స్వేచ్ఛ
- శ్రీశేషకళ్యాణి గుండమరాజు
"నా మాట విని అన్నం తినమ్మా! నా చిట్టి తల్లివి కదూ!", అంటూ తన ఎనిమిదేళ్ల కూతురు శివారాధ్యను బతిమలాడుతూదగ్గరకు తీసుకునే ప్రయత్నం చేశాడు అప్పుడే ఆఫీస్ నుంచీ వచ్చిన శ్రీకంఠ.
"నేనడిగింది ఇవాళ కూడా నువ్వు ఎందుకు తీసుకురాలేదూ? నేనన్నం తినను!", అంటూ శ్రీకంఠని దూరంగా తోసింది శివారాధ్య.
"ఎల్లుండి నీ పుట్టినరోజు కదా? నువ్వడిగినది నేను నీ పుట్టినరోజు కానుకగా తీసుకొద్దామని అనుకుంటున్నానమ్మా. నువ్విలా నామీద అలిగి అన్నం మానేస్తే ఎలా? అన్నం తిని త్వరగా పడుకో. మళ్ళీ పొద్దున్నే లేచి బడికెళ్ళాలి", అంటూ శివారాధ్యను బుజ్జగించాడు శ్రీకంఠ.
"నువ్విలాగే అంటూ ఉంటావ్. కానీ ఎన్ని రోజులైనా నేనుఅడిగినది మాత్రం తీసుకురావు. అసలు నాతో మాట్లాడకు", అంది శివారాధ్య ఏడుపు గొంతుతో.
తండ్రి వంక కాకుండా ఇంకెటో చూస్తూ శివారాధ్య ముద్దుగా అన్న ఆ మాటలు విన్న శ్రీకంఠ,"సరే బంగారం! నువ్వడిగినది రేపు నీ చేతుల్లో ఉంటుంది. సరేనా? ఇకనైనా అన్నం తిందాం రా. నాకు చాలా ఆకలేస్తోంది", అన్నాడు.
"నిజంగా తెస్తావా?", అడిగింది శివారాధ్య.
ఎర్రబడిన శివారాధ్య లేత బుగ్గలపైనున్న కన్నీళ్లను తుడుస్తూ, "ఓ! తప్పకుండా!ఈసారిమాటతప్పను!",అన్నాడు శ్రీకంఠ.
తండ్రి చెయ్యి పట్టుకుని ఎక్కిళ్ళు పెడుతూ డైనింగ్రూంలోకివచ్చింది శివారాధ్య.
"ఏమిటీ? మళ్ళీ పావురం గురించేనా దాని అలక?", శ్రీకంఠను అడిగింది శివారాధ్య తల్లి చిత్కళ.
"అవును", అన్నాడు శ్రీకంఠ.
"మొత్తానికి మిమ్మల్ని ఒప్పించిందన్నమాట", అంది చిత్కళ.
"ఒప్పుకోక తప్పుతుందా? అయినా మనకు పదిమంది పిల్లలు లేరు కదా! ఉన్నది ఒక్కగానొక్కత్తి. దాని పుట్టినరోజు నాడు అది మూతి ముడుచుకుని కూర్చుంటే నేను అస్సలు చూడలేను", అన్నాడు శ్రీకంఠ.
"సరే. మీ ఇష్టం", అంది చిత్కళ.
అమ్మానాన్నలిద్దరూ తాను అడిగినదానికి ఒప్పుకోవడంతో శివారాధ్య కోపం పూర్తిగా తగ్గిపోయింది.రాత్రి భోజనం ముగించి పడుకున్నారందరూ.
మరుసటిరోజు తెల్లవారుతూనే శివారాధ్య తండ్రి వద్దకు వెళ్లి, "ఇవాళ నేనడిగిన పావురం తెస్తావు కదూ? నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను", అంది.
"అలాగే బంగారం! ఇవాళ పావురాన్ని తీసుకుని ఆఫీస్ నుండీ త్వరగా వచ్చేందుకు ప్రయత్నిస్తాను. నువ్వు బడికెళ్ళొచ్చి నీ హోంవర్క్ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండు", అన్నాడు శ్రీకంఠ.
