అంతా... తనవల్లే !
-లక్ష్మణ్ భరధ్వాజ్
అమ్మా ! అమ్మా ! ఈ రోజు కూరేంటి, అని వరండాలోంచే అరుస్తూ, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వ్రాసిన, మహీధర్ లోపలికి వస్తున్నాడు !
అమ్మ (శ్రావణి) పనిలో ఉన్నా, కొడుకు వచ్చే సమయమైందని,ఆకలితో ఉంటాడు, పాపం ఉదయం ఏడు గంటలైనా అవకుండానే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న, కాలేజీకి పరీక్షల కోసం వెళ్ళాడు. ఎక్కడా ఏమీ తినడు, త్రాగడు ఆకలితో ఉంటాడని, వేడి,వేడిగా వంట సిద్ధం చేసి, మహీధర్ కోసం చూస్తోంది.
మహీధర్ అరుపు వినగానే పడక గదిలో, చిందరవందరగా, పడేసిన బట్టలు సర్దుతున్న శ్రావణి బైటకు వచ్చి ఏమిరా ! ఆ అరుపులేమిటి, ఎవరైనా వింటే ఏం బాగుంటుంది.ఎందుకలా ? అరుస్తున్నావు.
పరీక్ష ఎలా వ్రాసావు.నిన్న రాత్రంతా పడుకోరా, అన్నా వినకుండా చదివావు కదా ? బాగా వ్రాసావా ? ఈ పేపర్లో ఐనా నూటికి, నూరు మార్కులు వస్తాయా ?
నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాం.నువ్వు సరిగ్గా చదవకపోతే నష్టపోయేది నువ్వొక్కడివే కాదు, మొత్తం మన కుటుంబం అంతా అని గ్రహించు !
మనందరం నాన్న గారి ఒంటిచేత్తో సంపాదించే, సంపాదనమీదే ఆధారపడి, బ్రతుకున్నాం అని తెల్సుకదా ? అంటూ శ్రావణి, మహీధర్ కి సున్నితంగా ప్రశ్నించింది.
మహీధర్ లెక్కల పేపరు సరిగ్గా, వ్రాయలేని కారణంగా, తల్లితో,అబద్ధం చెప్పడానికి,మనసొప్పక, ఏం మాట్లాడలేక మౌనంగా ఉండి పోయాడు.
పాపం చాలా ఆకలిగా ఉన్నా, తల్లి అలా అడిగేసరికి, గుటకలు మ్రింగుతూ సగం ఆకలి చంపేసుకున్నాడు.
అయినా, ఉండబట్టలేక ఈ రోజు కూర ఏమిటి వండావు అమ్మా ! అని మెల్లగా అడిగాడు, తల్లి శ్రావణిని.
ఏముంది ? ఈ రోజు వంకాయే, ఉల్లికారం పెట్టి వండాను. ఈ రోజు వంకాయేనా ? నాకు వద్దు, నాకు నచ్చదని, నీకు తెల్సు కదా ? ఎన్ని సార్లు వద్దని చెప్పినా అదే కూర.నేను తిననంటే, తిననని, చెప్పెద్దామని అనుకున్నాడు. కానీ ఏదీ తినకుండా ఉండలేక. బాగా ఆకలిగా ఉండటం వల్ల, పరీక్ష సరిగ్గా వ్రాయకపోవడం వల్ల, సరైన బస్సు సదుపాయం లేక, మండే ఎండలో నానా అవస్థలు పడి ఇంటికి రావడం వలన, వచ్చిన కోపంతో, రోజూ వంకాయేనా ? ఇంకేం కూరలే లేవా ? నాకేం అక్కర్లెద్దు, నువ్వే తిను అని తల్లిమీద కోప్పడి ఏమీ తినకుండా గదిలోకి వెళ్లి పడుకున్నాడు
మహీ, మహీ అంటూ తల్లి ముద్దుగా పిలిచి, తనకు నచ్చిన బంగాళ దుంపల వేపుడు కూరతో తిందువుగాని, అనిపిలుస్తుందని, అనుకుని, దుప్పటి ముసుగేసుకుని పడుకున్నాడు.
