నాకు నేనే(మనిషి)
విశ్వమంతా నాదేనని విర్రవీగాను
భూమిని మాతగా భావించాను
అందుకే అడ్డగోలుగా దోచుకోవచ్చు అనుకున్నాను
చెట్టు, పుట్ట, గుట్ట కాదేదీ
నా దోపిడీకి అనర్హం !
భూగర్భాన్ని నిక్షేపంగా తవ్వేసాను
సాగరాన్ని సానుకూలంగా మధించాను
గగనాన్ని వదలలేదు
కాలుష్యాగ్నులతో నింపేసాను
స్వేచ్చా విహంగాలు లేవు
సేదతీరే జీవరాశులు లేవు
నన్ను చూసి తప్పుకు తిరుగుతున్నాయి.
నాకు ఎదురే లేదనుకున్నాను
విజయగర్వం తో వికటట్టహాసం చేసాను
చెళ్ళుమని చెంప చరుపు
కరోనా రూపం లో పెద్ద కుదుపు
ఉలిక్కిపడ్డాను.
నాకు నేనే బందీనైనాను
చేయి కలపలేను చేరి మాటాడలేను
విన్న కన్న ఉదంతాలతో ఉక్కిరి బిక్కిరయ్యాను
ఎవరి రూపంలో ఎలా వస్తుందో కరోనా
తల్లీ తండ్రీ,భార్యా బిడ్డలన్న బంధాలన్నీ బూటకాలు.
ఈ విశ్వమంతా ఒక బూటకం
ఏదీ శాశ్వతం కాదు
మాయ విడిన మునీశ్వరుడిలా ఒక నిట్టూర్పు
అంతలో ఒక చిరు ఆశ
బతికుంటే బలుసాకు తినవచ్చనుకున్నా
నేను సృష్టించుకున్న దేవుడినే వరమడిగా
బుధ్ధిగా ఉంటానని మాటిచ్చా
నాకు జీవించే హక్కు యివ్వమని ప్రాధేయపడ్డా !
దేవుడు చిరు మందహాసం చేసాడు
బ్రతుక్కి భరోసా లభించేసింది
ఇవ్వాళో,రేపో మందో మాకో వచ్చేస్తుంది
హమ్మయ్య!ఇక నేను యధేచ్చగా
బతికెయ్యొచ్చని సంబర పడ్డాను
ఔను మరి!నా దేవుడు మాట నిలబెట్టుకోలేదని
నన్ను అడగ లేడుగా!
***
No comments:
Post a Comment