ఇది సమస్య కాదా?
డా.లక్ష్మీ రాఘవ
ఎప్పుడూ భర్త వల్ల కష్టాలు పడే భార్య, కోడలి తప్పులెన్నేఅత్తలు, కట్నాలు కోరి కోడలిని సతాయించే అత్తమామలు, అదును చూసుకుని విధవరాలైన కోడలిని తారుస్తున్నారని మహిళా సంఘాల ఘోష! రాసే రాతలు అన్నీ ఆడవాళ్ల కష్టాలే!
ఇక టి.వి. సీరియల్స్ గురించి చెప్పే పనేలేదు. అత్తను మించి ఆలోచించే కోడళ్ళు... ఎత్తుకు పై ఎత్తు వేస్తూ, ప్లాను మీద ప్లానులు వేస్తూ విలన్లుగా మారిపోయిన ఆడవాళ్ళపై ఏళ్ల తరబడి వచ్చినా చూసే వారే ఎక్కువే... ఇక్కడా అంతా ఆడవాళ్ళే!
ఇప్పుడు మగవాడితో సమానంగా ఆడవారు ఉద్యోగాలు ఎంత చేసినా ఆది నుండీ ఇప్పటి దాకా రోజంతా ఆఫీసులో కష్టపడి పని చేసి అటు బయటా, ఇంట్లో నూ అన్నీ భరిస్తూ
నలిగిపోయే మగాడి పై ఆలోచన చెయ్యరే! మగవాడికి సమస్యలే ఉండవా?
ప్రతి ఆడదాని జీవితం లో తప్పనిసరిగా వుండే మగవాడి పాత్ర ఏమిటి? గయ్యాళి భార్యలతో వేగే భర్త, భార్య కోరికలకు అవినీతి పాలబడి, అ.వి.శా. కు దొరికిపోయిన భర్త! పట్టుబడిన వ్యక్తి దగ్గర దొరికే బంగారం గమనిస్తే అన్నీ ఆడవాళ్ళకు చెందినవే వుంటాయి...మూలకారణం ఆడది అయినా శిక్షించ బడేది మగవాడే!!!
ఏమిటీ ఈ విధంగా ఆలోచన చేస్తున్నాడు తను?...ఆలోచనలు మానాలని వాష్ బెసిన్ దగ్గరికి వెళ్లి ముఖం చల్ల నీళ్ళతో కడుక్కున్నాడు. కొంచం రిలీఫ్ వచ్చింది.
ఇలాటి ఆలోచనలే తనకు రాకూడదు. తనజీవితం కూడా ఆడవాళ్ళతోనే ముడి పడి వుంది.
నాన్న దేవుడిని చేరాక, అన్న అమెరికా వెళ్లి పోయాక, చెల్లి రమ అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకున్నాక మిగిలింది అమ్మా, తనూ, భార్య నందిని, కూతురు రాశి. అంటే ముగ్గురు ఆడవాళ్ళ మధ్య తను...
తన సమస్యలు అసలు సమస్యలే కావు...కానీ ఎప్పుడైనా కొంత ఆవేదన! ఎలా అంటే ...
మొబైల్ మోగింది. ఆలోచన ఆగింది.
రవి ఫోను.
“ప్రసాద్, నెల్లూరు దగ్గర లారీ కి ఆక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడే ఫోను వచ్చింది. డ్రైవర్ కు గాయాలు..హాస్పిటల్ చేరినాడట. నీవు వెంటనే బయలుదేరాలి. డ్రైవర్ ను పలకరించి ఇన్ష్యూరెన్స్ కొరకు లారీ ఫోటోలు తీయించి. అక్కడి ఏజెంట్ ను మేనేజ్ చెయ్యాలి. నేను పెళ్ళికి వెళ్ళాలి. వెళ్ళక పోతే నాభార్య సంధ్య తో నాకు ఎంత ఇబ్బందో నీకు తెలుసు గదా. ATM లో డ్రా చేసుకుని వెళ్ళు. రేపు మళ్ళీ వచ్చెయ్యచ్చు..సరేనా?”
“వూ“ అన్న ప్రసాద్ సమాధానం వింటూనే ఫోను పెట్టేసాడు రవి.
రవి కి “నో” అని చెప్పే పరిస్థితి లేదు.
