ఆశ
ప్రతాప వెంకట సుబ్బారాయుడు
ఆశ అనేది లేకపోతే మనిషి మనీషే
కోరిక, స్వార్థం, కుట్ర, మోసం ఇత్యాది పదాలు
మనిషి మనసును బహుముఖీయం చేయవు
నేటిని ఆనందంగా గడపక
రేపటిని గురించి చింతిస్తూ కూర్చోడు
ఉన్నదాన్ని అనుభవించక
లేనిదాని కోసం అర్రులు చాచడు
నేల మీద ఉన్నందుకు సంతోషించక
ఎత్తైన పర్వతాలెక్కాలని తాపత్రయపడడు
తన వాళ్లతో బంధాలని తుంచుకుని
ఇతరులతో డబ్బు బంధాలని ఏర్పరచుకోడు
ఆశ అనేది లేకపోతే మనిషి నిజంగా మనీషే
భూమ్మీద నిలవగలిగినందుకు తృప్తిపడక
కనిపించినంత మేర కబళించాలనుకోడు
తాను మాత్రమే స్వతంత్రంగా జీవిస్తూ
సమస్త జీవరాశి స్వేచ్ఛనూ హరించడు
కొన్ని జీవాల ఉనికి అసలే లేకుండానూ చేయడు
తనను దాటి నీడలా ఎదిగిన ఆశతో
ఆకాశాన్నీ పాదాక్రాంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరడు
ఆధ్యాత్మికత్వంతో అయినా ఆశను కాశీలో వదిలేస్తాడనుకుంటే
స్వర్గం మీద ఆశ దానికి కారణమంటాడు
ఆశ అనేది లేకపోతే మనిషి మనీషే
భగవంతుడు గనక మనిషి మనసులో ఆశ పెట్టి ఉండకపోతే
మనిషి కచ్చితంగా మరో భగవంతుడే!
***
No comments:
Post a Comment