లెక్కతప్పని తప్పు - అచ్చంగా తెలుగు

లెక్కతప్పని తప్పు

Share This
లెక్కతప్పని 'తప్పు' 
భవానీ ఫణి 


కల్యాణ మండపమంతా నిండిపోయి ఉంది, కొత్తవాళ్ల పక్కన కూర్చోవడం ఇష్టంలేక, ఏ మూలో నిలబడో, అటూ ఇటూ తిరుగుతూనో కాలక్షేపం చేస్తున్న,  కొందరెవరో వదిలేసిన కొన్ని కొన్ని ఖాళీ కుర్చీలు మాత్రమే అక్కడక్కడా కనిపిస్తున్నాయి. అతడు, ఓ కాలు వెనక్కి మడుచుకుని గోడకి జార్లబడి నిలబడి, ఆమె కనిపిస్తుందేమోనని వెతుకుతున్నాడు. ఆ వెతుకులాటల్లో, చూపులకి తగిలి తప్పుకుపోతున్న కాటుక కళ్ల లెక్క, కాస్త ఎక్కువగానే తెలుస్తోంది. అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూ, తన దాకా వచ్చేసరికి కాస్త నెమ్మదించే గాజుల చప్పుళ్ళూ, చీరల రెపరెపలూ కూడా గమనింపుకి వస్తూనే ఉన్నాయి. సూదంటు రాయిల్లాంటి తన కళ్ళో, సన్నని మీసకట్టో, పచ్చని పదునైన చెంపలో లేక ఏ మాత్రం పొట్ట రానివ్వకుండా కాపాడుకునే ఫిజిక్ నో... వీటిలో వాళ్ళనాకర్షించేదేదో! అలవాటుగా తొంగి చూడబోయిన గర్వాన్ని, దాంతోనే తొక్కిపెట్టి, పెళ్లి మండపం వైపుకు దృష్టి సారించాడు. 
మెత్తని పూరేకులపై పడిన రంగురంగుల కాంతితో మండపమంతా మెరిసిపోతోంది. బ్రహ్మగారు, పెళ్లి కొడుకుతో ఏదో పూజ చేయిస్తున్నారు... ఆమె వేదిక పైన కనిపించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పెళ్లి కూతురు, తనకి దగ్గర బంధువని కదా, రాసింది... ఆ హాల్ ని ఆనుకుని ఉన్న డైనింగ్ హాల్ లోంచి రకరకాల వాసనలు కలగలిసి వస్తున్నాయి. ఎవరో ఓ తెల్ల డ్రస్సయన, వంట వాళ్లమీదేమో, కేకలేస్తున్నాడు. ఓ పక్కనింకా కాఫీ, టీల సెక్షన్ నడుస్తూనే ఉంది. ఓ ముసలాయన, రెండింటిలో ఏది ఏదో తెలుసుకోవడం కోసం, క్యాన్ల మీద మూతలు తీసి వాసన చూస్తున్నాడు. ఆకలికో, నిద్రకో - ఓ పసివాడు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. జారిపోతున్న చీర కొంగునీ, పిల్లాడ్నీ ఒకేసారి సంబాళించుకోలేక, కొత్తగా అమ్మైన ఆ అమ్మాయి  సతమతమవుతోంది.  చీకట్ల కొత్త బ్యాక్ గ్రౌండ్ తెరలు తెచ్చిపెట్టిన ధీమాతో, విద్యుద్దీపాలు మరింత బడాయిని ప్రదర్శిస్తున్నాయి. అంతమంది జనానికి సరిపడేంత గాలిని అందించలేక, స్టాండ్ ఫ్యాన్లు పెద్దగా రొద చేస్తూ, గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. 