ప్రసాద్ ఇంతకు ముందు ఆఫీసరుగా పనిచేసినా ఆ కంపెనీ మూతపడటం తో స్నేహితుడి రవి లారీ ఏజెన్సీలో పనికి చేరాడు . ఇంట్లోనుండే పనిచేయ్యచ్చు. కంప్యూటర్ ద్వారానే బుకింగులు, లారీల ట్రాకింగు, పేమెంట్ల గురించిన పనులలో రవికి హెల్ప్ చేస్తాడు. జీతం పెద్దగా ఉండక పోయినా ఇంట్లోంచి పని చెయ్యడం బాగుంది. ముసలివయసులో అమ్మను పనివాళ్ళ మీద వదలటం కన్నా తనే తోడుగా వుండటం మేలనిపించింది.
ఇంట్లో అమ్మను వదిలి ఒక రాత్రి పూర్తిగా నందినిపై వదిలి వెళ్ళేది ఎంత కష్టమో.
కానీ తప్పదు. వెంటనే నందిని ఆఫీసుకు ఫోను చేసాడు. నెల్లూరు కు వెళ్ళాల్సిన అవసరం గురించి చెప్పాడు. నందిని ఆఫీసులో పర్మిషను తీసుకుంటానంది.
అమ్మను లేపి నెల్లూరు సంగతి చెబితే నిస్సహాయంగా చూసింది “వెళ్ళాలా”అన్న విధంగా.
నందిని వచ్చేస్తుందనీ అంతవరకూ తోడుగా ఉండమని పని మనిషికి చెప్పి వెడతాననీ తలుపు జాగ్రత్తగా వేసుకోమని చెబుతూ బయటకు నడిచాడు ప్రసాద్.
మొదటగా ATM లో డబ్బు తీసుకుని, టాక్సీ ఎక్కాడు.
రెండుగంటల ప్రయాణం నెల్లూరుకు. సీటు లో వెనక్కి వాలి నిస్సహాయంగా చూసిన అమ్మ చూపు గుర్తు చేసుకున్నాడు...
ఆఫీసులో నందినికి పర్మిషన్ దొరకడం ఎంతకష్టమో తెలుసు. అమ్మ మోకాళ్ళ ఆపరేషనుకు వున్న లీవులన్నీ ఖర్చయ్యాయి.
ఇలా ఆలోచిస్తూ వుంటే తన జీవితం లో ముఖ్యమైన పాత్ర పోషించేవారంతా ఆడవాళ్లే! అనిపించింది.
చిన్నప్పుడు అమ్మ కూచి. అన్న రాజా పైచదువులకు పట్నం వెళ్ళినా తను వున్న ఊర్లోనే చదువుకున్నాడు.ఇంజనీరై అన్న అమెరికా వెళ్ళినా అమ్మ నాన్నలకు తనేతోడు గా నిలిచాడు. చెల్లి రాధ భర్త పెట్టి బాధలు భరించలేక ఆత్మహత్య చేసు కోవటం తీరని బాధను కలిగించింది.
తను అమ్మ,నాన్నలు చెప్పిన సంబంధం అని నందినిని వివాహం చేసుకున్నాడు. అన్ని విధాలా అనుకూలవతి అయిన నందిని ప్రేమకు ఫిదా అయినాడు. తరువాత తన ఇంట్లో వెలసిన ఆనందానికి మూల కారణం కూతురు రాశి! కొద్ది కాలం ఉద్యోగరీత్యా సిటీ చేరాల్సివచ్చింది. సంసార బాధ్యతలు పెరిగాక నందిని ఉద్యోగం లో చేరింది. నాన్న హటాత్తుగా పోవడం తో అమ్మ మాదగ్గరికి వచ్చేసింది. అమెరికా నుండీ రాజా అప్పుడప్పుడూ వచ్చిపోవడం తప్పించి పెద్దగా పట్టించుకుంది లేదు.
తరువాత తనకు ఆఫీసరుగా ప్రమోషన్...అన్నీ క్రమశిక్షణ తో సర్దుకుంటూ ఉద్యోగం చేస్తూ అన్నింటా చేదోడుగా నిలిచే నందిని!
క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేరాశి! పెద్దదిక్కుగా అమ్మ....ఇలా ముగ్గురు ఆడవాళ్ళ మధ్య అందమైన తన జీవితం!! ఇంకేమి కావాలి?? అనుకుంటూ వుండగా పడింది పెద్ద బాంబు!
తను పని చేసే ప్రైవేటు కంపెనీ సడన్ గా మూత పడింది. ఉద్యోగం ఊడింది.
