నవయుగాది - అచ్చంగా తెలుగు
 నవయుగాది
దమయంతి 

రామయ్య గారు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకొని భార్య సీతమ్మ గారు ఇచ్చిన కాఫీని త్రాగి పేపర్ తెచ్చుకోడానికి వెళ్తారు. ఆ సమయానికే అదే వయస్సు ఉన్న ఇంకో ఇద్దరు స్నేహితులు కూడా కలుస్తారు. ముగ్గురు కలిసి వాకింగ్ పూర్తి చేసుకుని ప్రక్కనే వున్న పార్క్ లో కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకొని ఇళ్ల దారి పడుతారు. అది రోజువారీ వారి దినచర్య
ఆరోజు కూడ ఎప్పటిలానే మాట్లాడుతూ యింటిత్రోవ పట్టారు. మధ్యలో కూరగాయల మార్కెట్ లో వారికి కావలసిన కూరలు కొనుక్కోని ముగ్గురిలో మొదటి ఇల్లు రామయ్య దే కావటం వలన కాసేపు వాళ్ళింట్లోకూర్చొని సీతమ్మ గారు ఇచ్చిన కాఫీత్రాగి వెళ్ళారు.
రామయ్య గారు పురాణ పఠనం చేసుకుంటున్నారు. సీతమ్మ గారు కూడా వంటపని ముగించుకుని దేవుడి గదిలో కూర్చుని సుందరకాణ్డ పారాయణం చేసుకుంటున్నారు. పిల్లలు ఇద్దరు బయట దేశాల్లో నే ఉన్నారు.తల్లి దండ్రులను తమదగ్గరకు రమ్మన్న, పుట్టిన దేశం ఉన్న ఊరు వదిలి వెళ్ళటం ఇష్టం లేక ఇక్కడే అనందంగా కాలం గడుపుతున్నారు.ఇద్దరూ పురాణ పఠనం ముగించుకొని పన్నెండిటికి భోజనం చే సే అలవాటు. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు . రామయ్య గారు పప్పు కలుపుకుంటూ " దోసకాయ ఆవ నాకంచంలో వెయ్యలేదు. మర్చిపోయావా?"
అని అడిగారు. "అదేమిటి? ఎప్పుడు తెచ్చారు?
నాకివ్వందే!" అన్నారు సీతమ్మ." అదేమిటి? ప్రొద్దున వాకింగ్ వెళ్లి వచ్చే టప్పుడుతెచ్చాగా! ఎక్కడో పెట్టి మర్చిపోయుంటావు పోనీలే!రేపు చెయ్యి. ఈరోజు పచ్చడి అదేనేమో అని అడిగా!"
" అయ్యో రామా! మీరు తెస్తే ఎందుకు చెయ్యను. 
ఇన్నేళ్ళ కాపురం లో ఎప్పుడైనా మీరడుగుతే చెయ్యలేదా! మరీ చోద్యం కాకపోతే తేకుండానే నేను చెయ్య లేదంటారేమిటి? "మర్చిపోయుంటావు, పోనీలే. అన్నా గా. వదిలేయి." 
అన్న రామయ్య గారి మాటలకు కోపంవచ్చింది. సీతమ్మ గారికి." ఎంతసేపు నేను మర్చిపోయానని అనటమే కాని మీరు తేలేదని ఒప్పుకోరన్న మాట. పెళ్ళైనప్పటినుండి చూస్తున్న. అదే పంతం. అదే మొండితనం. ఏమిచేస్తా! సరే! మహాప్రభో! నేనే 
మర్చిపోయా! రేపు వెళ్లి నప్పుడు తెచ్చుకోండి. చేస్తాను." "పచ్చడి వద్దు. ఏమీ వద్దు." అని అప్పటి కే భోజనం ముగించుకున్న రామయ్య బయటికి వెళ్లి కూర్చున్నారు. కానీలే! ఈయనకు శాంతం ఎప్పుడుంది? ఇప్పుడు రావటానికి. వయస్సు మీద బడ్డా కోపాలకు ఏమీ తక్కువ లేదు. పచ్చడియేమో కానీ భోజనంచేసేటప్పుడు ప్రశాంతత లేకుండా పోయింది. సరిగ్గా రామయ్య గారు మనస్సు లో 
అదే అనుకుంటున్నారు. వయస్సు వస్తోందికదా! మర్చిపోయుంటుంది. అని అనుకోని పొద్దున సగం చదివి వదిలేసిన పేపర్ కోసం కుర్చీ పక్కన చూసుకుంటే చిన్న చేసంచి కనిపించి ఇదేమిటబ్బా! ఇక్కడ   పెట్టా! అని చూసుకుంటే దానిలో కూరగాయలు కన్పించాయి. అదేమిటి! నేను సంచీ సీతకు యివ్వ లేదా! అయ్యో రామ! నామతిమరుపు బంగారం గానూ! అని అనుకుంటూ సీతా! సీతా! కేకవేశారు. సీతమ్మ గారు చేతులు తుడుచుకుంటూ బయటకు వచ్చి "మళ్లీ యేమి మర్చిపోయానని చెప్పటాన్కిపిలిచారు.? మహాప్రభూ!" అన్నారు. అదికాదు. సీత నేనే మర్చిపోయా. కూరగాయల సంచి ఇక్కడే పెట్టా.నీ చేతికి ఇవ్వలేదు. అన్నారు రామయ్య."" అమ్మయ్య! అర్థం మైందా! ఇప్పటికైన మర్చిపోయిందేవరో! "సరేలేవోయి! సీతా! . ఒప్పుకున్నాగా. రాత్రి కి చేయ్యరాదు. పోనీ." అన్నారు రామయ్య. " ఏమిటీ! రాత్రి కి పచ్చడా! 
మరీఅంత జిహ్వ చాపల్యం యీవయస్సులో పనికిరాదు. రాత్రి పూట పచ్చడి తోటితింటే కడుపులో మండుతుంది. రేపు ప్రొద్దున చేస్తా. 
మర్చిపోయా! రేపు యుగాది కూడానూ. మార్కెట్ కివెళ్ళి మామిడికాయలు కూడతెండి. వేపపూత మన ప్రక్కింటి సరోజనడిగా. ఇస్తాఅన్నది. మీకు బొబ్బట్లుయిష్టం కదా! అవి చేస్తా. బెల్లం కూడ 
తెండి. సరే! నేను కాసేపు నడుంవాలుస్తా! నాలుగయితే పనిమనిషి వస్తుంది. " అని లోపలికి వెళ్తున్న భార్యనుచూసి పాపం! ఏనాడు నేను ఏపనిలోనూ సాహాయం చేయలేదు. తను అడగదు కూడా! ఎంతపనైనా ఒక్కతీ చేసుకుంటుంది. ఆమెకు కూడ వయస్సు మీదపడుతోందికదా! రేపటి నుంచి నేనుకూడ సాహాయం చేయ్యాలి  పచ్చడి ఏమో కాని నాకు జ్ఞానోదయమైంది అని అనుకుంటూ నిద్ర లోకి జారిపోయారు. 

