ప్రముఖ సితార్ వాయిద్యకారుడు పండిట్ రవి శంకర్ - అచ్చంగా తెలుగు

ప్రముఖ సితార్ వాయిద్యకారుడు పండిట్ రవి శంకర్

Share This
ప్రముఖ సితార్ వాయిద్యకారుడు పండిట్ రవి శంకర్
అంబడిపూడి శ్యామసుందర రావు



పండిట్ రవి శంకర్ ఏప్రిల్ 7, 1920 లో బెనారస్ లో ఒక బెంగాలీ కుటుంబములో ఏడుగురి సంతానంలో చిన్నవాడుగా జన్మించాడు. తండ్రి శ్యామ్ శంకర్ చౌదరి మధ్య తరగతి టెంపుల్ బారిస్టర్ మరియు ఈస్ట్ బెంగాల్ నుండి వచ్చిన ఒక స్కాలర్. ఆయన ఒక లాయర్ మాత్రమే కాకుండా రాజకీయవేత్తగా ప్రముఖుడిగా గౌరవ మర్యాదలు పొందేవాడు. 


ఆయన చాలా  కాలము రాజస్థాన్ లోని ఝాలావర్ సంస్థానానికి దీవాన్ గా పనిచేశాడు. ఈయన హేమాంగిని దేవిని వివాహమాడాడు ఈయన లాయర్ గా లండన్ లో కూడా పనిచేశాడు. అప్పుడే రెండవ వివాహము కూడా చేసుకున్నాడు. ఈయన లండన్ లో ఉండగానే రవి శంకర్ జన్మించాడు రవి శంకర్ కు ఎనిమిది ఏళ్ల వయస్సు వచ్చేవరకు అయన తన తండ్రిని కలవలేదు.

నిజానికి రవి శంకర్ అసలు పేరు రవీంద్ర శంకర్ కానీ రవీంద్ర పేరును రవిగా కుదించి రవి శంకర్ గా పేరు మార్చుకున్నాడు. రవి శంకర్ కు ఐదుగురు సోదరులు వీరిలొ ప్రముఖ నాట్యాచార్యుడు ఉదయ్ శంకర్ కూడా ఉన్నాడు. వీరు కాకుండా రాజేంద్ర, దేబేంద్ర, భూపేంద్ర మిగిలిన సోదరులు రవి శంకర్ బెనారస్ లోని బెంగాలి తోలా హైస్కూల్ లో చదువుకున్నాడు.


పదేళ్ల వయస్సు వరకు బెనారస్ లో గడిపిన రవి శంకర్ తన సోదరుడు నృత్య దర్శకుడు అయిన  ఉదయ్ శంకర్  డ్యాన్స్ గ్రూప్ తో పారీస్ వెళ్ళాడు. 13 ఏళ్ల  వయస్సుకు రవి శంకర్ ఆ గ్రూప్ లో సభ్యుడిగా చేరి వారితో ప్రదర్శనలలో పాల్గొంటూ వివిధ రకాల నృత్య రీతులను భారతీయ సంగీత పరికరాలను వాయించటం నేర్చుకున్నాడు.


 1930 ప్రాంతాన ఉదయ్ శంకర్ ట్రూప్ యూరోప్ అమెరికాలలో విస్తృతముగా పర్యటించింది. ఆ సమయములోనే రవి శంకర్  ఫ్రెంచ్ భాషను నేర్చుకొని పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకొని, పాశ్చాత్య రీతులతో పరిచయము పెంచుకున్నాడు. డిశంబర్ 1934 లోరవిశంకర్  మైహార్ సంస్థానం లోని ప్రముఖ సంగీత విద్వాంసుడు అల్లావుద్దీన్ ఖాన్ కచ్చేరిని కలకత్తా లో విన్నాడు. రవిశంకర్ సోదరుడు ఉదయ్ మైహార్ సంస్థానాధీశుడు అయిన మహారాజ బ్రిజనాధ్ సింగ్ జూదేవ్ ను ఒప్పించి అల్లావుద్దీన్ ఖాన్ ను తన గ్రూపులో సభ్యుడిగా చేర్చుకొని ప్రాన్స్ పర్యటనకు వెళ్లారు.ఖాన్ రవిశంకర్ కు మంచి సంగీత విద్వాంసుడు అవటానికి కావలసిన తర్ఫీదు ఇస్తానన్నాడు. కానీ ఒక షరతు మీద...