కలగాపులగపు ఆలోచనలతో బిజీగా ఉన్న అతని మెదడు, దూరంగా మెరిసిన మెరుపుని పట్టుకుని కళ్లందిస్తున్న సంకేతాన్ని వెంటనే అందుకోలేకపోయింది. ఆమెని గుర్తు పట్టడానికి కాస్త సమయం పట్టింది. అవును మరి, ఫోటోల్లో ఎప్పుడూ, టాప్సూ, లెగ్గింగ్స్ తో, లోపలికి వేసుకోవడంతో కనీ కనిపించకుండా ఉండే  సన్నపాటి గొలుసుతో, పెదవులపై మెరిసే మెత్తని చిరునవ్వుతో కనిపించే ఆమె, ఇప్పుడు, పచ్చని తన వొంటి రంగుకి నప్పే ముదురు నీలంరంగు పట్టు చీరలో, అంత దూరం నుండి వివరంగా పట్టుబడని ఏవేవో అలంకారాలతో, చాలా కొత్తగా, వింతగా కనిపిస్తోంది. అది ఆమేనని అర్థం కాగానే అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అప్రయత్నంగానే కాలు క్రిందికి పెట్టి నిటారుగా నిలబడ్డాడు. సన్నని వణుకేదో శరీరం నిండా పాకినట్టయింది. 'కథల్లో రాసే ఎటువంటి వర్ణనలనైతే నువ్వు చీల్చి చెండాడతావో, అవే ఏవో జరుగుతున్నట్టు లేదూ!' లోపల్నించేవరో వెక్కిరింతలు మొదలుపెట్టారు. అవును, ఇటువంటి వాక్యాలే రాసిన ఒకావిడ కథకి, ' ఇంత అబ్జర్డ్ కథని ఇంతవరకూ చదవలేదు' అనేగా, కామెంట్ పెట్టాడు. 

ఆలోచనల్ని ఇప్పుడటువైపుగా మళ్లించి సమర్ధనలు వెతుక్కునేంత తీరుబడి లేక, వాటినలా వదిలేసి, మండపం చుట్టూ తిరుగుతున్న ఆమె కదలికలకు చూపులను జత కలిపాడు. జ్యోతుల పళ్లెం పట్టుకుని, మరికొందరు ఆడవాళ్ళతో కలిసి నడుస్తున్న ఆమె, ఆ దీపాల వెలుగుల్ని మించి వెలిగిపోతోంది. అప్పటి వరకూ సినిమా సెట్టింగ్ లా అనిపించిన ఆ మండపపు వైభవం మొత్తం, ఆమె నాజూకు రూపం ముందర వెలవెలబోతోంది. అత్యంత అపురూపంగా కనిపిస్తున్న ఆ క్షణాల్లోంచి కవిత్వాన్ని పుట్టించే కార్యక్రమం, అలవాటుగా లోపలి నించి మొదలైంది. 'అబ్బే, అటువంటివి రాయడం ఎప్పుడో మానేసాడు. నిజానికి ఎప్పుడూ రాయలేదు. మరీ లేత వయసు నించీ కూడా, కేవలం ఫిలాసఫీ రాస్తాడనే కదా, తనకంత గొప్ప పేరు.' తనలోని కవికి కాస్త కసురుకుని, వాస్తవానుభూతిలోకి వచ్చి పడే ప్రయత్నం చేసాడు. 'ఇంత గొప్ప అనుభవాన్ని, అలా కవిత చేసి చెడగొట్టకూడదు.' అని మళ్ళీ అసంకల్పితంగానే తనను తాను సమాధానపరుచుకున్నాడు.
ఆమె కోసమే తనంత దూరం వచ్చాడని తెలిస్తే ఎలా ఫీలవుతుందో! తనంటే ఆమెకి చాలా ఇష్టమని అతనికి తెలుసు. 'అలా అని నీకు చెప్పిందా?' అందర్నీ, అన్నింటినీ తరచి చూస్తూ, నిశితంగా విమర్శించడానికి అలవాటుపడిన అతని చురుకైన బుర్ర, అతన్ని కూడా తర్కించడం మొదలుపెట్టింది. చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమవుతూనే ఉంటుంది. ఆమె అతనికి ఇంచుమించు పదేళ్లుగా తెలుసు. అప్పట్లో అంతా బ్లాగుల హవా నడుస్తున్న కాలం. తను రాసిన ఓ కవితకు కామెంట్ పెట్టింది. ఇప్పుడైతే చూడడు గానీ, అప్పుడేదో కుర్రతనం కదా; పేరు బావుందని, ఆమె బ్లాగ్ ప్రొఫైల్ లోకెళ్లి చూసాడు. అప్పుడప్పుడే మొదలు పెట్టినట్టుగా ఉన్న ప్రాస కవిత్వం. ఒక్క క్షణంలో పసిగట్టేసాడు, పెళ్ళై, పిల్లలు కూడా పుట్టేసాకా దొరికిన ఖాళీ సమయంలోంచి పుట్టుకొచ్చిన తీరుబడి రాతలని. తర్వాత ఆమెని పెద్దగా పట్టించుకోలేదు. కొన్నేళ్ల తర్వాతెప్పుడో ఫేస్ బుక్ లో వచ్చిన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడానికి కూడా, పేరు తెలుసన్న ఒక్క సాధారణమైన కారణం మాత్రమే అవసరమైంది. 
