మానస వీణ – 8 - అచ్చంగా తెలుగు
మానస వీణ – 8 
- కరణం రమా గాయత్రి కళ్యాణ్



వార్త యందు జగము వర్తిల్లుచున్నది
యదియు లేనినాఁడ యఖిలజనులు
నంధకారమగ్ను లగుదురు గావున
వార్త నిర్వహింపవలయుఁ బతికి
అన్న నన్నయ పద్యం చిన్న నాటి నుండి మదిలో నాటుకు పోయిన మానస నిత్యం ఆశ్రమానికి వచ్చే దినపత్రికలన్నీ క్షుణ్ణంగా చదవడం తన ఏడవ తరగతి నుంచే అలవాటు చేసుకుంది. 
ఆంగ్లం, తెలుగు పత్రికలు వాటీలో వచ్చే దేశ అ, ఆర్ధిక ,రాజకీయాంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టేది. అవసరమనిపించిన విషయాలను నోట్ చేసుకోవడం మానసలో ఉన్న మరో సద్గుణం.
ఎప్పటిలాగే చక్కగా తయారై ఆశ్రమంలోని న్యూస్ పేపర్ చదివేందుకు తోటలోకి వెళ్తోంది మానస. కారిడార్ లోంచి తోటవైపు ఆడుగేస్తున్న ఆ ఆందాల రాశి కోసం సురీడు తన కిరణాలను చెట్టు చాటునుంచి ఆకుల నడుమ ప్రసరించి ఆమెను తాకేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు... ఆమె కురుల స్పర్శకోసం పిల్ల తెమ్మెర ఆరాటపడి జుమ్మని దూసుకుపోయింది.. ఆమె తేజస్సుకు మబ్బుల చాటుకు వెళ్ళి దాక్కున్నాడు అంతవరకూ ఉవ్విళ్ళూరిన సూరీడు. తెలుపు పై గుండ్రటి నల్లటి పూలతల టాప్..నల్ల చున్నీ...నల్ల లెగ్గిన్ వేసుకున్న ఆమె.. తన చున్నీ సరిచేసుకుంటూ.. అందమైన గుండ్రటి ముఖానికి అడ్డుపడుతున్న ముంగురులను సరిచేసుకుంటూ నడుస్తుంటే ఎవ్వరికైనా కలహంస గబుక్కున మెదులుతుంది.. ఆమె నవ్వితే మంచి ముత్యాలు మిలమిల మెరిసి మెరుపుకే సవాల్ విసిరేలా వుంటాయ్..ఆమె మాట్లాడితే పలుకు తేనెల తీయదనం ఎవ్వరికైనా తెలుస్తుంది.. అంతటి ముగ్ధమోహన కౌమారం మానసది. తోటలోకి వచ్చి ఊయల పై చేరి అక్కడున్న పేపర్లని ఒకదాని తర్వాత ఒకటిగా చదువుతూ తనతో తెచ్చుకున్న నోట్ బుక్ లో ముఖ్య విషయాలను వ్రాసుకుంటోంది మానస.
భారతీయుల గొప్పదనం గురించి, భారతీయుల అభివృద్ధి గురించి ఒక్కటంటే ఒక్క పత్రిక కూడా సక్రమంగా.. అందించవనేది మానస అభిప్రాయం. క్రైం కి, రేటింగ్ కు ఇచ్చినంత ప్రాధాన్యం దేశభక్తికి , మానవతావిలువలకి ఏ పత్రికా ఇవ్వడం లేదనేది మానసకు ఎప్పుడో అర్హమైంది. కానీ ఉన్న వాటిలోనే తాను తెలుసుకోవాలనుకున్న విషయాలను తెలుసుకుంటుంటుంది.
అంతలో ఒక పాతకాలం పేపర్లో పడిన " నడిరోడ్డున తల్లిదండ్రులు" అనే వార్త హెడ్ లైన్ మానసను ఆకర్షించింది. తల్లికి కాన్సర్ సోకడంతో కొడుకులు వృద్ధులైన తల్లిదండ్రులు నిర్దయగా బయటకు గెంటేసిన వార్త అది. ప్రశాంత వదనం తో తోటలో అడుగెట్టిన మానస వదనం గంభీరంగా మారిపోయింది. ఎంత దారుణం ఎంత అమానుషం .. కన్నవారిని... పుట్టిన దగ్గర నుంచి కంటికి రెప్పలా పెంచిన తల్లిదండ్రులను దీర్ఘరోగం సోకిందని వదిలేసేంత కసాయిలా ఈ మనుషులు.. ఛ..చ.. మానసకు కోపం కట్టలు తెగేలా వస్తోంది.