కానీ శ్రావణి, అపర కాళికలా, మరింత కోపంతో, ఎప్పుడో ఉదయాన్నే వెళ్ళిన, మీ నాన్న, రెక్కలు,ముక్కలు చేసుకుని, పగలంతా, తన రక్తాన్ని మరగబెట్టి, ఒళ్ళంతా నొప్పి వస్తున్నా కష్టపెట్టి,సమ్మెట కొట్టి, మనకోసం శ్రమించి,ఆ ఇనుపముక్కలు, అన్నింటిని, అందంగా పేర్చి, ఒళ్ళంతా,అలసిపోయినా, కళ్ళంతా, ఎర్రబడిపోయి, సరిగ్గా కనబడక పోయినా, కళ్ళు మంట పెడుతున్నా, వెల్డింగు చేసి, ఓక చక్కనైన,అందమైన రూపం వచ్చేలా, గేట్లు తయారు చేస్తున్నారు.
అవి అమ్మగా వచ్చే దాంట్లో, కంపెనీవాళ్ళు కోత కోసేయగా ఇచ్చే కొద్దిపాటి జీతంతో, మనకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతో, కుటుంబం నెట్టుకు వస్తున్నాం, ఈ సంగతి నీకు తెలుసు కదా ?
అలాంటిది కష్టపడి పని చేసి వచ్చిన, మీ నాన్నకు నచ్చినది వండకపోతే,నీకు నచ్చిందెలా వండమంటావు.
ఆయన ఒక్క మెతుక్కూడా ముట్టడు.అలాంటిది, ఆయన్ని కాదని, నీకు నచ్చిందెలా వండమంటావు. ఒకే ఇంట్లో ఉంటూ మనిషికో, కూర వండటానికి, మనమేమి జమిందారి కుటుంబీకులేం,కాం కదా ?
నువ్వేదో వెలగ బెడతావని, బాగా చదువుతున్నావు, ఇంకా బాగా చదివి, మంచి మార్కులు, మంచి పేరు, సంపాదిస్తావని, మనకి స్తోమత లేకపోయినా, నిన్ను ప్రవేటు కాలేజీలో జేర్పించి మరీ చదివిస్తున్నాం.
నువ్విలా భోజనం మీద అలిగి, తిండి తినకపోతే, చదువేం చదువుతావు ? పరీక్షలేం వ్రాస్తావు? నువ్వూ చదువుకుంటున్నావు కదా ! పరిస్థితులను అర్ధం చేసుకుని సర్ధుకోవడం అలవాటు చేసుకోవాల్సింది పోయి ఇలా ఎదురు తిరిగితే ఎలా ? నీకు నచ్చకపోతే ఆ చారు, మజ్జిగతో సర్ధుకో లేదంటే ఏం చేద్దాం అనుకుంటున్నావో ,నువ్వే ఆలోచించుకో ?
రా ! అన్నం తిందువుగాని, ఇప్పటికే బాగా ఆలస్యమైంది, మీ నాన్న వచ్చే టైము కూడా అవుతోందని, తల్లి,తమ కుటుంబ పరిస్థితులు మరోసారి గుర్తు చేసేసరికి, మహీధర్ కి ఏం చేయాలో ? అర్థం గాక, ఇష్టం లేకపోయినా, ఆ వంకాయ కూరతోనే, అయిష్టంగా తినాల్సి వచ్చింది.
అన్నం,ఏదో తప్పక తింటున్నాడు కానీ తింటున్నంత సేపు తన మనస్సులో ఏవేవో ఆలోచనలు గిర,గిరామంటూ తిరిగే రంగుల రాట్నంలా తిరుగుతున్నాయి. ఆఖరికి ఒక చోట ఆగింది తన ఆలోచన !
