోగ్యం ఎలా ఉంది?నాకు తెలిసి వాడిది వజ్రం లాంటి శరీరం.చిన్నప్పుడు విపరీతమైన కసరత్తులు,ఎక్సర్సైజులు  చేసేవాడు....ఇప్పుడు అలాగే రాయిలాగే ఉన్నాడా మా రాజు ?వాడిని కూడా తీసుకు రాలేకపోయావా?”అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు కామేశం.
‘వాడిని కూడా’ అన్న పద ప్రయోగం చేసాడంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత చనువు ఉందో అన్నవిషయం ఆ క్షణం లోనే నాకు అర్థం అయ్యింది.
“నాన్నగారిని కూడా తీసుకువద్దమనుకున్నాను అంకుల్....కానీ ఈ మధ్య అయన ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు..... ఇలా మీరు ఈ ఊరు వస్తున్నట్లు తెలిసిందని చెప్పాను.....ఒకసారి మిమ్మల్ని కలిసి ,మీతో మాట్లాడి,ఆయనను తీసుకు వద్దామని ....” అన్నాను నేను.
“వ్వాట్!!రాజుగాడికి అనారోగ్యమా!?నేను నమ్మను. నేనే వస్తాను వాడిని చూడడానికి ....సాయంత్రం వస్తాను ....ఇంతకీ ఏమిటి ప్రాబ్లం !?” అని అడిగాడు  కామేశం.
“అదే అంకుల్  అస్తమానం గుండె నెప్పి, ఆయాసం  అని అంటున్నారు”అన్నాను నేను.
“గుండె నెప్పా !!??నా సబ్జెక్టు.వాడికి గుండె నెప్పి  ఏమిటి? గ్యాస్ ప్రాబ్లం అయ్యి ఉంటుంది.సరే సాయంత్రం వస్తాను కదా .చూస్తాను.వచ్చే ముందు ఫోన్ చేస్తాను.ఫోన్ నెంబర్ ఇయ్యి.”అన్నాడు కామేశం .
నేను ఫోన్ నెంబర్ చెప్పాను.
కామేశం నా సెల్ కి రింగ్ ఇచ్చి “అది సేవ్ చేసుకోవోయి” అంటూ నా నెంబర్ తన ఫోన్ లో సేవ్ చేసుకున్నాడు.
ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకు నాకు ఫోన్ చేసాడు అయన.నేను వెంటనే బయలు దేరి ఆసుపత్రికి వెళ్ళాను.దగ్గరుండి కామేశం ని తీసుకువద్దామన్నది నా ఉదేశ్యం.నేను ఆసుపత్రి దగ్గర ఆటో ని మాట్లాడి,అతనిని ఆగమని చెప్పి ఆసుపత్రిలోకి వెళ్ళాను.నిజానికి కామేశం ని కారు లో తీసుకు వెళ్ళాలి .కానీ నాకు తాహతులేదు.
“అంకుల్ ఆటో ని తీసుకు వచ్చాను.”అన్నాను నేను.
“అయ్యో ఆటో ఎందుకయ్యా బాబూ!?నేను మా ఊరినుంచి వచ్చేటప్పుడు కారులోనే వచ్చాను.ఆటో పంపించెయ్యి.నా కారులో వెడదాం.”అన్నాడు కామేశం .
“అలాగా అంకుల్ ?ఆటో ని పంపించేస్తాను.నేను నా బండి మీద ముందు వెళుతుంటాను మీరు కారు లో  వద్దురు గాని “అంటూ బయటకి నడిచాను.కామేశం నన్ను అనుసరించాడు.
పది నిమషాలలో మా ఇంటికి చేరుకున్నాం .
స్నేహితులు ఇద్దరూ ఒకరిని  చూసి ఒకరు బ్రహ్మానంద పడిపోయారు.ఒకరిని ఒకరు  హత్తుకుని కొన్ని క్షణాలు అలాగే ఉండి పోయారు.నిజమైన స్నేహానికి జాతి ,మత, కుల,హోదా,ఆర్థిక అసమానతలు ఏ మాత్రం అడ్డు కావని మరొక్కసారి  ఋజువు అయ్యింది అనిపించింది నాకు.