శివారాధ్య హుషారుగా తయారయ్యి బడికెళ్ళిపోయింది.
ఆఫీస్ కి బయలుదేరుతున్న శ్రీకంఠతో చిత్కళ,"శివారాధ్యకు పావురం తెస్తానని మాటిచ్చారు. బానే ఉంది. కానీ ఎక్కడినుంచీ తెస్తారు?", అని అడిగింది.
"ఏముందీ? నీకు తెలుసుగా! మా ఆఫీస్ పదో ఫ్లోర్ లో ఉంటుంది కదా! ప్రతిరోజూనా పక్కనున్న కిటికీలోకి బోలెడన్ని పావురాలు వచ్చి వాలుతుంటాయి. ఆ విషయం ఒకసారి శివారాధ్యతో చెప్పాను. అప్పటినుంచీ పావురం తెమ్మని గొడవ పెడుతోంది.మా ప్యూన్ రాములుకు చెప్తే ఇట్టే పట్టుకుంటాడు ఒకపావురాన్ని. నాతో పని చేసే వాళ్ళు ఒకళ్ళిద్దరు అలా తీసుకెళ్ళారుకూడా. శివారాధ్య కి మాటిచ్చాను కాబట్టి ఇవాళ వచ్చేటప్పుడు ఒక పావురం పట్టుకొస్తాను. కొద్ది రోజులు సరదాగా పెంచుకుంటుంది", అని చెప్పి ఆఫీసుకి వెళ్ళిపోయాడు శ్రీకంఠ.
బడినుండీ ఇంటికొస్తూనే హోంవర్క్ పూర్తిచేసేసుకుని ఎంతో ఉత్సాహంగా తన తండ్రి కోసం ఎదురు చూడటం మొదలు పెట్టింది శివారాధ్య. చెప్పినట్టుగానే శ్రీకంఠ ఆఫీస్ నుండీ త్వరగా రావడమేకాక తనతోపాటూ ఒక పావురాన్ని కూడా పంజరంలో పెట్టి పట్టుకొచ్చాడు. శివారాధ్య ఇంటిగుమ్మం దగ్గర తండ్రి చేతిలో ఉన్న పావురాన్ని చూసి ఆనందంతో చప్పట్లు చరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి పంజరాన్ని తన చేతుల్లోకి ఎంతో మురిపెంగా తీసుకుంది. తనఆనందానికిఅవధుల్లేవు.
పావురాన్ని ముద్దు చేస్తూ దానితో కబుర్లు చెప్పడం మొదలు పెట్టిందిశివారాధ్య. పావురం మాత్రం తెగ భయపడిపోతూ ఉండేసరికి, "ఏమిటీ? ఈ పావురం నాతో ఆడట్లేదూ?", అంటూ శ్రీకంఠ దగ్గరకు వెళ్ళింది.
"ఇప్పుడేగా తెచ్చా! ఇంకా నీకు అది అలవాటు పడలేదు. నువ్వు దానికి కొంచెం ఆహారం పెడితే అది నీతో ఆడుతుందనుకుంటా. పావురాలు ఎంతో ఇష్టంగా తినే గింజలు పట్టుకొచ్చాను. అవి పెట్టి చూడు", అన్నాడు శ్రీకంఠ.
"కొద్దిగా నీళ్లు కూడా పెట్టు", అంది చిత్కళ.
శివారాధ్య వెంటనే ఒక చిన్న గిన్నెలో గింజలూ, ఇంకో చిన్న గిన్నెలో నీళ్ళుతెచ్చి పావురమున్న పంజరం తలుపు తెరిచి అందులో చాలా జాగ్రత్తగా పెట్టి, "ఊఁ! హాయిగా బొజ్జ నిండా తిను. మనము ఎంచక్కా ఆడుకుందాం", అంది. పావురం పంజరంలో భయంగా ఒక మూలకు నక్కి కూర్చుంది. శివారాధ్య ఎంత ప్రయత్నించినా ఆ పావురం గింజల దగ్గరకు రాలేదు. ‘దీనికి ఆకలిగా లేదేమో ‘, అనుకుంది శివారాధ్య.