నా కుటుంబం మొత్తం ఇలా ఉండటానికి కారణాలలో, ఒకటి తన తండ్రి సరిగ్గా చదువుకోకపోవడంతో బాగా శారీరక శ్రమ పడాల్సి వస్తోంది దాంతో పెద్దగా ఆదాయం రాదు, ఇక రెండవది, సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది అన్నట్టు, కష్టం అంతా మా తండ్రిదైతే ఆ యజమాని కాలిమీద,కాలు వేసుకుని దర్జాగా సొమ్ము చేసుకుంటున్నాడు
దీనికంతటికి కారణం డబ్బున్న యజమానిది కాబట్టి దీనికి సరైన విరుగుడు అతని కూతుర్ని ప్రేమలో పడేలా చేసి, అతని ఇంటికి అల్లుడ్ని కావాలి ! ఆ తర్వాత ఆ ఇంటికి యజమానిని కావచ్చు. అప్పుడు మా నాన్న శ్రమపడే అవసరం, నేను మంచి, ఇష్టమైన వంటకాల కోసం అలగవల్సిన అవసరం ఉండదనేది,మహీధర్ ఆలోచన!
ఈ ఆలోచన మహిధర్ కి రాగానే " చిన్న పిల్లలు తాము కోరుకున్నది దొరగ్గానే ఎగిరి గెంతులేసినట్టుగా" మనస్సులోనే అత్యుత్సాహం నింపుకుని బైటకు ముసి,ముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు.
తల్లి,మహీధర్ ఆ నవ్వులను పసిగట్టి ఏమిరా ? ఏమైంది ! ఇందాక అంతలా కోప్పడ్డావు ! అలాంటిది ఇంతలోనే అంతలా నవ్వుకుంటున్నావు ? ఏంటి ?సంగతి ? అని అడిగింది.
ఆ ! ఆ ! ఏం లేదమ్మా ! ఏం లేదు అన్నాడు. వచ్చిన ఆలోచన విషయం గురించి తల్లికి చెప్పకుండా !
"క్లూసు టీం" వాళ్ళకి బలమైన ఆధారం దొరికినట్టుగా, శ్రావణి, కొడుకు మనస్సు గ్రహించిన దానిలా ఏమిరా మహీ ఎవరి ప్రేమలోనైనా పడ్డావా..? ఏమైనా ఫర్వాలేదు పడితే పడ్డావు గానీ, ఈ పరీక్షలేవో అయిపోనీ ! ముందుగా ఎందులోనైనా స్థిరపడ్డాక, అప్పుడు నీ ఇష్టం !
ఇంతకీ,అమ్మాయి బాగుంటుందా, అందంగా ఉంటుందా... అని ప్రేమగా అడుగుతూ నిజాన్ని రాబట్టె ప్రయత్నం చేసింది. కానీ మహీధర్ కనీసం నోరు విప్పలేదు. తన ఆలోచనను,బైట పెట్టలేదు.
పబ్లిక్ పరీక్షలు పూరై వారం రోజులుగా సెలవులని ఇంట్లోనే ఉంటున్న మహీధర్ అమ్మా ! అమ్మా ! నాన్న ఈ ఎండలో భోజనానికి ఇంటికేం వస్తారులే, నేను ఖాళీయేగా, క్యారేజీ పట్టుకెళ్ళి ఇచ్చి వస్తానని చెప్పి,తల్లిని ఒప్పించి, ఆ మేనేజరు కూతుర్ని ఎలాగైనా కలిసి,ఆమెను తన ప్రేయసిగా చేసుకోవాలనే, ఉత్సాహంతో ఒక రోజు ఉదయమే కొంచెం అందంగా తయారై సైకిలుమీద వెళ్తే, హుందాతనానికి లోటని, స్నేహితుడిని బైకు అడిగి మరీ బైకుమీద వెళ్ళాడు.
మేనేజరు కూతురు లిఖిత చాలా అందంగా, నాజూగ్గా ఉంటుంది ఆమె కూడా ఇంటరు కార్పోరేటు కాలేజీలో చదువుతూ మొదటి సంవత్సరం పరీక్షలు వ్రాసి సెలవులని ఇంటికి వచ్చింది.
