శ్రీకాశీవిశ్వనాథ శతకము -రామకృష్ణ సీతారామ సోదరకవులు - అచ్చంగా తెలుగు

శ్రీకాశీవిశ్వనాథ శతకము -రామకృష్ణ సీతారామ సోదరకవులు

Share This
శ్రీకాశీవిశ్వనాథ శతకము -రామకృష్ణ సీతారామ సోదరకవులు
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 

 

కవి పరిచయం:
రామకృష్ణ సీతారామ సోదరకవులు జంటకవులుగా ప్రసిద్ధి చెందారు. వీరి ఇంటిపేరు గౌరావఝల.  వీరిలో గౌరావఝల రామకృష్ణ శాస్త్రి (1902-1970) పెద్దవాడు. ఇతడు కర్నూలు మునిసిపల్ హైస్కూలులో పండితుడిగా పెక్కు సంవత్సరాలు పనిచేశాడు. రెండవ వాడైన గౌరావఝల సీతారామ శాస్త్రి (1904-1972) అప్పటి కర్నూలు జిల్లా (ప్రస్తుతం ప్రకాశం జిల్లా) గజ్జలకొండ గ్రామంలో బోర్డు హైస్కూలు ప్రధానోపాధ్యాయుడిగా, పోస్టుమాస్టర్‌గా పనిచేశాడు. ఈ ఇరువురు సోదరకవులు పెక్కు శతావధానాలు చేశారు. వీరు బాపట్ల శంకర విద్యాలయంలో గీర్వాణాంధ్ర భాషలను, మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పరీక్షను ఉత్తీర్ణులయ్యారు. సీతమాంబ, సుబ్బరామయ్య వీరి తల్లితండ్రులు. 
వీరు అనేక శతావధానాలు చెయ్యటమే కాక బహుగ్రంధ కర్తలు. 1. శ్రీ కాశీవిశ్వనాథ శతకము, 2. పయిడిపాటి మహాలక్ష్మి శతకము, 3. వెంకటేశ్వర శతకము, 4. శ్రీ కృష్ణ కథామృతము, 5. సుబ్రహ్మణ్యేశ్వరీయము, 6. శ్రీరామ నిర్యాణ నాటకము, 7. కాఫీ పురాణము-నశ్య విజయము, 8. తేనె సోనలు (సీతారామ కవి గారిది). 
ఈ సోదరకవులు మదనపల్లి, చిత్తూరు, బెంగుళూరు, మైసూరు, బళ్ళారి, అనంతపురము మొదలైన ముఖ్యపట్టణాలలో శతావధానాలు చేశారు. ఈ పట్టణాల చుట్టుపక్కల గ్రామాలలో అష్టావధానాలు, నేత్రావధానాలు కూడా చేశారు. ఆశు ప్రదర్శనలలో సభ్యులు కోరిన కథాభాగాన్ని తీసుకుని గంటకు 300 పద్యాలను ఆశువుగా చెప్పి పలువురి మెప్పును పొందారు. మరికొన్ని పల్లెటూరి దేవాలయాలలో పురాణ పఠనం చేశారు.
రామకృష్ణశాస్త్రి అభినవ బాణకవి, ఆశుకవి చక్రవర్తి, కవిసార్వభౌమ మొదలైన బిరుదులను పొందాడు. సీతారామశాస్త్రికి బాలకవిరత్న బిరుదును ఉన్నది.


శతక పరిచయం:
"తంగెడంచపుర కాశీవిశ్వనాధప్రభూ!" అనే మకుటంతో శార్ధూల మత్తేభ వృత్తాలలోరచించిన ఈ శతకం భక్తిరస ప్రధానమైనది. ఈ తంగెడంచ గ్రామం కర్నూలు నుండి శ్రీశైలం వచ్చేదారిలో ఉన్నది. ఇక్కడ 1948 సంవత్సరంలో ప్రతిష్ఠించబడిన కాశీవిశ్వనాధుని పేరున ఈ శతకం చెప్పబడినది. ఇందు కవిత్వం సరళం. కొన్ని పద్యాలను చూద్దాము.


శా. సారంగాసురహారి! పర్వతతనూజామానసాబ్జాటవీ
సారంగప్రతిభావిగారి! మునిరాట్సంతోషకారీ! సుహృ
త్సారంగౌఘ ఘనాంబుధారి! విలసత్సారంగధారీ! ననుం
జేరంగాఁగదె; తంగెడంచపుర కాశీవిశ్వనాధప్రభూ!

శా. గంధర్వాసుర నిర్జరప్రమధలోకశ్రేణిసేవింప; గో
గంధర్వంబునలంకరించి; జగమున్గాపాడునీవేటికా
గంధర్వావళితో శ్మశానభువి సౌఖ్యంబంచుఁగొల్వుందువో
సిందూరాంబక! తంగెడంచపుర కాశీవిశ్వనాధప్రభూ!

మ. శివపంచాక్షరమంత్రరాజజపమున్, శ్రీశైవపుణ్యస్థలిన్
శివరాత్రిన్శివలింగదర్శనము; కాశీవాసము న్బిల్వప
ల్లవముల్నీ చరణంబులందిడుటయున్ లాభాళిఁజేకూర్పుమో
శిబ! గౌరీధవ! తంగెడంచపుర కాశీవిశ్వనాధప్రభూ!

