టెంకాయచిప్పల వెంకటేషు
(మా జొన్నవాడ కధలు-3)
- టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)
"ఒరే పుల్లయ్యా! నాలుగు దేవళాల్లో టెంకాయ చిప్పలు బస్తాలకెత్తుకోని పోవాల గదా నేను! రోజూ జెప్పాలంటరా! ముందల కాడనే బస్తా కట్టిపెడితే నీ సొమ్ము ఏంబోతుందీ అంటా!"
"యోవ్ వెంకటేసా! గమ్మునుండబయా... మేమీడా …ఆపట్నా… ఖాలీగా కాళ్ళు బార్లా…..జాపుకోని కూకుంటున్నామా ఏంది? మాకేరే పన్లుండవా! ఏంది అట్ట మాటాడతా వుండావు" గొంతు పెంచాడు.
"ఓరే పుల్లిగా! ఎదవ ఎకసెకాలొద్దురో!.... నీకున్న అర్జెంటు పన్లేందో… నీ ఎవ్వారాలేందో నాకు బాగా తెలుసు. నువ్వు మొన్న నెల్లూర్లో అర్చనా హాలుకు మాట్నీ సినిమాకు ఎవరో ఒక ఆడమనిషితో బొయిండ్లా! మా బావమరిది జెప్పాడ్లే! ఎదవపోజులకు బోబాక! నాకన్నీ దెలుసురో!"
"అయ్యోరో! నీకు పున్నెముంటాది. ఈ మాట దేవళంలో పూజారిగ్గాని, గుర్నాధం గుమాస్తాగ్గానీ చెప్పబాక! లేనిపోని తకరాదవుద్ది. మొన్న స్టవునస్పేటకు బొయ్యి… టైముందిగదా అని… ఆపాట్న సినిమాకు బొయినా. ఆ అమ్మి పిన్నివరసవుద్దినాకు. మా యింట్లో ముక్యంగా దెలవనీబాక. ఆడోళ్ళతో రచ్చ! సుబ్బమ్మ అసలే రాక్షసి. పెద్ద గలభా జేసుద్ది." బుస్సున గాలిబొయిన బుడ్డలా తగ్గిపొయ్ గొంతు తగ్గించి మాట్లాడాడు.
"ఎహ! పనికిమాల్నెదవా! నాకెందుకురా నీ బాడుగోలు యవ్వారాలు. ఎక్కడైనా ఏడువ్. ఏమైనా ఏడువ్. నువ్వు నేనొచ్చేతలికి బస్తాలు గట్టి పెట్టు చాలు"
" అట్నేలేయ్యా... సామీ! రేపట్నించీ అట్టాగే జేస్తా. నీకొక యిషయం జెప్పాల. పూజారయ్యోరు నిన్నొకపాలి ఆఫీసులో గలవమని జెప్పారు"
"ఏంటో కతా!"
"నాకు దెలవదయ్యోరా! నేను ఈడ బస్తా రెడీ జేస్తాగానీ….. నువుబొయి కలిసిరా పో!.. మళ్ళీ నామీద బడి ఏడస్తారు ఆళ్ళు"
ఇంతలో గుర్నాధం బయటికి రానే వచ్చాడు. "వెంకటేసా! ఎట్టా వుండాది నీ చిప్పల యాపారం?"
"ఏదో అలవాటుగా చేస్తున్నా గాబట్టి జరుగుబాటవుతున్నాదిలే గురునాధమా! లాబాలు లేకపొయినా కాలమెళ్ళిపోతుళ్ళా! "
"అవున్లే సామీ! ఎవరైనా మాకు యాపారంలో లాబాలొచ్చాయని జెప్తారాంటయ్యా నా పిచ్చిగానీ!"
"నిజమయ్యా! ఒట్టు"
"ఇంత చిన్న విషయానికి ఒట్లు గిట్లు ఏంబల్లేదు గానీ…. అయ్యోరో!..... ముక్యమైన ఇషయం ఏందంటే...చిప్పరేటు యెల్లుండి ఒకటో తేదీ కాడ్నుంచీ ఎనిమిది రూపాయలు జేశాం."