ఆ సాయంత్రమంతా శివారాధ్య పావురంతోనే గడిపింది. దాని భయం పోగొట్టేందుకు ఎన్నో విధాలుగాప్రయత్నించింది. కానీ అవేవీ ఫలించలేదు. కొద్దిపాటి నిరాశతో రాత్రి పడుకునే ముందు తల్లి పక్కన చేరి, "అమ్మా! నేనెంత జాగ్రత్తగా చూసుకుంటున్నా ఆ పావురం నా దగ్గరికెందుకు రావట్లేదూ? దాని భయం ఎంతకీ పోవట్లేదేంటి? ", అని అడిగింది.
అందుకు చిత్కళ, "పక్షులు బయట స్వేచ్ఛగా బతికే ప్రాణులు. వాటిని బంధిస్తే అవి ఒత్తిడికి గురయ్యి ఆహారం మానెయ్యడం వంటివి చేస్తాయి. అయినా ఇవాళేగా నీ దగ్గరకొచ్చిందీ! అలవాటు పడుతుందిలే. త్వరగా పడుకో. అసలే రేపు నీ పుట్టినరోజు", అని దుప్పటి కప్పి మెల్లిగా చిచ్చు కొట్టడం మొదలుపెట్టింది.
ఇక శివారాధ్యకు నిద్ర పడుతోందనగా ఎక్కడినుండో ఒక పెద్దపక్షి పడక గది కిటికీ పగలగొట్టుకుని లోపలికివచ్చింది. ఏంజరుగుతోందో చిత్కళ గ్రహించేలోపే శివారాధ్యను ఆపక్షితన కాళ్లతో సున్నితంగాపట్టుకుని కిటికీలోంచీబయటకొచ్చిఆకాశంలోఎగురుకుంటూ చాలా దూరానికి వెళ్లి ఒక ఎతైన చెట్టుపైనున్న తన గూట్లో పెట్టింది.
శివారాధ్య భయంతో బిగుసుకుపోయింది. ఆ పెద్ద పక్షి ఏవో రకరకాల శబ్దాలు చేస్తూ ఆ గూట్లో ఉన్న చిన్న పక్షులను దగ్గరకు పిలిచింది. ఆ చిన్న పక్షులు పెద్ద పక్షి పిల్లలల్లే ఉన్నాయి. శివారాధ్య చుట్టూ ఆ పక్షులన్నీ చేరాయి. శివారాధ్యకు నోట మాట రాలేదు. పెద్దపక్షి మెల్లిగా వెనక్కి అడుగులు వేస్తూ గూడు బయటకెళ్ళిఎటోఎగిరింది. పిల్లపక్షులు శివారాధ్యను వాటి ముక్కులతో ముట్టుకునే ప్రయత్నం చేస్తూ దగ్గరకు వచ్చాయి.శివారాధ్య కెవ్వున అరిచింది.
పిల్లపక్షులు కాస్త దూరంగా జరిగాయి. అంతలో పెద్దపక్షి తన నోటితో బోలెడంత మెత్తటి దూదిని పట్టుకొచ్చి పరుపులాగా పేర్చి శివారాధ్యను దానిపై కూర్చోపెట్టింది. పరుపు చాలా మెత్తగా ఉన్నా ఆ సుఖం ఏమాత్రం తెలియట్లేదు శివారాధ్యకు. తనను ఆ పక్షులు ఏం చెయ్యబోతున్నాయోనని ఏడుపు ఆపుకుంటూ వాటివంక చూస్తూ ఉంది శివారాధ్య. ఇంకొద్ది సేపాగిన తరువాత పెద్దపక్షి మళ్ళీ ఎటో వెళ్లి శివారాధ్యకు ఎంతో ఇష్టమైన జామ పళ్ళు తీసుకొచ్చింది. అసలే ఆకలి మీద ఉన్న శివారాధ్యకు ఆ జామ పళ్ళ తియ్యటి సువాసన తగలగానే వెంటనే తినాలని అనిపించింది. అది గమనించిన పెద్ద పక్షి చటుక్కున ఒక పండు తనముక్కుతో పట్టుకుని శివారాధ్య వైపు రెండడుగులు వేసింది.
