శివానందలహరి 61-80 - అచ్చంగా తెలుగు
శివానందలహరి 61-80
మంత్రాల పూర్ణచంద్రరావు 


శ్లో: 61.అంకోలం నిజబీజసంతతి రయస్కాంతోపలం సూచికా
సాధ్వీ నైజవిభుం లతా క్షితిరుహం సింధు స్సరిద్వల్లభమ్
ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం
చేతోవృత్తిరుపేత్య తిష్టతి సదా సా  భక్తి రిత్యుచ్చతే ll

తా: ఊడుగ చెట్టు విత్తనములు కింద రాలి మళ్ళీ చెట్టునే చేరునట్లు, సూది సూదంటు రాయిని అంటుకొన్నట్లు, పతివ్రత తనభర్తనే  వదలకుండా ఉండేటట్లు, నదులు సముద్రమును చేరినట్లు భక్తుడి మనస్సు పశుపతి పాదములనే అంటిపెట్టుకుని ఉండుటయే భక్తి అందురు.

శ్లో: 62. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యత శ్ఛాదనం
వాచా శంఖముఖ స్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః
రుద్రాక్షె ర్భసితేన దేవ వపుషో రక్షాంభవద్భావనా
పర్యంకే వినివేశ్య భక్తిజననీ భక్తార్భకం రక్షతి ll

తా: దేవా! ఓ శివా! భక్తి అనెడి అమ్మ ఆనంద భాష్పములు జారుతుండగా బిడ్డను చేరతీసే విధంగా భక్తి రసము భక్తుడి శరీరము పులకించి ఉప్పొంగేట్లు చేస్తుంది.తల్లి బిడ్డకు చలి వంటి బాధలు లేకుండా నిర్మల భావము అనే బట్ట కప్పుతుంది.వాకు అనెడి శంఖమునందున్న భక్తి అనే అమృతముతో కడుపు నింపుతుంది . రుద్రాక్షల చేతను,విభూది చేతను రక్షణ కల్పించును.నీ భావన అనెడి మంచము పై పరుండబెట్టి భక్తుడు అను శిశువును కాపాడును.

శ్లో: 63. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే
గండూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే
కించిద్భక్షితమాంస శేషకబళం నవ్యోపహారాయతే
భక్తిఃకిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే ll

తా:  శివా! దారులు నడిచి నడిచి అరిగిపోయిన చెప్పు నిన్ను తుడిచే కుంచె అయినది. పుక్కిటపట్టి తెచ్చిన నీరు నీకు అభిషేకము అయినది. కొంచెము తినగా మిగిలిన మాంసము ముక్క నీకు కొత్తగా నైవేద్యము అయినది.ఏమి ఆశ్చర్యము,? బోయవాడు  నీకు అపూర్వ భక్తుడు అయ్యెను కదా!

శ్లో: 64. వక్షస్తాడన మంతకస్య కఠినాపస్మారసంమర్దనం
భూభృత్పర్యటనం నమ త్సుర శిరః కోటీరసంఘర్షణమ్
కర్మేదం మృదులస్య తావకపదద్వంద్వస్య గౌరీపతే
మచ్చేతోమణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు ll

తా: గౌరీపతీ ! మార్కండేయుని రక్షించునప్పుడు యముడుని తన్నుట, అపస్మారము అనే కఠినమైన రాక్షసుడిని మర్దించుట, కొండమీద సంచరించుట,నిన్ను మ్రొక్కుచున్న దేవతల కిరీటముల రాపిడి మొదలైన పనులు నీ మృదువైన పాదములకు తగదు. కావున శంకరా ! నా హృదయము అనే మణి పాదుకలతో విహరించుటకు అంగీకరింపుము.

