వినాయకుడే మా నాయకుడు
కావలి కోదండరావు
కైలాశం కోలాహలంగా ఉంది. మునులు, దేవతలు, మహర్షులు, గంధర్వులు, ప్రమధ గణాలు, భక్త జనాలతో కోలాహలంగా ఉంది. కొందరి చేతిలో ఆకుపచ్చ జెండాలు, మరికొందరి చేతిలో పసుపుపచ్చ జెండాలు రెప,రెప లాడుతున్నాయి. గణాలు రెండు గ్రూపులుగా విడిపోయి జయ,జయ ధ్వానాలతో హోరెత్తిస్తున్నాయి. నారదుడు చిరునవ్వుతో చిడతలు వాయిస్తున్నాడు. శంకరుడికి, ఆ భయంకర ధ్వనిలో విషయం అర్ధంకాక కాస్త చిరాకేసింది. శూలాన్ని, గాల్లోకి లేపి ఆగమన్నట్టు సైగ చేసాడు. ఒక్కసారి నిశ్సబ్ధం. పిన్ డ్రాప్ సైలెన్స్.
"ఏమిటి ఈ గొడవ? ఇంతమంది కలిసి వస్తే, మమ్మల్ని స్థుతిస్తారేమో అనుకుంటే.... మా మతినే పోగొట్టేలా ఉన్నారే. ఏమిటిదంతా?... గణపతి, సుబ్రహ్మణ్యం ఇరువురూ వేరు,వేరుగా చేరో గుంపుతో నిలబడ్డారు. నారదా! ఏమి జరిగినది?" అన్నాడు శంకరుడు.
"మహాదేవా! నీకు తెలియనిది ఏమున్నది. మొదటిసారి గణాధిపతిగా విఘ్నేశ్వరుడు సెలెక్షన్సులో నెగ్గాడు. ఇన్ని యుగాల తర్వాత... లీడరుగా తను సిద్ధమని, తనకి అవకాశం ఇవ్వాలని, కుమారస్వామి ముందుకొచ్చాడు." అన్నాడు నారదుడు.
"అవును తండ్రీ! ఇన్ని యుగాలు గడిచినా, అన్నగారి నోటినుంచి కొత్తవారికి అవకాశమిస్తామన్న మాటేలేదు. మొదటిసారి తెలివితో మామీద నెగ్గారు. ఈసారి మాకునూ మెచ్యూరిటి వచ్చినది. ఏ సెలెక్షన్ కైనా సిద్ధం, ఏ ఎలెక్షన్ కైనా సిద్ధం. మా బలం నిరూపించుకుంటాం.” అని అంటూనే తండ్రి పాదాలను మెత్తగా ఒత్తడం ప్రారంభించాడు కుమారస్వామి.
పరమేశ్వరుడు చిన్నగానవ్వి "మన లోకంలో సెలెక్షనేగానీ, ఎలెక్షనుకి తావులేదు. అది ధర్మ విరుద్ధం. శక్తి,సామర్ధ్యాలతోనే లీడర్షిప్ లభించేది. మరి నీ ఉద్దేశ్యం ఏమిటి, విఘ్నేశ్వరా!" అని వినాయకునివైపు చూసాడు.
"తండ్రీ! పితృవాక్య పరిపాలన మాకు శిరోధార్యం. మీమాట ఏదైనా, మా సమాధానం థన్సప్." అని బొటనవేలు చూపాడు.
"సరే, ఇన్ని యుగాలతర్వాత తిరిగి పోటీ నిర్వహించాల్సి వస్తోంది కనుక, ఇద్దరూ పోటీకి సిద్ధమేనని సంసిద్ధత తెలియ జేస్తున్నారు గనుక, పోటీ కొంచెం క్లిష్టతరంగా ఉండే విధంగా ఆలోచించాలి. అందుకు త్రిలోక సంచారి అయిన నారదుడే సరైనవాడు. నారదుడిని ఈ పోటీకి నిర్వాహకుడిగా, న్యాయనిర్ణేతగా నిర్ణయిస్తున్నాం." అన్నాడు శివుడు.
"మహాదేవా! ఇంత క్లిష్టమైన బాధ్యత నేను మోయగలనా...(అని నటిస్తూనే)….. అయినా నా పిచ్చిగానీ, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదుగదా. అలాగే స్వామీ. తప్పక వ్యవహరిస్తాను." అని లోలోపల నవ్వుకున్నాడు.