శా. నందీశుండు భవత్పదాబ్జముల నానందంఁతోఁగొల్వఁగ
డెందంబందుదలంచి, నిన్నటఁబ్రతిష్టింపంగదా శ్రీమహా
నంది క్షేత్రమువాసిగాంచె, సుజల్నాఁడాదిగామోక్షము
న్జెందగల్గిరి తంగెడంచపుర కాశీవిశ్వనాధప్రభూ!

తంగెడాంచపురి స్థల ప్రభావము గురించి:
మ. సిరినింపారెడు తంగెడంచపురి కాశీక్షేత్రమై; గోస్తనీ
వరపీయూష రసోపమానవిమలాంభః పురమౌబావి భా
సుర గంగానదియై మహోత్సవములన్శోభిల్లివర్ధిల్లుతం
జిరకాలంబిది తంగెడంచపుర కాశీవిశ్వనాధప్రభూ!

క్రొత్తగా కట్టిన ఆలయంలోని క్రొత్తబావి, పూలతోట కూడా ఈకవులు వర్ణించారు.

మ. ఒక మారేడుదళంబు నీపదములందుంచంగ సంతోషివై
యకలంకంబగు మోక్షమిత్తువఁట పుష్పారామముంబెంచి మా
లికలంగూర్చి సహస్త్రనామముల హాళింగొల్చు నీపుణ్యరా
శికినేమిచ్చెదొ? తంగెడంచపుర కాశీవిశ్వనాధప్రభూ!

మ. ఒకచోమల్లెలు సన్నజాజు, లొకచోనొప్పారు గన్నేరు వృ
క్షకదంబం, బొకవేదికాస్థలినినశ్వద్ధంబు, బిల్వంబు, వే
రొకచో నామలకాదిభూజములు, విధ్యుక్తంబుగానాటి మ
చ్చికతోఁబెంచిరి తంగెడంచపుర కాశీవిశ్వనాధప్రభూ!

శివలీలలు పరమశివుని భతుల కథలు కూడా ఇశతకంలో మనం చూడవచ్చును.

మచిఱుతొండడను శైవభక్తునిఁబరీక్షింపంగఁ దత్పుత్రకున్
శిరమున్ఖడనఁజేసివండుమని; భక్షింపంగనాబంతిలో
జిఱురండేడి; యనంగుమారకుని దాఁజీరంగ రక్షింపవా?
సిరియాళున్శివ! తంగెడంచపుర కాశీవిశ్వనాధప్రభూ!

మ. మనసారన్నినుగొల్చునర్జునుఁడె నీమాయాకిరాతాకృతిం
గని "ఈవేషములింక వేయక" నుచున్గాండీవసంతాడనం
బున శీర్షంబగలించి పాశుపతసంపూర్ణప్రభావంబు గాం
చెను దీనావన! తంగెడంచపుర కాశీవిశ్వనాధప్రభూ!

ఇదేవిధంగా మార్కండేయ వృత్తాంతము, మహావిష్ణువునకు చక్రము ప్రసాదించు ఘట్టము, దఖయజ్ఞ ధ్వంసము, కాముని దహనము, వ్యాసుకి కాసీ బహిష్కారము, రావణగర్వభంగము,  మొదలైన అనేక సంఘటనలపై కూర్చిన పద్యాలను ఇందులో చూడవచ్చును. 
ప్రాచీన కవులను వీరు కొన్నిపద్యాలలో అనుకరించారు
పాల్కూరికి సోమనాధుని అనుకరణ చూదండి
మ. అకలంకంబగుభక్తి నీచరణసేవాసక్తి వల్మీకమృ
త్తికచే లింగముఁజేసి నిత్యము "నమస్తేరుద్ర" యన్దివ్యవై
దికమంత్రంబుల ధూపదీపములనర్ధిం గొల్చునప్పుణ్యరా
శికిమోక్షంబిడు తంగెడంచపుర కాశీవిశ్వనాధప్రభూ!

మహకవి దూర్ఝటి అనుకరణ
మ. జలమా పుక్కిటఁబట్టితెచ్చినది, మాంసంబన్నఁదాఁదిన్న యెం
గిలి, మంత్రంబుహుళక్కి నీపయినభక్తిన్ బోయసేవింప గ
న్నులు రెండున్బెకిలించి పుచ్చుకొని సంతోషంబుజేకూర్చితౌ
శిల నీచిత్తము తంగెడంచపుర కాశీవిశ్వనాధప్రభూ!


అన్యభాష ప్రయోగాలు కూడా ఈశతకంలో మనకు కొల్లలుగా కనిపిస్తాయి రేషన్ షాపు, చీటీ, కలము, బ్యాటరీ, కరెంటు, మొదలైన పదాలు మనకు అనేకచోట్ల ఈశతకంలో కనుపిస్తాయి.
ఈశతకం చదివినవారికి ఆనాటి సామాజిక పరిస్థితులు ఎలాఉండేవో తెలుసుకోవటం సులభం అవుతుంది.

ఇంతటి మంచి శతకం మీరు చదవండి. ఇతరులచే చదివించండి.

No comments:

Post a Comment

Pages