శ్లో: 65. వక్షస్తాడనశంకయా విచలితో వైవస్వతో నిర్జరాః
కోటీరోజ్జ్వలరత్నదీపకలికా నీరాజనం కుర్వతే
దృష్ట్వా ముక్తి వధూస్తనోతి నిభృతాశ్లేషం భవానీపతే
యచ్చేతస్తవ పాదపద్మభజనం తస్యేహ కిం దుర్లభమ్ ll

తా: పార్వతీపతీ! ఎవరి హృదయము నీ పాదపద్మములను పూజించునో వానిని చూసి యముడు తన ఎద పై  తంతావు అని భయపడును, దేవతలు తమ కిరీటములయందు ప్రకాశించు రత్నములు అనెడి దీపాలతో నీరాజనములు పలికెదరు .ముక్తి కాంత వానిని చూచి కౌగిలించు కొనును.వానికి ఇచ్చట ఏమి కష్టము కాదు కదా .

శ్లో: 66. క్రీడార్థం సృజిసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః
యత్కర్మాచరితం మయా చ భవతఃప్రీత్యై భవత్యేవ తత్
శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం
తస్మాన్మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా ll

తా: ఓ పరమేశ్వరా ! ఓ పశుపతీ! సమస్త ప్రపంచమును నీ వినోదము కొఱకు సృష్టిస్తున్నావు. ఈ జనులు అందరూ నీకు క్రీడామృగములు. నా చేత చేయబడుచున్న ఏ పనులు అయినను నీ ఇష్ట ప్రకారమే జరుగుతున్నాయి. అవి నీకు ప్రీతీ కరములే.  అందువలన నా యొక్క సంరక్షణ నీకు కర్తవ్యమే కదా!

శ్లో: 67. బహువిధ పరితోష బాష్పపూర
స్ఫుట పులకాంకిత చారు భోగభూమిమ్
చిరపద ఫలకాంక్షి సేవ్యమానం
పరమసదాశివభావనాం ప్రపద్యే ll

తా: అనేక విధములయిన ఆనంద భాష్పముల ప్రవాహముల చేతను, స్పష్టమైన రోమాంచ చిహ్నముల చేతను,గొప్ప సుఖమునకు స్థానమైనదియు శాశ్వత మోక్షము కోరు వారిచే సర్వోత్తము అగు ఈశ్వరుని భావనను శరణు వేడుచున్నాను.

శ్లో:68. అమిత ముదమృతం ముహుర్దుహంతీం
విమలభవత్పదగోష్ఠ మావసంతీమ్
సదయ పశుపతే సుపణ్యపాకాం
మమ పరిపాలయ భక్తిధేనుమేకామ్ ll

తా: ఓ పశుపతీ! దయగలవాడా!  అంతులేని ఆనందము అను క్షీరమును మరల మరల ఇచ్చుచున్నదియు, నిర్మలమయిన నీ పాదమనెడి కొట్టమునందు ఉన్నది.మంచి పుణ్యములయిన పంట అను భక్తి అనేడి ఒక గోవు  నావద్ద ఉన్నది. దానిని నీవే సంరక్షింపుము .

శ్లో: 69. జడతా పశుతా కళంకితా
కుటిలచరత్వం చ నాస్తిమయి దేవ
అస్తి యది రాజమౌళే
భవదాభరణస్య నాస్మి కిం పాత్రమ్ ll

తా: ఓ దేవా! నా యందు జడత్వము,పశుత్వము,కళంకిత్వము , కుటిల ప్రవర్తనము నా యందు లేవు. ఉన్న యెడల ఓ చంద్రమౌళి ! నేను మట్టుకు నీ ఆభరణముగా ఉండుటకు ఎందుకు పనికి రాను ?

శ్లో: 70. అరహసి రహసి స్వతంత్రబుద్ధ్యా
వరివసితుం సులభః ప్రసన్నమూర్తిః
అగణితఫలదాయకః ప్రభు ర్మే
జగదధికో హృది రాజశేఖరోస్తి ll

తా: బహిరంగ స్థలము నందు,ఏకాంత స్థలమునందు, స్వంత బుద్ధితో సేవింప దగిన సులభుడూ, అనుగ్రహముతో కూడిన శాంతమూర్తి,చెప్పలేని ఫలములు ఇచ్చువాడు, సర్వాధికుడు,విభుడు అయిన ప్రభువు చంద్రశేఖరుడు నా హృదయము నందు  ఉన్నాడు.