"అయ్యా! అదేందయ్యా! ఎంతోకాలంగా మిమ్మల్ని నమ్ముకున్నోణ్ణి. నా పొట్ట గొట్టబాకండి"
అప్పుడే వచ్చిన పూజారి కలిపించుకుంటూ "వెంకటేషా! నువ్వు ఏమీ అనుకోబాకబ్బాయా!. మా ఇబ్బందులు మాకున్నాయి. సంవత్సరానికి ఇంతని బోర్డు ఛైర్మన్‌సారు టార్గెట్ పెడతాడు. ఈసారి మా టార్గెట్ చానా పెంచేశారు."
"ఏం టార్గెట్లో ఏందో! సామీ...మీరే కాస్తా చెప్పి చూడాల. నాకు నష్టం వస్తుందయ్యా."
ఏమీ లాభంలేదని వాళ్ళిద్దరూ కరాఖండీగా ఒకే మాట చెప్పేసరికి తలొంచుకొని, చిప్పల గోతాలేసుకుని, కామాక్షమ్మకు మొక్కున్నాడు. పాత రేట్లకే చిప్పలు దొరికేటట్టు చెయ్యి తల్లీ…. నీకు వచ్చే తిర్నాళ్ళకి వెండి కిరీటం జేయిస్తామ్మా... నువ్వే కడుపులోబెట్టుకోవాల... అమ్మణ్ణమ్మా! తల్లీ అని గట్టిగా నమస్కారం చేసి…గట్టిగా చెంపదెబ్బలేసుకుని యింక అమ్మణ్ణమ్మే దిక్కు నాకు అనుకుంటూ.. దిగులుగా ఆటో దోలుకుంటూ పొయ్యాడు వెంకటేషు.
* * *
"ఓనర్ గారున్నారా?" అడిగాడు కోమలవిలాస్‌లో చిప్పల బస్తా డెలివరీ ఇచ్చిం తర్వాత నోట్‌బుక్‌లో సంతకం తీసుకుంటూ.
"ప్రసాద్‌బాబుగారా! పైన ఆఫీసురూములో ఉండాల్నే! పో! పైకిబో! ఒకసారి తలుపు దట్టి, ఆయన రా అంటే ఆపాట్న బో"
"సార్!" తలుపు దగ్గర నిలబడి పిలిచాడు.
"ఏంది వెంకటేశా! నీ పాసుగూల రా! లోపలికి. ఏంది యవ్వారాలు? ఎట్టుండావు?
"బాగానే ఉన్నాసార్! మీతో ఒక ఇషయం జెప్పాలని వచ్చా!"
"చెప్పు వెంకటేషా! మా నాయన కాడనుంచి అన్ని యవ్వారాలు తెలుసు నీకు. ఏంది కతా?"
"దేవళాల్లో టెంకాయచిప్పల రేటు పెంచాశారయ్యా! పోటీల మీద జొన్నడలో, యిరగాలమ్మ దేవళంలో, నరిసిమ్ములుకొండలో…. అన్నిచోట్ల కూడబలుక్కున్నట్టుగా బెంచేశారాయ్యా! "
" అట్నా... అయితే.. ఆ యెవ్వారాలన్నీ నాకెందుకు జెప్పు?"
"తమరు కూడా చిప్పరేటు బెంచాల సార్! ఆడపిల్ల గల్లోణ్ణి. నష్టంవస్తుందయ్యా" చేతులు నలుపుకుంటూ అన్నాడు.
"చూడు అబయా! నువ్వేం కొత్త మడిసివి గాదు గదా! యిట్టా మద్య మద్యన రేట్లు బెంచితే మా యాపారం ఏంగావాల జెప్పు? యెనభైఏళ్ళ చరిత్రున్న హోటలబ్బా మాది. ఈ జిల్లా ఓలుమొత్తంలో మాఓటలే గదా నంబర్ వన్నా? మజ్జిగ పులుసుకోసమే కొంతమంది మన ఓటల్ కొస్తారు తెలుసా? చిప్పలరేటు బెంచితే పెరుగుపులుసు ప్రియమవదా? నీకు తెలవంది ఏంది చెప్పు? తర్వాత ఎపుడన్నా చూద్దాంలే మళ్ళీ. నేంజెప్పే వరకూ పాతరేటుకే యెయ్యాల. వేరే యవ్వారం వద్దు. ఇహబో… నాకు పనుండాది."