అలా ఒకరికొకరు గా జీవనం సాగిస్తున్న ఆ దంపతులను చూసి ఆది దంపతులు సంతోషంగా ఆశీర్వచనం యిచ్చారన్నట్టు గా అప్పటి దాకా ఎండగా ఉన్న వాతావరణం చల్ల బడి సన్న చినుకులు మొదలయ్యాయి. 
పండగ రోజు తెల్లవారుజామునేలేచి రామయ్య దంపతులు కాలకృత్యాలు తీర్చుకొని మిత్రులతో కలిసి రామయ్య మార్కెట్ కి, సీతమ్మ వంట ఇంట్లోకి వెళ్ళారు. పండగ కాబట్టి మిత్రులందరు ఇంటిత్రోవ పట్టారు. రామయ్య కూడలోపలికి వచ్చి కాళ్లు చేతులు కడుగుకొని "చెప్పవోయి! నన్ను ఏమి చేయమంటావు"? అనిఅడిగిన భర్త ను చూసి సీతమ్మ నివ్వెర పోయింది. "ఏమిటీ! మీరా! పనా!". అన్నది.
"అవును. నేనే. చెప్పు." అన్న రామయ్య తో "మీరేమీ చేయవద్దు కాని అలా కూర్చుని కబుర్లుచెప్పండి. చాలు". అన్నది సీతమ్మ." ఇలా కాదు కానీ దేవుడి మందిరం శుభ్రం చేసావా? "అన్న రామయ్య కు లేదని చెప్పింది సీతమ్మ. నేను ఆ పనిచూస్తా. అని వెళ్ళారు. సీతమ్మ ఆశ్చర్యంగా భర్త వెళ్ళినవేపు మళ్లీ తనపని తాను చేసుకుంటూ
" నిన్న నే చిత్రపటాలు అన్నీతుడిచి పెట్టాను. కాస్తంత గంధం పెట్టి బొట్టు పెట్టండి. ఇదిగో! తుడుచుకోటాన్కి తుండుగుడ్డ ఇక్కడ పెడుతున్నాను. పంచెకి తుడవకండి." అని వంటగదిలోకి వెళ్లి పోయారు.
రామయ్య గారిది శ్రావ్యమైన కంఠం. ఆయన దేవుడికి బొట్లు పెడుతూ చక్కగా విష్ణు సహస్రం నామం చేస్తూవుంటే సీతమ్మ గారు కూడా గొంతుకలిపి తాను చే స్తున్నారు. సీతమ్మ కూడా తనపని ముగించుకుని నైవేద్యాలు పట్టుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి పూజలో కూర్చున్నారు.పూజాకార్యక్రమాలు ఐపోయి కాసేపు ముందు గదిలో కూర్చున్నారు ఇద్దరూ. "ఏమిటీ! ఎన్నడూ లేనిది ఈ రోజు మీ అంతట మీరే వచ్చి పూజ చేశారు! ఎప్పుడూ పూజంత ఐపోయినాక నేనుపిలుస్తే వచ్చి తీర్థం తీసుకునేవారు కదా!" 
అన్న సీతమ్మ ను చూసి "లేదు. సీతా! ఇన్ని ఏళ్లు