ఇంట్లో కరెంటు పోవడం వల్ల, ఉన్న ఇన్వర్టరు అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల,మేడమీద ఇంట్లోనుంచి పరికిణి,వోణి కట్టుకున్న లిఖిత, వీధి వైపుగా ఉన్న వరండాలో, రోడ్డుమీద వచ్చే,పోయే వాళ్ళని గమనిస్తూ అటూ,ఇటూ పచార్లు చేస్తోంది.
ఇంతలో మహీధర్ "గీత గోవిందం" సినిమాలో హీరో విజయ్ దేవరకొండలా, బైకుమీద నుండి క్యారీయర్ పట్టుకుని దిగాడు.
అక్కడ మహీ వాళ్ళ నాన్న గారు, కనబడకపోవడంతో, ఎప్పడూ ఆ,గ్యారేజీకి వెళ్ళకపోవడం వలన, అక్కడ ఎవర్ని అడగాలో తెలియక అటూ,ఇటూ చూస్తూ, ఒక్కసారిగా తన చూపులు మేడమీద ఉన్న వరండాలోనికి మళ్ళించాడు. ఇంకేముంది ఒక్కసారిగా,దేవలోకంలోకి వెళ్ళి,దేవకన్యను చూసినట్టుగా, అనుభూతి చెంది తదేకంగా లిఖితను చూస్తూ అలా ఉండిపోయాడు !
ఈ లోగా తండ్రి వస్తూనే, ఏరా ! మహీ ఏంతసేపైంది ఇక్కడికి వచ్చి, ఏంటలా,మేడవైపే చూస్తూ, ఉండిపోయావు.ఏది? ఆ క్యారేజీ ఇటివ్వు, బాగా ఆకలేస్తోంది మీ అమ్మ నాకోసం ఏం వండి పంపించిందో ?
తండ్రి పిలుపుకి, మహీధర్ ఊహాలోకం నుండి బైటపడి, హా! ఇదిగో నాన్న,ఈ రోజు మునగకాయ సాంబారు మీకు ఇష్టమని చేసిందట అంటూ క్యారేజీ అందించాడు.
మేడమీద నుండి మహీధర్ ని చూసిన లిఖిత కూడా ఒక్కసారిగా అతని అందానికి చూపు త్రిప్పలేకపోయింది. ఇనుము, అయస్కాంతాన్ని ఆకర్షించిన తీరుగా, లిఖిత,మహీథర్ అందానికి ఆకర్షితురాలైంది.
వసంత కాలంలో కోయిల కూతలా, లిఖిత, తన గొంతునుండి,ఏమండీ వీర్రాజు గారు ఇంట్లో కరెంటు పోయింది,ఇన్వర్టర్ కూడా పాడైనట్టుంది పనిచేయడం లేదు, మా నాన్నగారేరి. ఉంటే ఎలక్ట్రీషియన్ని పంపించమని చెప్పండి,లేదా మీరు చూస్తారా? అని ప్రశ్నించింది.మహీధర్ తండ్రి వీర్రాజుని.
లిఖిత గొంతునుండి వచ్చే మాటలు ఎంత వినసొంపుగా అంటే, అంత వినసొంపుగా ఉన్నాయి. ఆమె మాట్లాడితే ఎక్కడ మాటల ముత్యాలు, రాలి పోతాయేమో?అన్నట్లుగా చాలా మ్రృదువుగా, పొదుపుగా,సున్నితంగా అడుగుతోంది వీర్రాజుని.
వీర్రాజు,లిఖితతో, లేదమ్మా,? నాన్నగారు మార్కెట్ పని ఉందని, టౌన్ వెళ్ళారు, మధ్యాహ్నానికి, గానీ రావడానికి, కుదరదని పని అప్పగించి వెళ్ళారమ్మా? నాకా ఎలక్ట్రీషియన్ ఫోన్ నంబరు తెలియదు, నాకేమో ఆ కరెంటు సంబంధించిన పనులేవి పెద్దగా తెలియవు, కానీ,మా అబ్బాయి మహీధరే, అప్పుడప్పుడు ఇంట్లో కరెంటు పోయినా, ఏ చిన్న,చిన్న,రిపేర్లు ఉన్నా చేస్తుంటాడు. వాడ్ని పంపించనా అమ్మా ! అనడిగాడు.
