దండాలయ్యా... ఖాకీలూ!
దినవహి సత్యవతి
తలపై టోపీ, చేతిలో లాఠీ ,
నడకలో ఠీవి, మాటలో ధాటి,
మీకు లేరు పోటీ, మీకు మీరేసాటి,
విధినిర్వహణలో మిమ్మెవరుమించలేరయ్యా,
దండాలయ్యా ఖాకీలూ!
ఆకలిదప్పుల కంటేనూ,
ఆలుబిడ్డల కంటేను,
మీ ప్రాణాలకంటేనూ,
జనరక్షణే ముఖ్యమని తలచి కాచేరయ్యా,
దండాలయ్యా ఖాకీలూ!
జనాలను ఇల్లుకదలవద్దని వారించేరు ,
ఇంట్లోనుంటేనే క్షేమమని బుధ్ధి గరిపేరు ,
వినని ఆకతాయిలకు లాఠీ భాషలో చెప్పేరు,
జనానికి కొరోనా సోకకుండగ ఆదుకునేరయ్యా,
దండాలయ్యా ఖాకీలూ!
కొట్లవద్ద వలయంలో నిలబెట్టి కట్టడి చేసేరు,
మందులు సరుకులు సైతం ఇళ్ళకు చేరవేసేరు,
జనాగ్రహాన్ని సహించి ప్రాణాలు కాపాడజూసేరు,
ప్రజా రక్షకులంటే నిక్కముగ మీరేనయ్యా,
దండాలయ్యా ఖాకీలూ!
రేయీపవలూ రోడ్లపైనే మీ నివాసం,
ధృఢసంకల్పమే మీ వజ్రాయుధం,
కొరోనా వ్యాప్తి నివారణే మీ లక్ష్యం,
మీతోడుంటే ఈ పోరాటం గెలిచేమయ్యా,
దండాలయ్యా ఖాకీలూ!
మేటియైన మీ త్యాగనిరతిని,
సాటిలేని మీ సేవాతత్పరతను,
దీటులేని మీ కార్యదక్షతను,
కీర్తించుటకు మాటలు చాలవయ్యా,
దండాలయ్యా ఖాకీలూ!
***********
No comments:
Post a Comment