 అది ఏమిటి అంటే ఈ టూర్ లు మాని తనపాటు మైహార్ రావాలి అని చెప్పాడు. రవిశంకర్ యూరోప్ పర్యటన నుండి తిరిగి వచ్చేనాటికి  అయన తల్లిదండ్రులు మరణించారు. అప్పటికే రెండవప్రపంచయుద్ధము కారణముగా మారిన రాజకీయ పరిస్తుతుల వల్ల యాత్రలు అపి నృత్యానికి ఫుల్ స్టాప్ పెట్టి మైహర్ చేరి ఖాన్ వద్ద ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ పూర్తిగా గురుకుల వ్యవస్థ పద్దతిలో శిష్యరికం చేసి నేర్చుకోవటం ప్రారంభించాడు.

ఖాన్ కూడా రవిశంకర్ కు కఠినమైన శిక్షణ సితార్ మరియు సర్బహర్ లలో ఇచ్చాడు. రవిశంకర్ ఖాన్ వద్ద రాగాలు,ద్రుపద్,ధమార్ ఖయాల్,వంటి  వివిధ సంగీత పద్దతులను వివిధ వాయిద్యాలపై రుద్ర  వీణ, రుబాబ్ మరియు సూర్ సింగర్ వాయించటంలో మెల కువలను నేర్చుకున్నాడు. డిశంబర్ 1939లో రవిశంకర్ స్వయముగా సితార్ కచేరి ఇచ్చే స్థాయికి ఎదిగాడు మరో ప్రముఖ సరోద్ విద్వాంసుడు అలీ అక్బర్ ఖాన్ తో జుగల్ బంది లో పాల్గొన్నాడు.


ఆవిధముగా 1944 కల్లా తన ట్రైనింగ్ ను పూర్తిచేసుకొని ముంబయ్ చేరి అక్కడ ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోషియేషన్ వారికి వారి నృత్య ప్రదర్శనలకు సంగీతాన్ని సమ కూర్చే వాడు రవిశంకర్" సారే జహ సి అచ్చా " అనే దేశ భక్తి గీతానికి సంగీతాన్ని రికంపోజ్ చేసాడు. 25 ఏళ్ల  వయస్సుకే HMV కంపెనీకి సంగీతాన్ని సమకూర్చేవాడు. ఆల్   ఇండియా రేడియోకు సంగీత దర్శకుడిగా 49 నుండి 56 వరకు న్యూ ఢిల్లీలో పని చేశాడు రవిశంకర్ AIR లో ఇండియన్ నేషనల్ ఆర్కెస్ట్రా ను ప్రారంభించి పాశ్చాత్య భారతీయ సంగీత వాయిద్యాలతో అనేక ప్రయోగాలు చేసాడు.


1950 ప్రాంతములో సత్యజిత్ రే సినిమా లకు సంగీత దర్శకత్వము చేసాడు. అలాగే గోదాన్ ,అనురాధ వంటి హిందీ సినిమాలకు కుడా సంగీతాన్ని అందించాడు. అప్పటి AIR డైరెక్టర్ అయిన  నారాయణ మీనన్ 1952లో భారత దేశానికీ మొదటిసారిగా వచ్చిన  పాశ్చాత్య ప్రముఖ వయొలినిస్టు యెహూది మెనుహిన్ కు రవిశంకర్ ను పరిచయము చేసాడు.అయన రవిశంకర్ ప్రతిభకు సంతోష పడి తనతో పాటు న్యూ యార్క్ వచ్చి భారతీయ శాస్తీయ సంగీతాన్ని ప్రదర్శించవలసినదిగా ఆహ్వానించాడు ఆ విధముగా వీరిద్దరి స్నేహ బంధము సంగీతములో అత్యుత్తమ గ్రామీ అవార్దులు రెండు సంపాదించి పెట్టింది. ఈ విధమైన పాశ్చాత్య సంగీత సాధనలో అయన ఎంతమందినో ఆభిమానులుగా చేసుకున్నాడు వారిలో జార్జ్ హ్యారీసన్ అనే ప్రముఖుడు రవిశంకర్ ను తనకు సితార్ నేర్ప వలసినదిగా కోరాడు.