అమ్మకు కాన్సర్ సోకిందని.. కొడుకులు కాదని కట్టుబట్టలతో ఇంటి నుండి గెంటేస్తే.. భార్య అలివేణి కాన్సర్ బాధ చూసి తట్టుకోలేక పోయిన భర్త కొండలరావు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయిస్తూ.. రోడ్డుప్రక్కన పేమెంట్ పై దుప్పటితో టెంట్ లా కట్టి అక్కడ భార్య అలివేణి ఉంచి... తన వయసు ను కూడా లెక్కచేయక 40 ఏళ్ళుగా తనతో కలిసి నడచిన దేవతలాంటి భార్యను కాపాడుకోవాలన్న తపనతో అక్కడికి ఎదురుగా వున్న టీ క్యాంటిన్ లో బార్ వాలా గా టీలు అందిస్తూ.. ఎంగిలి కప్పులు కడుగుతూ మధ్య మధ్యలో భార్యను చూసుకుంటున్న కొండలరావు కష్టం..చదువుతున్న మానస మనసు చలించిపోయింది.
పేపర్లో వేసిన ఫొటోలు చూడగానే బాగా బ్రతికిన వారిలనే అనిపిస్తోంది. అసలు మనుషుల్లో మానవత్వం ఎందుకు మంటగలిసి పోతోందీ.. మానస మనసు మనసులో లేదు... ఏంచేయాలి.. ఎలాచేయాలి.. ఎవరు చేయాలి.. ఏదో చేసి వాళ్ళకు చేయూతనివ్వాలి.. తానే అనాధ.. మరి వీళ్ళకి సహాయం ఎలా చేయాలి అనే సంధిగ్ధం.. 'తాను అనాధ' అని గుర్తు రావటంతో మానస కళ్ళు తడిబారాయి.. అమ్మా,నాన్న పిలుపు కోసం తనలాంటి వాళ్ళ మనసు ఆరాటపడుతుంటే..! చక్కగా తల్లిదండ్రులు ఉండి వారు సంపాదిస్తే వారి సొమ్ముతో తిని పెరిగి పెద్దవారై.. పెళ్ళైపోగానే ఆ తల్లిదండ్రులే పరాయి వాళ్ళయి పోవడం మానసను బాధించింది. గుండె బరువెక్కింది.. కళ్ళు వర్షించడం మొదలెట్టాయి.
పరిపరి విధాల ఆలోచిస్తున్న మానసకు నిన్న కాలేజ్ దగ్గర జరిగిన సంఘటన గుర్తొచ్చింది...
**** 
మినిస్టర్ కృషీవలరావు తన కారులో ఎలాంటి హడావుడి లేకుండా.. తన కాలేజ్ వద్దకు వచ్చారన్న విషయం వాచ్ మెన్ ద్వారా తెలుసుకుని బయటకు వచ్చిన మానస ఆయన అడగటంతో కాదనలేక కారెక్కింది. ఆమె ఎక్కడం తోనే కారు దూసుకుపోవడం మొదలెట్టింది.
"ఎక్కడికి వెళ్తున్నాం అంకుల్.." బేల చూపులతో గంభీరంగా కూర్చున్న కృషీవలరావుని అడిగింది..
"చెప్తా.. వెళ్తున్నాం కదా.. తినే ముందర రుచెందుకు... కూల్" అన్నాడు కృషీ.
" ఎంతదూరం వెళ్తున్నాం అంకుల్ మరలా కాలేజ్ లో .. ఆశ్రమంలో కంగారు పడతారు" అంది మానస.
ఏం ఫర్వాలేదు మానసా పనైపోగానే నిన్ను నేరుగా కాలేజ్ దగ్గర దిగబెడతా..!" అన్నాడు కృషీవలరావు..
కారు అత్యంత వేగంతో దూసుకు పోతూ .. సందులు,,,గొందులు సర్రున తిరుగుతూ... ప్రాంగణం కూడాలేని ఒక పాడుబడిన దేవాలయం కి కాస్త దూరంలో ఆగింది.
దేవాలయం వద్ద దిక్కులు చూస్తూ కూర్చున్న ఓ పిచ్చిదాన్ని మానసకు చూపించాడు కృషీవలరావు.
" ఏవరంకుల్ ఆమె.." అమాయకంగా ఆర్ధ్రం గా అడిగింది మానస.