నీవైపు నుండి నేను ఏమీ ఆలోచించలేదు. సరే! బాధ్యతల తోటి బంధాల తోటి రోజులు ఏలా వెళ్ళాయో కూడా తెలీకుండా వెళ్ళిపోయాయి. అందరూ ఎవరి గూటిలో వారు సుఖంగా ఉన్నారు.మళ్లీ ఇద్దరం మన గూటిలో మిగిలాము. ఇప్పుడు ఈజీవితం ఎవరికి వారమే అన్నట్లు బ్రతుకుతే మన ఇన్ని యేళ్ల జీవితానికి అర్థం లేదు. ఎప్పుడూ నాకుఏదీకావాలో నీవు గ్రహించావు. కానీ నీవు ఏమిటీ అనేది నాకు తెలియదు. నీ రుచులు అభిరుచులు అసలు తెలియవు. మనయిద్దరికి పెళ్ళి అయ్యి యిన్నిఏళ్ళు గడచిన నీమనస్సు ఏమిటీ అనేదినేను ఎప్పుడూ గమనించలేదు. అదంతా నిన్న ఒకఅల లా నామనస్సును తట్టిలేపింది. ఇప్పటికైనా నాతీరు మార్చుకోకపోతే నాఅంతరాత్మ కు నేను సమాధానం చెప్పలేను. ఇప్పటినుండి మనంబ్రతుకుతున్న యీ శేషజీవితం ఒకరికొకరు ఓదార్పు గా బ్రతుకుదాము. నీవు ఇన్నేళ్ళు నాకు అలాగే ఉన్నావు. నేను కూడ అలాగే వుంటా సీతా!. అప్పుడే మనకు ముడిపడ్డ వివాహబంధాన్కి ఒక నిండుతనం. పరిపూర్ణత వస్తాయి. " అలాచెప్తున్న భర్త ను చూసి ఆమె కళ్ళ లో ఆనందబాష్పాలతో నిండాయి. " మీరు కూడ ఇంత లోతుగా ఆలోచిస్తారా? దోసావ ఘాటు కాబోలు!" అని నిండుగానవ్వుతున్న భార్య భుజం చుట్టూ చేయివేసి" ఇకపదవోయీ! ఆత్మారాముడు గొడవచేస్తున్నాడు. అందిట్లో దోసావఘాటు నిలవ నీయటంలేదు. పద పద ". అని భోజనాలు మొదలుపెట్టారు." ఇదిగో మహాప్రభూ! మీకిష్ట మైన దోసావ. ఇది మాములు ఆవ కాదు. జ్ఞానోదయం కలిగించిన దోసావ. రుచికేకాదు. బుధ్ధి కికూడ ఘాటే నండోయ్." అని నవ్వుతున్న భార్యతో ఆయన పకపక నవ్వేశాడు. వారి నవ్వులతో యుగాది కిక్రొత్త అందాలు వచ్చాయి. వారి నవ్వులకు లయగా టివి లో"ఆడుతు పాడుతూ పనిచేస్తుంటే "అనే పాటవస్తోంది. 
ఆకాలపు జంటలు భేదాభిప్రాయాలు వచ్చినా సర్దుకొనిపోయి వివాహబంధాన్కి ఒక గౌరవం ఇచ్చారు. ఈకాలపు యువతరం చిన్న చిన్న గొడవలకే అవలీలగా ఆ బంధాలను తెంచుకుంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో నే మనపధ్ధతులు బాగున్నాయని ఆచరిస్తుంటే మనం వాటిని కాలరాసి ఎండమావులకోసంపరిగెత్తుతున్నాము. ఆమార్గం ఎప్పుడూ శ్రేయస్సు కాదు. ఒడుదుడుకులు వచ్చిన రామయ్య గారి జంట లా సర్దుకొనిపోయి అందరూ సుఖశాంతులతో జీవనయానం సాగించాలి.
"సర్వేజనా సుఖినోభవంతు"
***


No comments:

Post a Comment

Pages