"సరే, పోటీ ఏమిటో తక్షణం సెలవివ్వండి. అది ఏదైనా సరే, ఛేదించి, బేధించి విజయం సాధిస్తాను."అన్నాడు కుమారస్వామి ఉత్సాహంగా.
నారదుడు కళ్లుమూసుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అందరూ ఉత్కంఠతో అతడివైపే చూస్తున్నారు. కుమారస్వామి తన చేతులు రుద్దుకుంటూ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాడు. వినాయకుడు ఆదుర్దాగా చూస్తున్నాడు. నారదుడు చిరునవ్వుతో కళ్లు తెరిచాడు. అందరూ అతని మాటలకోసం ఆతృతగా అటువైపు చూసారు.
"మహాదేవా! ఈసారి ముల్లోకాలు తిరగక్కరలేదు. కేవలం ఒక్కరోజు భూలోకంలో గడపాలి. అదీ మీకు మంచి ఫాలోయింగు ఉన్న ఆంధ్రప్రదేశ్లో గడపాలి. అయితే మామూలు మనిషిగా గడపాలి. మహత్తులు ఉండవ్. అందులో ఎవరు గెలిస్తే వారే నాయకుడు." అన్నాడు నారదుడు. శివుడు ఫక్కున నవ్వి... ముక్కుమీద వేలేసి, అన్నన్నా అన్నట్టు నారదుడివైపు చూసాడు. కుమారస్వామి సరే అన్నట్టు సైగజేసాడు. లోలోపల భయపడుతూనే, తప్పక… విఘ్నేశ్వరుడూ తల ఊపాడు.
"అత్యుత్సాహంగా ఉన్న కుమారస్వామికి తొలి అవకాశం ఇవ్వాల్సిందిగా నిర్ణయిస్తూ, రేపే వారి ప్రయాణానికి సన్నద్ధం చేయాల్సిందిగా ఆదేశిస్తున్నాం. ఇవి స్వీకరించు నాయనా" అని కొన్ని కాయితాలు అతని చేతిలో ఉంచాడు శివుడు.
"ఇవేమిటి తండ్రీ" అని కొశ్చెన్ మార్కు ఫేసు పెట్టాడు కుమారస్వామి.
"ఇవి డబ్బులు నాయనా. ఇవి లేకపోయినా... ఈ లెక్కలు రాకపోయినా... కుక్కలుకూడా ఖాతరు చెయ్యవు ఆలోకంలో. రేపటి సూర్యోదయమ్నుంచి, ఎల్లుండి సూర్యోదయం వరకు నువ్వు మానవుడివి. " అన్నాడు శివుడు.
అవి అందుకుని, పవిత్రంగా రెండు చేతుల్తో పట్టుకుని గర్వంగా బయల్దేరాడు కుమారస్వామి.
నీలం జీన్స్, తెల్ల టీషర్టు, జేబులో ఒత్తుగా ఉన్న పర్సుతో సుబ్రహ్మణ్యం జగదాంబ జంక్షన్లో ప్రత్యక్షం అయ్యాడు. జంక్షన్లో ఒక పిచ్చోడు గోచీకట్టుకుని, గాల్లోకి చూస్తూ, తనలో తనే ఏదో మాట్లాడుతూ, మద్య,మద్యలో అరుస్తున్నాడు. ఎవరూ వాడిని పట్టించుకోవట్లేదు. ఇంకొకడు మంచి ఖరీదైన బట్టలేస్కొని గాల్లోకి చూస్తూ, తనలో తనే ఏదో మాట్లాడుతూ, మద్య,మద్యలో అరుస్తున్నాడు. వాడినికూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. సుబ్రమణ్యం ఇద్దరినీ మార్చి,మార్చి చూస్తున్నాడు. అటుగా వెళుతున్న ఒక వ్యక్తిని ఆపి అడిగాడు.
"బాబూ, అతను పిచ్చోడు. అందుకే అలా మాట్లాడుకుంటున్నాడు. అది తెలుస్తోంది. కానీ ఇతను బాగానే ఉన్నాడు కదా, ఇతనెందుకలా మాట్లాడుకుంటున్నాడు."