శరవణలో, వెంకటరమణ విలాస్‌లో, అడయార్ ఆనందభవన్‌లో, టిఫిన్ సెంటర్లల్లో ఏడ బట్టినా యిదే పాట. తర్వాత..తర్వాత! తర్వాత చూద్దామని. వెంకటేశుకు చేతులూ కాళ్ళు ఆడడంలేదు. నష్టానికి అమ్మడమా? ఏంజెయ్యాల? అనే మీమాంసలో పడ్డాడు.
* * *
నెలాకరు రోజది. అందరి దగ్గరా సంతకాలు తీసుకుని డబ్బులెక్క ఫైనల్ జేయించుకునేసరికి పొద్దు బొయింది బాగా. చివరాకర్న జొన్నాడకొచ్చి ఆటోలో నెల్లూరుకు యమాస్పీడ్‌గా బోతుంటే ఎదురుగుండా లిక్కరులారీ మిడిమేళంగా దూసుకోనొచ్చి నరిసిమ్ములకొండ టర్నింగ్ కాడ ఆటోను గుద్దింది. ఆటో తల్లకిందులైంది. వెంకటేశు అపస్మారక స్థితిలో ఉంటే చూసినోళ్ళు 108 నంబరు వ్యానుకు ఫోన్‌జేసి సింహపురి ఆస్పత్రిలో జేర్చారు. భార్య విషయం దెలిసి గగ్గోలు పెట్టి యేడ్చుకుంటా ఆస్పత్రికి జేరింది.
మూడ్రోజులు బెడ్ మీదుండి యింటికొచ్చాడు వెంకటేశు. ఈలోపల హోటళ్ళల్లో నానా తిర్నాళ్ళయింది. అందరూ వెంకటేశును నమ్ముకున్నోళ్ళే! రాకపొయ్యేసరికి ఏంజరిగిందో అర్ధం కాలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తోంది. ఆఘమేగాలమీద పెద్ద హోటళ్ళవాళ్ళు బయట చిప్పలు సప్లై చేసేవాళ్ళకోసం ఎతుకులాడారు. ఆఖరకు చిన్న చిన్న టిఫిన్ సెంటర్ల వాళ్ళు యిచ్చిన ఇన్‌ఫర్మేషన్ ప్రకారం పొగతోటలో ఉన్న రామస్వామిని పట్టుకున్నారు. రామస్వామి చిన్న చిన్న దేవళాల్లో చిప్పలు ఏరి టిఫిన్ సెంటర్లకు సప్లై చేస్తాడు. తనకు చిప్పకు 15 రూపాయలిస్తే సప్లై చెయ్యగలనని తెగేసి చెప్పేసరి అందరూ బిత్తరపోయారు. 30 రూపాయలకు టెంకాయే వొస్తుందిగదా అని అందరూ కొత్త టెంకాయల్నే కొనుక్కోని తాత్కాలికంగా పబ్బం గడుపుకున్నారు. అలాగే దేవళాలవాళ్ళు రామస్వామిని సంప్రదించగా నాలుగు రూపాయలకు తీసుకుంటానని కొంతమందికి, మూడు రూపాయకైతే కొంటానని కొంతమందికి చెప్పాడు. హోటళ్ళ వాళ్ళకు ఏంజెయ్యాలో పాలుబోలేదు. కొత్త టెంకాయలు కొని మజ్జిగపులుసులు, కొబ్బరి చట్నీలు చేసేసరికి కోమలవిలాస్ వాళ్ళకు తడిసి మోపెడయింది కర్చు. ఎంకటేశు రేటు పెరిగిందని ఆపేసినాడా? ఏందనుకొని విషయం అర్ధంకాలేదు.
నాల్రోజులతర్వాత చేతికి కట్టుగట్టుకొని జొన్నవాడ కొచ్చాడు వెంకటేశు. గుర్నాధం అదరాబాదరా పరుగెత్తుకుంటూ వచ్చి ఏక్సిడెంటు విషయం దెలుసుకొని "వెంకటేశా! నీకు పాత రేటుకే యిస్తాం చిప్పలు. మానెయ్ బాక. బస్తాలన్నీ ఎత్తుకొనిపో! అయ్యోరా! నీకు పున్నెముంటాది" అన్నాడు. పూజారి కూడా “మళ్ళీ తిరునాళ్ళదాకా రేటు బెంచం గాని వెంకటేషా! చిప్పలు తీసుకొనిపో!" అన్నాడు. అందరు దేవళాలవాళ్ళు కూడా రేటేం పెంచమని మాటిచ్చి చిప్పలు తీసుకెళ్ళమని బతిమాలుకున్నారు.