శ్లో: 71. ఆరూఢభక్తిగుణ కుంచిత భావ చాప 
యక్తైః శివస్మరణ బాణగణైరమోఘైః
నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీంద్రః
సానందమావహతి సుస్థిర రాజ్యలక్షీమ్ ll

తా: పండిత శ్రేష్ఠుడు పాదుకొనిన భక్తి ని అల్లె త్రాటిగాను అంతఃకరణ అనెడి ధనుస్సును సంధింపబడిన ఈశ్వర స్మరణ అను బాణ పరంపరతో పాపము లనెడి శత్రువులను జయించి పరమానందముతో సుస్థిరమైన పరమేశ్వరసారూప్య రాజ్యలక్ష్మిని ఆనందముగా అనుభవించును.   

శ్లో: 72. ధ్యానాంజనేన సమవేక్ష్య తమఃప్రదేశం
భిత్వా మహాబలిభి రీశ్వరనామమంత్రైః
దివ్యాశ్రితం భుజగభూషణ ముద్వహంతి
యే పాదపద్మ మిహ తే శివ తే కృతార్థాః ll

తా: శివా! భక్తుడు ధ్యానము అనే అంజనముతో నీ పాద పద్మములు అనెడి నిధిని కనిపెట్టి నీ నామ మంత్రములు అనెడి బలితో ఆవరించిన అజ్ఞానమును తొలగించి దేవతలచే ఆశ్రయింపబడినదియు,సర్పము ఆభరణముగా గలదియు అగు మీ పాద పద్మములను గ్రహించి జన్మ సాఫల్యము పొంది పరమానందము పొందుచున్నాడు .

శ్లో: 73. భూదారతా ముదావహద్యద పేక్షయా శ్రీ
భూదార ఏవ కిమతః సుమతే లభస్వ
కేదార మాకలిత ముక్తి మహౌషధీనాం
పాదారవింద భజనం పరమేశ్వరస్య ll

తా: ఓ సుబుద్ధీ ! లక్ష్మీ, భూ భర్త అయిన విష్ణుమూర్తి ఏ పాదాన్ని చూడాలని వరాహత్వము  ధరించాడో, అందువలన కోరుకున్న ముక్తులు అనెడి గొప్ప ఓషధులు లభించెడి మాగాణి అయిన పరమేశ్వరుని పాదారవింద భజన చేసుకొనుము.

శ్లో:  74. ఆశా పాశ క్లేశ దుర్వాసనాది
భేదోద్యుక్తై ర్దివ్యగంధై రమందైః
ఆశాశాటీకస్య పాదారవిందం
చేతః పేటీం వాసితాం మే తనోతు ll

తా:ఆశాపాశములు,క్లేశములు,దుష్ట సంస్కారములు మున్నగు వానిని పటాపంచలు చేయుటకు సమర్ధములు అయిన గొప్పవి,దివ్యములు అయిన సువాసనలచే దిక్కులే వస్త్రములుగా గల శివుని యొక్క పాదము అనేడి పద్మము నా చిత్తము అను పెట్టెను సువాసన గల దానిగా చేయును గాక.

శ్లో: 75. కళ్యాణినం సరస చిత్రగతిం సవేగం
సర్వేంగితజ్ఞ మనఘం ధ్రువలక్షణాఢ్యమ్
చేత స్తురంగమధిరుహ్య చర స్మరారే
నేతః సమస్తజగతాం వృషభాధిరూఢ ll

తా:వృషభ వాహనా ! విశ్వేశ్వరా! సరసముగను,చిత్రముగను ఉండు వేగముగా పరుగెత్తగలిగి, సమస్త జ్ఞానము కలిగి, దోషము లేనిది,ధ్రువ లక్షణములతో గూడినదియు అగు నా మనస్సనే, కల్యాణి అను గుఱ్ఱమును ఎక్కి విహరింపుము.