మహీధర్ మళ్ళీ మనస్సులోనే తండ్రికి క్రృతజ్ఞతలు చెప్పుకుంటూ లిఖిత రమ్మనమని పిలిస్తే బాగుణ్ణు,అని పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. పండూ పండింది,కాకీ వాలింది, అనే సామెతలా, మహీధర్,లిఖితతో మాట కలపాలని,ఆమెకు దగ్గరవ్వాలని, అనుకున్న కోరిక తీరబోతోంది.
లిఖిత ఒకసారి గదిలోకి వెళ్లి, ఒంటినిండా, మత్తెక్కించే మల్లెల వాసన గల పెర్ప్యూం స్ప్రే చేసుకు వచ్చి, మేడమీద నుండి వీర్రాజు గారు, పంపించండి,మీ అబ్బాయైనా పర్వాలేదు అంది.
ఉద్యోగానికై వ్రాత,మౌఖిక పరీక్షలు పూర్తి చేసుకుని,ఫలితాలకోసం ఎదురు చూస్తున్న, నిరుద్యోగిలా, లిఖిత ఆదేశంకోసం, ఎదురు చూస్తున్నాడు మహీధర్!
లిఖిత పిలుపు రాగానే,కుక్క ఉన్నది జాగ్రత్త! అని బోర్డును చూసి, అదేమీ లెక్క చేయకుండా, ఒక్క ఉదుటున బుల్లెట్ ట్రైనులా లోపలికి దూసుకు పోయాడు. కరెంటు మీటరు అన్ళీ పరిశీలించి, ఫీజులవీ,బాగానే ఉన్నాయి ఇది డిపార్ట్మెంటు వాళ్ళ పవర్-కట్ సమస్య, నేను చేసేదేం లేదని అన్నాడు.
వాస్తవానికి, లిఖిత స్కార్పుతో మూయబడిన మొహం చూడాలనే ఆతృతతో, ఇక ఇన్వర్టర్ ఎక్కడుందో చూపిస్తే,చూస్తానని అడిగాడు. లిఖిత గదిలోఉండే వేడికి మరింత తోడుగా, తన ఒంట్లోనుండి పుట్టే వేడి భరించలేక తన ముఖానికి చుట్టుకున్న (స్కార్పు), చున్నీ ముసుగుని,సినిమా ప్రారంభించే ముందు నెమ్మదిగా,తెర తొలగించినట్లుగా తీసి,ఇదిగో ఇలా రండి,ఈ గదిలో ఉందని ఆమె తన బెడ్రూంలోకి తీసుకు వెళ్ళింది.
చీకటిపోయి, మబ్బుల మాటున దాగి ఉన్న చందమామ, ఒక్కసారిగా, బైటకు వస్తే వచ్చిన, వెలుగులా,ఆ ప్రశాంతమైన చీకటి గదిలో,లిఖిత ఒంటికి పూసుకున్న,పేర్ఫ్యూం మరింత మత్తెక్కించేలా ఉంది. ఈ లోగా మేకప్ తో నిండిన ముఖం కన్పించింది మహీధర్ కి.
అదిగో ! అని గదిలో సన్-షేడు మీద ఉన్న ఇన్వర్టర్ చూపించింది. మహీధర్, వైరింగు,స్విచ్,ఆన్ - ఆఫ్ అన్నీ పరిశీలించి, బ్యాటరీని చూసాడు ఇంకేముంది అందులో ఉండే డిస్టిల్ - వాటర్ ,డ్రై అయిపోయింది. అది గమనించి,పెద్ద ప్రాబ్లెం ఏం కాదు, బ్యాటరీలో వాటర్ ఐపోయిందన్నాడు.
దానికి,సమాధానంగా మమ్మీని,వాటర్ తెమ్మని పిలవనా అంది.
