హైదరాబాద్ లోని ప్రాంతాల పేర్ల పుట్టు పూర్వోత్తరాలు - అచ్చంగా తెలుగు

హైదరాబాద్ లోని ప్రాంతాల పేర్ల పుట్టు పూర్వోత్తరాలు

Share This
హైదరాబాద్ లోని ప్రాంతాల పేర్ల పుట్టు పూర్వోత్తరాలు
అంబడిపూడి శ్యామసుందర రావు.



చాలా కాలము వరకు అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక తెలంగాణ రాష్ట్రము విడిపోయే దాకా హైదరాబాద్ మనకు రాజధానిగా ఉండేది. హైదరాబాదు భారతదేశంలో ఐదవ అతిపెద్ద మహానగరం కోస్త, రాయల సీమ ప్రాంత వాసులకు హైదరాబాద్ తో ఎంతో అనుబంధము ఉండేది. ఉద్యోగ వ్యాపారాల  నిమిత్తము అక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతకన్నా ఎక్కువ హైదరాబాద్ కు ఎంతో  ఘనమైన సాంస్కృతిక  రాజకీయ చరిత్ర ఉంది. పురాతన నగరాలలో హైదరాబాద్ ఒకటి. 

హిందూ ముస్లిమ్  సంస్కృతుల సమ్మేళనము హైదరాబాద్: 
హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలకు ఆ పేర్లు ఎలావచ్చాయో చాలా మందికి తెలియదు.  అటువంటి హైదరాబాద్ గురించి మనము తెలుసుకోవలసినది చాలా ఉంది. హైదరాబాద్ చరిత్ర తెలుసుకుంటే ఆ పేర్లు వాటి పుట్టు పూర్వోత్తరాలు తెలుస్తాయి .
1. హైదరాబాద్ నగరము గోల్కొండ  పాలకుడు అయినా కులి కుతుబ్ షా చే నిర్మింపబడింది. ఈయన రాణులలో ఒక హిందూ రాణి భాగమతి చాలా అందగత్తె. ఆవిడ జ్ఞాపకార్ధము మూసి నది ఒడ్డున కట్టిన ఈనగరము  మొదట్లో భాగ్యనగర్ గా పిలువబడేది. కానీ తర్వాతి రోజుల్లో ఇస్లామ్ ప్రభావంతో అన్ని పేర్లతో సహా భాగ్యనగర్ పేరు హైదరాబాద్ గా మారింది. ఈ నగరము ఇరాన్ లోని ఇస్ఫాన్ నగరము నమూనాను పోలి ఉంటుంది.
2. సికిందరాబాద్ కు ఆ పేరు 3వ అసఫ్ జాహి నైజామ్ సికందర్ ఝా వల్ల వచ్చింది. 1806 లో ఈ ప్రాంతము బ్రిటిష్ కంటోన్ మెంట్ గా ఏర్పడింది. అందుచేతనే ఇప్పటికీ సికిందరాబాద్ ను కంటోన్ మెంట్ ప్రాంతముగానే వ్యవహరిస్తారు.
3..హైదరాబాద్ లోని ప్రముఖ వ్యాపార కూడలి కోటి నిజానికి మొదట్లో నైజామ్ గారి ఉంపుడుగత్తెల సంతానము కోసము కేటాయించబడ్డ భవంతి. తరువాత ఈ భవంతి సర్ జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్ అనే ఆంగ్లేయుడు ఖైరున్నీసా ను వివాహమాడటం వలన ఆయనకు నివాస గృహము అయింది. అలాగే ఆవిడ పేరుతో ఏర్పాటు అయిందే ఖైరతాబాద్. వినాయక చవితికి అతి పెద్ద గణేష్ విగ్రహము ఇక్కడే పెడతారు.
4.ఫేమస్ షాపింగ్ సెంటర్ అయినా మోజమ్ జాహి మార్కెట్ (ఎమ్ జె మార్కెట్) చివరి నైజామ్ నవాబ్ రెండవ కొడుకు మోజమ్ ఝా పేరుతో వెలసింది.
