కోదండం - అచ్చంగా తెలుగు
కోదండం
 శ్రీను వాసా 


"ఉన్నదున్నట్టు సెపుతాం, లేనిదిలేనట్టు సెపుతాం" అరుస్తున్నాడు కోయవాడు. చుట్టూ గుమిగూడి జనం ఎవరిజాతకాలు వాళ్ళు చెప్పించుకుంటున్నారు. బొబ్బిలిమాత్రం తనకేం పట్టనట్టు పక్కన ఎటో చూస్తూ కుర్చున్నాడు. అందరికీ చెప్పడం అయిపోయిన తరవాత లేచి వెళ్ళిపోతూ బొబ్బిలి వైపు చూసాడు కోయవాడు. తనుమాత్రం ఎటోచూస్తున్నాడు. "ఈడికెంతపొగరు.. సంగతి తేలుత్తా..! అనుకున్నాడు మనసులో. దగ్గరకొచ్చి "ఉన్నదున్నట్టు సెపుతాం, లేనిదిలేనట్టు సెపుతాం" అంటూ అరవడం మొదలెట్టాడు. ఒక చిన్న నవ్వు నవ్వాడుగాని ఏం పట్టించుకోలేదు బొబ్బిలి.
"నీకు రాజయోగం పట్టబోతంది దొరా.. జనం నీకు బెమ్మరతం పడతారు దొరా" అంటూ ప్రలోభపెట్టడం మొదలెట్టాడు. అయినా పట్టించుకోలేదు. "దొరా అలా పక్కకొస్తావా నీతో సానా గొప్ప ఇసయం సెప్పాల" అన్నాడు గుసగుసగా. సరేనని తనతో వెళ్ళాడు బొబ్బిలి. సంచీలోంచి ఒక అడుగు పొడవున్న రాగిరంగులో వంగి విల్లులావున్న వస్తువొకటి బయటికి తీసి ఇచ్చాడు బొబ్బిలికి. "దీని నీ ఇంట్లో ఈసాన్యమ్మూల నిలబెట్టు దొరా.. దీని ముందు కూసిని రోజూ మొక్కుదొరా.. నీకు మంచిరోజులున్నాయిదొరా.. ఇదినీకెలావచ్చిందో ఎవ్వరికీ సెప్పమాకుదొరా.. దీని సక్తి తరిగిపోద్ది దొరా..." అంటూ చెప్పి వాడిదారిన వాడు వెళ్ళిపోయాడు, తనలో తానే నవ్వుకుంటూ. ఇంతకీ అదేంటో తనక్కూడా తెలీదు. ఏదో దారిలో దొరికితే ఎందుకైనా పనికొస్తుందని సంచీలో వేసుకున్నాడు. "ఈడికి సెవిలో పువ్వెట్టటాకి పనికొచ్చింది" అనుకున్నాడు. 
"ఏవయ్యా.. ఏటది ఆమూలెట్టావు? గుడిససలే ఇరుకు. మళ్ళీ ఇదోటేటి? నీవరసేం బాలేదు. తీసాతలపారై" అరిచింది అచ్చమ్మ. ఏమీ వినబడనట్టు కుట్టుమిషన్ కుట్టుకుంటున్నాడు బొబ్బిలి.
ఇంతలో ఒక పిల్లాడు ఆడుకుంటూ గుడిసెలో దూరాడు దాక్కోడానికి. వాడి చేతిలో ఒక పుస్తకంవుంది. లోపలికొచ్చీరాగానే మూల నిలబెట్టి ఉన్న ఆ వస్తువు ఆకర్షించింది. "ఏంటది తాతా?" అని అడిగాడు.
అవును ఏంటిది? దీని పేరేంటి? కోయవాడు ఇవ్వడమైతే ఇచ్చాడుకానీ పేరేంటో చెప్పలేదు. అని మనసులో అనుకొని, కోయవాడిచ్చిన దండం కదా.. "కో దండం రా..దీనికి మొక్కితే అనుకున్నవన్నీ అయిపోతాయి." అన్నాడు అప్రయత్నంగా! చేతిలోవున్న పుస్తకం పక్కనబెట్టి మోకాళ్ళమీద కుర్ర్చుని భక్తిగా దణ్ణంపెట్టాడు కుర్రాడు. ఇంతలో బయటినుంచి ఎవరోపిలిస్తే ఆపుస్తకం అక్కడే మర్చిపోయి తుర్రుమన్నాడు. వెతుక్కుంటూ వాడే వస్తాడులే అనుకుంటూ పుస్తకాన్ని తీసి కోదండం దగ్గర పెట్టాడు బొబ్బిలి.
మర్ణాడు స్కూల్లో పుస్తకం కనబడక కంగారుపడ్డాడు ఆ కుర్రాడు. సాయంత్రం ఇంటికెళ్ళాకా అంతావెతికాడు.. ఎక్కడా కనబడలేదు. హఠాత్తుగా కోదండం గుర్తుకొచ్చింది. వెంటనేబయలుదేరి బొబ్బిలి ఇంటికి దారితీసాడు. వెళ్తూవెళ్తూ "నా పుస్తకం నాకు దొరికితే కోదండానికి ఐదు నిమ్మతొనలు పెసాదం పెడతా" అని మొక్కుకున్నాడు మనసులో. పుస్తకం కోదండం దగ్గరే ఉండే సరికి ఆశ్చర్యపోయాడు. బొబ్బిలి తాత చెప్పింది నిజమే! కోదండంకి చాలా మహిమలున్నాయ్ అనుకున్నాడు మనసులో!
పుస్తకం తీసుకుని వెళ్ళిన పిల్లాడు అరగంటతరవాత ఐదు నిమ్మతొనలు తీసుకొని ఇంకో ఐదుగురు పిల్లల్ని వెంటేసుకొచ్చాడు బొబ్బిలి ఇంటికి. మర్ణాడు స్కూలంతా మారుమోగిపోయింది కోదండం గురించి. ఇంకేం.. నాచిన్నప్పుడు బంగారు చేతిమురుగుపోయిందనొకడు.. నా పెన్నుపోయిందనొకడు.. ఇంగ్లీషులో పాసవ్వాలనొకడు.. నిమ్మతొనలు, అరటిపళ్ళు, పిప్పరుమెంటులు, ఉప్పు బిస్కట్లు.. ఇలా ఎవరికి తోచించివాళ్ళు తేవడం మొదలెట్టారు.
"ఏంటీ కవ్వేటం..? సిరాకొచ్చేత్తంది. ఈపిల్లలేటి? ఈ గోలేటి..? తీసేత్తావాలేదా" అరిచింది అచ్చమ్మ సాయంత్రం పొయ్యిరాజెయ్యడానికి ముందు, పొయ్యిలోఉన్న బూడిద చేటలోకెత్తి. బొబ్బిలి ఏం మాట్లాడలేదు. "అలా బెల్లంకొట్టిన రాయిలా ఏం మాట్టాడవేంటి?" మళ్ళీ అరిచింది. అయినా చలనం లేదు. అచ్చమ్మ కోపం కట్టలు తెంచుకుంది. ఆ చేటలోని బుగ్గి మొత్తం కోదండమ్మీద పోసేసింది కోపంగా! బొబ్బిలి మాత్రం ఏమ్మాట్లాడలేదు. అలా చూస్తూ ఉండిపోయాడు.