కామేశం ని కూర్చోబెట్టడానికి సరి అయిన కుర్చీ కూడా లేదు మా ఇంట్లో.ఉన్న ఒక్క పాత చెక్క కుర్చీనే  బాగా దులిపి ,తుడిచి ‘అందులో కూచోండి’అన్నట్లు కామేశం కి సంజ్ఞ చేశాను. కామేశం మా ఇంట్లో అడుగు పెడుతూనే మా పరిస్థితులు గ్రహించినట్టున్నాడు.
“నేను మీ నాన్న దగ్గర కుచుంటానులేవోయి”అంటూ నాన్నగారి మంచం మీద అయన పక్కనే కూచున్నాడు  కామేశం.
“నాకు మర్యాదలు ఏమిటోయ్?నేను మీ ఇంట్లో వాడినే.మా రాజు గాడు ,నేను... రాజుగాడు  మీ అమ్మని పెళ్ళి చేసుకోక ముందు నుంచే  స్నేహితులం.”అన్నాడు కామేశం నవ్వుతూ.  
“నువ్వు ఏమీ కంగారు పడకు.ఏదో కాసేపు సరదాగా గడుపుదామని వచ్చాను .నాకు మర్యాదలు,మన్ననలు చేస్తే ఇబ్బందిగా ఫీల్ అవుతాను.”అన్నాడు కామేశం మరలా .
అయన మాటలకు నా నవ్వే సమాధానం అయ్యింది.
స్నేహితులు ఇద్దరూ చాలా సేపు చిన్న నాటి విశేషాలు,సంగతులు మాట్లాడుకున్నారు.చాలా  కాలం తరువాత మా నాన్న గారి మొహం లో నవ్వు చూడగలిగాను.అదేమో అమలిన స్నేహానికి ఉన్న మహత్యం. మాటలలో నాన్నగారు మా ఆర్థిక పరిస్థితి ,మేము పడుతున్న ఇబ్బందులు కామేశం కి చెప్పారు.కామేశం  అన్నీ వింటూ సాలోచనగా తలూపాడు.ఆ సమయం లో ‘అవన్నీ ఆయనికి చెప్పడం ఎందుకు ?’అని నేను చేసిన సంజ్ఞ నాన్నగారు పట్టించుకోలేదు.
“కామూ శేఖరం చెప్పే ఉంటాడు.ఈ మధ్య నా ఆరోగ్యం అంత బాగుండడం లేదు.తరుచుగా గుండెల్లో నెప్పి,ఆయాసం వస్తున్నాయి.”అన్నారు నాన్నగారు .
“నీ బొంద .నీకు గుండె నెప్పి ఏమిటి!!??అది గుండె ఉన్న వాళ్ళకే వస్తుంది......అదే హృదయం ఉన్న వాళ్ళకే వస్తుంది.నీ లాంటి  పాషాణానికి వచ్చే ప్రశ్నే లేదు.”అన్నాడు కామేశం పెద్దగా నవ్వుతూ .మా నాన్న గారు కూడా కామేశం నవ్వుతో శృతి కలిపేరు.
అలా నవ్వుతూ,నవ్వుతూ నాన్నగారు గుండె పట్టుకుని విపరీతం గా బాధ పడ సాగారు.నేను కంగారు పడ సాగాను.కామేశం కంగారు పడ వద్దని నాకు సంజ్ఞ చేసి తన బ్రీఫ్ కేసు లోంచి స్టెత్ బయటకు తీసి నాన్న గారిని పరీక్షించ సాగాడు.ఒకటి , రెండు నిమషాలు నిశితంగా పరీక్షించి ,తన దగ్గర ఉన్న ఒక ఇంజక్షన్ ఇచ్చాడు కామేశం.
కొంత సేపటికి నాన్నగారు నెప్పి తగ్గిన సూచనగా కాస్త తేరుకున్నట్టు కనిపించారు.
