అటక మీది మర్మం - 29 - అచ్చంగా తెలుగు
 అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల- 29
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)



(జరిగిన కథ : తండ్రి కోరికపై కనిపించకుండా పోయిన ముసలి మిలిటరీ ఉద్యోగి మార్చ్ కుమారుడి సాహిత్యాన్ని వెతికి పట్టుకోవటానికి నాన్సీ అంగీకరిస్తుంది. తన స్నేహితురాళ్ళతో ఆ పాత భవనాన్ని గాలిస్తుంది కానీ ఆమెకు ఎలాంటి ఆధారాలు దొరకవు. ఆగంతకుడెవరో ఆ భవనంలో తిరుగుతున్నాడని అక్కడ పనిలో చేరిన ఎఫీ ద్వారా నాన్సీ తెలుసుకొంటుంది. ఒకసారి తన స్నేహితురాళ్ళతో కలిసి అతన్ని పట్టుకొనే ప్రయత్నం చేసి విఫలమవుతుంది. అటక మీద రహస్యమార్గం ఉందేమో అని వెతుకుతున్న సమయంలో అస్తిపంజరం తమకేదో సైగ చేస్తోందని బెస్ అంటుంది. వెంటనే అస్తిపంజరం ఉన్న బీరువాలో గాలించిన యువగూఢచారికి పాత ఉత్తరాలతో పాటు కొన్ని పాటలు దొరుకుతాయి.  ఆమె తన స్నేహితురాళ్ళతో కలిసి జెన్నర్ ఆఫీసుకి వెళ్ళగా అతను యింటర్వ్యూ యివ్వకపోగా, తమ గురించి ఎవరితోనో మాట్లాడటం అమ్మాయిలు వింటారు.    తరువాత ఆ వ్యక్తిని వెంబడించిన ముగ్గురు అమ్మాయిలు, హోటలు వాళ్ళు ఆ వ్యక్తిని బెన్ బాంక్స్ అని గాక డైట్ అని సంబోధించటం వింటారు. హోటలు వాళ్ళ నుంచి ఈ డైట్, బెన్ బాంక్స్ ఒకరే అని తెలుసుకున్న నాన్సీ, ఆ విషయం తండ్రితో చెబుతుంది. తండ్రి కోరికపై నాన్సీ ఫిప్ ఉత్తరాలతో మార్చ్ భవనానికి చేరుకొంటుంది. ఆ ఉత్తరాలను చదివిన ఆమెకు కిటుకంతా అస్తిపంజరంలో ఉన్నట్లు గ్రహించి, దాన్ని బీరువాలోంచి పక్కకు తీస్తుంది.  చివరకు బీరువా వెనుక తలుపుని గమనించిన నాన్సీ, బలవంతంగా తెరువబోగా, మార్చ్, ఆమె ఒక చీకటిగదిలోకి తూలి పడతారు.  వారికి ఆ గది కున్న పైకప్పు కిటికీ నల్లగుడ్డతో మూసి ఉండటం గమనిస్తారు.  ఆ గదికి మరో రహస్యద్వారం ఉందేమోనని గదినంతా వెల్తికిన వాళ్ళకు రెండు చెక్క వస్తువులు తప్ప అమరేమీ కనబడలేదు.  తరువాత. . .)
@@@@@@@@@@

  వారికి ఆ చీకటిగదిలో కేవలం రెండు చెక్క వస్తువులే కనిపించాయి.  అవి పాతకాలంనాటి పియానో డెస్క్, సొరుగు లేని చెక్క బల్ల.  'వీటిని యింతకు ముందు ఎప్పుడైనా చూశారా?' అని పెద్దాయన్ని ఆమె వాకబు చేసింది.

"చూసి చాలాకాలమైంది" బదులిచ్చాడతను.  "కానీ నాకు గుర్తు ఉన్నంతవరకూ అటకమీద ఒక గోడకు యివి ఆనుకొని ఉండేవి."

నాన్సీ అసాధారణంగా ఉన్న ఆ పియానో డెస్క్ ను సునిశితంగా పరీక్షించింది.  ఫిప్ తన సంగీతాన్ని దానిలో ఎక్కడైనా దాచి ఉంచాడేమోనని ఆమెకు అనిపిస్తోంది.  ఆమె తన చేతితో పియానోలోని కొన్ని పసుపు మీటలను సున్నితంగా నొక్కింది.  ఆ శబ్దం విన్న ఆమె గుండె జారిపోయింది.

"వీణానాదాన్ని పోలిన ఈ స్వరాలు యింతకు ముందు విన్నాను" ఆమె ఆశ్చర్యంతో అరిచింది.

"ఖచ్చితమేనా?" మార్చ్ అడిగాడు.

"రూఢిగా చెబుతున్నా!"  ఆమె తనలో అనుకొంటున్నట్లు చెప్పసాగింది, "ఆ ఆగంతకుడికి ఈ అటక రహస్యమంతా తెలుసు.  అతను యిక్కడ అన్ని పాటలను కనుగొన్నాడు.  ఒక్కటొక్కటిగా వాటిని పట్టుకెళ్ళి ముద్రిస్తున్నాడు.  ఆ దొంగ మీద కేసు వేయటానికి చిన్న సాక్ష్యం కూడా దొరకటం లేదు.  మెట్ల దగ్గర గోడకంటించిన కాగితం కింద మనకు దొరికిన ఆచూకీ అంతగా ఉపయోగించకపోవచ్చు."