ఇంతలో నలుగురు పిల్లలు కోదండానికి మొక్కుతీర్చుకోవడానికొచ్చారు. కోదండం చూట్టూ ఏంటది? ప్రతిఒక్కరిలో కుతూహలం. "ఏమోనర్రా.. నాకూతెలీదు. దానంతటదే వచ్చింది కోదండంలోంచి" అన్నాడు అమాయకంగా! అవునా అంటూ ఆశ్చర్యపోయారు పిల్లలు. ఆ వార్త ఊరంతా దావానలంలా పాకేసింది. పెద్దవాళ్ళుకూడా రావటం మొదలెట్టారు.
"డిబ్బీలేదాండి?" అడిగాడు వచ్చినవాళ్ళలో ఒకడు.
గబగబా బిందెలో నీళ్ళు బక్కెట్లో పోసి, బిందిమూతికొక గుడ్డకట్టి చిల్లుపెట్టి తెచ్చిపెట్టింది అచ్చమ్మ. గంటలో బిందె నిండిపోయింది.
బొబ్బిలి ఇంటిముందు టెంటు లేచింది. భజనలు, భస్మాబిషేకాలు, అన్నదానాలు లాంటివి మొదలయ్యాయి. ఆనోట ఈనోటా చుట్టుపక్కల ఊళ్ళకి పాకేసింది. ఏడాదిలో కోదండానికి గుడి, గుడిసె స్థానంలో బొబ్బిలికి రెండంతస్తుల మేడ లేచాయి. సైకిల్ స్థానంలో కారొచ్చింది.

