అదంతే... - అచ్చంగా తెలుగు
 అదంతే...
సామర్ల రమేష్ బాబు 
          

తన సమస్య గరించి ఆలోచిస్తూ బైక్ నడుపుతున్న రాఘవ టర్నింగ్ లో సడన్ బ్రేకుతో ఆపాడు. ఒక తెల్ల కుక్క అనుకోకుండా దారికడ్డంగా పరుగెత్తడంతో ఆగిపోకతప్పలేదు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీకాలేదు... బైక్...బైక్ మీద రాఘవ...బైక్ క్రింద పడబోయిన కుక్క...అందరూ క్షేమంగానే వున్నారు.
    సాయంత్రం ఆరు గంటలకు డ్యూటీ తర్వాత కంపెనీ నుంచి వాళ్ళ టౌన్ షిప్ కి వస్తున్న రాఘవ ‘ హమ్మయ్య ‘ అనుకుని మళ్ళీ బైక్ ని ముందుకి కదిలించాడు. కంపెనీ నుంచి టౌన్ షిప్ వరకు మూడు కిలో మీటర్ల దూరం వుంటుంది. ఆ దారిలో అతనికి తెల్ల కుక్క కనిపించడం అదే మొదటిసారి. 
     ఆలోచనల్ని మళ్ళీ తన సమస్య మీదకి మళ్ళించాడు.అతని సమస్య చిన్నది.. చిత్రమైనది...ఈమధ్య వాళ్ళ టౌన్ షిప్ లోని అన్ని రకాల క్వార్టర్స్ కి ‘ఇంటర్ కం’ ఫోన్ సౌకర్యం కలిగించడంతో అతని భార్య దినచర్య పూర్తిగా మారిపోయింది.
    స్నేహితురాళ్ళతో గంటల తరబడి ఇంటర్ కం లో మాట్లాడుతోంది. భర్త ఇంట్లో వున్నా అదే తంతు.ఒకవేళ రాఘవ ఇంటికెళ్ళే సరికి ఆమె గనుక ఫోనులో మాట్లాడుతుండటం జరుగు తుంటే మొగుడికి కనీసం స్మైల్ కూడా యివ్వడం లేదు.ఏంచేయాలో తెలియక సతమతమవుతున్వాడు.
    ఇంటికి చేరుకున్న రాఘవకి ఊహించినట్లుగానే భార్య ఇంటర్ కం లో మాట్లాడుతూ కనిపించింది.నిస్సహాయంగా డ్రస్ మార్చుకుని స్నానానికి వెళ్ళాడు.

                                                *     *      *
           తర్వాత ఆ తెల్ల కుక్క ప్రతి రోజూ కనిపించడం మొదలైంది. కంపెనీ నుండి తీసుకెళ్ళే బిస్కెట్లు ముద్దుగా ఉన్న ఆ తెల్ల కుక్కకి వెయ్యడం మొదలెట్టాడు. అదే ప్లేస్ లో నిలబడి రోజూ అతని కోసం ఎదురు చూస్తోంది.మరికొన్ని రోజుల్లో ఆ కుక్క రాఘవకి మంచి నేస్తమయిపోయింది.అది  పరిచయం అయిన తర్వాత భార్య ప్రవర్తన పెద్దగా బాధ పెట్టడం లేదు.
        ఆ రోజు సాయంత్రం అయిదు నమిషాలు ఆలస్యంగా ఇంటికి బయలు దేరాడు రాఘవ. కుక్కకి రోజూ బిస్కెట్లు వేసే చోటుకి చేరుకునే సరికి అక్కడ రెండు కుక్కలు పోట్లాడుకుంటూ కనిపించాయి. కంగారుగా దగ్గరకెళ్ళి ఆగాడు.వాటిల్లో ఒకటి అతని ఫ్రెండ్ తెల్లకుక్క. రెండోది నల్ల రంగు మీద తెల్ల మచ్చలతో భయంకరంగా వుంది. దగ్గర్లో దొరికిన రాయి తీసుకుని నల్లకుక్క మీదకి విసిరాడు, నల్లకుక్క పారిపోయింది.
       అలసిపోయిన తెల్లకుక్క వగరుస్తూ నిలబడింది. రాఘవ రోజూలాగానే బిస్కెట్లు దానిముందు వేశాడు. తినకుండా అతనివైపు అదోలా చూసింది. అతని మనసంతా కెలికినట్లయింది....’ కొంపతీసి నల్లకుక్క పిచ్చిదికాదు కదా....ఛ..అలా ఏం కాదు..’  దాన్ని చేత్తో నిమిరి తినమని చెప్పి వెళ్ళిపోయాడు.
      దగ్గరగా వేసివున్న తలుపుని నీరసంగా తోసుకుని యింట్లోకి అడుగు పెట్టాడు రాఘవ. భార్య ఫోన్ లో మాట్లాఢుతోంది. ఆరోజు అతనికి కోపం రాలేదు...కళ్ళముందు తెల్ల కుక్కే మెదులుతోంది.భార్యని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు.భర్త తనవైపు విసుగ్గా చూడకుండా లోపలికెళ్ళడంతో రాఘవ భార్యకి వెలితిగా అనిపించింది.తనని ఏమీ అనలేక నిస్సహాయంగా భర్త చూసే చూపు అమెకి సంతోషాన్ని, గర్వాన్ని కలిగిస్తుంది. కానీ ఆరోజు అతనలా చూడకపోవడంతో ఫోన్ పెట్టేసి టీ చెయ్యడానికి వంటింట్లోకోళ్ళింది
        ఫీలయితేనే మనం ఫెయిలయినట్లు... మనం ఫీలవ్వకపోతే.. ఫెయిలయ్యేది ప్రయత్నించిన వాళ్ళే...
        *      *     *   
     తర్వాత నాలుగు రోజులు తెల్ల కుక్క కనిపించ లేదు. రోజూ దారిలో ఆగి అటూ యిటూ చూసి మరీ వెళుతున్నాడు. ఏమయివుంటుంది..? మనసు కీడు శంకించడం మొదలయింది... అలాగే మరికొన్ని రోజులు గడిచి పోయాయి.

