అటక మీది మర్మం - 26 - అచ్చంగా తెలుగు

అటక మీది మర్మం - 26

Share This
అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల- 26
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)
 


(తండ్రి కోరికపై కనిపించకుండా పోయిన ముసలి మిలిటరీ ఉద్యోగి మార్చ్ కుమారుడి సాహిత్యాన్ని వెతికి పట్టుకోవటానికి నాన్సీ అంగీకరిస్తుంది.  తన స్నేహితురాళ్ళతో ఆ పాత భవనాన్ని గాలిస్తుంది కానీ ఆమెకు ఎలాంటి ఆధారాలు దొరకవు.  ఆగంతకుడెవరో ఆ భవనంలో తిరుగుతున్నాడని అక్కడ పనిలో చేరిన ఎఫీ ద్వారా నాన్సీ తెలుసుకొంటుంది.  ఒకసారి తన స్నేహితురాళ్ళతో కలిసి అతన్ని పట్టుకొనే ప్రయత్నం చేసి విఫలమవుతుంది. అటక మీద రహస్యమార్గం ఉందేమో అని వెతుకుతున్న సమయంలో అస్తిపంజరం తమకేదో సైగ చేస్తోందని బెస్ అంటుంది. వెంటనే అస్తిపంజరం ఉన్న బీరువాలో గాలించిన యువగూఢచారికి పాత ఉత్తరాలతో పాటు కొన్ని పాటలు దొరుకుతాయి. రేడియోలో వినబడే పాటలో కొన్ని పదాలు మార్చ్ కుమారుడు అతని భార్యకు వ్రాసిన ఉత్తరంలో ఉన్నాయని ఆమెకు గుర్తుకొస్తుంది. వాటిని వెతకటానికి యింటికి వెళ్దామనుకొంటూండగా, ఫాన్సీ డ్రస్సు వేసిన సుశాన్ ప్రమాదవశాత్తూ మెట్లమీద నుంచి కిందకు దొర్లిపోతుంది. అదే సమయంలో మెట్లకు పక్కనున్న గోడపై వ్రాసి ఉన్న సంగీత స్వరాలు బయటపడతాయి.  ఆమె తన స్నేహితురాళ్ళతో కలిసి జెన్నర్ ఆఫీసుకి వెడుతుంది. జెన్నర్ తమకు ఇంటర్వ్యూ యివ్వకపోగా, తమ గురించి ఎవరితోనో మాట్లాడటం వాళ్ళు వింటారు. తరువాత అక్కడనుంచి హోటలుకి బయల్దేరిన వ్యక్తిని వెంబడిస్తారు ముగ్గురు అమ్మాయిలు. హోటలు వాళ్ళు ఆ వ్యక్తిని బెన్ బాంక్స్ అని గాక డైట్ అని సంబోధించటం వాళ్ళు వింటారు. హోటలు వాళ్ళ నుంచి ఈ డైట్, బెన్ బాంక్స్ ఒకరే అని తెలుసుకున్న నాన్సీ, ఆ విషయం తండ్రితో చెబుతుంది. వెంటనే తండ్రి ఆమెను అక్కడనుంచి మార్చ్ భవనానికి వెళ్ళిపొమ్మని, అవసరమైతే తానే ఆమెను అక్కడకొచ్చి కలుస్తానని చెబుతాడు. తరువాత . . . .) 
 
"మీరనేదేమిటో నాకు అర్ధమైంది" అంటూ ఆమె కొద్ది క్షణాలు ఆగింది.  "మార్చ్ పాత భవనమే అందుకు అనువైనదని అనిపిస్తోంది.  ఆ యింట్లో నేను అన్వేషించవలసినది కూడా చాలా ఉంది.  ఇప్పుడే నేను వెళ్ళిపోతాను.  ఆ ఉత్తరాలను కూడా నాతో పాటు తీసుకెడతాను."