అప్పట్లో అతని జోరే వేరుగా ఉండేది. మాన్లీనెస్ తో మిసమిసలాడుతూ, వెరైటీ వెరైటీ పోజుల్లో ఉండే ఫొటోలతో పాటుగా, అతను రాసే లోతైన కవిత్వం, పదునైన వాక్యాలతో నిండి ఉండే కథలూ, జనాల్ని విపరీతంగా ఆకర్షించేవి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చెప్పలేనంత బిజీగా ఉండి కూడా, అతను చేస్తున్న సాహిత్య సేవ, వేనోళ్ళా కొనియాడబడుతూ ఉండేది. ఎందరు ప్రయత్నించలేదని! మాట కలపాలని, కథ ముందుకు నడపాలనీ. మొదట్లో కాస్త చనువివ్వడం వల్ల ఎదురైన ఒకట్రెండు అనుభవాల చేదు తగిలింతర్వాత, ఎవర్ని ఎంతవరకూ రానివ్వాలో అంతవరకే రానిచ్చి నిలబెట్టెయ్యడం అతనికి బాగా అలవాటైపోయింది. ఇంతలో...తన కోసమే పుట్టినట్టుండేంత అందాల రాశి, స్పందనతో పెళ్లి.  
సినిమాలూ, షికార్లూ, 'ఫ్లిప్ కార్ట్' లో పుస్తకాలు వెతుక్కుని కొనుక్కోవడం, క్రమం తప్పకుండా ఏదో ఒకటి రాయడం... జీవితం ఎప్పటికీ మారిపోని వసంత ఋతువులా అనిపించేది. పైగా తన తెలివైన బుర్రకి అవసరమైనంత పని చెప్పలేకపోయినా, అవసరానికి మించిన బ్యాంక్ బ్యాలెన్స్ ని నిల్వ చేసుకుంటూ పోయే ఉద్యోగమొకటి. జీవితంలో ఇక దేన్నీ, ఎవర్నీ లెక్క చేసే అవసరం లేకపోవడం, అతనికి అతి సాధారణమైన అలవాటుగా  మారిపోయింది. అందులోంచే, మెల్ల మెల్లగా ఏదో అసంతృప్తి తలెత్తి చూడసాగింది. అన్వేషణనే అసలు తత్వంగా కలిగిన, మనిషి పుట్టుకలోంచి పుట్టుకొచ్చే ఖాళీతనం. ఇప్పుడు రాయడం, మెచ్చుకోళ్ళని అందుకోవడం కూడా సంతోషాన్నివ్వలేని స్థాయికి చేరిపోయాడతను. పైగా ఆసక్తి తగ్గడం వల్లనేమో, ఇదివరకు వచ్చినంత ఆశువుగా ఇప్పుడు కవిత్వం రావడం లేదు కూడా. ఆ గందరగోళంలోనే ఓ ఏడాది పాటు పెద్దగా ఏమీ రాయకుండా ఉండిపోయాడు. చదవడం కూడా బాగా తగ్గించేసాడు. అలవాటైపోయిన వైవాహిక జీవితం, ముందరిచ్చినంత కిక్కుని ఇప్పుడివ్వడం లేదు. ఆఫీసు వర్క్ లో కూడా మునుపటి వేగమెందుకో తగ్గింది. చేస్తున్న పనుల్లో తప్పులు రావడం, టీంలో చిన్న చిన్న అభిప్రాయం బేధాలేర్పడ్డం వల్ల, కొద్దిపాటి చిరాకులు తలెత్తుతున్నాయి.  