అమె పేరు -శ్రావణి. ఆమె భర్త రఘురాం.. జమిందారీ కుటుంబం వారిది.. ఆమె కూతురుకుకు మూడు నెలల వయసున్నప్పుడు పక్కలో పడుకున్న ఆశిశువు మాయమైంది. ఏమైందో ఇంతవరకూ తెలీదు...ఆ నాటి నుంచి ఈ పిచ్చితల్లి పిచ్చిదైపోయింది.. మాయమైన పాపను తలచుకుంటూ పదహారేళ్ళుగా ఏడుస్తూనే.. వుంది.. కనిపించని దేవుడి కోసం ఆకాశం వైపు అమాయకంగా చూస్తూ ప్రార్ధిస్తూనే వుంది. మాయమైన పొయిన ఆ చిన్నారి శిశువు ఇప్పుడు నీ అంత వుంటుంది.. అందుకే ఒకసారి అమెను ఓదార్చి వద్దామా మానసా..! నీ ముద్దు మాటలు ఆమెలో ఏమైనా మార్పు తెస్తాయేమో అన్నాడు. కృషీవలరావు.. అప్పుడు కృషీవలరావు ఒక వేదాంతిలా మానసకు కనబడ్డాడు .
శ్రావణి గురించి తనకు తెలిసిన వాస్తవాలు మానసకు చెప్పకుండా దాచిన కృషీవలరావు .. ముందుగా వేసుకున్న పధకం ప్రకారం శ్రావణి సహాయకురాలిగా పనిచేస్తున్న తన బంధువైన సరిత ను ఒప్పించి, వ్యాహ్యాళి పేరుతో దేవాలయం వద్దకు తెప్పించేలా ఏర్పాటు చేశాడు కృషీవలరావు.
భయం, భక్తి, ఆప్యాయత, అనురాగం,నడుమ ధైర్యం కూడగట్టుకుని.. పిచ్చి చూపులు చూస్తున్న శ్రావణి వైపుకు కృషీవలరావు తో కలసి అడుగులేసింది మానస .
" పాప .. నా పాప..నా బంగారు తల్లీ.. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా..?" అంటూ రేగిన జుట్టు.. అమాయకత్వం పోతపోసి.. పిచ్చి చూపులు చూస్తోంది శ్రావణీ. దగ్గర కొస్తున్న కృషీవలరావు మానస లను చూసిన శ్రావణీ ఒక్కసారిగా పైకి దూకి కృషీవలరావు ని వెనక్కు నెట్టి మానసను లాక్కుని దేవాలయం లోకి పరిగెట్టి ఒక మూల కూర్చుని " నాపాప.. నాపాప..నా బంగారు తల్లీ...నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా..?" అంటూ కంటి నుంచి ధారగా కారుతున్న కన్నీరు వర్షిస్తున్న విషయం కూడా పట్టించుకోకుండా శ్రావణి మానసను గట్టిగా హత్తుకుని ముద్దుల వర్షం కురిపిస్తుంటే.. ఆందోళన.. ఆనందం నడుమ, తొలిసారి అమ్మ ప్రేమను ఆస్వాదిస్తూ వింతానుభూతికి లోనైంది మానస.నిజంగా ఈమె తన అమ్మే ఐతే ఎంత బావుణ్ణు... అని మనసులోంచి తన్నుకొస్తున్న దుఖా:న్ని పంటి క్రింద అదిమి పట్టింది. అప్పటిదాకా ప్రక్కన దాక్కున్న మెయిడ్ సరిత అక్కడకు వచ్చి ఆమెకు ధైర్యం చెప్పి ..
" ఈ పాప నీపాప కాదు.. " అని ఒప్పించే ప్రయత్నం చేసింది.
శ్రావణి ససేమిరా.. అంటోంది. మళ్ళా రేపు వస్తుందిలే..!.. కాలేజ్ వెళ్ళాలి కదా అంటూ కృషీవలరావు మానసను దగ్గరకు తీసుకుంటే సరిత , శ్రావణిని వెనక్కు లాక్కుంది. పిచ్చితనం తో భోరున విలపిస్తున్న శ్రావణినిని ఓదార్చడం వారి తరం కాలేదు.
" ఒరేయ్ నా పాపను వదిలేయ్.. బూచోడా..ఒరేయ్ బూచోడా.. బూచోడు పాపనెత్తుకెళ్తున్నాడు..ఒరేయ్ నా బంగారు తల్లిని నాకొదిలెయ్" అంటూ కన్నీరు మున్నీరౌతోంది. 