మామూలు వాటర్ కి,డిస్టిల్-వాటర్ కి,తేడా తెలియని,లిఖితను చూసి మహీధర్ నవ్వుకున్నాడు. ఏం ఎందుకలా నవ్వుతున్నావు,వాటరే కదా,మమ్మీ తెస్తుందిలే అన్నాది మరలా, కాదండి, మనం రోజూ ఉపయోగించే వాటర్ కాదు డిస్టిల్ -వాటర్ బాటిల్ పెట్రోలు బంకులోనో, ఎలక్ట్రికల్ షాపులోనో దొరుకుంది అది ఉందా అనడిగాడు.అయ్యో ! నాకు తెలీదే, అది ఉండి ఉండదు. ఐనా, అమ్మను అడుగుతానని వంటింట్లోకి తుర్రున వెళ్ళిపోయింది.నిజానికి,ఆ గదిలో ఉక్క భరించలేక !
లేదుట, అని అనగానే, మహీధర్, ఆమెను మరింత లోబరుచుకోవాలంటే, ఇదే సమయం అని,ఆమె మనస్సును దోచుకోవచ్చని భావించి అంతలా మండే, ఎండలోనూ వెళ్ళి, డిస్టిల్ - వాటర్ బాటిల్ తెచ్చి,ఇన్వర్టర్ పనిచేసేలా చేసాడు.
మహీధర్ కి,లిఖిత మనస్సులోనే ధన్యవాదాలు తెలుపుకుంది. కానీ బైటకు ఓ చిరునవ్వు నవ్వి,ఇక మీరు వెళ్ళొచ్చు అన్నట్టుగా చూసింది.
పాపం మహీ, ఏ కూల్- డ్రింకో, ఇస్తుందని ఊహించుకుంటే,కనీసం మంచినీళ్ళు కూడా,త్రాగండని ఇవ్వకుండా, వెళ్ళమన్నందుకు బాధగా ఇంటికి వెళ్లిపోయాడు.
మరలా,వారం రోజుల వరకూ తండ్రికి క్యారేజీ ఇవ్వడానికి వెళ్ళకుండా, మహీధర్, అతని స్నేహితులకు, ఇచ్చి పంపిస్తున్నాడు.
ఒక రోజు,వీర్రాజు ఓనరు,రంగారావు ఏమిటి రాజూ,మీ వాడు క్యారేజీ తేవడం లేదు,ఆ రోజు ఇన్వర్టర్ ఏదో బాగు చేసాడట,గదా! పాప లిఖిత చెప్పింది.ఒకసారి పిలిపించు. వాటర్ - మోటార్ సరిగ్గా పనిచేయడం లేదని మా ఆవిడ ఒక్కటే గోల, ఒక్కసారి ,ఆ మోటారేదో చూడాలని రమ్మనమను.
ఆ !అలాగేనండి, రేపు ఉదయం నాతోపాటుగా తీసుకు వస్తానన్నాడు, వీర్రాజు.
మర్నాడు,తండ్రితో కలిసి,మహీధర్ గ్యారేజీకి, వెళ్ళాడు.వానలకోసం చకోర పక్షి ఎదురు చూస్తున్నట్టుగా, మహీధర్ రాక కోసం, లిఖిత ఎదురు చూస్తోంది. మేడమీద నుండి.
మహీనీ,అల్లంత దూరంనుండే,చూసి వాటర్ - మోటార్ ,పంప్-సెట్ దగ్గరకు తీసుకొని వెళ్ళి,అతనితో మహీ సారీ, ఈ మోటారు బాగానే ఉంది. ఏ రిపేరు లేదు,నువ్వు రావడం లేదని, నిన్ను చూడాలని, నేనే రప్పించాను! ఆ రోజు,మా అమ్మ గమనిస్తోందని నీకు కనీసం వాటరు కూడా ఇవ్వకుండా పంపించేసాను. నిజానికి అంతలా మండుతున్న ఎండలో చాలా దూరం వెళ్ళి,కష్టమే అయినా, ఇన్వర్టర్ బాగు చేసినప్పుడే గ్రహించాను.నువ్వు,నన్ను ఇష్టపడుతున్నావని !