ఆ వెర్రిగ్యాప్ లోకే ఆమె రావడం మొదలుపెట్టింది. కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ, రాస్తూ, మెరుగు పడుతున్న ఆమె కవిత్వంలోని మెరుపూ, అలా నేర్చుకోవాలన్న తపనా, మొదట్లో ఆమె పైన సదభిప్రాయాన్ని కలిగించాయి. మరికొంతకాలానికి, ఆమె అరుదుగా పెడుతుండే ఫొటోల్లోని ఓ ఫోటో చూసాక,  ఫేస్ బుక్ చూపించే ఆమె వయసును బట్టీ, రచనల్నీ బట్టీ ఊహించుకున్న రూపాలన్నీ చెల్లాచెదురైపోయి, అనుకోని ఆకర్షణ మొదలైంది. అది కూడా పెద్దగా పట్టించుకుని ఉండకపోయేవాడు గానీ, ఆమెని గమనించడం మొదలుపెట్టిన తర్వాత, ఒక విషయం అతనికి అర్థమయింది. ఆమె అతన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతుంది.పెద్దగా కామెంట్లు పెట్టదు గానీ, అతను రాసేవన్నీ మిస్ కాకుండా చదువుతుందనీ, అతన్ని బాగా అనుకరిస్తుందనీ, అతనంటే గొప్ప ఎడ్మైరేషన్ తో ఉందనీ, ఆమె పోస్ట్లు జాగ్రత్తగా చదివితే తెలిసింది. అప్పటినించీ ఆమెని మరింతగా గమనించడం, అతని కొత్త అలవాటుగా మారింది. నెమ్మదిగా కొంతకాలానికి, ఆమె పోస్టులకి లైక్ కొట్టడం, ప్రోత్సహించే విధంగా కామెంట్స్ పెట్టడం లాంటి కదిలించే పనుల్ని కొన్ని, పనిగట్టుకు చేయసాగాడు. ఎప్పుడైతే తాము ఆరాధించే వ్యక్తులు, తమని గుర్తించారని తెలుస్తుందో, అప్పుడు ఆటోమేటిగ్గా మనుషులు మరింత ముందుకొచ్చే ప్రయత్నం చేయడం సహజం. ఆ కారణమే, ఆమెని మెసేజ్ లు చేయడానికి పురిగొల్పి ఉంటుంది. అలాగని గుడ్ మార్నింగ్ లూ, గుడ్ నైట్ లూ కాదు, కేవలం కవిత్వం గురించో, కథల గురించో సలహాలు మాత్రమే అడిగేది. అడిగినంతవరకే సమాధానం చెప్పి ఊరుకునేవాడు. ఆమెకి ఇంకొంచెం మాట్లాడాలనుందని తెలుసు. కానీ తెలీనట్టుగానే ప్రవర్తించేవాడు. 
