దేవుడు కనిపించాడు..
వి.యన్.మంజుల
అవును, దేవుడు కనిపించాడు..
నేనేనాడూ ఆయన దర్శనం చేయకపోయినా..
భగవన్నామం పలకకపోయినా...
దేవుడు కనిపించాడు..
నిజం..కళ్ళారా చూసాను..
వికృత కరాళ కాటుకి..
మహమ్మారి వేటుకి..
ఊపిరందక నే ఒరిగిపోతున్న వేళలో..
కళ్ళజీవం కదిలిపోతున్న కాలంలో..
ఆశలసౌధం కూలిపోతున్న క్షణంలో..
ఆత్మీయులు గుర్తొచ్చిన తరుణంలో..
నీకోసం..నేనున్నానంటూ..
శ్వేతవస్త్రధారుడై..
ధవళవర్ణరూపుడై..
మందస్మిత వదనంతో..
మెడలో రక్షాభరణంతో..
అభయహస్తంతో..
సేవకదళ బృందంతో..
దేవుడు కనిపించాడు..
నిజం..కళ్ళారా చూసాను..
శత్రువులనీ, మిత్రువులనీ చూడక,
పేద,ధనిక వివక్షలేక,
కులమత ప్రస్తావన రానీక,
ప్రతిఫలాపేక్ష తలపేలేక,
విసుగన్న ఊసేలేక,
అలుపన్న ఆనవాలులేక,
దైవత్వంమూర్తీభవించిన రూపమై,
మానవత్వం ఘనీభవించిన అఖండమై,
తిమిరాన్ని తరిమే దీపమై,
గమనాన్ని చూపే మార్గమై..
దేవుడు కనిపించాడు..
నిజం.కళ్ళారా చూసాను.
అమ్మని మరిపించి,
నాన్నను తలపించి,
బ్రతుకు ఆశ కల్పించి,
జీవన ధన్యత నేర్పించి,
కర్తవ్య కవచం ధరించి,
ప్రాణమనే వరం ప్రసాదించి,
ఇన్నాళ్ళ జీవితం రెప్పపాటనీ,
ముందున్న బ్రతుకు దిద్దుబాటనీ,
గుణపాఠం నేర్పించి..
నలుగురికీ చేయందించమనీ..
పదుగురి మంచీ ఆశించమనీ..
గీతబోధ వల్లించి,
చిరునవ్వుతో నన్ను సజీవంగా సాగనంపి..
మరో సేవకు పయనమైన
నిశ్వార్ధ వైద్య నారాయణుడికి
శతకోటి వందనాలు చేసాను..
చేతులెత్తి మనసారా మొక్కాను..
నిజం.. దేవుడు కనిపించాడు...
కళ్ళారా చూసాను..
***
Very apt and perfect description .. Excellent.
ReplyDelete