శివం - 59
(శివుడే చెబుతున్న కథలు)
రాజ కార్తీక్
హర సిద్దుని కథ
ఇంత సకల చరాచర సృష్ఠి నమూనా ఇదే మహాశివ
ఉన్నది ఏమైనా అది ఒక్కటే అదే శివ శివ శివ "
అంటూ శివ లింగాన్ని చెక్కుతూ, దాన్ని పూర్తి చేసి ఆనందంగా పాడుతూ ఉన్నాడు హరసిద్దుడు.
హర సిద్ధుడు శిల్పి ..తనకున్న శిల్ప కళతో రాయిని కూడా జీవం ఉట్టిపడే విధంగా చేయ గలిగిన సిద్ధ హస్తుడు ..అలా ఎన్నో దేవాలయాలను చెక్కి, ఎన్నో ప్రతిమలను రూపొందించి, అందరి దగ్గరా మంచి పేరు తెచ్చుకున్నాడు.
"నాది ఏముంది. మనిషి మనిషికి మహాదేవుడు ఒక విద్య ఇస్తాడు. అందరికీ ఉంది అవే చేతులు, అవే కళ్ళు, అవే కాళ్ళు ...కానీ ఆయన అనుగ్రహం కలిగినట్లు వారొక్కొక్కరికి ఒక్కో విధమైన బ్రతుకు తెరువు "అంటూ తన శిల్పకళ గురించి చెప్తున్నాడు.
కానీ హర సిద్ధుడు లౌక్యం తెలియని వాడు. తన ముక్కు సూటి వ్యవహారంతో అందరికీ మంచివిద్య కలిగిన ఎదురువాదిగా పేరు తెచ్చుకున్నా డు.
ఎవరయినా ప్రేమగా మాట్లాడితే, వారికి అంతే చక్కనివాడు. కానీ అన్ని ఆస్తులు దాన ధర్మాలు చేత పోవటం వల్ల, పేదవాడిగా ఉండి పోయాడు. యదార్థ వాది లోక విరోధి... అనే మాట ఇతనికి సరిగ్గా అతుకు తుంది. తనతో ఎవరయినా చర్చలోకి వస్తే వారికి నిజాన్ని, వారు చేసిన తప్పులను మొహం మీద చెప్పేవాడు. దానికి సమాధానం చెప్పలేక వారు హర సిద్దుడ్ని ఒక వితండవాదిగా ముద్ర వేశారు. ఏదైనా జగడం అయితే, హర సిద్దుని ప్రతాపం చూడాలి.
అప్పటి కప్పుడు కోపం తెచ్చుకునే హరసిద్ధుడి మనసు మాత్రం వెన్న . తనకున్న అనుభవంతో మంచి చెడూ కలిగిన మనుషులను వెంటనే తెలుసుకునే వాడు. ఉన్నతమైన వ్యక్తిత్వంతో అందరికీ చేతనైన సాయం చేసేవాడు. సాయం పొందిన వారు 'నువ్వు మాకు చేసింది ఏముంది?'అని గట్టిగా అన్న వారికి ఏదోలా బుద్ది వచ్చే లాగా చేద్దాం అనుకుని కూడా, మళ్లీ నిదానంగా స్థిమిత పడేవాడు. ఇలా ముక్కు సూటి తనం వల్ల ఇంట్లో కూడా హర సిద్దునికి జగడమే. 'పేదవాడి ఆత్మాభిమానం, పొగరు, పేదవాడి హాస్యం, చులకన అవుతాయి' అని తన తల్లి చెప్పినా, సహజంగా తను మనుషులను నమ్మేవాడు కావున అవి అలా జరిగిపోతాయి. తన కున్న దీక్ష ఎదుట వారికి కూడా ఉండటం ఎలా కుదురు తుంది? అని తెల్సుకో లేకపోయాడు. ఎవరయినా తన దగ్గర అతిగా ప్రవర్తిస్తే వారికి ,'మీరు మాకు చేసింది ఏమి లేదు మీ నీతులు ఆపి మీ పని చల్లగా చేసుకొని పొండి', అని గదిమే వాడు. తనకు కళ్యాణం కాలేదు అని బాధ లోపల ఉంది తన తల్లికి.
ఒకరోజు ఆ శిల్పం దగ్గర ఒకతను, 'ఏమయ్యా ఆ రాయిని నువ్వు అటూ ఇటూ చెక్కి, ఏంది నువ్వు చేసిన గొప్ప పని?' అన్నాడు. ఆ మాటకు హరసిద్దుడు "పిచ్చి ప్రేలాపనలు చేస్తే అవయవాలు సరిగ్గా పని చేయవు. ముందు చెప్పిన పైకం ఇచ్చి, తీసుకుని పో "అనే సరికి అతను పలాయనం చిత్తగించాడు.
