శివం - 62
హరసిద్ధుని కథ
రాజ కార్తీక్
( కుంభయ్య కోరిక మేరకు శిల్పి హర సిద్దు తన పని తనం చూపించాలి అని నిశ్చించుకుంటాడు. ఇక తర్వాత... )
తెల్లవారింది ...
చెప్పిన సమయానికి టక్కున వచ్చాడు హరసిద్దు.
ఈరోజు తన పనితనం చూపించాలి కదా ...
తను వెళ్లేసరికి కుంభయ్య సిద్దంగా ఉన్నాడు.
హర సిద్దు జీవితం లో మొట్ట మొదటి సారి తను చెప్పిన సమయానికి సిద్దం అయిన కుంబయ్య ను చూసి,
హ సి "కుంబన్నా! నా జీవితం లో మొట్ట మొదటి సారి ఇంత సమయ పాలన చేసిన వాడిని చూసాను."
కుంభయ్య "నీ కోసమే చూస్తున్నా పద."
అలా దారిలో మాట్లాడు కుంటూ వెళ్తున్నారు.
హ సి " కుంభన్నా! చెప్పు అన్నా! అసలు ఆ కనులు లేని నా సావాస గాడు నా గురించి నీకేం చెప్పాడు అన్న? "
కు. "హర సిద్దు... నీ గురించి నేను ఏమి తెల్సుకున్న అంటే నీవు ఒక మనసున్న వాడివి అని. నీ కోసం నీవు ఏమి చేసుకోవాలో తెలియని వెర్రి వాడివి అని. స్వార్థం తెలియని పిచ్చి వాడివి అని, కఠినంగా వాగే మంచి వాడివి అని, ప్రేమ చూపించి మోసపోయే అసమర్థుడివి అని. జీవితంలో గుణ పాఠం నేర్చుకున్న విషయాలను నుండి ఏమి నేర్చుకోలేని అసమర్థుడువి అని. నీ కున్న తెలివిని లౌకిక ప్రపంచం లో వాడుకొలేని అవివేకివి అని ,లౌక్యం లేని అమాయకుడువి అని."
హ సి "హ హ ఎంత బాగా చెప్పావ్ అన్నా! నా జీవితాన్ని మొత్తం నాకే అర్ధం అయ్యే విధంగా సమాధానం తేల్చి చెప్పావ్. ఎవరయినా నన్ను ఒక మాట అంటే అసలు తట్టుకోలేను. కానీ నువ్వు నన్ను ఇన్ని అన్నా నేను ఇలా నవ్వు తున్నా."
కు " అవును హర సిద్ధ... వారి మాటలు, వారి ప్రవర్తన, అంతా నిన్ను దూషించలి అని, నిన్ను తక్కువ చేయాలి అని. కానీ నేను నిన్ను నీకు అర్దం అయ్యేలే చేయాలి అని ప్రయత్నిస్తున్నాను. అందుకే మీ కుటుంబంలో కూడా నువ్వు ఎన్నో మాటలు పడాల్సి వస్తోంది."
హ సి " ఏమి చేస్తాం అన్నా భగవంతుడు నాకు ఇలాంటి ఒక మనసు ఇచ్చాడు.."
కు " నీకేం హర సిద్ధ... భగవంతుడు నీకు మంచి మనసు ఇచ్చాడు. అద్భుతమైన కళను ఇచ్చాడు. వేచి ఉండు. నీ జీవితం అద్భుతమైన మలుపు తిరుగుతుంది. "
హ సి " అంతా నీ అభిమానం అన్న."
కు " అభిమానం ఏముంది హర సిద్ధ? ఒక్క గుడ్డి వాడేనా? ఇంకా ఎంత మంది )కి ఎన్ని సహాయాలు చేశావ్? అవన్నీ నాకు చెప్పాడు. అందుకే నీకోసం వచ్చాను .."
హ సి " అదేముంది అన్న !మనకి ఎంత చేత అయితే అంత సహాయం చేస్తాము."
ఇంతలో వచ్చింది హర సిద్ధుని శిల్ప శాల.
హ సి "అదుగో అన్న. ఇక్కడే నేను చెక్కిన విగ్రహములు తరలిస్తూ ఉంటా."
కుంభయ్య "సంతోషం హర సిద్ధ ! నీవు ఇక్కడ సంతోష గా ఉంటావు అనుకుంటా."
హ సి " సంతోషం లేదు దుఖం లేదు అన్న. ఇక్కడ ఇలా నా కళను పోషించ కుంటూ ఉంటాను."
కు " ఏది, చూపించు నీ పనితనం! "
అక్కడ కనుచూపు మేరలో ఉన్న విగ్రహాలు ఇద్దరు కలిసి ఒకసారి చూశారు.
"చూసావా అన్నా! ఇక్కడ ఉన్నవన్ని నేను చేసినవి .." అన్నాడు హుందాగా.
కు " చూద్దాం హర సిద్ధ.. ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. "
ఇంచమించుగా అక్కడ అన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. కొన్ని మాత్రం ప్రకృతి శిల్పాలు ఉన్నాయి."
అందులో కొన్ని తన జీవితంలో సంఘటనలు అని మాత్రం హరసిద్దు కే తెల్సు.
కానీ అవి తన జీవితంలో ఉన్న గుర్తులు అని చెప్పటం ఇష్టం లేక, మౌనంగా ఉండి పోయాడు.
అక్కడ ఒకచోట వరుసగా ఉన్నాయి త్రిమూర్తుల విగ్రహాలు.
కుంభయ్య వెళ్ళాడు అక్కడికి...
వాటిని నిశితంగా చూస్తూ ఉన్నాడు ..హర సిద్దు వాటిని చూసి తనను ఎంత బాగా పొగుడుతాడో అని ఆలోచిస్తూ ఉన్నాడు.
"హర సిద్ధ ఇటు రా "
ఈ శివుని విగ్రహం చూడు....
మూడవ కన్ను పెట్టావ్ కానీ, ఆ కన్ను మిగిలిన మూసి ఉన్న మూసి ఉన్న రెండు కనుల వలె లేదు. కొంచెం తక్కువగా ఉంది.
చెవులు కూడా చూడుసరిగా. ఎగుడుదిగుడుగా ఉన్నాయి.
పెదాలు కూడా ఒకటి చిన్నది రెండవది పెద్దది.
ఇక ఈ విష్ణు మూర్తి విగ్రహంలో కమలం చూడు, అని చూపించాడు ..
అయినా విష్ణు మూర్తి ఏంటయ్యా అలా సరిగ్గా నవ్వలేదు అని చూపాడు.
నువ్వు చెక్కిన ఈ చేతులతో బ్రహ్మ దేవడు ఏమి రాత రాస్తాడు? బెమ్మ దేవుడి మూడో ముఖంలో కవళికలు ఏవి?
ఇలాంటి వంకర విల్లుతో రాముడు బాణం వేస్తే సరిగ్గా పోతుందా? అంటూ లోపాలు చెప్పసాగాడు.
హర సిద్దు పూర్తిగా అవాక్కయ్యాడు.
కుంబన్న ప్రతిదీ చూపించి తనకి మంచి చెప్తున్నట్లు ఉంది.
కానీ తన పనితనంలో ఇంత లోటే! హర సిద్ధుని కి ఏమి అర్దం కావటం లేదు.
అప్పుడే ఏమి అయ్యిందో ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment