బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు   చంద్రప్రభ వాహనం - అచ్చంగా తెలుగు

బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు   చంద్రప్రభ వాహనం

Share This
బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య కీర్తనలు   
చంద్రప్రభ వాహనం
డా.తాడేపల్లి పతంజలి 



బ్రహ్మోత్సవాలలో ఏడవనాటి రాత్రి వేంకటేశ్వరుడు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతారు. చందతి ఆహ్లాదయతి ఆనందింపచేయువాడు. చంద్రుడు.చందతి దీప్యతే ప్రకాశించునది. చంద్రుడు. ఇటువంటి చంద్రుని ప్రకాశింపచేయు స్వామి మనలను ఆనందింప చేయుటకు చంద్రప్రభ వాహన ధారి అవుతాడు. . "నక్షత్రాణా మహం శశీ"చుక్కల్లో చంద్రుడు నేను - అని శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పాడు.
 
ఇటువంటి చంద్రుడు అన్నమయ్య వాజ్మయంలో చాలా చోట్ల మెరిసాడు. పల్లవులలో చంద్ర ప్రస్తావన కలిగిన కీర్తనలు ఇవి;
రామ రామచంద్ర రాఘవా రాజీవలోచన రాఘవా(1 -392 ఎందరైన గలరు నీ కింద్రచంద్రాదిసురలు (3-42)సీతారమణ వో శ్రీరామచంద్ర(3-157) శరణు శరణు రామచంద్ర నరేంద్రా(3-505)రామచంద్రుడితడు రఘువీరుడు(4-147)రామ రామచంద్ర రాఘవా రాజీవలోచన రాఘవా(10-1)రావయ్య వావిలిపాటి రామచంద్ర(10-67)అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన(13-333)రామచంద్రా రామభద్రా రఘువీరా(15-23) రాజపు నీకెదురేది రామచంద్ర (19-165)రాతిబతిమ సేసిన రామచంద్ర(26-36) సరస మాకొకపొత్తే చంద్రమందానిలాదులు(26-74) 

వీటిలో రాముని పక్కన  చంద్రుడు కొలువైన కీర్తనలు ఎక్కువగా కనిపిస్తాయి. మనము వీటిలో వాచవిగ   "అరయ శ్రావణ బహుళాష్టమి"  కీర్తన తాత్పర్యాలు చదువుకొందాం.

అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన
సిరులతో నుదయించె శ్రీకృష్ణుడిదివో ॥పల్లవి॥

వసుదేవునిపాలిటి వరతపోధనము
యెసగి దేవకీదేవి యెదపై సొమ్ము
సుసరాన గొల్లెతల సొంపు మంగళసూత్రము
శిసువై వుదయించె శ్రీకృష్ణు డిదివో ॥

నందగోపుడు గన్న నమ్మిన నిధానము
పొందగు యశోదకు పూజదైవము
మందల యావులకును మంచి వజ్రపంజరము
చెంది యుదయించినాడు శ్రీకృష్ణుడిదివో ॥

సేవ సేసే దాసుల చేతిలోని మాణికము
శ్రీవేంకటాద్రి నేచిన బ్రహ్మము
వోవరి నలమేల్మంగ నురముపైబెట్టుకొని
చేవదేర నుదయించె శ్రీకృష్ణుడిదివో ॥


తాత్పర్యము
పల్లవి
ఇదుగో ! శ్రావణ బహుళాష్టమి నాడు చంద్రుడు ఉదయిస్తున్న సమయంలో సకల వైభవములతో శ్రీకృష్ణుడు అవతరించినాడు.

01
తెలుసుకొంటే   ఆశ్రీ కృష్ణుడు వసుదేవునికి శ్రేష్ఠమయిన తపోధనము.
 అతడు దేవకీదేవి హృదయముపై శోభిల్లిన ఆభరణము.
సులభముగా అతడు  గోపికలకు చక్కటి  మంగళసూత్రము.
 ఇదిగో!  అట్టి లీలలు చూపబోవు  శ్రీకృష్ణుడు శిశువై శ్రావణ బహుళాష్టమి నాడు  జన్మించాడు.
02
ఆశ్రీ కృష్ణునికి   నందుడు తండ్రి. తాను  కన్నప్పటికి, కృష్ణుని  తన నిధి అని నందుడు  నమ్మాడు .
కన్నతల్లి  యశోదాదేవికి అతడు సాటియైన పూజల దైవము.
 పశు సమూహములకు ఆవులకు ఈ గోపాలుడు గట్టిరక్షణ నిచ్చేవాడు.
ఇదుగో ! ఈ విధముగా అందరికీ చెందిన శ్రీకృష్ణుడు శ్రావణ బహుళాష్టమి నాడు ఉదయించాడు.

03
సేవచేసి తరించాలనుకొనే  సేవక భక్తులకు అందుబాటులోని అమూల్యవస్తువు ఈ కృష్ణుడు.
ఈయనే శ్రీవేంకటాద్రిలో  అతిశయించిన పరబ్రహ్మ స్వరూపుడు.
పడకటిల్లులో అలమేలు మంగను హృదయంపై పెట్టుకొని బలపడిన ఈ శ్రీకృష్ణుడు శ్రావణ బహుళాష్టమి నాడు ఉదయించాడు

ముగింపు
 "చంద్రమా మనసో జాతః" అని  ప్రసిద్ధమయిన మాట.  భగవంతుని మనస్సు నుండి చంద్రుడు   పుట్టాడట. అన్నమయ్య చంద్ర కీర్తనలప్రశంస సహృదయుని మనస్సునుండి పుడుతుంది.
****

 

No comments:

Post a Comment

Pages