మెల్ల మెల్లగా అతని ఏమీ తోచని సోమరి క్షణాలోకి ఆమె మరింతగా చొచ్చుకురావడం మొదలుపెట్టింది. విజయం ఖాయమని తెలిసి ఆడే ఆటలోని చివరి క్షణాల్లా, అవి అతనికి గొప్ప ఆనందాన్నిచ్చేవి. తనని గొప్ప అందగాడిగా, కవిగా, ఫిలాసఫర్ గా, ఆమెకంటే ఎక్కవగా ఆరాధించినవాళ్లూ, తన ఒక్క పలరింపు కోసం పరితపించినవాళ్లు లేకపోలేదు. కానీ ఈమెలో తనకి నచ్చిన మరో విషయం, ఎవరి జోలికీ వెళ్లినట్టుగా కనిపించకపోవడం. ఆమెకు ఎవరితోనైనా పరిచయమున్నట్టుగా అనిపించదు. అతన్ని తప్ప వేరెవర్నీ ఫాలో అవుతున్నట్టు కూడా కనిపించదు. ఒకరో ఇద్దరో తెలిసుండచ్చేమోనని అనుమానం వచ్చినా, ఆ ఆలోచన అతని ఆనందమయమైన ఊహల్ని పాడు చేస్తుంది కనుక, పెద్దగా పట్టించుకోలేదు. కేవలం తనకి మాత్రమే సొంతమైన అంత గొప్ప ఆరాధనను  నింపుకున్న హృదయం, ఎంతో కొంత ఆకర్షించే రూపం. మృదు స్వభావం... నిజానికి మరీ అంత మెతగ్గా ఉండేవాళ్ళంటే అతనికిష్టముండదు. పెద్దలు కుదిర్చిన సంబంధమే అయినా, స్పందన, అంత హుషారైన అమ్మాయి కావడం తన అదృష్టమేననుకుంటాడు. కానీ ఈమె విషయంలో కలుగుతున్న ఆకర్షణ, ఇటువంటి చిన్న చిన్న సాకులన్నింటినీ చూసీ చూడనట్టుగా వదిలేసి ముందుకు సాగమంటోంది. నెమ్మది నెమ్మదిగా, గుర్తొచ్చే క్షణాలు మరింతగా పెరిగి, అతన్ని ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి; కానీ ఎప్పుడూ ఒక్కడుగూ ముందుకేసి వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడే సాహసం, ఆమె చెయ్యలేదు, అటువంటి అవకాశాన్ని అతను ఇవ్వనూ లేదు.  
ఎటూ బయటపడలేక ఇరకాటంలో పడి నలిగిపోతున్న అటువంటి సమయంలోనే కనిపించిందా పోస్టతనికి; 'చాలా రోజుల తర్వాత తన సొంత ఊరికి వెళ్తున్నానంటూ' ఎంతో ఆనందంగా రాసుకుంది. క్రింద, ఆమె బంధువుల కామెంట్లన్నీ శ్రద్ధగా చదువుతుంటే ఎదురైన మరో యాదృచ్చికత, అతన్ని మరింతగా అబ్బురపరిచింది. ఆమె ఊరు, తమ ఊరి పక్కనే! అది చదవగానే, లోపల్నించి ఉధృతమైన ఉద్వేగం బయలుదేరి, అతన్ని నిలవనివ్వకుండా చేసింది. వెళ్లి ఆమెనోసారి స్వయంగా చూడాలన్న కోరిక చిన్నగా మొదలై రెండు మూడు రోజులకే వటవృక్షమంత పెరిగిపోయింది. 
'ఊళ్ళో ఉన్న ఇల్లమ్మే విషయం సెటిల్ చేసుకుందాం... రమ్మని' కొన్ని నెలలుగా బాబాయ్ అడుగుతున్నాడన్న విషయం హఠాత్తుగా గుర్తొచ్చింది. ఆ వంకతో అక్కడి దాకా వెళ్తాడు సరే, పక్క ఊరిలో జరిగే, తెలీని పెళ్లికి ఎలా అటెండ్ అవుతాడు? అయి మాత్రం ఏం చేస్తాడు? అసలు వెళ్లాలన్న ఆలోచన ఎందుకు కలుగుతోంది? అతని మనసంతా విపరీతమైన సంఘర్షణ. కానీ వెళ్లాలని మాత్రం బలంగా అనిపించింది. అతను ఒక్కసారి ఏదైనా అనుకుంటే, దాన్ని బలపరుచుకునే వాదనల్ని సమీకరించుకుంటూనే ఉంటాడు. చివరికి ఆ పని చేయబోయే సమయానికి, అతని దగ్గర అవసరానికి మించినన్ని సమర్ధనలుంటాయి. ఈ విషయంలో అన్నేసి సమర్ధింపుల్ని దన్నుగా  తెచ్చుకోలేకపోయినా, మనసు చేసే వాదోపవాదాల్ని అలా పక్కకి తోసేసి, పరాగ్గా ఇలా పరిగెత్తుకొచ్చేసాడు.  బాబాయి ద్వారా కొన్ని వివరాలు తెలుసుకుని, చెప్పాల్సి వస్తే, ఆ పెళ్లికి ఎందుకొచ్చాడో చెప్పగలిగే, ఓ చిన్నపాటి కారణాన్ని వెతుక్కుని మరీ వచ్చాడు.  