1958లో పారిస్ లో ఐక్యరాజ్య సమితి వారి యునెస్కో ఆధ్వర్యములో జరిగే ఐక్యరాజ్య సమితి పదవ వార్షికోత్సవ సభలో రవిశంకర్ పాల్గొని తన సితార్ కచేరీని అందించాడు 1961 నుండి రవిశంకర్ యూరోప్ అమెరికా ఆస్ట్రేలియా వంటి దేశాలలో పర్యటించి తన సంగీతముతో  అక్కడి ప్రజలను మంత్రం ముగ్దులుగా చేసాడు. భారతీయ భాష కానీ సినిమాలకు సంగీత దర్శకత్వము వహించిన మొట్టమొదటి భారతీయుడిగా రవిశంకర్ చరిత్ర సృష్టించాడు 1962లో రవిశంకర్ ముంబాయ్ లో కిన్నెరా స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ను ప్రారంభించాడు. 1970ల క్యాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ లో ఇండియన్ మ్యూజిక్ విభాగానికి హెడ్ గా ఉన్నాడు. ఆ సందర్భములోనే ఇతర ప్రముఖ విద్యాసంస్థలలో గెస్ట్ లెక్చరర్ గా పనిచేశాడు పాశ్చాత్య దేశాలతో సంగీతముతో అంత  అనుబంధాన్ని కలిగి ఉన్నప్పటికీ రవిశంకర్ పాశ్చాత దేశాలలోని హిప్పీ సంస్కృతికి, మాదక ద్రవ్యాల సంస్కృతికి దూరముగా ఉన్నాడు.


ఈవిధముగా విశాంతి లేకుండా దేశ విదేశాల పర్యటనలు సంగీత కచేరీలు వలన రవిశంకర్ ఆరోగ్యము దెబ్బతింది. 1974లో చికాగోలో ఉన్నప్పుడు హార్ట్ ఎటాక్ కు గురి అయినాడు . దీని ఫలితముగా తన పర్యటనలో కొంత భాగము మిస్ అయినాడు. ఆ మిస్ అయిన  భాగము వైట్ హవుస్ లో అమెరికా ప్రెసిడెంట్ కొడుకు జాన్ గార్డెనర్ ఫోర్డ్ ఆహ్వానము మీద ఏర్పాటు అయిన  కచేరి. 1980లో తన రెండవ కన్సార్టో ను జుబిన్ మెహతా ఆధ్వర్యములో విడుదల చేశాడు 1982లో రవిశంకర్ కు అకాడమీ అవార్డు గాంధీ సినిమాకు గాను లభించింది. ఈ విధముగా సంగీతములో అయన పొందని గౌరవాలు అధిరోహించని శిఖరాలు లేవు ప్రపంచవ్యాప్తముగా సితారకు మారు పేరు రవిశంకర్ గా ప్రపంచ ప్రఖ్యాతి సాధించాడు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ రవిశంకర్ ను రాజ్య సభ సభ్యుడిగా నామినేట్ చేశాడు ఆ విధముగా 12 మే 86 నుండి 11 మే 92 వరకు రాజ్య సభ సభ్యుడిగా కొనసాగేడు ఇది ఒక కళాకారునికి దక్కిన గౌరవము.


2012 లో రవిశంకర్ గతించినప్పటికీ అయన సంగీత వారసత్వము ఆయన ఇద్దరు కూతుళ్లు అనౌష్క శంకర్ మరియు నోరాహ్ జోన్స్ ద్వారా కొనసాగుతూనే వుంది. ఈ విధముగా పండిట్ రవి శంకర్ సంగీత ప్రపంచములో జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి గడించి సితార వాయిద్యములో ఎనలేని కీరి గడించి దేశ ప్రతిష్టను పెంచిన  మహానుభావుడు రవిశంకర్.
***

No comments:

Post a Comment

Pages