శ్లో: 76. భక్తర్మహేశ పదపుష్కర మావసంతీ
కాదంబినీవ కురుతే పరితోషవర్షమ్
సంపూరితో భవతి యస్య మన స్తటాక
స్తజ్జన్మ సస్య మఖిలం సఫలం చ నాన్యత్ ll

తా: భక్తి పరమేశ్వరుని పాదము అనెడిఆకాశమును ఆశ్రయించి మేఘమాల వలె ఆనంద వర్షాన్ని కురుస్తుంది.ఎవరి మనస్సు అనే తటాకము ఆ ఆనంద వర్షముతో తడుస్తుందో వారి జన్మము అనే పైరు ఫలించినది అగును.ఇతరములు సఫలము కాదు . నిశ్చయము .

శ్లో: 77. బుద్ధిః స్థిరా భవితు మీశ్వరపాదపద్మ
సక్తా వధూర్విరహిణీవ సదా స్మరంతీ
సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది
సంమోహితేవ శివమంత్రజపేన వింతే ll

తా: ఓ ఈశ్వరా! మీ పాద పద్మముల యందు ప్రీతీ కలది అయి నా బుద్ధి భర్త వియోగాన్ని పొందిన భార్య వలె ఎల్లప్పుడూ నిన్నే ధ్యానించుచూ "  శివ శివ "అను మీ నామ మంత్రాన్ని జపిస్తూ మొహాన్ని పొందినదై మీ పాద ధ్యానం,మీ పాద స్మరణము , మీ పాద సందర్శన,మీ పాద పూజ మొదలగు వాటి గూర్చి విచారిస్తోంది.కావున దీనిని ఉద్ధరించుము.

శ్లో:78. సదుపచారవిధిష్వనుబోధితాం
సవినయాం సుహృదం సముపాశ్రితామ్
మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో
వరగుణేన నవోఢవధూమివ ll

తా: ప్రభూ! శంకరా! పెద్దలకు ఉపచారము చేయుట యందు శిక్షణ పొంది,వినయ విధేయతలు కలిగినదియు, మంచి మనస్సు కలిగి,చక్కగా ఆశ్రయించునదియు అయిన నా బుద్ధిని వరధర్మముచే కొత్త పెండ్లి కూతురు వలె గైకొనుము.

శ్లో: 79. నిత్యం యోగిమనస్సరోజదళసంచారక్షమస్త్వత్ర్కమః
శంభో తేన కథం కఠోరయమరాడ్వక్షఃకవాటక్షతిః
అత్యంతం మృదులం త్వదంఘ్రియుగళం హా మే మనశ్చింతయ
త్వేతల్లోచనగోచరం కురు విభో హస్తేన సంవాహయే ll

తా: శంకరా! నీ పాదములు ఎల్లప్పుడూ పద్మముల వంటి యోగుల హృదయములలో సంచరించుచూ మృదువుగా ఉందును కదా. అట్టి  పాదముతో బండ రాతి వలె ఉండు యముని వక్షఃస్థలముపై నీవు ఎలా తన్నావు ? నీ సాహసాన్ని తలుచుకుని నా హృదయము ద్రవించి పోవు చున్నది.నీ పాదములను ఒక్కసారి నాకు చూపించుము, చేతితో వత్తి నీ పాద సేవ చేసుకుంటాను.

శ్లో: 80. ఏష్యత్యేష జనిం మనో-స్య  కఠినం తస్మిన్నటానీతి మ
ద్రక్షాయై గిరిసీమ్ని కోమలపదన్యాసఃపురాభ్యాసితః
నోచేద్దివ్యగృహాంతరేషు సుమన స్తల్పేషు వేద్యాదిషు
ప్రాయః సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ ll

తా: శంకరా! ఈతడు భూమి మీద పుట్టబోతున్నాడు, వీడి హృదయము మిక్కిలి కఠినము గా ఉంటుంది , అందు సంచరించవలసి వచ్చును అని నీవు కొండ రాళ్ళ మీద నాట్యము చేయు చున్నావు.లేనియెడల మిద్దెలు,మేడలు పూలపాన్పులు ఉండగా నీవు ఎందుకు బండల మీద నాట్యము చేస్తావు.?

***

No comments:

Post a Comment

Pages