శివానందలహరి 41-60 - అచ్చంగా తెలుగు
శివానందలహరి 41-60
మంత్రాల పూర్ణచంద్రరావు 


శ్లో: 41. పాపోత్పాతవిమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ
స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణ నే
జిహ్వా చిత్త శిరోంఘ్రిహస్తనయనశ్రోత్రై రహం ప్రార్థితో
మా మాజ్ఞాపయ తన్నిరూపయముహు ర్మామేవ మామేవచః ll

తా:  ఓ మృత్యుంజయా ! ఓ ఈశ్వరా ! పాపముల నుండి విముక్తి పొందుటకు , కావలసిన ఐశ్వర్యమును పొందుటకు ఈశ్వరుని ధ్యానింపు మని మనస్సు,స్తుతించుమని  నాలుకయూ,నమస్కరించుమని శిరస్సు,ప్రదక్షణములు చేయుమని పాదములు,పూజింపుమని కరములు,నిన్ను చూడమని కన్నులు, నీ కధలు వినుమని చెవులు , నన్ను పదే పదే కోరుతున్నవి. నా అవయవములు నన్ను కోరిన విధముగా చేయుటకు అనుమతిని ఇమ్ము. నాకు ఎటువంటి ఆటంకములు రాకుండా నీవే చూడుము.

శ్లో: 42. గాంభీర్యం పరిఖాపదం ఘనధృతిః ప్రాకార ఉద్యద్గుణ 
సోమశ్చాప్తబలం ఘనేంద్రియచయో ద్వారాణి దేహస్థతః
విద్యా వస్తుసమృద్ధి రిత్యఖిల సామగ్రీ సమేతే సదా
దుర్గాతిప్రియ దేవ మామకమనోదుర్గే నివాసం కురు ll

తా: దుర్గా దేవికి ప్రియమైన ఓ దేవా ! నా శరీరములో ఒక దుర్గము ఉన్నది. గాంభీర్యము దాని అగడ్త,ధైర్యము దాని ప్రాకారము,ఉద్భవించు గుణసముదాయమే మిత్ర సంపద, మంచి యింద్రియములే ద్వారములు. నీకు సంబంధించిన జ్ఞానమే వస్తువుల సమృద్ధి. ఇటువంటి సర్వ సామాగ్రితో కూడిన నా మనస్సనెడి దుర్గమున నివసింపుము.

శ్లో:43. మా గచ్చస్త్వమిత స్తతో గిరిశ భో మయ్యేవ వాసం కురు
స్వామిన్నాదికిరాత మామక మనః కాంతార సీమాంతరే
వర్తంతేబహుశో మృగా మదజుషో మాత్సర్య మోహాదయ
స్తాన్హత్వా మృగయా వినోదరుచితా లాభంచ సంప్రాప్స్యసి ll

తా: కైలాసమునందు శయనించే ఓ ఆది కిరాతా ! ఈశ్వరా ! నీవు నామనస్సునందే నివసించిన నీకు రెండు లాభములు ఉన్నవి.నా మనస్సు అనే అడవిలో కామ క్రోధ మోహ మద మాత్సర్యములు అను క్రూర జంతువులు ఉన్నవి. వాటిని వధించి  నీ వేట అను వినోదమును తీర్చుకొన వచ్చును.నన్ను సత్య సంపన్నునిగానూ చేయవచ్చును

శ్లో:44. కర లగ్న మృగః కీరంద్ర భంగో
ఘన శార్దూల విఖండనో స్తజంతుః
గిరిశో విశదాకృతిశ్చ చేతః
కుహరే పంచముఖోస్తి మే కుతో భీః ll 

తా:  మృగమును చేతిలో ధరించిన వాడునూ, గజాసురుని సంహరించిన వాడునూ, వ్యాఘ్రాసురుని ఖండించిన వాడునూ, జంతువులు అన్నియూ లయము చెందిన వాడునూ, కొండలో నివశించు వాడునూ,తెల్లని శరీరము కలవాడునూ, పంచముఖుడు అయిన శివుడు నా హృదయమందే నివశించుచున్నాడు.ఇక నాకు భయము ఎక్కడిది.?