నందిని ఆదాయమే అండగా నిలిచింది. రాశి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ కొచ్చింది.
తిరిగీ ఉద్యోగాలకై వేట. ఒకటీ రెండూ చేరినా నిలదొక్కుకునే పరిస్థితి లేదు.
అలాటి సమయంలో అమ్మ జబ్బుపడటం...నడవలేక పోతే తప్పని పరిస్థితి లో మోకాళ్ళ ఆపరేషన్. అన్న రాజా కొద్దిగా డబ్బు రూపేణా సహాయం చేసినా నిరంతరం కనిపెట్టుకొని చూసేది, చూడబోయేది తనేగా?? ముసలితనం లో తోడు అవసరం కానీ బాంకు బాలెన్స్, ఫోను పలకరింపూ కాదుగా...ఇదీ అని రాజా కు చెప్పాలని కాదు. కొన్ని సార్లు మనిషి ఎదురుగా వుండి చెయ్యడం ఎంత అవసరం అని తెలుసుకోవాలి కదా.
అమ్మ కూడా అంతే ఎంతసేపూ అమెరికాలో అన్న ఎలా ఉన్నాడో అని బెంగ. ఎదురుగావున్న తను ఎన్నింటికి అడ్జెస్ట్ అవుతున్నాడో అర్థం చేసుకోదు.
అమ్మ కళ్ళు కాటరాక్ట్ వచ్చి చూపు మందగించింది. డయాబెటిస్ కొంచెం తగ్గితేనే ఆపరేషన్ అంటే ఇంకొంచం కష్టాలు ఎదురైనాయి. అమ్మకు తోడు మనిషి అవసరం ఇంట్లో. అందుకే ఉద్యోగాల వేట మాని తన ఫ్రెండ్ రవి చేస్తున్న లారీల డీలర్ షిప్ కంపేనీలో ఉద్యోగానికి సరే అన్నాడు. జీతం తక్కువే అయినా ఇంట్లోనుండే పనిచేయ్యచ్చు అన్నది ఆశక్తి కరమైన పాయింట్. నందిని పర్మనెంట్ ఉద్యోగమే కొండంత అండ!
పైనలియర్ ఎగ్జామ్స్ ముందు రాశి చెప్పిన విషయం నెత్తిమీద చిన్న బండ రాయితో కొట్టినట్టయింది. రాశి తన సీనియర్ ని ప్రేమిస్తూందట. అతడు ఉద్యోగం లో చేరినాడట. తనకు ఉద్యోగం వచ్చాక ఇంట్లో చెప్పాలని అనుకుందట. మొదటగా నందినితో చెప్పింది. నందిని నాతో చెప్పగానే షాకు తిన్నాను. కులం వేరుగా వుండటం నాకే నచ్చక పోయినా అమ్మ ఏమంటుందో...అన్న భయం పట్టుకుంది.
తనకు నచ్చినవాడు అన్న ఒక్క పాయింటు తప్పించి వాళ్ళు ఎలాటి వారో, బాక్ గ్రౌండ్ ఏమీ తెలియకుండా ఎలా ఓకే చెయ్యడం? ఇంకా నాకు భయమేసింది అమ్మ ఎలా తీసుకుంటుందో అని ఇప్పుడు ఆమెకున్న డెలికేట్ ఆరోగ్యం లో ఏమవుతుందో అనీ...నా మనసులో మాట తెలిసుకున్నట్టుగా “అతను మంచివాడు డాడీ, ఫామిలీలో అందరూ బాగా చదువుకున్న వాళ్ళు. కులం గురించి ఆలోచించకు. నన్ను బాగా చూసుకుంటాడు. అయినా కులం, గోత్రం అంతా బాగా విచారించి పెళ్లి చేస్తే రాధత్త జీవితం ఏమైంది? ఆయన పెట్టె కష్టాలకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది...” రాశి మాటలతో చెల్లి రాధ కళ్ళముందు కదలాడింది. ఇంకేమి సమాధానం చెప్పాలి?
“ముందు మీరు చెప్పండి డాడీ. మీరు ఓకే అంటే నాన్నమ్మతో నేను మాట్లాడతా“ అంది ధైర్యంగా. కూతురి ముందు దీనంగా నిలబడ్డం తప్ప చేసేదేముంది?