'వచ్చినందుకు తన శ్రమ వృధా పోలేదు. ఈ క్షణాలు ఎంత అపురూపంగా ఉన్నాయి! తన మనసు నిండా ఎంతటి ఆనందం.' అనుకున్నాడు. ఎందుకని ప్రశ్నించుకుంటే సమాధానం అతనికే తెలీదు. అలా దాదాపుగా ఓ గంట సేపు, స్టేజ్ మీదే పెళ్లి కూతురిని అంటిపెట్టుకునున్న, ఆమె చుట్టూనే చూపుల్నావరించి ఉండిపోయాడు; అలుముకుపోయిన పరిసరాల మధ్యన, ఆమె రూపం మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంటే, తప్పనిసరైనప్పుడు తప్ప, రెప్పవేయడం కూడా మరిచిపోయాడు. పక్కనున్న కుర్చీ ఎప్పుడు ఖాళీ అయిందో, ఎప్పుడు తనందులో కూలబడ్డాడోనన్న స్పృహ కూడా లేదతనికి. 
అప్పటికి గమనించినట్టుందామె. ముందు సందేహంగా చూసింది. తర్వాత పట్టి పట్టి చూసింది. మరునిమిషంలో ముఖమంతా ఏదో కాంతిని మెరిపించింది. చిరునవ్వుతో పెదవుల్ని వెలిగించింది. గబగబా స్టేజ్ దిగి తన వైపే వస్తోంది. అతనికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎందుకో తెలీదు, భార్య గుర్తొచ్చింది. పైకి చురుగ్గా, సరదాగా, లిబరల్ గా ఉన్నట్టున్నా, తేడా వస్తే తోలు తీసెయ్యగల ఆమె తెంపరితనం కూడా జ్ఞాపకానికొచ్చింది. అంతటితో ఆగకుండా, ఫొటోల్లో ఆమె పక్కన కనిపిస్తుండే, బుర్ర మీసాల, ఆమె భర్త రూపం కళ్ల ముందు కదిలింది. దగ్గరకొస్తే ఇక కష్టం, తప్పించుకోలేడు. ఏదో పనున్నట్టుగా పక్కకి తిరిగి, కుర్చీలోంచి లేచి బయటకి దారి తీసాడు. వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా రోడ్డు మీదకొచ్చిపడి, ఎదురొచ్చిన ఆటో ఎక్కేసాడు. 
రెండు రోజుల తర్వాత ఆమె దగ్గర్నించి మెసేజ్ వచ్చింది, మొట్టమొదటిసారిగా కాస్త చనువును ప్రదర్శిస్తూ... "మొన్న పెళ్ళిలో మీలాంటి వ్యక్తే ఒకరు కనిపించారు. ఒక్క క్షణం మీరేనేమో అనుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది." కళ్ళని వెలిగించుకుంటూ, తనవైపుకు వడివడిగా నడిచొస్తున్న ఆమె రూపం మరోసారి మనసును పట్టుకు గుంజింది. అక్కడున్న గంటసేపటి జ్ఞాపకాల్లో, ఆ దృశ్యమే అతని ఫేవరేట్. ఇప్పుడీ మెసేజ్ కి రిప్లై ఇస్తే ఏమవుతుంది? మాటలు మొదలవుతాయి. మరింత ముందుకెళ్లి అది ఆత్మీయ స్నేహమవుతుంది. మెత్తని తెలివైన పదాల ద్వారా, అభిమానపు పరస్పర బదిలీ జరుగుతుంది. బహుశా ఆమె తత్వానికి, అంతకంటే ముందుకు రానివ్వకపోవచ్చు. ఒకవేళ రానిచ్చినా, ఆ జంజాటంలో ఇరుక్కోవడం అతనికిష్టంలేదు కూడా. నెమ్మదిగా, కేటాయిస్తున్న సమయం సరిపోవడంలేదని అటునించి ఫిర్యాదులు మొదలు కావచ్చు. అందిపుచ్చుకోలేని అదనపు సమయాల కోసం ఆరాటాలు ఎగిసిపడొచ్చు. అవి కన్నీటి బెదిరింపులుగా రూపాంతరమూ చెందవచ్చు. లేకపోతే, సైన్ అవుట్ చెయ్యడం మరిచిపోయిన ఎఫ్బీ మెసేజ్ లతోనో, డిలీట్ చెయ్యకుండా వదిలేసిన కాల్ లాగ్ ల ద్వారానో, ఈ సరదా దోబూచులాట కాస్తా, నిప్పులాంటి నిజమై ఎదురుగా వచ్చి నిలబడొచ్చు. అప్పుడిక ఇద్దరి జీవితాల్లోనూ జరగబోయే మార్పులెలా ఉంటాయో, ఊహించడం కూడా కష్టమే. ఎందుకిదంతా? ఈ కొద్దిపాటి భ్రమల కోసమా? అనవసరం. 