శ్లో: 45. చందశ్శాఖి శిఖాన్వితై ర్ద్విజవరై స్సంసేవితే శాశ్వతే
సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే
చేతఃపక్షి శిఖామణే త్యజ వృధా సంచార మన్యైరలం
నిత్యం శంకరపాదపద్మయుగళీనీడే విహారం కురు ll

తా:  మనస్సు అనే ఓ పక్షి శ్రేష్టమా ! వేదములు అనే వృక్షముల చిట్ట చివరి కొమ్మలతో సంబంధము గలిగి బ్రాహ్మణ వర్యులతో సేవించబడేది, స్థిరమైనది , సౌఖ్యమైనది , అమృతము వంటి సారము గల ఫలములతో ప్రకాశించునది దుఃఖమును తొలగించేది, సుఖములు కలుగజేయునది అగు శివుని పాదపద్మ యుగము అనే గూటి యందు ఎల్లప్పుడూ విహరించు.. ఇతరములు వలదు, వ్యర్ధ సంచారము విడిచి పెట్టుము.

శ్లో: 46. ఆకీర్ణే నఖరాజికాంతివిభవై రుద్యత్సుధావైభవై
రాధౌతేపి చ పద్మరాగలలితే హంసవ్రజై రాశ్రితే
నిత్యం భక్తి వధూగణైశ్చ రహసి స్వేచ్ఛావిహారం కురు 
స్థిత్వా మానసరాజహంస గిరిజానాథాంఘ్రి సౌధాంతరే ll

తా: మనస్సు అనే ఓ రాజహంసా ! గోళ్ళ వరుసల కాంతి చే కూడుకొనినదియు ప్రసరించు చున్న అమృత ప్రవాహముచే కడుగబడినదియు పద్మము వంటి కెంపు వర్ణముచే ఇంపైనదియు పరమ హంసల గుంపుచే ఆశ్రయింప బడినదియు అగు పార్వతీపతి అయిన శివుని పాదము అనే మేడ యందు ఉండి రహస్యముగా భక్తి అనే స్త్రీల సమూహములతో స్వేచ్చగా విహరింపుము.

శ్లో: 47. శంభుధ్యాన వసంతసంగిని హృదారామే ఘజీర్ణచ్ఛదా
స్ర్సస్తా భక్తిలతాచ్ఛటా విలసితా పుణ్యప్రవాళ శ్రితాః
దీప్యంతే గుణకోరకా జపవచఃపుష్పాశ్చ సద్వాసనాః
జ్ఞానానందసుధా మరందలహరీ సంవిత్ఫలాభ్యున్నతిః ll

తా: ఈశ్వరా! మీ ధ్యానము వసంత ఋతువుతో సంబంధము ఏర్పడగా నా హృదయమనే పూల తోటలో పాపములు అన్నీ ఎండుటాకుల వలె రాలిపోయి పుణ్యములు చిగురుటాకుల వలే మొలిచాయి.సద్గుణములు మొగ్గలుగా తొడిగాయి. భక్తి అనెడి తీగలు అలుముకొన్నవి. జప వచనములు అనే పుష్పములు వికసించినవి.అవి ఉత్తమ సంస్కారము అనే సువాసనలు వెదజల్లుతున్నాయి. బ్రహ్మ జ్ఞానము ఫలముగా ఉన్నది. నా హృదయము ఉద్యాన వనమునకు ఉండవలసిన సర్వ లక్షణములతో విరజిల్లుతున్నది.

శ్లో: 48. నిత్యానందరసాలయం సురముని స్వాంతాంబు జాతాశ్రయం
స్వచ్ఛం సద్ద్విజసేవితం కలుషహృత్సద్వాసనావిష్కృతమ్
శంభుధ్యానసరోవరం వ్రజ మనోహంసావతంస స్థిరం
కిం క్షుద్రాశ్రయ పల్వలభ్రమణ సంజాతశ్రమం ప్రాప్స్యసి ll

తా: ఓ మనోరాజ హంసా ! చిన్న చిన్న నీటి గుంటల చుట్టూ తిరిగి శ్రమ పడి అక్కడ ఉన్న క్షుద్ర దేవతలను పూజించిన ఫలమేమి ? కేవలం ఈశ్వర ధ్యానం మాత్రమే చెయ్యి. ఆ శంభుని ధ్యానం మహా సరస్సు వంటిది, ఆసరస్సులో శాశ్వత ఆనందం నీరు గానూ, దేవతలు,మునులు వంటి హృదయ పద్మములునూ ,ఉత్తములయిన ద్విజులు హంసల వంటి పక్షులు గాను నిత్యమూ అక్కడ సేవిస్తూ ఉంటారు. అది పాపాలను పోగొడుతుంది. సత్కర్మల వల్లనే ఆ సరస్సు లభిస్తుంది.ఈ సరస్సు ఎప్పుడూ తరిగి పోయేది కాదు .