"ఏటి బాబు, ఎర్రి పెస్న...ఇప్పుడే కొత్తగా సూత్తున్నట్టు. ఆడు ఫుల్లు పిచ్చోడు, ఈడు సెల్లు పిచ్చోడు." అని వెళ్లిపోయాడు.
కొంచెం ముందుకెళ్లాక... అటుగా నడుచుకుంటూ, రొప్పుతూ వస్తున్న కొందరిని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. చెమటలతో, ఊపిరి తీయడంకూడా కష్టంగా ఉంది వాళ్లకి. ఒక రాతి దిమ్మమీద కూర్చున్నారు. కాసేపాగి, పక్కనే ఆగిన కార్లు, స్కూటర్లు వేసుకుని వెళ్లిపోయారు. మళ్లీ ఆశ్చర్యపోయాడు సుబ్రమణ్యం. ఈసారి మరోవ్యక్తిని అడిగాడు.
"వాళ్లవద్ద వాహనాలున్నా, పాదయాత్ర చేస్తున్నారెందుకు? అలా రొప్పుతూ కూర్చోన్నారెందుకు? ఎందుకలా చేస్తున్నారు?"
"బాబూ, అయ్యి పాదయాత్రలు కావండి. ఆటిని వాకింగులు, జాగింగులూ అంటారు. వయసులో ఉన్నన్నాళ్లు జుట్టుకి రంగేస్కోడం, షర్టుకి సెంటేసుకోడం తప్పా... ఎప్పుడైనా నడిసేరేటండి. ఈది సివర బడ్డీకొట్లో సిగిరెట్టుక్కూడా సిఫ్టు కారేస్కెళ్లీవోరు. సుగరొచ్చాక, పొగరణిగి నేలమీద నడుస్తున్నారు. అయినా, తమరేటి బాబూ ఆకాశమ్నుంచి ఒచ్చినట్టు అడుగుతున్నారు." ఆశ్చర్యంగా ఫేసుపెట్టి అడిగాడు.
"అంటే, అంటే... అది, అదీ... నేను మంచుకొండల్లోంచి మొదటిసారి ఊర్లోకొచ్చా" సుబ్రమణ్యం.
"ఓసోస్, అదీ సంగతి. బోర్డర్ సెక్కూరిటి ఫోర్స్… మిలట్రీ.. ..మీకు కొత్తగానే ఉంటదిలెండి." అంటూ వెళ్లిపోయాడు.
తన నడక సాగుతోంది. సమయం 10:00 దాటగానే సుబ్రమణ్యంకి కాస్త ఆకలి, దప్పిక అనిపించాయి. రోడ్డు దాటడానికే పావుగంట పట్టడం, అతని సహనాన్ని పరీక్షిస్తోంది. ఎవర్నైనా, ఫలహారం గురించి అడుగుదామంటే... ఆగేవాడూ లేడు, చెప్పేవాడూ లేడు. ఇంతలో ఒకవ్యక్తి ఖాళీగా కూర్చొని కనపడ్డాడు. ఆనందంగా అతగాడి దగ్గరకెళ్లి
"అయ్యా, ఇక్కడ అమృతం ఎక్కడ లభిస్తోందో కాస్త చెబుతారా"
"గుడ్డు, ఎరీగుడ్డు. మీరూ మాటీమే. నేనూ అమృతం కోసమే సూస్తున్నాను. కానీ డబ్బుల్లేవు."
"నా దగ్గరున్నాయి. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. ఇద్దరూ కలిసివెళ్లి సేవిద్దాం."
"సూపరూ, మరి పదా శ్రీ వినాయకా వైన్సాప్ కాడికి. మూడు నైంటీలేసామంటే సాలు, సొర్గమే సొర్గం." ఇద్దరూ బయల్దేరారు.
"యాక్, ఏమిటీ దుర్గంధం. అమృతం అడిగితే, విషాన్ని ఇచ్చారేమిటి? చీ,చీ... నేనెళ్లిపోతా."సుబ్రమణ్యం లేచాడు.
