అటక మీది మర్మం - 25 - అచ్చంగా తెలుగు

అటక మీది మర్మం - 25

Share This
అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల- 25
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)
 



(కనిపించకుండా పోయిన తన కుమారుడి సాహిత్యాన్ని వెతికి పెట్టమని నాన్సీ తండ్రిని సాయమడుగుతాడు ముసలి మిలిటరీ ఉద్యోగి మార్చ్.  తండ్రి కోరికపై ఆ కేసును చేపడుతుంది  నాన్సీ. ఆగంతకుడెవరో ఆ భవనంలో తిరుగుతున్నాడని అక్కడ పని చేసే ఎఫీ ద్వారా తెలుసుకొంటుంది.  ఒకసారి తన స్నేహితురాళ్ళతో కలిసి అతన్ని పట్టుకొనే ప్రయత్నం చేసి విఫలమవుతుంది.  అటక మీద రహస్యమార్గం ఉందేమో అని వెతుకుతున్న సమయంలో అస్తిపంజరం తమకేదో సైగ చేస్తోందని బెస్ అంటుంది.  వెంటనే అస్తిపంజరం ఉన్న బీరువాలో గాలించిన యువగూఢచారికి పాత ఉత్తరాలతో పాటు కొన్ని పాటలు దొరుకుతాయి.  తన తండ్రి క్లయింట్ కు అమ్మించి పెడతానని వాటిని నాన్సీ యింటికి తీసుకొస్తుంది.  ఒకరాత్రి ఆగంతకుణ్ణి పట్టుకోవటానికి ఆమె చీకట్లో మాటువేయగా, ఆకస్మికంగా మార్చ్ రావటంతో ఆ ఆగంతకుడు తప్పించుకొని పారిపోతాడు.  మరునాడు రేడియోలో వినబడే పాటలో కొన్ని పదాలు మార్చ్ కుమారుడు అతని భార్యకు వ్రాసిన ఉత్తరంలో ఉన్నాయని ఆమెకు గుర్తుకొస్తుంది.   వాటిని వెతకటానికి యింటికి వెళ్దామనుకొంటూండగా, ఫాన్సీ డ్రస్సు వేసిన సుశాన్  ప్రమాదవశాత్తూ మెట్లమీద నుంచి కిందకు దొర్లిపోతుంది.  అదే సమయంలో మెట్లకు పక్కనున్న గోడపై వ్రాసి ఉన్న సంగీత స్వరాలు బయటపడతాయి.  ఆమె తన స్నేహితురాళ్ళతో కలిసి జెన్నర్ ఆఫీసుకి వెడుతుంది.  జెన్నర్ తమకు ఇంటర్వ్యూ యివ్వకపోగా, తమ గురించి ఎవరితోనో మాట్లాడటం వాళ్ళు వింటారు.  తరువాత అక్కడనుంచి హోటలుకి బయల్దేరిన వ్యక్తిని వెంబడిస్తారు ముగ్గురు అమ్మాయిలు.  హోటలు వాళ్ళు ఆ వ్యక్తిని  బెన్ బాంక్స్ అని గాక డైట్ అని సంబోధించటం వాళ్ళు వింటారు.  తరువాత. . .)
 