5.నైజామ్ కు ఆఫ్రికన్ గార్డ్స్ పేరుతో అశ్విక దళము (గుర్రాల దండు) ఉండేది.
వారికి కేటాయించిన గృహాల ప్రాంతమే ప్రస్తుతము ఏ సి గార్డ్స్ గాపిలవబడే
ప్రాంతము.
6.హైదరాబాద్ లోని మరో ప్రముఖ వ్యాపారకేంద్రము అబిడ్స్  నైజామ్ కు రకరకాల వస్తువులను సప్లై చేసే   ఆల్బర్ట్ అబిద్ అనే జ్యుఇష్ (యూదు) వ్యాపారి యొక్క దుకాణము. పరిసర ప్రాంతాలను అబిడ్స్ గా వ్యవహరిస్తున్నారు. జనరల్ పోస్ట్ ఆఫీసు ఇక్కడే ఉంది.
7.అఫ్జల్ గంజ్ ప్రాంతాన్ని ఐదవ నైజామ్ అఫ్జల్ ఉద్ దౌల ధాన్యము వ్యాపారులకు దానముగా ఇవ్వటము వలన ఆ ప్రాంతానికి అఫ్జల్ గంజ్ అనే పేరు వచ్చింది. ఇక్కడే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉంది. ఈ లైబ్రరీలో దాదాపు 17,000 పురాతనమైన వ్రాత ప్రతులు ఉన్నాయి. ఇక్కడకు దగ్గరలోనే సాలార్ జంగ్ మ్యూజియం కూడా ఉన్నది. ఆర్ టి సి బస్ స్టాండ్ కూడ ఈ ప్రాంతము లోనే ఉంది.
8. సూఫీ సన్యాసి అబ్దుల్ ఉలాయ్ శిష్యుడైన అఘా ముహమ్మద్ దావూద్ పేరు తో వెలసింది ఎమ్ ఐ ఎమ్ పార్టీ హెడ్ క్వార్ట్రర్స్ ఉన్న అఘపురా.
9. శ్రీ వేంకటేశ్వరుని భక్తులైన ఆళ్వారులు చాలా కాలము క్రిందట ఈ ప్రాంతానికి వచ్చి సెటిల్ అవటం వల్ల ఆ ప్రాంతానికి అల్వాల్ అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతములో శ్రీ వేంకటేశ్వరుని దేవాలయము కూడా వున్నది. ప్రముఖ చిత్ర దర్శకుడు శ్యామ్ బెనిగళ్ ఈ ప్రాంత వాస్తవ్యుడే. 10.సికిందరాబాద్ ప్రాంతము  ఆల్వాల్, తిరుమలగిరి, బోయనపల్లి అనే మూడు గ్రామాలవల్ల ఏర్పడింది. బోయనపల్లి పేరు మొదట్లో భువనపల్లి చాళుక్య రాజైన త్రైలోక్య భువనేశ్వరుడి పేరుతో ఈ గ్రామము ఏర్పడింది. కాలక్రమేణ భువనపల్లి కాస్త బోయనపల్లి గామారిపోయింది.
11.ఈ సి ఐ ఎల్ కు సమీపాన ఈ సి ఐ ఎల్ వ్యవస్థాపకుడైన డాక్టర్ ఏ ఎస్ రావు గారి జ్ఞాపకార్ధము ఏ ఎస్ రావు నగర్ ఏర్పడింది.
12.పరుశరాముడి తల్లి రేణుక (ఎల్లమ్మ)  ను  చంప బోయినప్పుడు దాగిన ప్రదేశమే బల్కంపేట లోని ఎల్లమ్మ గుడి అని స్థానికులు చెపుతారు. బోనాల పండుగకు ఈ గుడి ముఖ్యమైనది.
13. ఉస్మానియా యూనివర్సిటీకి దగ్గరలో గల అంబర్ పేట్ ప్రముఖ సూఫీ సన్యాసి హజరత్ అంబర్ బాబా పేరుతో వెలసింది. అక్కడి దర్గాకు ఇప్పటికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
14.నైజామ్ జాగిర్దార్ అయిన అమీర్ అలీ కి నవాబ్ కానుకగాఇచ్చిన ప్రాంతము అమీర్ పేట్ గా అభివృద్ది చెందింది. ఈ ప్రాంతము కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ లతో, పోటీ పరీక్షలకు తర్ఫీదు ఇచ్చే సంస్థలతో నిండి ఉంటుంది. ఈ ప్రాంతము లోనే నిజామియా అబ్జార్వేటరీ (నక్షత్ర పరిశోధనశాల )ఉన్నది.