"మంచిది.  నేను నీకేదైనా చెప్పాలనుకొన్నా, నీ నుంచి వినాలనుకొన్నా నేను అక్కడికి వచ్చి నిన్ను కలుస్తాను."
ఇంత త్వరగా తండ్రిని వదలాలంటే ఆమెకు బాధగానే ఉంది.  కానీ చీకటి పడకుండానే ప్లెజెంట్ హెడ్జెస్ కు చేరుకొమ్మని అతను కూతురికి చెప్పాడు.   ఆమె తండ్రికి చెప్పాల్సిన సంగతులెన్నో ఉన్నాయి.   ముఖ్యంగా మార్చ్ భవంతి దగ్గర తారట్లాడే ఆగంతకుడి విషయాన్ని చెప్పటం పూర్తిగా మరిచిపోయింది.
ఆమె పాత భవనాన్ని చేరుకొన్న వెంటనే మార్చ్ ని వెతికి పట్టుకొంది.  తన తండ్రి క్లయింట్ ఫిప్ పాటను కొన్నాడని అతనికి చెప్పింది.
"అద్భుతం!  ఇప్పుడు నా కుమారుడికి, మార్చ్ వంశానికి సంఘంలో మంచి గుర్తింపు వస్తుంది.  నాన్సీ!  నువ్వు చేసిన సాయానికి ఋణం తీర్చుకోలేను."
"మిస్టర్ హాకిన్స్ మరికొన్ని పాటలను అడుగుతున్నాడు" నాన్సీ నవ్వుతూ చెప్పింది.
"ఇంతకుముందు కన్నా ఆ పాటల కోసం మరింత కష్టపడి వెతుకుతాను.  మీ అబ్బాయి ఉత్తరాలను తెచ్చాను.  వాటిలో ఆధారాలేమన్నా దొరుకుతాయేమో చూద్దాం."
కొన్ని నిమిషాలపాటు వారిద్దరూ ఆ ఉత్తరాలను మౌనంగా చదివారు.
అకస్మాత్తుగా నాన్సీ అరిచింది.  "నేను వెతుకుతున్నది యిదే!  వినండి."
తన భార్యకు ఫిప్ మార్చ్ వ్రాసిన ఉత్తరాల్లో ఒకదాన్ని ఆమె చదివి వినిపించింది.
"నా ప్రేమను మించిన యదార్ధం లేదు 
ప్రతి దినము నిన్ను కాపాడుకొంటాను.
పురాతన, శ్రేష్టమైన విషయాల నడుమ 
నా హృదయపు కోరికను విడిచిపెడతాను "

"అందమైన కవిత.  కానీ యిందులొ క్లూ. . ."అర్ధోక్తిలో ఆగాడతను.
నాన్సీ ఆ పదాలకు వివరణనిచ్చింది.. "మీ అబ్బాయి తన భార్య కోసం ఎల్లప్పుడూ ఏదో ఒకటి యివ్వాలని కోరుకొన్నాడు.  ఈ పాటలో అతను "తన హృదయపు కోరిక" అన్న పదాలలో తనకిష్టమైన సంగీతం అన్న భావనను గుంభనగా పేర్కొన్నాడు.  దాన్ని అతను కొన్ని శ్రేష్టమైన, పురాతన వస్తువుల మధ్య ఉంచాడు.  ఆమె వాటిని కనుగొని తన అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు."
"అలాగా?  అంటే అటక మీద ఎక్కడో వాటిని దాచినట్లుగా తను చెబుతున్నట్లు నువ్వు భావిస్తున్నావా?"
"కావచ్చు" నాన్సీ బదులిచ్చింది.  " ఈ ఉత్తరాల్లో యింకా ఏదైనా వైనం కనబడుతుందేమో చూద్దాం.  మనక్కావలసిన కీలకమైన రహస్యం వీటిలోనే ఉందని నాకు అనిపిస్తోంది."
కొన్ని నిమిషాల తరువాత యువ గూఢచారి మరొక చక్కని పద్యాన్ని చూసింది.  "ఆ కీలకాన్ని కనుక్కొన్నాననే నేను నమ్ముతున్నాను" అత్యుత్సాహంగా చెప్పిందామె.  ఆ పద్యాన్ని ఆమె బిగ్గరగా చదివింది.
"ఎప్పుడో మరిచిపోయిన మనిషీ! 
నా రహస్యాన్ని దాచిపెట్టు.
నా ప్రేయసికి మాత్రమే దాన్ని తెలిపి
ఓదార్పుని అందించిపెట్టు!"