“శేఖరం ప్రస్తుతానికి  ఏమీ  కంగారు పడ వలసిన పని లేదు............ రేపు ఒకసారి వీడిని ఆసుపత్రికి తీసుకురా .... అన్ని టెస్ట్ లు చేద్దాం.”అన్నాడు కామేశం నాతో .
ఆ మాటలు విన్న ,అక్కడే ఉన్న అమ్మ, కన్నీళ్ళు పెట్టుకుంటూ “అన్నయ్యగారు ఏమీ భయపడాల్సిన పని లేదు కదండి .”అంది  ఆదుర్దాగా  కామేశం తో.
“అబ్బే ! అలా  భయ పడాల్సింది ఏమీ లేదు.ఇప్పుడే చూసాను కదా .కాకపోతే అన్ని టెస్ట్ లు ఒకసారి చేయించుకొని ఏమీ లేదు అనిపించుకుంటే మంచిది.అంతే .కంగారు పడాల్సిన అవసరం  లేదు.”అన్నాడు కామేశం .
“ఏమోనండి .అయన బాధ  పడుతున్నారు. .మా వాడి  ఆర్థిక పరిస్థితి ఇప్పుడు అయన  మీకు చెప్పారు.మీ దగ్గర దాచలేకపోయారు.నిజానికి పూట గడవడం కష్టంగా ఉంది ” . అమ్మ ఇంకా ఏదో చెప్పబోతోంది. 
ఆ మాటలు విన్న కామేశం కి పరిస్థితి పూర్తిగా అర్థం అయ్యింది.
“ఆహా ! టెస్ట్ లకి ఏమీ ఖర్చు ఉండదు.అన్నీ నా పేరు మీద చేయిస్తాను.....నేను డాక్టర్ అయి ఉండి రాజుగాడికి ఆ మాత్రం చేయలేకపోతే ఇక నేను ఎందుకు ,నా డాక్టర్ గిరి ఎందుకు ?”అన్నాడు కామేశం నాకు,అమ్మకు భరోసా ఇస్తున్న ధోరణిలో.
ఒక నిమషం ఆగి “వస్తానమ్మా .వస్తానోయ్ శేఖరం.రేపు ఉదయం ఆరు గంటలకల్లా మీ నాన్న ని కాళీ కడుపుతో తీసుకు రా .తిన్నగా నా రూమ్ దగ్గరికి వచ్చెయ్యండి.నేను దగ్గర ఉండి అన్ని టెస్ట్ లు చేయిస్తాను.” అంటూ  బయటకి నడిచాడు కామేశం.
*                                                      *                                                           *
ఆ మరునాడు ఉదయం , మా నాన్న గారిని, కామేశం  చెప్పినట్టుగానే ,ఏమీ తినకుండా ,తాగకుండా తీసుకెళ్ళాను.కామేశం కొన్ని టెస్ట్ లు దగ్గర  ఉండి చేయిస్తే ,కొన్ని ఆయనే చేసాడు.
“రేపు రావోయి శేఖరం .నాన్నను తీసుకు రావక్కర్లేదు.....అవసరముంటే అప్పుడు చెపుతాను.రేపటికి అన్ని రిజల్ట్స్ వస్తాయి.”అన్నాడు కామేశం.
“ఒరేయ్ రాజూ నీకేమీ లేదురా. నేను చూసినంతమట్టుకు అంతా  బాగానే ఉంది.హయిగా ఉండు.”అంటూ మా నాన్న గారి భుజం తట్టాడు కామేశం.
ఆ మరునాడు కామేశాన్ని కలుసుకోడానికి వెళ్ళాను .ఎందుకో కామేశం మొహం లో నేను మొదటి రోజు చూసిన ప్రశాంతత లేదు.ఆయన గంభీరంగా కనిపించాడు.
నన్ను చూడగానే “రావోయ్ శేఖరం కూచో “ అంటూ ఎదురుగా  ఉన్న కుర్చీని చూపించాడు కామేశం.