"ఓయ్,నేనెళ్లిపోతా అంటే కుదర్దు. ఒచ్చాక తాగాల్సిందే. లేదా 2000/-ఫైను కట్టాల్సిందే." అని సుబ్రమణ్యం ఫిల్ట్ పట్టుకున్నాడు. వాడిచేతిలో రోజ్ కలర్ నోటుపెట్టి, రోడ్డుబాట పట్టాడు సుబ్రమణ్యం.
సుబ్రమణ్యం నడక సాగుతోంది. కాస్తముందు, ఒక ఫలహారశాల ఉందని తెలుసుకుని నడక వేగం పెంచాడు. ఇంతలో ఫలహారశాల కనబడింది. ఆనందంతో కళ్లు పెద్దవయ్యాయి. రోడ్డుక్రాస్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తుండగా,ఒక కారు, ఒక బైకుని గుద్దేసింది. రక్తంతో ఆ వ్యక్తి కొట్టుకుంటున్నాడు. తెలివైనవాళ్లు పక్కనుంచి, రక్తం అంటకుండా తప్పుకుని వెళ్లిపోతున్నారు. పనిలేనివాళ్లు గుమిగూడి కారువాడితో బేరం మాట్లాడుతున్నారు. సుబ్రమణ్యం అక్కడికి వెళ్లాడు.108లోఎక్కి కింద పడ్డవాడు,డబ్బులిచ్చి ఎక్కి,తొక్కినోడు వెళ్లిపోయారు. ఈ హడావిడిలో సుబ్రమణ్యం పర్సు పోయింది. ఎదురుగా ఫలహారం, కానీ తప్పని ఉపవాసం. మళ్లీ నడక సాగుతోంది. సమయం 4:00 దాటింది. సుబ్రమణ్యం పరిస్థితి, మరింత దారుణంగా తయారైంది. ఇంతలో ఒక పెద్ద గుంపు,జెండాలతో వెళుతోంది. సుబ్రమన్యం ఇక ఆగలేక ఒక వ్యక్తితో
"అయ్యా, ఎక్కడైనా ఉచిత భోజనం పెడతారా?" అని అడిగాడు.
"అరే తమ్ముడూ! నువ్వు ఖాళీయా. అయితే ఒచ్చేయ్. బిరియానీ పెట్టిస్తా." అంటూ ఒక జెండా సుబ్రమణ్యం చేతికిచ్చాడు.
కొంత దూరం వెళ్లాక, ఒక హోటల్లో సుబ్రమణ్యం కోరికమేరకు శాఖాహార భోజనం పెట్టించి, 500/ నోటు చేతికిచ్చాడు. సుబ్రమణ్యం కళ్లు మెరిసాయి. మళ్లీ జెండా భుజాన వేస్కొని, నడక ప్రారంభించాడు.
"సంతోషం మిత్రమా, ఆకలి తీర్చావు. నీ మేలు మర్చిపోను. అతను మీ నాయకుడా? అతడంటే భక్తితో కూడిన గౌరవం వలే కనిపిస్తోంది. చాలా శ్రద్ధగా జేజేలు కొడుతున్నారు." అడిగాడు సుబ్రమణ్యం.
"నాయకుడా, గాడిదగుడ్డా. నిన్న ఇంకో పార్టీకికూడా, ఈ మనుసుల్నే ఎట్టేను. మనిసికింతాని పుచ్చుకుంటాను. నీకిచ్చినట్టే అందరికీ బోజనం, 500 ఇస్తాను. నాకు మనిసికి 500 మిగులుద్ది. లేపోతే, ఎవుడొత్తాడు ఈల్ల మీటింగులకి."
"అయితే మరి, ఆయనకొచ్చే ఉపయోగం ఏంటి?"
"బిల్డప్పు, నా మీటింగులకి ఇంతమందొచ్చారని పోటోల్దిగి, పేపర్లకిత్తారు. అదిసూసి అదిష్టానం ఈల్లేదో తోపులని అనుకుంటారు. నిజానికి గుర్తులు తీసేసి, ఈల్ల పోటోలు, పేర్లు రాసి ఓట్లు అడిగితే... ఆల్ల పక్కింటోడుకూడా గుర్తు పట్టడు.ఓటు ఎయ్యడు." అని నవ్వాడు ఆ వక్తి.
"మరింత ఖర్చుపెట్టి, ఇంత శ్రమ ఎందుకు పడుతున్నట్టు?" అన్నాడు సుబ్రమణ్యం.