     అ రోజు అదివారం కావడంతో ఆలశ్యంగా నిద్ర లేచిమార్కెట్ కి బయలుదేరాడు రాఘవ. కొంత దూరం వెళ్ళేసరికి కొంతమంది జనం కర్రలతో రోడ్డు ప్రక్కగా కనిపించారు. బైక్ స్లో చేశాడు...
     “ ఎదవ కుక్క , ఎక్కువ మందిని కరవక ముందే దొరికింది...” ఎవరో అంటున్నారు...
     కుక్క అనే మాట వినగానే అప్రయత్నంగా బైక్ ఆపి దిగాడు...” ఏమయింది ..” ముందునుంచి వెళుతున్న వ్యక్తిని అడిగాడు.
    “ పిచ్చికుక్క.. అక్కడో అబ్బాయిని కరిచి పారిపోతుంటే  వెంటపడి చంపి పారేశాం...” కసిగా అన్నాడా వ్యక్తి.
    పరుగులాంటి నడకతో చచ్చి పడివున్న కుక్క దగ్గరకెళ్ళి చూసి స్ధాణువులా నిలబడి పోయాడు.
  అది ... అది...అతని ఫ్రెండ్.. తెల్ల కుక్క...కళ్ళు తిరగడం మొదలయ్యింది. ప్రక్కనే వున్న చెట్టుని ఆసరాగా చేసుకుని నిలబడ్డాడు.
   అరోగ్యంగా వున్న తెల్ల కుక్క తన ప్రమేయం, పొరపాటు లేకుండానే పిచ్చిదిగా మారింది. అ పిచ్చిలో జనాన్ని కరవడం మొదలెట్టింది. దాంతో జనాలు కొట్టి చంపారు. ఆ పిచ్చి తనానికి బాధ్యత తనది కాకపోయినా  ఫలితం మాత్రం అదే అనుభవించింది. ఆ పిచ్చిని నయం చేసే ఓర్పు, నేర్పు లేని మనుష్యులు దాన్ని చంపేశారు. లేకపోతే ఆ పిచ్చిలో అది మరికొంత మందిని కరుస్తుంది.
      పిచ్చి ఎవడు పట్టించినా.. ఫలితాన్ని అనుభవించాల్సింది..పిచ్చివాడే...
         అదంతే... ఈ ప్రపంచంలో అలాగే జరుగుతుంది... 
       బరువెక్కిన గుండెని తేలిక చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ మార్కెట్ కి వెళ్ళకుండానే యింటికి బయలు దేరాడు రాఘవ.
***

No comments:

Post a Comment

Pages