నేను,నిన్ను తొలిసారిగా,బైకుమీద నుండి హీరోలా,దిగిన స్టైలు చూసి,నీకు ఫిధా అయ్యాను. నా కోసం శ్రమించి మండుటెండలో,ఇన్వర్టర్ పనిచేసేలా, చేసినప్పుడు, నేనుసుఖంగా ఉండాలనే అలా చేసుంటావని, నమ్మి, నన్ను జాగ్రత్తగా చూసుకోగలవనే నమ్మకం పొందాను. కానీ నువ్వు ఇంకా, చదువుతున్నావని తెల్సుకుని డిస్ట్రబ్ చేయకూడదనుకున్నా ! కానీ ఎందుకో నిన్ను ఛూడకుండా, ఉండలేక, నిన్ను చూడ్డంకోసం రప్పించాలనే, ఈ ప్లాను వేసాను.
అవునా ! ఇప్పుడెందుకు,ఆ, క్షమించడాలవీ, అంతలా కష్టపడి బాగు చేసినందులకు, కనీసం థ్యాంక్సు కూడా, చెప్పనందుకు చాలా హర్ట్ అయిన మాట నిజం, గానీ, ఇప్పుడేం చెప్పనవసరం లేదు ఎందుకంటే, నేను కూడా,ఆ రోజు నువ్వు నా కోసం రాసుకున్న పెర్ఫ్యూంకి ఫిధా అయ్యాననుకో ! అన్నాడు మహీధర్.
ఇలా లిఖిత,మహీధర్ లు తరచూ ఏదో ఒక వంకతో కలుస్తున్నారు.వాళ్ళ మధ్య పరిచయం,కొద్ది రోజుల్లోనె, ప్రేమగా మారింది.
అనుకోకుండా లిఖిత,తల్లితండ్రులు ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఆ సమయంలో మహీధర్ రోజూలానే, తండ్రికి క్యారేజీ ఇచ్చి, మేడమీదకు వెళ్ళాడు.లిఖిత ఒంటరిగా, హాల్- లో, కూర్చుని "విజయానికి ఐదు మెట్లు" అనే పుస్తకం చదువుకుంటోంది.
మహీధర్ లిఖితను గమనించి, ఇంట్లో ఎవరూ లేరనే ధైర్యంతో, లిఖితతో, తనకు ఉన్న చనువు,వలన ఒక్కసారిగా, లిఖితను వాటేసుకున్నాడు.
లిఖిత ఏ పామో,మీద పడితే అరచినట్లుగా,అరవబోయి, అరవకుండా, జాగ్రత్తపడి, తోక తొక్కిన త్రాఛూలా కోపంగా, మహీధర్ ని,గట్టిగా ప్రక్కకు నెట్టింది.
చూడు,మహీ ఇప్పుడిలా,చేసావు గానీ,ఇంకెప్పుడూ ఇలా చేయకు,నాకు నచ్చదు.నాకే కాదు,ఏ ఆడపిల్ల ఇలాంటిది కోరుకోదు, అడవిలో, ఆకలితో ఉన్న సింహానికి,లేడిపిల్ల, దొరికినట్లుగా, ఒంటరిగా,దొరికిన,నన్ను ఇంట్లోఎవరూ లేరని చూసి ఇలా వాటేసుకోవడం నువ్వు చేసిన తప్పు.
"కెరటాలు కాళ్ళ దగ్గరకి వచ్చాయని, సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో,మంచి తనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు!