"ముందు పద్యం కన్నా దీన్ని అర్ధం చేసుకోవటం మరింత కష్టం.  నీకెలా అనిపిస్తోంది?" పెద్దాయన ఆమెను అడిగాడు.
"ఎప్పుడో మరిచిపోయిన మనిషి అంటే . . .అస్తిపంజరమే!  అతనొక రహస్యాన్ని పరిరక్షిస్తున్నాడు.  అది బయటపడ్డ మరుక్షణం మీ అబ్బాయి కుటుంబానికి ఓదార్పు చేకూరుతుంది."
"నువ్వు చెప్పింది నిజమే కావచ్చు" పెద్దాయన అంగీకరించాడు.  "కానీ నువ్వు బట్టలబీరువాలోని రహస్య అరను ఎప్పుడో కనుగొన్నావుగా!  దానిలో ఒక్కటే పాట దొరికింది."
ఏమైనప్పటికీ అస్తిపంజరపు క్లూ మీద నాన్సీకి ఆశ తగ్గలేదు.  తక్షణమే అటక మీదకు వెళ్ళి అస్తిపంజరాన్ని, బట్టల బీరువాను మరింతగా శోధించాలని ఆమె కోరింది.  పెద్దాయన చేతిలో కొవ్వొత్తిని పట్టుకొని ఆమెను అనుసరించాడు.
"నేను మరిన్ని నిరాశలను తట్టుకోలేను" విషాదస్వరంతో అన్నాడతను. 
"వెతికిన ప్రతిసారి ఏదో దొరుకుతుందని ఆశపడటం, చివరికి అది విఫలమవటం.  బెన్ బాంక్స్ లేదా హారీ హాల్ మీద కేసు వేయటానికి చాలినంత సొమ్ము కూడా నా దగ్గర లేదు."
"ఈసారి మన ప్రయత్నం తప్పక ఫలిస్తుందని నాకు అనిపిస్తోంది" నాన్సీ ఆత్మవిశ్వాసంతో చెప్పింది.
వాళ్ళు అటక మీదకు చేరుకోగానే, నాన్సీ బట్టల బీరువా దగ్గరకెళ్ళి జాగ్రత్తగా తలుపు తెరిచింది.
ఈసారి ఆమెకు అస్తిపంజరంపై పూర్వం కన్నా భిన్నమైన భావన కలిగింది.  అది ఆమెకు దుష్టుడిలా కనబడలేదు.  నిజానికి అది తనకు సాయపడే మిత్రుడన్న ఊహ ఆమెలో పాదుకొంది.
"బహుశా ఈ మధ్య తరచుగా కలవటం వల్ల అలా అనిపించి ఉండవచ్చు" అని ఆమె తనలోనవ్వుకొంది.  "లేదా మార్చ్. సుశాన్ లకు అదృష్టాన్ని కలిగించే ముఖ్యమైన రహస్యాన్ని కలిగి ఉండటం వల్ల కూడా కావచ్చు."
జాగ్రత్తగా ఆమె అస్తిపంజరాన్ని దాన్ని తగిలించిన కొక్కెం నుంచి బయటకు తీసింది.  దాని తలను వేలాడదీసిన చోట బట్టల బీరువా వెనుకభాగంలో చిన్న కన్నం కనిపించింది.
"దీని అర్ధం ఏదో ఉండొచ్చు" పేరాశతో చెప్పిందామె.
కర్టెన్ని తగిలించే పొడవైన గుండ్రని ఊచ నేలపై పడి ఉంది.  ఆమె దాన్ని చేతిలోకి తీసుకొని ఆ ఊచ ఒక వైపు కొసని బట్టలబీరువాలోని గుండ్రంగా ఉన్న ఆ చిన్న కన్నంలోకి జాగ్రత్తగా నెట్టింది.
(తరువాయి భాగం వచ్చే సంచికలో)

No comments:

Post a Comment

Pages