సుబ్బుమామయ్య కబుర్లు! - అచ్చంగా తెలుగు

సుబ్బుమామయ్య కబుర్లు!
వినదగు ఎవ్వరు చెప్పినా..!


పిల్లలూ ఎలా ఉన్నారూ..?
బావున్నారు కదూ..గుడ్.
మనం మాట్లాడ కూడదనుకుంటే నోరు మూసుకుని మౌనంగా ఉండొచ్చు. చూడకూడదుకుంటే కను రెప్పలు మూసుకోవచ్చు. కాని చెవులు అలా కాదు. ప్రతీ శబ్దం మనకు వినిపిస్తూనే ఉంటుంది. దేవుడు మన శరిరాలకు చేసిన ప్రత్యేక అమరిక అది. దానర్థం మనం ఎవరు ఏం చెప్పినా, అన్నీ వినాలి. కాని ఆచరించాలంటే విన్నదాన్ని మన విచక్షణతో విశ్లేషించుకుని తర్వాతే చెయ్యాలి. మన చుట్టూ ఉన్నవాళ్లలో కొంతమంది మన శ్రేయోభిలాషులుండొచ్చు. మరి కొంతమంది శ్రేయోభిలాషుల ముసుగులో శత్రువులు ఉండొచ్చు. అందుకనే ఎవరు చెప్పినా వినాలి..చేసేటప్పుడు మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించి చెయ్యాలి.
పూర్వపు రోజుల్లో శ్రీకృష్ణదేవరాయలు, చంద్రగుప్తుడు, అక్బర్ లాంటి రాజుల పరిపాలన కొనియాడబడిందంటే కారణం వారి మంత్రులైన తిమ్మరుసు, చాణక్యుడు, బీర్బల్ కారణం. రాజుకు అవసరమైన చోట్ల చక్కని సలహాలనిచ్చి ఆయారాజులకు, రాజ్యాలకు గొప్ప ఖ్యాతి తెచ్చారు.
అమ్మ నాన్నలు ప్రథమ గురువులర్రా, మనకు నడక, నడవడిక నేర్పేది వాళ్లే! వాళ్లను గౌరవించి వాళ్లు చెప్పేది శ్రద్ధగా ఆలకించాలి. మన మంచికోసం స్వామిజీలు పురాణాల్లోని చిన్న చిన్న కథలను ఎంచుకుని వినసొంపైన ప్రవచనాలను చెప్పి మన మార్గాన్ని సవ్యం చేస్తారు. బడిలో మాస్టార్లు పాఠాలు చెప్పి మన అభివృద్ధికి దోహదం చేస్తారు.
ఒక్కోసారి మనం ఒకచోట ఉన్నా, మన మనసు పరి పరి విధాల పోతుంటుంది. ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు మనసును కుదురుగా ఉంచుకుని, ఏకాగ్రతగా వినాలి. ఎందుకంటే వాళ్లు మన కోసం మళ్లీ చెప్పరుగా. చెప్పింది విన్నాక ఒకసారి మననం చేసుకోవాలి. ఎందుకంటే ఏ ఒక్క విషయం మరచిపోకూడదు. ఉదాహరణకి, టీచర్ తరగతిలో పాఠం అందరికీ ఒకేసారి ఒకేలా చెప్పినా, పరీక్షల్లో ఒక్కొక్కరికీ ఒక్కోలా మార్కులు రావడానికి కారణం వాళ్ల వాళ్ళ వినే నేర్పరితనం మీదే ఆధారపడి ఉంటుంది. అందుచేత శ్రద్ధ లేకుండా విన్నది ఎప్పుడూ వ్యర్థమే!
ఇహనుంచి వినడాన్ని నిర్లక్ష్యం చేయరు కదూ!
మీ మావయ్య.


No comments:

Post a Comment

Pages