మానస మాత్రం తుఫాన్ ముందరి ప్రకృతిలాగా ఆర్ద్రంగా మారి పోయింది. -శ్రావణి పిచ్చి చూపులనే చూస్తూ కృషీవలరావు వెంట అడుగులేసి కారు దాకా వెళ్ళిన మానస, "అంకుల్ ఒక్కసారి " అంటూ మరలా పరిగెత్తుకుని ఆమె దగ్గరకెళ్ళి ఆమె కంటి నుండి ధారగా వస్తున్న కన్నీటిని తన చేత్తో తుడిచి బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి .. "ఏడ్వకు మళ్లీ రేపొస్తాలే" అని పరిగెత్తుకొచ్చి కార్లో కూర్చుంది...
అంత వరకూ బిగ్గరగా ఏడుస్తూ అరుస్తున్న -శ్రావణి గొంతు ఒక్కసారిగా మూగవోయింది.
కార్లో కూర్చుందో లేదో అంతవరకూ మానస ఆపుకున్న దు:ఖం పొరలు పొరలుగా ఉధృతి దాల్చింది... వెక్కి వెక్కి ఏడుస్తున్న మానసను ఓదార్చేందుకు కృషీవలరావు దగ్గరకు తీసుకుని "ఏడ్వకు మానసా .. ఆమె ఆరోగ్యం కుదుటపడాలనే తప్ప నిన్ను బాధపెట్టాలని కాదమ్మా.. అమ్మ గుర్తొచ్చిందా తల్లి.." అంటూ దగ్గరకు తీసుకుని తల నిమిరాడు. కారు పోనిమ్మంటూ డ్రైవర్ కి సైగ చేశాడు. కారు దూసుకెళ్తుండగా బరువెక్కిన రెండు గుండెలు మౌనం గా ఆలోచిస్తూ ఉండిపోయాయ్.
" ఎవరామె అంకుల్ " మీకేమౌతుంది అని నిశ్శబ్దాన్ని చేధిస్తూ మానస అడిగిన ప్రశ్నకు ఆలోచనల సుడిగాలి నుంచి బయటపడ్డ కృషీవలరావు... " శ్రావణి గారు మాకు దేవతలాంటిదమ్మా..!.. ఆమె పక్కలో ని పసికందుని ఎవరో మాయం చేశారు. అప్పటి నుంచి ఆమె షాక్ లోకి వెళ్ళిపోయింది.పదహారేళ్ళుగా వెదుకుతున్నా.. ఆ పాప జాడ తెలీదు. ఈమె పిచ్చికుదరక పోవడంతో ఇలా నిన్ను తెచ్చి ప్రయత్నం చేశా..!"
"మరి నన్నెందుకు తెచ్చరంకుల్ " నిలదీసింది మానస
"నిన్ను స్కూల్ ఫంక్షన్ లో చూసినప్పుడే.. ఆమె మళ్ళా మనుషుల్లో తిరగాలంటే నీలా తెలివైన వారే సరైన ఔషధం అని అనుకున్నా.. అందుకే నిన్నలా తీసుకెళ్ళా ఏమీ అనుకోవద్దు తల్లీ..అదిగో కాలేజ్ వచ్చింది వెళ్ళు మానసా" అని కాలేజ్ దగ్గర దింపి వెళ్ళిపోయాడు కృషీవలరావు.
ఆమె కూతురు ఇప్పుడెక్కడుందో ..? పాపం ఎన్ని కష్టాలు పడుతుందో... తమలాగా అమ్మకోసం ఎంతగా ఎదురు చూస్తోందో.. అనుకుంటూ రోజంతా దిగులుగా గడిపింది మానస.
*** 
ఒక్కసారిగా వర్తమానం లోకి వచ్చిన మానస...తనలాంటి వారు తల్లి లేక బాధపడుతూ ఒక ప్రక్క, పిల్లలకోసం -శ్రావణి గారిలా పిచ్చాళ్ళవుతూ తల్లులొక పక్క బాధలు పడుతుంటే.. ఉన్న తల్లిదండ్రులని పట్టించుకోకుండా రోడ్డున పడేస్తున్న దుర్మార్గులను ఏంచేయాలో" ఆలోచించే కొద్దీ కడుపు తరుక్కుపోతోంది..మాన్సకు
న్యూస్ పేపర్ లో చద్దివిన వార్తలోని ' కొడుకుల దుర్మార్గంతో రోడ్డున పడ్డ తల్లిదండ్రుల ' కు ఏవిధంగానైనా సహాయం చేయాలని ఆలోచిస్తుండగా తమకు దైవ సమానమైన జిటీఅర్ మదిలో మెదిలారు..
(సశేషం)

No comments:

Post a Comment

Pages