15. ఓల్డ్ సిటీ లోని బర్కాస్ కు ఆ పేరు నైజామ్ మిలిటరీ బరాక్స్ (సైనికుల నివాసాలు) వల్ల వచ్చింది. ఈ ప్రదేశములో నైజామ్ యొక్క అరబ్బు సైనికులు, అంగరక్షకులు నివాసము ఉండేవారు. ఇప్పటికి వారి వారసులు ఆ ప్రాంతములో నివసిస్తున్నారు. 
16. పైగా రాజవంశానికి చెందిన బషీర్ ఉద్ దౌల అనే ప్రముఖ వ్యక్తి  పేరుతో వెలసినది. హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న బషీర్ బాగ్ ఈ ప్రాంతములోనే!  పైగా ఇక్కడ ప్యాలస్ ఉన్నది.
17. హందా బేగము (నిజామ్ అలీ ఖాన్ భార్య) జ్ఞాపకార్ధము ఏర్పడినది బేగం బజార్ నిజాముల్ ముల్క్. ఈ ప్రాంతాన్ని వ్యాపారులకు వ్యాపారము చేసుకోటానికి దానముగా ఇచ్చాడు. ఇక్కడే హైదరాబాద్ లోని రెండవ పెద్ద చేపల మార్కెట్ ఉన్నది. మొదటి గణేష్ పూజ పందిరి ఇక్కడే మొదలవుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతము హోల్సేల్ మార్కెట్లకు ప్రసిద్ధి.
18. 6వ నిజామ్  కూతురు బషీర్ ఉల్ ఉన్నీసా పేరుతో ఏర్పడ్డ ప్రాంతమే బేగం పేట్. ఈవిడకు ఈ ప్రాంతాన్ని కట్నముగా ఇచ్చాడు. ఇది ప్రస్తుతము ప్రముఖ వ్యాపార కేంద్రము, ఐటి సంస్థలకు కేంద్రముగా ఉన్నది. 1897లో సర్ రోనాల్డ్ రాస్ బేగం పెట్ జనరల్ హాస్పిటల్ లోనే పరిశోధనలు చేసి మలేరియాకు కారణాన్ని కనుగొన్నాడు.
19. చిక్కడపల్లి అనే పేరుకు మూలము  "చిక్కడ్ " అంటే బురద ఈ ప్రాంతములో నాలా (మురుగు కాల్వలు) నుండి వచ్చే బురద పేరుకుపోయేది.  ఆ విధముగా చిక్కడపల్లి అనే పేరు స్థిరపడింది. ఇక్కడి  శ్రీ వెంకటేశ్వర ఆలయము ప్రసిద్ధి.
20. సుల్తాన్ కులీ కుతుబ్ షా నిర్మించిన పెద్ద ఆసుపత్రి వల్ల ఆ ప్రాంతానికి దారుషిఫా అనే పేరు వచ్చింది.
21.నైజామ్ కాలములో ఉత్తరప్రదేశ్ నుండి వలస వచ్చిన వారి వల్ల ఏర్పడినదే ధూల్ పేట్. ఈ ప్రాంతము గణేష్ విగ్రహాల తయారీకి నాటు సారా తయారీకి ప్రసిద్ధి. 
22. మలక్ పేట లోని ల్యాండ్ ఓనర్ దిల్ సుఖ్ రామ్ పెర్షద్ తన భూమిని ప్లాట్లుగా చేసి అమ్మాడు. ఆ విధముగా దిల్ సుఖ్ నగర్ అనే అతి పెద్ద నివాస ప్రాంతము అభివృద్ధి చెందింది ఈ ప్రాంతము వ్యాపార కేంద్రముగాను, విద్యా కేంద్రముగాను అభివృద్ధి చెందింది.
23. ట్యాంక్ బండ్ పక్కనే రామకృష్ణ మఠము ఉన్న ప్రాంతాన్ని దోమల్ గూడ అంటారు. ఈ పేరు రావటానికి కారణము ఆ ప్రాంతములో పూర్వము ఇద్దరు మల్లయోధులు (కుస్తీలు పట్టేవాళ్ళు) ఉండే వాళ్ళుట. దో అంటే ఇద్దరు, మల్ అంటే మల్ల యోధులు - అన్న అర్ధం వచ్చే పేరిది.
