స్పూర్తిదాయక మహిళ - పి.వి.ఎల్.సుజాత
భావరాజు పద్మిని
రచనలు, ముగ్గులు, పాటలు, పలు కళారూపాలు అన్నీ ఆమెకు కరతలామలకం. దాదాపు అన్ని ప్రముఖ పత్రికల్లోనూ ఆమె కవితలు, ముగ్గులు వచ్చాయి. కళా పిపాసకు వయసుతో నిమిత్తం లేదని చాటి చెబుతూ తెలుగు బుక్, వండర్ బుక్ లో రికార్డులు నెలకొల్పిన మేటి వనిత - పి.వి.ఎల్.సుజాత గారితో ముఖాముఖి ఈ నెల ప్రత్యేకించి మీకోసం...
1. మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి క్లుప్తంగా చెప్పండి.
నేను పుట్టింది ఆంధ్ర , పెరిగింది. తెలంగాణ... భద్రాచలం, ఖమ్మం జిల్లా.
2. మీ ఇంట్లో రచయతలు ఎవరైనా ఉన్నారా ? రచన వైపు మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు ఏమిటి?
మా ఇంట్లో సంగీత విద్యాంసులు ఉన్నారు గానీ, సాహిత్య రచనలు చేసేవారు అటు అమ్మ తరపున గానీ, ఇటు నాన్న తరపున గానీ ఎవరూ లేరండి. నాకు ఎలా అబ్బిందో !!... అంతా ఆ శిరిడీ సాయి ఆశీస్సులే !
3. ఏ వయసు నుంచి మీరు రచనలు చేయడం ప్రారంభించారు? అచ్చయిన మీ తొలి రచన ఏది?
నేను ఇంటర్ చదివే రోజుల నుండి ... బాలజ్యోతి, చెకుముకి , లాంటి పిల్లల మాసపత్రికలకు , చిన్న చిన్న కథలు , క్విజ్ లకు సమాథానాలు రాస్తుండేదాన్ని... అలా మొదలైంది నా రచనా ప్రస్థానం . అచ్చయిన నా తొలి రచన ఈనాడులో మినీ వ్యాసం . పేరు 'ఆమె vs-అతడు'.
4. మీ అభిమాన రచయతలు/రచయిత్రులు ఎవరు ?
మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి రచనలంటే చాలా ఇష్టం. ఆయన ఎంచుకునే కథాంశమే అద్భుతం - ఆద్యంతం చదివించేలా కట్టిపడేస్తాయి ఆయన రచనలు .
5. మీ రచనా ప్రస్థానంలో మర్చిపోలేని సంగతి ఏదైనా చెప్పండి ?
ఒక్కటేమిటండీ... అబ్బో! చాలా ఉన్నాయి. అందులో కొన్ని చెబుతాను.
అ) 2001 లో ఖైరాతాబాద్.. 'జాతీయ విపత్తు నివారణ సంస్థ వారు నిర్వహించిన - కార్యక్రమంలో పద్మశ్రీ స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి చేతు మీరుగా మెమెంటోను అందుకోవడం నిజంగా మర్చిపోలేని సంఘటన..
ఆ) 2006, 2007, .... ఇలా ఎన్నో సన్మానాలందుకున్నా.. 2012 లో తెలుగు భాష దినోత్సవం' సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన కార్యక్రములో మాజీ సి.ఎం. శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి చేతుల మీదుగా మెమెంటో తో, పాటు సన్మానం.
6. మీ వారు కూడా ఇదే రంగంలో ఉన్నారు కదా, మీ ప్రస్థానంలో ఆయన ప్రోత్సాహం ఏ విధంగా ఉంది ?
అవునండీ... అసలు అక్కడే పోటీ మొదలైందనే చెప్పాలి . ఈ సందర్భంగా జరిగిన ఓ చిన్న సంఘటనని చెబుతాను.. మీరేమీ అనుకోనంటే... హ్హహ్హ హ్హా... 1995 లో నా పెళ్ళి చూపులు జరిగాయి. మా ఇంటికి వచ్చారు అత్తగారి ఫ్యామిలీ. మా వాళ్ళు ఆ మాటా, ఈ మాటా మాట్లాడుకున్నాక. " మాటల సందర్భంలో మా అత్తగారు “మా వాడు పత్రికలకి రాస్తాడు...” అని చెప్పింది కాస్త డాంబికంగానే. మా సుజాత కూడా రాస్తుంది.. చాలా పోటీల్లో ప్రచురితమయ్యాయి కూడా.. అంది మా అమ్మ. వెంటనే నేను లోపలికి వెళ్ళి ఈనాడులో పడిన - నా ఫస్ట్ ఆర్టికల్ పేపర్ కటింగ్ తెచ్చి చూపించును .. ఇక్కడదాక బానే వుంది కదా!"