శ్లో: 49. ఆనందామృతపూరితా హరపదాంభోజాలవాలోద్యతా
స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్వితా
ఉచ్చైర్మానసకాయమానపటలీ మాక్రమ్య నిష్కల్మషా
నిత్యాభీష్ట ఫలప్రదా భవతు మే సత్కర్మసంవర్ధితా ll

తా: పరమేశ్వరుని సేవ అను కోరిక నీటి పోత గాను, పరమ శివుని చరణ కమలము పాదుగాను, స్థిరత్వము ప్రాకుడు కొయ్యగాను  అమరి కొమ్మలతో,రెమ్మలతో బయలుదేరి క్రమముగా ఉన్నతములయిన మనస్సులు అనే పందిళ్ళ మీదకి ప్రాకి చీడ పీడలు లేకుండా శిధిలము కాకుండా ఉన్న ఈ భక్తి లతామ తల్లి నాకు నిత్యమైన అభీష్ట ఫలములు ఇచ్చు గాక .

శ్లో: 50. సంధ్యారంభ విజృంభితం శ్రుతిశిరః స్థానాంతరాధిష్టితం
సప్రేమ భ్రమరాభిరామ మసకృత్సద్వాసనా శోభితమ్
భోగీంద్రాభరణం సమస్త సుమనఃపూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరి మల్లికార్జునమహాలింగం శివా లింగితమ్ ll

తా: సంధ్య ఆరంభమునందు విశేషముగా ప్రకాశించు వాడును ఉపనిషత్తులను,స్థాన విశేషములను ఆశ్రయముగా చేసుకొని ప్రేమతో కూడిన భ్రమరాంబికతో సహా విరాజిల్లు వాడును ఎల్లప్పుడూ మంచి భావనతో ఉండు వాడును , ప్రేమతో ఉద్ధరిణి నీరు పైన పోసిన ఉబ్బి పోవు వాడునూ, ఏ విధముగా తనను పూజించిన వారిని అనుగ్రహించ వలెనని మంచి భావన కలవాడు ఆశు తోషుడు అని భావము. వాసుకి ఆభరణము గా గలవాడు దేవతలచే పూజించబడు వాడును పార్వతి దేవిచే ఆలింగనము చేసికొనబడిన వాడును, శ్రిశైలమున మల్లిఖార్జునుడు అను పేరున వెలసిన జ్యోతిర్లింగమును పూజిస్తాను.

శ్లో: 51. భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా
హ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణా చాదృతః
సత్పక్షస్సుమనోవనేషు స పున స్సాక్షాన్మదీయే మనో
రాజీవే బ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః ll

తా: భ్రుంగీశ్వరుని కోరిక మేరకు తాండవము చేయుట యందు మిక్కిలి నేర్పు గల వాడును,గజాసురుని మదమును అణచినట్టి వాడును,మోహినీ రూపము ధరించిన మాధవుని ద్వారా ఆనందమును పొందిన వాడును,శంఖాది నాదములచే సేవించబడు వాడును,మిక్కిలి తెల్లని శరీరము గలవాడును,మన్మధుని బాణములు లక్ష్యముగా చేసుకొనబడిన వాడును, దేవతలను,సజ్జనులను రక్షించుట యందు ఆసక్తి గల వాడును,ప్రత్యక్షముగా శ్రీశైలము నందు భ్రమరాంబిక పతి అయి నివసించు వాడునుఅగు ఆ మల్లిఖార్జున స్వామి నా హృదయ పద్మమునందు నివసించు గాక .