ముగ్గురమ్మాయిలు తాము విన్న విషయాన్ని నిర్ధారించుకొందుకు కౌంటర్ దగ్గరకొచ్చారు.
"ఇక్కడ మిస్టర్ బెన్ ఉన్నారా?" నాన్సీ చిరునవ్వుతో గుమాస్తాని అడిగింది.
"మీరు అడిగేది ఆ స్వరకర్త గురించేనా? ఉన్నారు.  కానీ ఆయన యిక్కడ తన అసలు పేరు హోరేస్ డైట్ నే వాడతారు.  క్షమించండి.  మిస్టర్ డైట్ యిప్పుడు మిమ్మల్ని కలవరు.  తన విశ్రాంతికి భంగం కలిగించవద్దని చెప్పి వెళ్ళారు."
ముగ్గురమ్మాయిలు హోటల్ని విడిచిపెట్టారు.  రివర్ హైట్స్ కి వెళ్ళేదారిలో ఈ కేసులో చోటు చేసుకొన్న కొత్త పరిణామాల గురించి చర్చించుకొన్నారు.
"డయానె కుటుంబంతో ఈ డైట్ కి సంబంధం ఉందనుకొంటున్నావా?" బెస్ అడిగింది.
"ఈ బెన్ బాంక్స్ గా పిలవబడేవాడు తప్పకుండా వాళ్ళకి చుట్టమై ఉండొచ్చు" నాన్సీ అంగీకరించింది. 
"ఈ విషయాన్ని బయటకు లాగటమే నా పనిగా పెట్టుకొంటాను.  అతను నిజంగా చుట్టమే అయితే, ఈ కేసు ఎంతో క్లిష్టంగా మారబోతోంది!"
ఆ రోజు కనుగొన్న విషయాల వెలుగులో డ్రూ చేపట్టిన కేసు కొత్త ప్రాముఖ్యతను సంతరించుకొంది.  ఇంటికెళ్ళి తండ్రితో వెంటనే మాట్లాడాలని నాన్సీకి ఆత్రుతగా ఉంది.  తండ్రి రావటానికి పావుగంట ముందుగా ఆమె యింటికి చేరుకొంది.
"డైట్ కేసులో విశేషాలేమున్నాయి నాన్నా?" నాన్సీ అడిగింది.
"అతని పరిస్థితి ఏం బాగులేదు.  ఇప్పుడే బుకర్ నాకో సమాచారమిచ్చాడు.  అతని కెమిస్ట్ డైట్ ఫాక్టరీనుంచి నువ్వు తెచ్చిన సీసాల్లోని ద్రవాన్ని విశ్లేషించాడట!"
"ఫలితం ఏమి వచ్చిందట?"
"సాలీడు నుంచి తీసిన దారాన్ని గట్టిపరచటానికి బుకర్ ప్లాంట్ లో వాడే రసాయనంతో అవి సరిపోలాయి."
" అంటే లారెన్స్ డైట్ ఆ ఫార్ములాని దొంగిలించినట్లేగా? లేదా వాటిని తయారుచేయటానికి బుషీట్రాట్ ని మనఃస్ఫూర్తిగా కూలికి తీసుకొన్నట్లేగా?"
"అలాగే కనిపిస్తోంది.  కేసుని పూర్తిగా తయారుచేశాక, లారెన్స్ డైట్ పై చట్టబద్ధమైన చర్యలకు దిగుతాను." 
అప్పుడే నాన్సీ తను బెన్ బాంక్స్ విషయంలో సేకరించిన వివరాలను, అతని అసలు పేరు హొరేస్ డైట్ అన్న సంగతిని తండ్రికి చెప్పింది.
"వ్యవహారాలు క్లిష్టంగా మారుతున్నాయి" న్యాయవాది సాలోచనగా అన్నాడు.
"నాకు మీ సాయం కావాలి.  హోరేస్ డైట్ గురించి మీరు సమాచారం సేకరించగలరా?" నాన్సీ అడిగింది.
"ఆఫీసులోని నా ఫైళ్ళలో అతని సమాచారమేమన్నా ఉందేమో చూడాలి" చెప్పాడతను.
వెంటనే అతను తన సెక్రటరీకి ఫోను చేయగా, లారెన్స్ డైట్ కి హోరేస్ అనే పేరుగల పినతల్లి కొడుకు ఉన్నాడని తెలిసింది.