- అసలు ట్విస్ట్ ఏమిటంటే... ఆ వ్యాసంపై మా కాబోయే శ్రీవారు రాసిన అభిప్రాయం పక్కనే ఉంది. ఒకే పేజీలో ఇద్దరి రచనలు.. సరిపోయింది .. ఇద్దరి కిద్దరూ సరిపోయారు.. అంటూ అంతా నవ్వుకున్నారు .
మా వారి ప్రోత్సాహం చాలా ఉందండి . అలాగే పోస్టల్ కవర్లు, స్టాంపుల విషయంలో ఫైట్లు కూడా చాలా జరుగుతుంటాయి . హ్హ హ్హ హ్హ.. ఇప్పుడు mails వచ్చాక కొంచెం తగ్గాయనే చెప్పాలి యుద్ధాలు.!
7. మీ రచనలకు సాధారణంగా ఎంచుకునే అంశాలు ఎలా ఉంటాయి?
నా కథలన్నీ వుమెన్ ఓరియంటెడ్ స్టోరీస్, మధ్య తరగతి జీవిత గాథలనే ఎంచుకుని రాశాను. కవితల విషయానికొస్తే ప్రేమ,విరహం అనే అంశంపై నేను రాసిన కవితలన్నీ దాదాపు అన్ని ప్రచురితమయ్యాయి.
8. మీరు పొందిన అవార్డులు, మర్చిపోలేని ప్రశంసల గురించి చెప్పండి.
- 2001లో నేషనల్ డిశాస్టర్ మేనేజ్మెంట్ అధారటీ వారు నిర్వహించిన కార్యక్రమంలో మెమెంటో,సన్మానం.
- సన్మానం - 2005 లో సంజీవ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ నిర్వహించిన చెరుకూరి స్వర్ణాంజలి వారి కార్యక్రమంలో నా కవితకు మొదటి బహుమతి రావడం విశేషం.
- 2006 లో మచిలీపట్నం ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ 27వ వార్షికోత్సవం సందర్భంగా మచిలీపట్నం మెహర్ బాబా ఆడిటోరియంలో అప్పటి మేయర్ చేతుల మీదుగా నా కవితకు ప్రథమ బహుమతిని అందుకున్నాను...
- 2012 లో పద సాహిత్య పరిషత్తు, హైదరాబాద్ వారు నిర్వహించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 141వ జయంతి సందర్భంగా కవి సమ్మేళనంలో మెమెంటో, ప్రశంసా పత్రం...
- 2017 ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా అస్థిత్వం పేరిట 'తెలుగే ఒక వెలుగు' కవితా సంకలనంలో భాగంగా మెమెంటో, సన్మానం.
- ఈ సంవత్సరం 5 జనవరి 2020 మంచిర్యాల తెలంగాణా లో నిర్వహించిన 'శ్రీ వేంకటేశ్వరునికి లక్షల అక్షర హారాలు' కవి సమ్మేళనంలో సన్మానం, మెమెంటో, ప్రశంసా పత్రం.
- ఇటీవల 22 జనవరి 2020 సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్ లింగంపల్లి, హైదరాబాద్ లో నిర్వహించిన వ్యవహారిక భాషోద్యమ పితామహుడు రామ్మూర్తి పంతులు గారి 80వ వరంతి సందర్భంగా కవితా సంకలనంలో నేనూ ఒక భాగమైనందుకు అభినందిస్తూ ఇచ్చిన సన్మానం, మెమెంటో, ప్రశంసా పత్రం అందుకోవడం మరచిపోలేని అవార్డులు.
9. ఇంతవరకు ఎన్ని కథలు కవితలు వ్యాసాలు రాశారు? అందులో ఏవైనా పుస్తకాలుగా అచ్చయ్యాయా?
ఇంత వరకు నేను 200లకు పైగా కవితలు, 35 కధలు, 40 బాల సాహిత్యం కథలు, 150 (వివిధ రకాల) వ్యాసాలు, 60 ఆధ్యాత్మిక వ్యాసాలు, 160 జ్సోక్స్, 30 బాలగేయాలు, 100 (నానీలు లాంటి నాలుగు లైన్ల) మీనీ కవితలు రాశాను.. అంతే!!
10. మీరు ఇతర రంగాల్లో కూడా రాణిస్తున్నారు కదా. మీరు సాధించిన రికార్డుల గురించి చెప్పండి.
నేను ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీర్ గా ఐదేళ్ళు, ప్రయివేటు పాఠశాలలో ఏడేళ్ళు ఉపాధ్యాయురాలిగా పనిచేశాను .విద్యార్థుల్లో చదువు పట్ల సరైన అవగాన పెంపొందించాలనే ఉద్దేశ్యంతో బడిబాట లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాను... అంతే కాకుండా 50 టేకు ఆకులపై (ఎండిన టేకు ఆకులపై రంగవల్లికు' వేసినందుకు తెలుగు బుక్, వండర్ బుక్ లో రికార్డు స్థానాన్ని పొందాను...
సుజాత గారు మరిన్ని రచనలు చేసి, మరిన్ని విజయాలు పొందాలని మనసారా కోరుకుంటోంది - అచ్చంగా తెలుగు.
***
No comments:
Post a Comment