"బిజినెస్సు, ఇయ్యాల రుపాయి ఖర్చెడితే, రేపు ఐదు లాగుతారు. లేకపోతే జనాలమీద పేమనుకున్నావా? ఒట్టి ఎర్రిమాలోకంలా ఉన్నావే."
"వీళ్లంతా డబ్బులకోసం వస్తే, రేపు ఓట్లు ఎవరేస్తారు?" అన్నాడు సుబ్రమణ్యం.
"డబ్బులెట్టి కొనుక్కుంటారు. ఓటుకి 5/10... ఎంతవుద్దో సెప్పలేం. లాటరీలో సీటు తగిల్తే, పంట పండినట్టే. దొరికినంత భూమి ఎకరాల్లో కబ్జాలు, ప్రాజెక్టుల్లో కమీసన్లు. ఇవి తెలిసిన సదువుకున్నోడు ఓటెయ్యడు. తెలీనోడు పదికి,పరక్కి అమ్మేస్కుంటాడు.. పద,పద ఈ మీటింగుకి రాత్రి 8:00 గంటల్దాకే పెర్మిసను." అని నడక వేగం పెంచాడు. సుబ్రమణ్యం భుజాన జెండాతో, అతడిని అనుసరించాడు.
మీటింగు మొదలయ్యింది. ఒక్కొక్కరి వాగ్ధాటి చూస్తే సేవకోసమే జన్మించిన మహాపురుషుల్లా ఉన్నారు. ఇంతలో ఒక గుంపు డౌన్,డౌన్ అని అరవటం మొదలెట్టారు. కుర్చీలు గాల్లోకి ఎగురుతున్నాయి. బూతులు తిట్టుకుంటూ, కర్రలతో కొట్టుకుంటున్నారు. పోలీసులు లాఠీచార్జి చేసారు. కొంతమందిని అరెస్టు చేసారు. రాత్రి 10:00 అయ్యింది. సుబ్రమణ్యం పోలీసుస్టేషన్లో ఉన్నాడు.
"ఈల్ల జేబులు ఎతకండి. ఎవడిదగ్గర, ఎంతుందో తీసేస్కోండి. రేపు తెల్లారేక ఒదిలెయ్యండి. పెద్దాయన కులపోళ్లమీద చెయ్యెయ్యకండి. మిగిల్నోళ్లని కుమ్మెయ్యండి. పెద్దాయన, పేకట్టు ఒస్తది దాసుంచండి. క్లబ్బు కెల్తున్నాను. ఒక గంటలో ఒచ్చి తీస్కెళ్తాను. అసలే నిన్న, రమ్మీలో మన పాకెట్టు కుమ్మీసారు. అండర్స్టాండ్" అన్నాడు కుర్చీలో కూర్చున్న పెద్ద టోపీ ఆయన. సెల్యూట్ కొట్టి, లాఠీలని పిసుకుతూ ఆయన్ని సాగనంపాయి చిన్న టోపీలు.
కాళరాత్రి కంటిమీద కునుకు లేకుండాచేసి, మెల్లగా కరిగిపోయింది. సుబ్రమణ్యం, సూర్యోదయంతో సెల్లోనుంచి అదృశ్యం అయ్యాడు. కైలాశంలో ప్రత్యక్షం అయ్యాడు. రావటం, రావటంతోనే... "వినాయకుడికి జై, వినాయకుడే మా నాయకుడు... వినాయకుడికి జై, వినాయకుడే మా నాయకుడు" అని నినాదాలు మొదలెట్టాడు కుమారస్వామి.
"అదేమిటి కుమారా, ఇంకా పోటీ పూర్తి కాకముందే వినాయకుడే మా నాయకుడు అంటున్నావ్" అడిగాడు నారదుడు.
"ఇంకెక్కడి పోటీ స్వామీ, ఒక్కరోజుకే ప్రత్యక్ష నరకం చూసాను.అలాంటిది అన్నగారు ప్రతీ సంవత్సరం తొమ్మిదిరోజులు గడిపి వస్తున్నారు. వారి ధైర్యానికి, సహనానికీ నా జోహార్లు. అందుకే అన్నగారే నాయకుడు" అని వినాయకుడి మెడలో మాలవేశాడు కుమారస్వామి.
******
No comments:
Post a Comment