శ్లో: 52. కారుణ్యామృతవర్షిణం ఘనవిపద్ర్గీష్మచ్ఛిదా కర్మఠం
విద్యాసస్యఫలోదయాయ సుమనస్సంసేవ్య మిచ్ఛాకృతిమ్
నృత్యద్భక్తమయూర మద్రినిలయం చంచజ్జటామండలం
శంభో వాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతకః ll

తా: హే శంభో! నీల కంధరా ! కరుణ అనెడి అమృత  వర్షమును కురిపించు వాడవును,మహా విపత్తులు అనెడి సంతాపాన్ని తొలగించువాడా విద్య అనెడి పైరు పండుటకుసహాయము చేయు వాడా, దేవతలు సజ్జనుల చేత చక్కగా కీర్తింపబడు వాడా, ఇష్టము వచ్చిన ఆకారము ధరించువాడా, నాట్యము చేయునట్టి నెమిళ్ళు గలవాడా , పర్వతము పైన నివశించు వాడా, చక్కగా ప్రకాశించు జడలు కలవాడవు అగు నిన్ను నా మనస్సు  చాతక పక్షి వలె కోరుచున్నది. 

శ్లో: 53. ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రా కలాపీ నతా
నుగ్రాహిప్రణవోపదేశనినదైః కేకీతి యో గీయతే
శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా
వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే ll

తా: ఆకాశము చేత శిఖ గలవాడవు,సర్పముల రాజైన వాసుకి ఆభరణము గా గల వాడవు , నమ్రత గలవారిని అనుగ్రహించునట్టి ప్రణవోపదేశమునకు సంబంధించిన " కేకి " అని గానము చేయ బడుచున్న వాడవు,మేఘ కాంతితో ఒప్పు శ్యామలాంబను చూసి సంతోషముతో నాట్యము చేయు వాడవు,వేదాంతము అనెడి ఉద్యాన వనమునందు విహరించుటకు ఆశక్తి కలవాడవు అయిన ఆ నీల కంఠుని పూజించుచున్నాను .

శ్లో: 54. సంధ్యా ఘర్మదినాత్యయో హరికరాఘాత ప్రభూతానక
ధ్యానో వారిదగర్జితం దివిషదాం దృష్టిచ్ఛటా చంచలా
భక్తానాం పరితోషబాష్పవితతిః వృష్టిర్మయూరీ శివా
యస్మిన్నుజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే ll

తా: మహేశ్వరా! సంధ్యాకాలమే వర్షారంభ సమయము, విష్ణువు సంతోషముతో వాయించే మద్దెల మ్రోతయే  ఉరుములు,దేవతలు ఆనందముతో అటూ ఇటూ తిప్పే చూపులే మెరుపులు, భక్తులు ఆనందముతో కురిపించే ఆనంద భాష్పముల ధారలే వర్షము.అమ్మవారు మయూరి. ఈ సమయంలో ఆనంద తాండవము చేసే నెమలి వంటి శివుని పూజిస్తాను.

శ్లో: 55. ఆద్యాయామిత తేజసే శ్రుతిపదై ర్వేదాయ సాధ్యాయ తే
విద్యానందమయాత్మనే త్రిజగతస్సంరక్షణోద్యోగినే
ధ్యేయాయాఖిల యోగిభిస్సురగణై గ్గేయాయ మాయావినే
సమ్యక్తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిశ్శంభవే ll

తా: సర్వలోకముకు ఆద్యుడవునూ,అధిక తేజస్సు గలవాడవున్నూ,వేద వాక్యముల ద్వారా తెలుసుకొనదాగిన వాడవునూ, తపోధ్యానాదులచే సాధింపదగిన వాడవునూ,జ్ఞానానంద స్వరూపుడవునూ,సమస్త యోగుల ద్వారా ధ్యానింప దగిన వాడవునూ,సర్వ దేవతలచే గానము చేయబడ దగిన వాడవునూ,మాయచే అనేక ఉపాధులను ధరించు వాడవునూ,జటాజూటము కలిగిన వాడవూ, తాండవము నందు అమితాసక్తి కల వాడవునూ,శంభుడవు అయిన నీకు ఇదియే నా నమస్కారము.