పెద్ద పక్షి దగ్గరకు వచ్చే కొద్దీ శివారాధ్య గుండె భయంతో మరింత వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. కళ్ళు గట్టిగా మూసుకుని తన చేతులతో ముఖం కప్పుకుని, "నన్ను మా అమ్మానాన్నల దగ్గర దింపు. ప్లీజ్!", అంటూ గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది.
అంతలో, "చిట్టి తల్లీ..!తెల్లారిందిలేస్తావా?", అంటూ శ్రీకంఠ గొంతు వినబడింది శివారాధ్యకు. కళ్ళు తెరిచి,‘ఓహ్! ఇందాకటిది నాకొచ్చిన కలా?’, అని అనుకుంటూ తండ్రి మెడచుట్టూచేతులు వేసి గట్టిగా హత్తుకుంది.
"నా బంగారు తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు!", అన్నాడు శ్రీకంఠ. చిత్కళ కూడా శివారాధ్యను ముద్దు పెట్టుకుని శుభాకాంక్షలు చెప్పింది.
శివారాధ్య మంచం దిగుతూనే పావురం ఉన్న పంజరం దగ్గరకు వెళ్ళింది. పావురం ఇంకా భయపడుతూపంజరంలో ఒక మూలకు నక్కి కూర్చుని ఉంది.గిన్నెలో పెట్టినగింజలలో ఒక్కటి కూడా తినలేదు. శివారాధ్య పంజరాన్ని తీసుకుని,"నీకేమికావాలోనాకుతెలుసు!",అనిపావురంతోఅంటూగబగబా వాళ్ళ ఇంటి మేడ మీదకు వెళ్ళింది. ఏమిటా విషయమని ఆలోచిస్తూ శివారాధ్యను అనుసరించారు శ్రీకంఠ, చిత్కళలు. శివారాధ్య పంజరాన్ని అక్కడున్న ఒక దిమ్మ పై ఉంచి మెల్లిగా పంజరం తలుపు తెరిచింది. పావురం ఒక్కక్షణంకూడాఆలస్యంచెయ్యకుండాతన రెక్కలను టపటపలాడిస్తూ రివ్వున బయటకెగిరిపోయింది. ఆ వేగానికి పంజరంలో గింజలతో ఉన్న గిన్నె కింద పడిగింజలన్నీ మేడంతా పడిపోయాయి.
అది చూసి శ్రీకంఠ ఆశ్చర్యపోయాడు. తనకేసి ఏమయ్యిందన్నట్టు చూస్తున్న చిత్కళతో, "అమ్మా! నువ్వు చెప్పింది నిజం! ఆ పావురాన్ని నేను పంజరంలో పెట్టి ఎంత బాగా చూసుకున్నా ఈ స్వేచ్ఛ వల్ల దానికి కలిగే ఆనందం మాత్రం ఇవ్వలేనని నాకు తెలిసింది. అందుకే ఈ పని చేశా!", అంది శివారాధ్య.
"నాబంగారుతల్లి! పుట్టినరోజు నాడు నిజమైన మంచి పని చేశావు", అంది చిత్కళ .
"శివా.. ఇతర ప్రాణులపై నీకున్న కరుణ ఎప్పటికీ ఇలాగే ఉండాలి", అన్నాడు శ్రీకంఠ.
అంతలో ఎక్కడినుండీ వచ్చిందోకానీ ఒక పెద్ద పావురాల గుంపు మేడపైపడ్డగింజలను తినడానికి వచ్చింది. శివారాధ్య చూస్తూ ఉండగానే ఆగుంపులోనిపావురాలు ఏమాత్రం భయపడకుండా ఆ గింజలన్నీ తినడం మొదలుపెట్టాయి.
"పక్షులని పెంచుకోవాలంటే ఇదన్నమాట మార్గం!", అంది శివారాధ్య.
"నిజమే!", అన్నారు శ్రీకంఠ చిత్కళలునవ్వుతూ.
*****
No comments:
Post a Comment