* * *
ఐదురోజులతర్వాత హోటళ్ళ ముందు వెంకటేష్ చిప్పల ఆటో ఆగే సరికి అందరికి ప్రాణం లేచొచ్చింది. కోమలవిలాస్‌లో సరుకు బస్తాలు దించుతుంటే ప్రసాద్‌గారు మిమ్మల్నోపాలి కనబడమన్నాడయ్యా! అని వంటవాడు చెప్పాడు. లోపలికి బోంగానే "రా! రా! వెంకటేశా! చేతికా కట్టేంది? నిన్ను మొన్న లారీ గుద్దింటంటగదా! పోన్లే! ప్రాణాలతో బయట బడ్డావు. అంతేజాలు. నువు మొన్న అడిగినట్టే చిప్పకు ఇంకో రెండు రూపాయలు బెంచుతాంగానీ సప్లై మాత్రం ఆపగాక! చీటిరాసిస్తా క్యాషియర్‌కు యియ్యి. పెరిగిన రేటు పొయిన నెలనుంచే తీసుకో! దిగులు పడమాక! పో! నీ కష్టపు సొమ్ము మాకెందుకు! పో!" అన్నాడు.
"సంతోషం అయ్యా! మీ నాయన శ్రీనివాసన్ మాదిరి మీ తాత వెంకటాచలం మాదిరి మీది గూడా చానా జాలిగుండయ్యా ! ఇంకో వెయ్యేళ్ళు చల్లంగుండాల మీ కోమలవిలాసు" అని దండంబెట్టి సంతోషంగా బయటికొచ్చాడు. నాలుగురోజులు సరుకు ఆగేసరికి మిగతా హోటళ్ళవాళ్ళు, టిపిన్ సెంటర్లవాళ్ళు చక్కంగా దారికొచ్చారు. అందరూ కోమలవిలాస్ ఇచ్చిన రేట్ ఇస్తామని చెప్పారు. "అమ్మా! కామాక్షమ్మా! నువ్వున్నావు తల్లా! అని మనసులోనే దండంబెట్టుకున్నాడు.
అన్నమాట ప్రకారం తిర్నాళ్ళకు కామాక్షమ్మ తల్లికి బంగారం పూతేసిన వెండి కిరీటం, మకరతోరణము క్రొత్తవి చేయించాడు వెంకటేశం. ఛైర్మన్‌గారి చేతులమీదుగా అమ్మవారికి సమర్పించి, "అమ్మా..కామాక్షమ్మ తల్లీ.. చల్లంగా జూడు తల్లీ! ఈ జీవితం ఇట్టాబోనియ్యి చాలు" అని మనస్ఫూర్తిగా దణ్ణంపెట్టుకున్నాడు. ఛైర్మన్ "ఒరే! వేంకటేశో! నువ్ వ్యాపారస్తుడివే గాకుండా... మంచి భక్తుడివి గూడా.... నేను అద్దెచ్చుడిగా ఉన్నంతకాలం ఇంకోరు బల్ల్యా! చిప్పలేపారం నీకే! పో!" అన్నాడు. వెంకటేష్ రెండుచేతులెత్తి నమస్కరించాడు. గుర్నాధం పూజారి ఒకరి మొహం ఒకరు చూసుకున్న సంగతి ఎవరూ గమనించలేదు.
"నిన్నే నమ్మినాను సదా నా విన్నపము విని నన్ను బ్రోవుము" అంటూ బయట మైక్‌లో శ్యామాశాస్త్రి పాట తోడి రాగంలో వినిపిస్తూ ఉంది. భక్తులై తన్మయత్వంతో వింటున్నారు. దేవస్థానం అధికార్లు ఉత్సవాలకు అంకురార్పణ ఏర్పాట్లు చేస్తున్నారు.
* * *
No comments:
Post a Comment