ఇప్పుడు రిప్లై ఇవ్వకపోతే, ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఇవ్వకపోతే, ఆమె కొంతకాలం బాధ పడొచ్చు. కానీ తను చేస్తున్న పని వల్ల, ఇద్దరికీ మంచే జరుగుతుంది... "దీన్నే పిరికితనమంటారు'" లోపల్నించి కసిగా, ఓ కేకలాంటి ఆక్రందన వెలువడింది. "కాదు, ప్రాక్టికాలిటీ అంటారు; ఇంకా సరిగ్గా చెప్పాలంటే నైతికత, గొప్పతనం అని కూడా అంటారు. మా ఇద్దరికీ వేరు వేరుగా పెళ్లయిపోయిందనీ, ఇప్పుడిటువంటివి తప్పనీ నీకు తెలీదా? ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు, ముందు నువ్వే ఓ క్లారిటీ తెచ్చుకోవడం నేర్చుకో." 
మనుషులదే కాదు, అంతరాత్మల నోరు మూయించడం కూడా అతనికి బాగా వచ్చు. అఖండమైన అతని తెలివితేటల కారణంగా, చిన్నప్పటినించీ అతను చేసిన లెక్కలెప్పుడూ తప్పు కాలేదు. ఇక ఎల్లవేళలా అత్యంత జాగృతమై ఉండే అతనిలోని వివేకం, అతన్ని జీవితంలో కూడా తప్పులు చేయనివ్వదు. చేయనిచ్చినా వాటి లెక్క మాత్రం తప్పనివ్వదు. 
అతనొక్కసారి ఒక నిర్ణయానికి వస్తే, ఎంత కష్టమైనా సరే, దానికే కట్టుబడి ఉంటాడు. ఆమె మెసేజ్ కి 'మార్క్ యాజ్ అన్ రీడ్' కొట్టి, వాల్ పోస్టుల మీద దృష్టిని  నిలిపాడు. మొన్న, ఫేమస్ ఫ్రెంచ్ కవి, 'విక్టర్ హ్యూగో' జీవితాన్నీ, కవిత్వాన్నీ విశ్లేషిస్తూ అతను రాసిన వ్యాసం మీద అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 'ఇంతకాలం ఏమైపోయారు? మీలో ఇంత గొప్ప విమర్శకుడు కూడా ఉన్నాడా!' అంటూ జనం ఒకటే ఆశ్చర్యపోవడం. మరికొందరైతే మరింత ముందుకెళ్లి, సోషల్ మీడియాలో లేని కొన్ని పెద్ద తలకాయలకి ఇతని పోస్ట్ చూపించి, 'సరికొత్త తెలుగు సాహిత్య కిరణం'లాంటి, వాళ్ళిచ్చిన బిరుదుల్ని పట్టుకొచ్చి మరీ ఇక్కడ వ్రేలాడదీసారు. ఇప్పుడతనికి, దృష్టిని మరల్చుకునేందుకు పనికొచ్చే కారణమేదో దొరికినట్టే ఉంది. జీ మెయిల్ ఓపెన్ చేసి, కొత్త డ్రాఫ్ట్ కంపోజ్ చేసాడు, నిన్ననే చదివిన బైరన్ లిరికల్ పోయెమ్, 'షి వాక్స్ ఇన్ బ్యూటీ' పై తన విశ్లేషణని టైప్ చెయ్యడం మొదలుపెట్టాడు.  
***

No comments:

Post a Comment

Pages