అదే హర సిద్దుడు, "చూడు తాతా! నువ్వు నాకొక శివ లింగం చేసి పెట్టమన్నవ్ కదా! నీ కోసం చేసా!' అని ఉచితంగా ఇచ్చాడు.
తాత "ఒరేయ్ హర సిద్ధా! నీ మనసు లాగే ఈ శివయ్య కూడా తళతళ లాడిపోతున్నాడు," అన్నాడు ఆ శివలింగం మీద ఉన్న మట్టి తుడుస్తూ.
హర సిద్ధుడితో తాత ఇలా అన్నాడు, 'ఒరేయ్ హర సిద్ధ! కొంచెం మంచిగా లౌక్యం నేర్చుకో రా! ఇంత మంచి మనసు, మట్టి కమ్మినట్టే అయి పోతుంది." అన్నాడు.
ఆ మాటకు చెప్పాల్సిన వేదాంతం అంతా చెప్పాడు హర సిద్ధుడు.
కానీ ఆ తాతకి తనకు హర సిద్దుడితో ఒక అనుభవం గుర్తుకు వచ్చింది.
ఆ తాత శిల్ప కళను చూసి ఎంతో ఆనంద పడే రస పిపాసి. కానీ ఆ తాత ఏదో కొంచెం నడవ గలడు కానీ అక్కడ ఉన్న దేవాలయాలను చూడలేదు. ఎందుకంటే నడిచి చూడ లేడు కాబట్టి! హర సిద్ధునికి చెప్పుకున్నాడు తన బాధను. ఉయాల లాగ ఒక ఆసనం ఏర్పాటు చేసి, ఆ తాత వద్దన్నా ఎక్కించుకొని, ఆ దేవాలయం అంతా తిప్పి, అణువు అణువు ఆ తాతకు చూపించి, ఆ తాతను ఎంతో ఆనందింప చేశాడు. అప్పుడు ఆయన అడిగినందుకు శివ లింగాన్ని చేసి ఇచ్చాడు.
తన కోరిక తీర్చిన హర సిద్దుడంటే ఆ తాత కు ఎంతో ప్రేమ. 'ఇలా ఒకటా రెండా ఎన్నో మంచి పనులు చేసినా, నీ నిఖార్సయిన వైఖరితో ఇబ్బంది పడుతున్నావు రా,' అంటూ ఉండేవాడు తాత.
హర సిద్దుడి మనసు అందరూ అర్దం చేసుకోలేక పోయారని ఆవేదన పడేవాడు తాత.
అటుగా పోతున్న వాడు హర సిద్దుడు ఏమి చేస్తున్నాడోనని చూడగా, ఒక గుడ్డి వాడికి, స్పర్స చేత అక్కడ ఉన్న ప్రతి విగ్రహాన్ని అనుభూతి పొందే లాగ చేస్తున్నాడు.
ఆ గుడ్డివాడు " ఆ దేవుడు నాకు కనులు ఇస్తే, ఎంతో బాగుండేది. ఇంత గొప్ప శిల్పకళా సంపదను చూసి తరించాలి. ఆ కళ గొప్పతనం తెలిసిన వాడే, ఆ కళ నైపుణ్యం చూసి తాదాత్మ్యం చెందుతాడు. కళ్ళు లేని నాకే ఇలా ఉంటే, ఉన్నవాళ్లు ఎంత బాగా ఆనందపడతారు .." అన్నాడు.
హర సిద్దుడు కేవలం తనే చెక్కిన శిల్పాలు కాకుండా అన్నీ చూపించే వాడు ఆ గుడ్డివాడికి.
గుడ్డివాడు "దేవుడు మనుషులను తయారు చేశాడు. కానీ నువ్వు ఆ దేవుళ్ళను తయారు చేస్తున్నావు బాబు! నిత్యం శివ పూజ చేసే నిన్ను ఆ శివుడు ఎల్లప్పుడు కనిపెట్టుకొని ఉంటాడు "అని ఆశీర్వదించాడు.
"అవును. ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉంటాను. ఆ హర సిద్దునికి, నాకు జరిగిన కథ, అతని కోసం నేను ఏమి చేశానో, ఆ వివరాలు ఈసారి చెప్తాను..
(మిగతాది వచ్చే నెల)
No comments:
Post a Comment