24. నైజామ్ కు ఉండే అబిసీనియన్ అంగరక్షకులు ఉండే ప్రాంతము హబ్సిగూడ గా ప్రసిద్ధి చెందింది. ఆ అంగరక్షులను స్థానికులు హబ్సీస్ అని వ్యవహరించేవారు.
25. ఓల్డ్ సిటీలోని రెడ్ లైట్ ఏరియాను మెహబూబ్ కి మెహందీ అంటారు. ఇది ప్రస్తుతము అంత  ప్రాముఖ్యమైనది కాదు.
26. పాలవ్యాపారుల (గౌలిస్) గ్రామము గౌలిగూడ నైజామ్ కాలములో ఇక్కడ నైజామ్ సొంత విమానాలను ఉంచేవారు.  ప్రస్తుతము ఈ స్థలములో బస్ రిపేర్ వర్క్ షాప్ ఉన్నది.
27. ప్రస్తుతము ఫతేహ్ మైదాన్ క్రికెట్ స్టేడియమ్ ఉన్న స్థలాన్నిగోల్కొండ కోటను స్వాధీనము చేసుకోవటానికి వచ్చిన మొఘల్ సైనికుల స్థావరంగా ఉండేది. మొఘలులు గోల్కొండను స్వాధీనము చేసుకున్నాక ఈ మైదానాన్ని ఫతేహ్ మైదాన్ గావ్యవహరించారు. ఫతేహ్ అంటే గెలుపు .
28. నైజామ్ నవాబ్ తన జనరల్ ఎల్ ఎల్డ్రోస్ తో  సర్దార్ పటేల్ కు లొంగి పోయింది బొలారం ప్రాంతములోని భవంతిలో. ఆ భవంతి యే ప్రస్తుత రాష్ట్రపతి నిలయము. అంటే దక్షిణాదిలోని రాష్ట్రపతి అధికారిక విడిది. 
29. గోల్కొండకు చెందిన 16 వ శతాబ్దపు ప్రముఖ సూఫీ సన్యాసి హజ్రత్ హుస్సేన్ షా వలి జ్ఞాపకార్ధము నగరము యొక్క నీటి అవసరాలను తీర్చటానికి ఏర్పాటు చేసినదే హుస్సేన్ సాగర్  హుస్సేన్ సాగర్ లో బౌద్ధ విగ్రహము, ట్యాంక్ బండ్ చూపరులను ఆకర్షిస్తాయి.
30.  6వ నైజామ్ మహబూబ్ అలీ ఖాన్ చే సైఫాబాద్ ప్యాలెస్ లో ప్రస్తుత సెక్రటేరియట్ చాలా మటుకు ఉంది.
31. చివరి నైజామ్ కోడలు యువరాణి నీలోఫర్ కోరికపై నైజామ్ నిలోఫర్ ఆసుపత్రిని నిర్మించాడు. ఈ ఆసుపత్రి పూర్తిగా ఆడవారికి, చిన్నపిల్లలా కోసము నిర్దేశింపబడుతుంది.  ముఖ్యముగా ప్రసవాలకు అప్పుడే పుట్టిన శిశువులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. నిలోఫర్ ఒట్టోమన్ రాజవంశములో ఆఖరి యువరాణి రెండవ ప్రపంచ యుద్ద  సమయములో ఆవిడ ఈ ఆసుపత్రిలో నర్స్ గా పనిచేసి సేవలందించింది.
32. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలి  తండ్రి అఘోరనాధ్ చటోపాధ్యాయ నైజామ్ కాలేజీ మొదటి ప్రిన్సిపాల్.
33. తార్నాక అనే పేరు ఆప్రాంతానికి టెలిగ్రాఫ్ ఆఫీసు, చెక్ పోస్ట్ ఉండటం వల్ల వచ్చింది. తార్నాక అనే మాటకు అర్ధము వైర్డ్ (తీగలు)  చెకే పోస్ట్.

ఇవండీ హైదరాబాద్ లోని ప్రాంతాల పేర్లు, వాటి పుట్టుపూర్వోత్తరాలు. ఇవి కాకుండా పెరిగిన జనాభాకు అనుగుణముగా అనేక కాలనీలు ఏర్పడ్డాయి.
***

No comments:

Post a Comment

Pages