జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 29 - అచ్చంగా తెలుగు
జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 29
చెన్నూరి సుదర్శన్  



 (జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్  తన  గత జ్ఞాపకాల్లోకి జారిపోతాడు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను  మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి  అనుభవాలను వారితో  పంచుకుంటూ ఉంటాడు.)  
మాట తప్పకుండా ప్రభాకర్ అనితల వివాహానికి హాజరయ్యాను. వారు చూపించిన అపురూప ఆదరాభిమానాలను నా జీవతంలో మర్చిపోలేను.. 
ఆ సంవత్సరం వేసవి సెలవుల్లో సూరారం ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్‍ను కలిసి ఎస్.ఎస్.సి. పిల్లల చిరునామాలు సేకరించాను.
కొంతమంది స్టాఫ్ సహాయంతో పిల్లల తల్లిదండ్రులను కలిసి మన ఊరి  కాలేజీ అంటూ వారి పిల్లలు కాలేజీలో చేర్పించాలని  ప్రోత్సహించాను. శతవిధాలా మా ప్రయత్నం మేము చేసాం. యాదగిరి ప్రిన్సిపాల్ సైతం మాతో కొద్ది రోజులు తిరిగాడు. మా కష్టానికి ఫలితం దక్కింది.
కొత్త అకాడెమిక్ ఇయర్‍లో నిండు గోదావరిలా సూరారం కాలేజీ విద్యార్థినీ, విద్యార్థులతో  కళ, కళలాడింది.
ఇది ఊహంచని ప్రైవేటు కాలేజీ వాళ్ళు మా గేటు ముందుకు వచ్చి పిల్లలను అడుక్కోవడం మొదలు పెట్టారు.
ప్రతీ రోజూ ఆలస్యంగా వచ్చి.. ముందే వెళ్ళిపోయే యాదగిరి ప్రిన్సిపల్ దారిలోకి వచ్చాడు.
ఈ పరిణామాన్ని చేజార్చుకోవద్దని లెక్చరర్ల వెన్నుతట్టాడు.
***
నా జూనియర్ లెక్చరర్  సర్వీసనుసారం  అంచెలంచెలుగా పేపర్ వాల్యూయేషన్ క్యాంపులో అన్ని రకాల విధులు నిర్వహించాను.
ఆ సంవత్సరం నేను  చీఫ్ ఎగ్జామినర్‍గా క్యాంపులో జాయినయ్యాను.
సెయింట్ మేరీ జూనియర్ కాలేజీ సికిందరాబాదులో మెదక్, నల్గొండ జిల్లాలు మిళితమైన క్యాంపది.
“మీరు ఈ రోజు ఉదయం స్టాఫ్ రూంలో కూర్చొని పేపర్ వాల్యూయేషన్ మీద సెటైర్లు వేసుకోవడంవిన్నా” న్నాడు సూర్యప్రకాష్. స్టాఫ్ అంతా ఖంగు తింది.
“ఆగమయ్యా.. మరొక సారి టీ తీసుకురా.. “ అంటూ పిలిచి డబ్బు లిచ్చాడు. ఆగమయ్య ఫ్లాస్క్ తీసుకొని పరుగెత్తాడు. స్టాఫ్ కళ్ళు గోడ గడియారం వైపు మళ్లడం గమనించాడు సూర్యప్రకాష్.
సమయం ఐదు కావస్తోంది.
 చిరు నవ్వు నవ్వుతూ  స్టాఫ్ వైపు తిరిగి “మరో అర గంటలో అయిపోతుంది..” అన్నాడు.
“ఫరవా లేదు సార్.. కానివ్వండి.. చాలా కుతూహలంగా ఉంది” అంటూ తెలుగు లెక్చరర్ లేచి గోచీ సర్దుకొని తిరిగి కూర్చున్నాడు.
స్టాఫ్ ఉత్సాహంగా వినసాగింది. జోగయ్య పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా ఉంది.
“మీరు పిల్లలు రాసే సమాధానాలను నెమరు వేసుకుంటూ జోక్స్ వేసుకున్నారు గాని విద్యార్థులు జీవితాలతో చేలగాటాలాడుకునే మన లెక్చరర్ల గురించి చెబుతా వినండి..” అంటూ సూర్యప్రకాష్ మళ్ళీ చెప్పసాగాడు.
***
(సశేషం)

No comments:

Post a Comment

Pages