ఒక ఆధ్యాత్మిక చానల్ వాళ్ళు బొబ్బిలితో ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు, ఒక నలుగురు ఆధ్యాత్మిక వేత్తలని వెంటేసుకుని మరీ.
"మీకు కోదండం ఎలా దొరికింది? ఎవరైనా ఇచ్చారా లేక మీకు ఎక్కడైనా దొరికిందా?" మొదటి ప్రశ్న.
కోయదొర ఎవరికీ చెప్పొద్దన్న సంగతి గుర్తొచ్చింది. "అంటేనండి.. మరేమోనండి..ఏదన్నా మనకొచ్చీదుంటే దనంతటదే వత్తాదండి. పోయీదుంటే మరలాగే పోతాదండి" అన్నాడు అమాయకంగా!
"ఆహా ఏమి వేదాంతం! సిరిదా వచ్చినవచ్చును సలలితముగ నారికేళ సలిలముభంగిన్ అని సుమతి శతకంలో చెప్పినట్టు.. వామనుడు "వడుగా ఎవ్వరివాడవు" అనడిగితే నర్మగర్భంగా సమాధానమిచ్చినట్టు.. అంటూ బొబ్బిలి చెప్పిన దానికి వ్యాఖ్యానాలు మొదలెట్టారు ఆధ్యాత్మిక వేత్తలు!
"కోదండం అధ్యాత్మిక, పౌరాణిక ప్రాముఖ్యత లేంటి? అదిచ్చే సందేశం ఏమిటి? తదుపరి ప్రశ్న.
అర్థంకాలేదు బొబ్బిలికి. "అంటే మరి రాముడు సేతిలో బానముంటాదికదండి.. దానికి తిరుగులేదు కదండి.. ఇదికూడా అంతేనండి" అన్నాడు ఏంచెప్పాలో తెలీక!

"ఆహా.. ఈ కోదండం రాముని కోదండం.. సర్వ జగద్రక్ష!" మళ్ళి ఇంకో పదినిముషాల వ్యాఖ్యానం!
"ఈ కొదండానికి భస్మానికి సంబంధం ఏమిటి? కోదండమ్నుంచి భస్మం ఎలావస్తుంది" తదుపరి ప్రశ్న!
"అగ్గి అన్నిటిల్నీ బుగ్గి సెసేత్తాదండి.. పిడక కాలిస్తే కచ్చికవ్వుద్దండి.. కట్టె కాల్చినా బూడిదేనండి. చివరాకరికి ఏదైనా బుగ్గేనండి. అగ్గిబానం కదండీ.." అన్నాడు ఈసారి కాస్త ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా!
ఇంకేం.. వ్యాఖ్యాతలు రెచ్చిపోయారు..
మొత్తానికి ఇంటెర్వ్యూ పూర్తయ్యింది. రెండురాష్ట్రాలలో కోదండం లేని ఇల్లు లేదు. శక్తి కొలది రాగి, వెండి, బంగారు కోదండాలు పూజగదుల్లో వెలిసిపోయాయి. పలుచోట్ల గుడులు వెలిసాయి. కోదండమ్మీద స్తోత్రాలు, సుప్రభాతాలు రాసేసారు. కోదండ సత్య చారిత్రము అనే పుస్తకం రాయబడింది.

ఇవన్నీ చూసిన కోయదొర నెత్తీ నోరూ బాదుకున్నాడు. అదేదో నాగుడిసెలో గుచ్చుకు చచ్చినా బగుండేది. వాడికెందుకిచ్చానో.. ఇచ్చి ఉన్నదీ లేనిదీ వాడికెందుకు చెప్పానో అని వాపోయాడు!
***

No comments:

Post a Comment

Pages