పెద్దాయన నిరాశ నిండిన ఆమె అనుభూతుల్ని పంచుకొన్నాడు.  వారిద్దరూ పియానో డెస్క్ కున్న అన్ని సొరుగులను ఒకదాని తరువాత ఒకటి లాగి చూశారు.  కానీ అవి అన్నీ ఖాళీగానే ఉన్నాయి.

"బహుశా ఈ మీటల అడుగున ఏదైనా రహస్య సొరుగు ఉందేమో!" నాన్సీ అనుమానం వ్యక్తపరిచింది.  ఉన్నట్లుండి ఆమె ఉలికిపడింది.  "గతంలో నేను విన్న సంగీతస్వరాలు పియానోలోని రహస్యంగా ఉన్న సొరుగును తెరవటానికి ఉపయోగించే సంకేతంలో భాగమేమో!"

"అదే సమయంలో టకటకమని దేన్నో తట్టిన శబ్దాలు కూడా వినిపించాయని చెప్పావు కదా!" మార్చ్ ఆమెకు గుర్తుచేశాడు.  "పియానో స్వరాలను మోగించే సమయంలోనే దేనిపైనైనా టకటకమని తట్టాలేమో!  మొత్తం పాటలన్నీ దొంగ పట్టుకుపోయాక, యింత హైరానా పడే మనకు కలిగే ప్రయోజనమేమిటి?"

"పాటలన్నీ దొంగిలించబడ్డాయని మనకు తెలియదుగా!" పెద్దాయనతో నాన్సీ అంది.  "దొంగ కూడా మనలాగే ఒక ప్రయత్నం చేసి ఉండొచ్చు.  అతనికి సరియైన సంకేతం దొరక్క విఫలమై ఉండొచ్చు కదా!"

ఆమె గతంలో తాను విన్న స్వరాలను గుర్తుచేసుకొంటూ ఉన్నదున్నట్లుగా అనుకరిస్తూ పియానోపై మళ్ళీ మళ్ళీ మోగించసాగింది.  అదే సమయంలో రెండవ చేతితో అక్కడున్న వివిధ రకాల చెక్కవస్తువులపై టకటకమంటూ శబ్దం చేసింది.  ఎంతసేపు ప్రయత్నించినా ఫలితం కనిపించక తన ప్రయత్నాన్ని ఆమె విరమిద్దామనుకొంటూండగా, పియానో మీటలకు కొంచెం పైన ఒక సొరుగు తెరుచుకొంది.

"ఇన్ని అవస్థలు పడ్డా ఈ రహస్యసొరుగులో ఏమీ లేవు" పెద్దాయన నిరాశతో మూలిగాడు.  "ఆ దొంగ మనకన్నా ముందే వచ్చి పాటలన్నీ పట్టుకొనిపోయి ఉంటాడు.."

"దీనిలో ఏదో కార్డు ఉంది" అంటూ నాన్సీ సొరుగులోంచి దాన్ని బయటకు తీసింది.  "దీనిపై ఏదో వ్రాసి ఉంది.  తదుపరి చేయవలసిన పనికి యివి ఆదేశాలు కావచ్చు."

"ఏదీ? చదివి వినిపించు" కుతూహలంగా అడిగాడతను.

ఆనందంతో ఆమె నోటి వెంట పదాలు జారిపడుతున్నాయి.  అది భావగర్భితమైన చేతివ్రాతతో ఫిప్ పాటలను దొంగిలించి పట్టుకెళ్ళే వ్యక్తికి, వాటిని తన స్వంత బాణీలుగా ప్రకటించుకొని ముద్రించుకొనే వ్యక్తి యిచ్చిన సందేశం.  ఇది తమకు అద్భుతమైన సాక్ష్యం.  మార్చ్ దాన్ని మరల చదవమని కోరాడు.

" రిగ్గిన్,
మరొక మంచి పాటను కనుక్కొన్నావా?
. . . . .డి."

"డి అంటే డైట్ అంటావా?" మార్చ్ అడిగాడు.

"ఖచ్చితంగా అదే" బదులిచ్చిన నాన్సీ గొంతులో ఆనందం ప్రతిధ్వనించింది.  "కానీ ఈ రిగ్గిన్ ఎవడు?
ఎవడైతేనేం?  పాటలను వెతికే సమయంలో ఈ కార్డును పడేసుకొన్నాడు."

అదే సమయంలో ఎఫీ అటకకున్న తలుపు దగ్గర ప్రత్యక్షమైంది.  "ఎవరూ భోజనాలకు రారా?  ఆలశ్యమైతే పదార్ధాలు చప్పగా చల్లారిపోతాయి."

ఆమె పిలుపుతో అన్వేషణలో ములిగిపోయిన వారు యిహంలోకి వచ్చారు.

"ఎందుకు రాము. ఇప్పుడే వస్తాం" మార్చ్ చెప్పాడు.

"మీ వాలకాలు అలాగ ఉన్నాయేంటి?  ఏమైనా జరిగిందా?" ఎఫీ అడిగింది.

  (తరువాయి భాగం వచ్చే సంచికలో)

No comments:

Post a Comment

Pages