రాశి ఏమి చెప్పిందో తెలియదు కానీ ఆ రోజు రాత్రే అమ్మ“రాశి కి నచ్చినవాడితో పెళ్ళిచేసేయ్యిరా. నాకేమీ అభ్యంతరం లేదు. రాధను పోగొట్టుకున్నాం చాలు” అంటే ఎంత ఆశ్చర్యం వేసిందో. కాలం తో బాటు పెద్దవారి ఆలోచనలూ మారుతున్నాయి అనిపించింది. ఇంటి కి పెద్దగా ఆమె నిర్ణయం శాసనమే గదా.
‘కూతురి సుఖం ముఖ్యం’ అనే నందిని.
‘నా ఇష్టాన్ని ఎందుకు కాదంటారు?’ నిలదీసే కూతురు.
‘దాని ఇష్టం నీవెందుకు వద్దనేది?’ నిర్ణయం చెప్పే అమ్మ.
నా చుట్టూ వున్న ముగ్గురు ఆడవాళ్ళూ శాసించే వాళ్ళే!! తను కేవలం కర్త నేనా?
రాశి పెళ్లి తరువాత జీవితం మరీ విసుగ్గా వుంది...
రోజంతా అమ్మతో ముడి పడిన జీవితం!! తనెలా వున్నా ఆవిడ ఆనందంగానే వుంది.
అమ్మకు రాసి ఎంతో ఇష్టం గా తీసిచ్చిన కొత్త స్మార్ట్ ఫోనుతో ఆమె రోజంతా బిజీ. పొద్దున్న పూట తన చెల్లెళ్ళు ఇద్దరితో ఫోనులో మంతనాలు. తిండి, రోజూ టంచనుగా అమెరికా నుండీ రాజా ఫోను!! గంటకు పైగా సంభాషణ.
అయినా రోజూ మాట్లాడుకోవడానికి ఏముంటాయి చెల్లెళ్ళకు, కొడుకుకూ??
ఇంట్లో ఇంత చేస్తున్న తనతో మాట్లాడడానికి అమ్మకు తీరికే వుండదు. భోజనం చేసేటప్పుడు వంటల గురించి తప్ప!
నందిని కి తీరిక వుండదు ఉద్యోగం తో!
రాశి కొత్త సంసారం లో నేనెక్కడ??
పోనీ అన్నగారు తలుచుకుంటారా అంటే అమ్మతో గంటలు, గంటలు మాటలు...అమెరికాలో ఉంటూ అమ్మతో ఫోనులో మాటలు చెబితే చాలా? రోజూ రోజూ బాధ్యతగా చూసుకుంటేనే కదా తెలిసేది??
ఎప్పుడూ ఆడవాళ్ళు కష్టపడతారనే ఘోషిస్తారు. ఒక్కరైనా నాలాటి మగాడు పడే బాధల్ని గురించి ఆలోచించారా??
బాధ్యతలు నిర్వర్తించడం కష్టం అని కాదు... కొంచెం ఇంపార్టెన్స్, కాస్త ఓదార్పు, కాస్త సాయం అవసరం లేదా?
తన బాధలు ఎవరితో చెప్పుకోవాలి??
ఉండబట్ట లేక ఒక రోజు రవితో చెప్పుకున్నాడు. దానికి రవి సమాధానం విన్నాక ఆశ్చర్యపోవడం తనవంతయింది.
రవి భార్య కూ, రవి తల్లికీ అస్సలు పడదట. ఆ కారణం గా రవి తన తల్లి దండ్రులని ఇంకో ఇంట్లోకి షిఫ్ట్ చేసాడు. రవి నాన్న పెన్షన్ సరిపోదని తను కాస్త సాయంచెయ్యక తప్పదు అనగానే ససేమిరా అని మొండికేసిందట భార్య సంధ్య. అందుకే సంధ్యకు తెలియకుండా హెల్ప్ చేస్తాడట. రవి పిల్లలనిద్దరినీ కూడా నాన్నమ్మ దగ్గర కాకుండా చూసుకుంటుందిట సంధ్య. ఏనాడైనా భార్యా పిల్లలతో ట్రిప్ వెళ్లి వస్తే ‘మాకూ ఎక్కడైనా తిరగాలని ఉంటుందిరా...’ అనే అమ్మకు సమాధానంగా వాళ్ళతో ఏదైనా యాత్రలకి తీసుకు వెడతాడట. నాన్నగారి లాగా అన్నీ మౌనంగా తీసుకోవడం చేతకాదుట !