"మీరు నిజంగా పరిపూర్ణమైన పరిశోధకులు" నాన్సీ చిరునవ్వుతో తండ్రిని మెచ్చుకొంది.
"చూడమ్మా! ఒక మనిషి నేపధ్యానికి సంబంధించిన కొద్దిపాటి సమాచారమైనా మునుముందు ఉపయోగిస్తుందన్న విషయం నీకు తెలియదు" అని కర్సన్ డ్రూ బదులిచ్చాడు.  "ఈ కేసులో యించుమించు లారెన్స్ డైట్ వయసువాడైన తతని బంధువు హోరేస్ డైట్ పెద్ద సోమరిపోతు అన్న నిజాన్ని దృష్టిలో ఉంచుకోవాలి."
"ఇకపై మనం చేయాల్సింది ఏమిటి?" నాన్సీ అడిగింది.  "బెన్ బాంక్స్ తన గురించి ఫలానా నాన్సీ డ్రూ అనే అమ్మాయి కొంత సమాచారాన్ని సేకరించిందని, యింకా సేకరించబోతోందని జెన్నర్ ద్వారా తెలుసుకొన్నాడు.  అతను నా పేరును రివర్ హైట్స్ లోనున్న డైట్ కుటుంబం దగ్గర ప్రస్తావించవచ్చు."
"నేనలా అనుకోవటం లేదు" కూతురితో న్యాయవాది అన్నాడు.  "అయితే నువ్వు మార్చ్ కేసును పరిష్కరించేవరకు నేను లారెన్స్ డైట్ పై చట్టపరమైన చర్యలను నిలిపి ఉంచాలి.  నువ్వు ఇంకా ఏమన్నా ఫిప్ పాటలను కనుగొన్నావా?"
లేదన్నట్లు నాన్సీ తలూపింది.
"నువ్వు తప్పక కనుగొనగలవని ఆశిస్తున్నా" ఆమె తండ్రి చెప్పాడు.  "మిస్టర్ హాకిన్స్ నువ్వు తీసుకొచ్చిన పాటను కొన్నాడు."
"అద్భుతం " నాన్సీ ఆనందంగా అరిచింది.
"ఈ ఉదయమే హాకిన్స్ నుంచి ఉత్తరం వచ్చింది.  ఫిప్ పాట బాగుందని మెచ్చుకొంటూ మరిన్ని పాటలను కావాలంటున్నాడు."
" నేను కొన్ని మాత్రమే యివ్వగలను.  ఇంతవరకు నాకు మరొక పాట దొరకలేదు నాన్నా! కానీ ఈసారి నేను మంచి ఆధారాన్ని కనుక్కొన్నాననిపిస్తోంది."
"మార్చ్ యిటీవల రేడియోలో ఒక పాట విన్నారు.  దాని బాణీని తన కుమారుడు ఫిప్ కట్టాడని మార్చ్ అంటున్నారు.  ఆ పాట " నా హృదయపు కోరిక " అన్న పదబంధంతో ప్రారంభమౌతుంది" ఆమె తన తండ్రితో అంది.
"ఫిప్ మార్చ్ తన భార్యకు వ్రాసిన ఉత్తరాలలో ఒక దాంట్లో ఈ పదాలను చదివినట్లుగా గుర్తుకొస్తోంది.
అదృశ్యమైన సంగీతం తాలూకు వైనం, ఇంకా దొంగిలించబడకుండా ఉంటే, ఆ ఉత్తరాలలోనే ఉండొచ్చని నమ్ముతున్నాను. వాటిని ఒక్కసారి చూస్తే. . ."చెబుతున్న నాన్సీ మాటలకు అడ్డు తగిలాడతను.

"నువ్వు కొన్ని బట్టలను సర్దుకొని యిక్కడనుంచి జారుకోవటం మంచిది" ఆమెకు న్యాయవాది సలహా యిచ్చాడు.  "డైట్ సోదరులిద్దరూ నువ్వు వారి వెంట పడ్డావని అనుమానిస్తే, నిన్నెక్కడ పట్టుకోవాలో వాళ్ళకి తెలియకపోవటం మంచిదని అనుకొంటున్నాను."
"మీరనేదేమిటో నాకు అర్ధమైంది" అంటూ ఆమె కొద్ది క్షణాలు ఆగింది. 
(తరువాయి భాగం వచ్చే సంచికలో)

No comments:

Post a Comment

Pages