నేను ఇంకా పూర్తిగా కుచోకుండానే “నాన్నగారికి ఏమీ ప్రాబ్లం లేదు కదా అంకుల్?? “అని ఆత్రంగా అడిగాను నేను.
“ఆహా ! ఏమీ అంత పెద్ద ప్రాబ్లం లేదు.....”అంటూ ఆగిపోయాడు కామేశం.
“ ఏమిటి అంకుల్!!?? నాన్న గారికి ఏమీ పరవాలేదు కదా !!??” ఎందుకో నా కంఠం వణికింది.
“అలా  అని చెప్పలేను...........................................వాడి పరిస్థితి ఏమీ బాగా లేదు శేఖరం”అన్నాడు కామేశం.
నా గుండె ఒక్క నిమషం ఆగి మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించింది. 
“అంటే నాన్నగారు ఎప్పడినుంచి బాధ పడుతున్నారో తెలియదు ....ఈ మధ్యే  నాతో చెపుతుండేవారు....మా పరిస్థితి మీకు పూర్తిగా అర్థం అయ్యే ఉంటుంది.ఏదో చిన్న డాక్టర్ కి చూపించి మందులు ఇప్పిస్తున్నాం....నిజం చెప్పాలంటే ఏదో గచ్చాకు ,పుచ్చాకు వైద్యం చేయిస్తున్నట్లే లెక్క .....ఇంతకీ పరిస్థితి ఏమిటి అంకుల్!!??” అని అడిగాను గుండెని ఉగ్గ పట్టుకుంటూ.
“నువ్వు ధైర్యంగా ఉండు”అన్నాడు కామేశం గంభీరంగా .
“అంకుల్ ...పరిస్థితి ఏదిఅయినా ఈ రోజుల్లో ట్రీట్మెంట్,ఆపరేషన్లు ఉన్నాయి కదా!!??ఎంతటి గుండె జబ్బులనన్నా తగ్గించేస్తున్నారు కదా !!??”నా సందేహం వెలిబుచ్చాను.
“నిజమే.కానీ మీ నాన్న ఆరోగ్య పరిస్థితి బాగా పాడయిపోయింది .ఇప్పుడు మనం చెయ్యగలిగింది ఒక్కటే.వాడు బతికి ఉన్నన్నాళ్ళు బాధ పడకుండా చూడడం.వాడిని అనుక్షణం కనిపెట్టుకుని జాగర్తగా చూడడం.”అంటూ కామేశం నా భుజం మీద అనునయంగా చెయ్యి వేసాడు.
కామేశం మాటల కన్నా అయన మాట్లాడిన తీరు,నా భుజం మీద చెయ్య వెయ్యడం తో నాకు దుఃఖం ఆగలేదు .నా అసమర్థత వల్ల ,ఆర్థికమైన చాత కానితనం వల్ల తండ్రిని దూరం చేసుకునే పరిస్థితి  చేజేతులా నేనే తెచ్చుకున్నాను అనిపించింది. గిరుక్కన నా కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి.
“ఛ!ఛ!అదేమిటి శేఖరం ?మగవాడివి కనుక నీకు అసలు పరిస్థితి వివరించాను...అమ్మకు ఈ విషయం చెప్పకు కంగారు పడుతుంది.”
“పోనీ వేరే ఎక్కడి కన్నా తీసుకు వెళితే !?”అన్నాను నేను ఆ పరిస్థితి లో ‘వేరే డాక్టర్ ‘ అనలేక. నా బాధలో ఒక డాక్టర్ కి ,నాన్నగారి ప్రాణ స్నేహితుడుకి ఇవ్వవలిసిన కనీస గౌరవం కూడా ఆ క్షణం లో ఇవ్వలేక  పోయానేమో!!??