“ఇద్దరు స్ట్రాంగ్ ఆడవాళ్ళ మధ్య నేను ఎలా వున్నానో ఎవరితో చెప్పుకోను?” రవి మాటలకి బాధేసింది. ఇంకానయం నాకు ఇలాటి ప్రొబ్లెంస్ లేవు అనుకున్నా మనసు ఏదో ఆప్యాయత కోరుకుంటూనే వుంటుంది!!
నాజీవితంలో ఏదో శూన్యం వుంది. కొంత ఆప్యాయత అవసరం అనిపిస్తుంది. రొటీన్ గా జరిగిపోతూ వుండాల్సిందేనా?
ఎవరితో చెప్పుకోవాలి?
ఎలా చెప్పుకోవాలి?
ఎందుకు ఇది సమస్య కాదు...
“నెల్లూరు వచ్చాం సార్..” డ్రైవర్ అన్న మాటతో ఉలిక్కి పడ్డాడు ప్రసాద్.
****
నెల్లూరు లో పని ముగించుకునే దానికి రెండు రోజులు పట్టింది. వెనక్కి వచ్చి అలసి పోయిన కారణంగా స్నానం చేసి పడుకున్నాడు ప్రసాద్.
అమ్మ వచ్చి తల మీద చేయివేసి వెళ్ళటం లీలగా అనిపించింది ప్రసాద్ కు.
మగతలో ఏదో మార్పు అనిపిస్తోంది.
“నీవు లేకపోతే చాలా కష్టమయిందిరా ప్రసాదూ...” ఆప్యాయంగా పలకరించిన అమ్మను ఆశ్చర్యంగా చూస్తూ “అదేమీ నీ పెద్దకొడుకు ఒక గంట, మీ చెల్లెళ్ళతో కొన్ని గంటలూ ఫోనులో మాట్లాడుతావు గదా. ఇక మిగిలిన టైము లో భోజనం, నిద్ర అంతే కదా. మధ్యలో నేను లేకపోతేనేమి?”
“నీవుంటే నిశ్చింత రా...అప్పుడే ఫోనులో మాటలు. రాజా దూరాన వున్నాడు అని ఆలోచిస్తాను తప్ప నీవు లేకపోతే నేను ఇలా వుండే దాన్నా?” ఇన్నాళ్ళకి అమ్మనోట మంచిమాట!
రాత్రికి నందిని “మీరు లేక పోతే అమ్మకు ఏదైనా ఇబ్బంది ఉంటుందేమోనని ఒకటే టెన్షన్ అనుకోండి.ఆఫీసుకు వెళ్ళినా ఇంటి మీదే ధ్యాస!” అని ఆప్యాయంగా భుజం మీద వాలితే ఆ క్షణం శాశ్వతమవ్వాలని అనిపించింది.
మరురోజు రాశి ఫోనులో “ డాడీ,మీరు నెల్లూరికి వెళ్లారట కదా నాతో చెప్పలేదే? సేఫ్ గా వెనక్కి వచ్చారని ఎంత సంతోష మైనదో. నెల్లూరు రోడ్ కూడా అంత బాగా లేదని విన్నాను. నెక్స్ట్ టైం మీకు ట్రిప్ పడితే నాతో చెప్పండి డాడీ....” ఆడపిల్లకి ప్రేమ ఉండదని ఎలా అనుకునాను??
నేను అనుకున్న సమస్యలన్నిటికీ సమాధానం దొరికింది. మనిషి ఎదురుగా లేకపోతే విలువ తెలుస్తుందేమో ..
అన్నీ సినిమా రీలులాగా కనిపిస్తూంటే ఉలిక్కిపడి ఒళ్ళు జలదరించింది ‘కొ౦పతీసి ఇదంతా కల కాదు కదా’ అని చేతిమీద గిచ్చుకోవాలసి వచ్చింది.
ఇలా అయితే నా సమస్యలు తీరినట్టేనా??
ఆడవాళ్ళ మనసులు నాకు అర్థం అయినట్టేనా?
అన్నీ నేనూహించుకున్నవేనా? జీవితం లో ఒక కిటికీ లో చూపిన సినిమా లాగా కల ఏమైతేనేమి??
నెక్స్ట్ డే రవికి ఫోన్ చేసాను “కంపెనీ తరపున ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు చెప్పు రవీ..” అని!
నాకూ ఒక మార్పు కావాలి మరి!
***
No comments:
Post a Comment