ఇందులో,నాతప్పు కూడా ఉందనుకో,నిన్ను చాలా చనువుగా చూడ్డం,కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో మహీ, నీ మీద కోపంతో కాదు, ఇష్టంతోనే,చెబుతున్నా "దేనినైనా మన బలంతో సాధించాలి గానీ అవతలవారి బలహీనతతోగాదు"
ముందు నీ,బలమేమిటో తెల్సుకుని, నీ,బలహీనతను తొక్కిపెడుతూ, ఉన్నత ఉద్యోగం సాధించి,అటు మీవాళ్ళని, మెప్పించి, ఇటు,నా తల్లితండ్రులకి, హుందాగా, విలాసంగా,బ్రతకగలరనే, నమ్మకాన్ని కల్పించావనుకో, నువ్వు, నా కాళ్ళమీద పడే అవసరం ఉండదు.మా తల్లితండ్రులే,నీ కాళ్ళు కడిగి, కన్యాధానం చేసేలా చూస్తాను. అంత వరకూ ఎలాంటి, పిచ్చి,పిచ్చి వేషాలు వేసినా, నీ కుటుంబం పరువు తీయడమే, గాక,నీ తాట తీస్తా ! అని హెచ్చరించింది.
ఒక్కసారిగా, లిఖిత అలా అనడంతో,భయపడిన మహీధర్,తన తప్పుని మన్నించమని, తనతో ఉన్న ఈ పరిచయాన్ని, దూరం చేయకని బ్రతిమలాడాడు.
లిఖిత మాట్లాడిన, మాటలకు,తీవ్ర ఆలోచనలో పడ్డ మహీధర్, తనకి, లిఖితపై ఉన్నది,ప్రేమ,వ్యామోహమా,
లేక ఆకర్షణా అర్ధం గాక చాలా ప్రేమ ఇతివ్రృత్తంగా గల సినిమాలు,నువ్వంటే నాకిష్టం,నువ్వు నాకు నచ్చావ్, ప్రేమ,ప్రేమంటే ఇదేరా, ప్రేమించుకుందాం రా,ప్రేమతో,నువ్వు-నేను,ఔను వాళ్ళిద్ధరూ ఇష్ట పడ్డారు లాంటి ఎన్నో సినిమాలు చూసాడు.
చివరకు,తేల్చుకున్నది ప్రేమించ బడాలంటే అందమో,ఐశ్వర్యమో అవసరం లేదని స్పష్టం చేసుకున్నాడు.
ఇరువురూ కలిసి సుఖంగా జీవించాలన్నా,ఇద్దరూ అన్యోన్యంగా, ఆదర్శంగా ఉండగలిగేలా ఆర్ధిక స్థితి అవసరమని తెల్సుకుని లిఖిత చెప్పిన మాటలు పదే,పదే గుర్తు చేసుకుంటూ ఉన్నత ఉద్యోగం కోసం తీవ్రమైన క్రృషి చేస్తూ ఆ,దిశగా తన ఉన్నత విద్యను పూర్తి చేసుకుని, మంచి ఉద్యోగం సంపాదించాడు.
చిన్న నాటినుండి చూస్తున్న,కుటుంబ పరిస్థితులు,ఆర్ధిక అవసరాన్ని, లిఖిత మీద ఉన్న ఆకర్షణ నిజమైన ప్రేమగా మార్చుకోవాలని,గుర్తు చేస్తూ హెచ్చరించడం,వలన,లిఖితతో గడిపిన కొద్ది రోజులు, మరే అమ్మాయితో ప్రేమలో పడకుండా ఉండేలా ప్రేరణ పొందిన మహీధర్, లిఖిత పూర్వకంగా, లిఖిత తండ్రికి వ్రాసి ఇస్తూ,లిఖిత ప్రేమ సౌధానికి మహారాజయ్యాడు.తల్లి శ్రావణి,వీర్రాజుల ప్రేమ పూర్వక ఆశీర్వాదాలతో...
నేటి ఆధునిక కాలంలో యువత,దీపాన్ని చూసి,దీపం పురుగు ఆకర్షించబడి,తన జీవితాన్ని, ముగించు కున్నట్లుగా,ప్రేమ పేరుతో,ఆకర్షణలో పడి,అత్యంత సులువుగా, ప్రాణ త్యాగాలు,చేస్తూ,ఇరువైపుల తల్లి తండ్రులకు తీరని దుఃఖాన్ని, మానసిక వేదనను, పరువు నష్టాన్ని, మిగులుస్తున్నారు.
***
No comments:
Post a Comment