“చూడు శేఖరం.నేను గుండె స్పెషలిస్ట్ ని .మీ నాన్న నా ప్రాణ స్నేహితుడు.   ఏదైనా చెయ్యాల్సింది,చేయ గలిగింది ఉంటే నేనే చెప్పేవాడిని కదా? అయినా ఏదో అయిపోయిందని నేను ఏమీ అనలేదే !?అయిదు నిమషాల కన్నా బతకరు అన్న వాళ్ళు అయిదు సంవత్సరాలు బతికిన సందర్భాలు  ఎన్నో చూసాను,విన్నాను.నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇంకా టెస్ట్ లు ,ప్రొసీజర్ లు చేసి, ఉన్నన్నాళ్ళు వాడిని బాధ పెట్టకుండా ,ప్రశాంతంగా ఉండనివ్వడం మంచిది.”అన్నాడు కామేశం మెల్లిగా.
“సరే అంకుల్ “అంటూ ఒక్క ఉదటన లేచి బయటికి నడిచాను.నాకు ఎందుకో అ నిమషం కామేశం మీద పిచ్చి కోపం వచ్చింది.ఆ క్షణం లో అయన నాన్నగారి పాలిట యముడిలా కనిపించాడు.అశ్విని దేవతలకు ఆగర్భ శత్రువుగా కనిపించాడు .కామేశం నాన్న గారి స్నేహితుడు అవడం వలన ఏమి అనలేక నా  కోపం నాలోనే దాచుకున్నాను . 

*                                                *                                                   * 
ఆ  తరువాత రెండు నెలలకు నాన్నగారు పోయారు. అప్పుడు అమ్మ అసలు విషయం  అంతా   చెప్పింది. 
కామేశంకి  తన స్నేహితుడు ఇక ఎక్కువ కాలం బతకడు అని మొదటసారి పరీక్షించగానే తెలిసిపోయిందట . కానీ ఒక డాక్టర్ గా ఏ పేషెంట్ ని చూస్తూ చూస్తూ వదలలేడు కదా .అందులోనూ నాన్నగారు తన  బాల్య  స్నేహితుడు,ప్రాణ మిత్రుడు. ఖరీదైన మందులు వాడితే కొంత కాలం బతికించవచ్చు  అనుకున్నాడు.అయితే అదే మాట చెపితే నేను తల తాకట్టు పెట్టి అయినా తండ్రిని బతికించుకునే ప్రయత్నం చేస్తాను. దానితో తండ్రి జీవిత కాలం కొంచం పెంచగలనేమో కానీ ఆర్థికం గా పూర్తిగా చితికి పోతాను  .అప్పుడు రోజులు గడవడం కష్టమవుతుంది.అటు తండ్రిని కోల్పోయి ,ఇటు ఆర్థికంగా కుదేలు అయిపోయి కష్టాల కడలిలో పడిపోతాను . తన స్నేహితుడి కొడుకు అన్ని విధాల నష్టాలపాలు అవకూడదని కామేశం ఉద్దేశ్యం .కనుక మందుల ఖర్చు తను పెట్టుకుంటే స్నేహితుడు బతికినన్నాళ్ళు బతుకుతాడు,నాకు ఆర్థికం గా భారం కాదు,తన  స్నేహితునికి ఏదో చేసాడని తృప్తి ఉంటుంది అనుకున్నాడు   కామేశం .
కామేశం  నాకు తెలియకుండా ,నాకు చెప్పకుండా, చాలా ఖరీదైన మందులు నాన్నగారికి వాడారుట.నాకు అలాంటి  మందులు కొనే స్తోమత లేదని తనకు తెలుసునని , ఆయన నాకు  చెపితే, నేను అభిమానం కలవాడిని కనుక ,  కామేశం సహాయం చేయడం ఒప్పుకోను అని నాతో చెప్పలేదట. ఆ మందుల వల్లే నాన్నగారు ఇంత కాలం బతికారట .  నేను రోజూ గుళ్ళలో వెదికే చోట దేవుడు లేడని,కామేశం  లాంటి వాళ్లలోనే ఉన్నాడని అర్థమయ్యింది. ఆ దేవుడి కాళ్ళకి నా కన్నీటితో అభిషేకం చేయడానికి ,కృతజ్ఞతతో ,  ఆగకుండా ఉబుకుతున్న కన్నీళ్ళతో  బయలు దేరాను.
***

No comments:

Post a Comment

Pages