శ్లో: 56. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే
సత్యాయాదికుటుంబినే ముని మనః ప్రత్యక్షచిన్మూర్తయే
మాయాసృష్ట జగత్ర్తయాయ సకలామ్నాయాంతసంచారిణే
సాయం తాండవసంభ్రమాయ జటినే సేయం నతిశ్శంభవే ll

తా: శాశ్వతుడును, త్రిమూర్తి స్వరూపుడును, త్రిపురాసులను సంహరించిన వాడును, కాత్యాయినీ మనోహరుడును,సత్యమైన వాడును,మునుల మనములకు ప్రత్యక్షముగా గోచరమయిన చిత్ స్వరూపుడును,మాయ వలన ముల్లోకములను కల్పించువాడునూ,వేదాంత వేద్యుడునూ,సంధ్యా కాలమున తాండవము చేయుటకు ఇష్ట పడు వాడును,జటా జూటము కల వాడును,మొట్ట మొదటి సంసారియు అయిన శివునికి నమస్కారము.

శ్లో: 57. నిత్యం స్వోదరపోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయా
వ్యర్థం పర్యటనం కరోమి భవత స్సేవాం న జానే విభో
మజ్జన్మాంతరపుణ్యపాకబలతస్త్వం శర్వ సర్వాంతర
స్తిష్ఠస్యేవహితేనవా పశుపతే తే రక్షణీయోస్మ్యహమ్ ll

తా: శివా! ఓ పశుపతీ! ప్రతి దినము నా ఉదార పోషణకు ధనము అర్జించుటకు కలవారి గురించి అటు ఇటు తిరుగుతూ ఉన్నాను, కానీ నిన్ను సేవించుట ఎరుగను. కానీ నా పూర్వజన్మ పుణ్య ఫలమున సర్వాంతర్యామివి అయిన నీవు నాలోనూ ఉన్నావు కదా ! అందుచేత అయిననూ నన్ను ఉపేక్షించకుండా రక్షింప దగిన వాడనే కదా !

శ్లో: 58. ఏకో వారిజబాంధవః క్షితినభోవ్యాప్తం తమోమండలం
భిత్వా లోచనగోచరోపి భవతి త్వం కోటిసూర్యప్రభః
వేద్యః కిం నభవస్యహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమ
స్తత్సర్వం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ర్పసన్నోభవ ll

తా: ఓ పశుపతీ ! ఒక్క సూర్యుడు భూమి ఆకాశములను ఆవరించిన చీకటిని పటాపంచలు చేసి కన్నులకు కనపడుతున్నాడు. నీవు కోటి సూర్యుల కాంతి కల వాడవు. అయిననూ మాకు కనబడకున్నావు ఎందువలన? నా అజ్ఞానము అనే చీకటి ఎంత దట్టముగా ఉన్నదో కదా , దానిని తొలగించి నాకు దర్శనమియ్యి స్వామీ .

శ్లో: 59. హంసః పద్మవనం సమిచ్ఛతి యథా నీలాంబుదం చాతకః
కోకః కోకనదప్రియం ప్రతిదినం చంద్రం చకోర స్తథా
చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో
గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్యసౌఖ్యప్రదమ్ ll

తా: పశుపతీ! గౌరీనాథా! తామర కొలనును హంస, నీలమేఘమును వానకోయిల, సూర్యుని చక్రవాకము, చంద్రుని చకోరము, ప్రతిదినము ఎంతగా యిష్టపడునో నా మనస్సు జ్ఞానమార్గముతో వెదకదగినదియు కైవల్య సౌఖ్యము ఇచ్చు నీ పాదార యుగళమును కోరుచున్నది.

శ్లో: 60. రోథస్తోయహృతఃశ్రమేణ పథికశ్ఛాయాం తరోర్వృష్టితో
భీతః స్వస్థగృహం గృహస్థమతిధి ర్దీనః ప్రభుం ధార్మికమ్
దీపం సం తమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా
చేతస్సర్వభయాపహం వ్రజ సుఖం శంభోః పదాంభోరుహమ్ ll

తా: ఓ మనసా! నీళ్ళలో కొట్టుకొని పోవు వాడు తీరమును, బాటసారి అలసి పోయి చెట్టు నీడను, వర్షము వలన భయపడు వాడు మంచి ఇంటిని,అతిధి గృహస్తుని ఇంటి వలే,  బీదవాడు ధనిక ప్రభువు వలెను,చీకటిలో ఉన్న వాడు దీపము వలె, చలి పుట్టిన వాడు అగ్నిని ఆశ్రయించుట వలె,నీవు సమస్త భయములు పోగొట్టి, సుఖములు కలుగ చేయు ఈశ్వరుని పాదపద్మములు ఆశ్రయింపుము.
***

No comments:

Post a Comment

Pages