విపరీతము లివి వినరాదు
బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య కీర్తనలు సూర్యప్రభ వాహనం
బ్రహ్మోత్సవాలలో ఏడవరోజు పగలు ఏడు గుర్రాలు (గాయత్రి, బృహతి, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి) కలిగిన రథాన్ని ఎక్కిన సూర్యప్రభ వాహనం మీద వేంకటేశ్వరుడు విహరిస్తారు. స్వామివారు ఈ వాహన సేవలో వజ్రకవచం ధరిస్తారు.
ఈ సందర్భంలో సూర్యప్రభ ప్రస్తావన చేసిన అన్నమయ్య కీర్తన ప్రస్తావించుకొందాం.
పల్లవి
విపరీతము లివి వినరాదు
వుపమలెల్ల మీవొద్దనె కలిగె ॥పల్లవి॥
01.వువిదవదనచంద్రోదయవేళను
రవియగుసూర్యప్రభ నీవేగగ
యివల నవల మీయిద్దరివలననే
దినమును రాతిరి దెలియగగలిగె ॥విప॥
02.అంగనతురుముమహర్ని శివేళను
రంగగు సూర్యప్రభ నీవేఁగఁగ
సంగడి వెలుగును సరిజీకటియును
చెంగట మీయందే చెప్పగ గలిగె ॥విప॥
03.కాంతమోవి చుక్కల నిండువేళ
రంతుల సూర్యప్రభ నీవేగగ
యింతట శ్రీవేంకటేశ్వర మీయందే
కాంతులుగళలునుగలయుట గలిగె॥విప॥
(రేకు: 1433-5;సంపుటము: 24-197)
భావం:
పల్లవి
ఓ వేంకటేశా ! కొన్ని వ్యతిరేకములు నీ సన్నిధిలో జరుగుతున్నాయి. ఇవి ఏనాడు వినలేదు.
పోలికలన్నీ మీ దంపతుల మధ్యనే కలిగాయి.
01.
అలమేలు మంగ ముఖమనే చంద్రోదయము అయినప్పుడు ,సూర్యప్రభను నింపుకొన్న నువ్వు ఆమె సన్నిధికి వెళ్ళావు.
అప్పుడు ఇవతల చంద్రోదయము. అవతల సూర్యోదయము. రాత్రి , పగలు రెండూ పక్కపక్కనే ఉండటం తెలిసాయి. ఇటువంటి వ్యతిరేకములు ఏనాడు వినలేదు
02.
నువ్వు దగ్గరికి వెళ్ళినప్పుడు అలమేలు మంగ కొప్పు పగలు రాత్రి కూడా కాంతితో వెలిగిపోతుంది. వెలుతురుతో, ( స్వామివారి సూర్య కాంతి) చీకటి (అలమేలు మంగ కొప్పు రంగు) స్నేహం చేస్తుంది. మీదగ్గరే ఇటువంటి విపరీతాలు ఉన్నాయి. ఇటువంటి వ్యతిరేకములు ఏనాడు వినలేదు
03.
అలమేలు మంగ పెదవిపై నీ నఖ క్షతాలనే చుక్కలు నిండిన వేళలో ,క్రీడగా సూర్య కాంతితో నువ్వు మరికాస్త దగ్గరగా వెళ్ళావు. ఓ శ్రీవేంకటేశ్వర! అప్పుడు మీ ఇద్దరి యండు కాంతులు, కళలు కలిసాయి. ఇటువంటి వ్యతిరేకములు ఏనాడు వినలేదు.
విశేషాలు
ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణః"
సూర్య మండలం మధ్యలో వున్న శ్రీమన్నారాయణుడు వేంకటేశ్వరుని రూపంలో ఎల్లప్పుడు ధ్యానింపదగియున్నాడు అని ఈ సూర్య ప్రభ వాహనధారణ ద్వారా వేంకటేశుడు మనకు ప్రబోధిస్తున్నాడు. స్వస్తి.
***
No comments:
Post a Comment