తిరోగమన కవిత్వానికి - అచ్చంగా తెలుగు

తిరోగమన కవిత్వానికి

Share This
తిరోగమన కవిత్వానికి అడ్డుకట్ట పడాలి
తక్కెడశిల జాని బాషా 


అంగులూరి అంజనీ దేవి గారు నవల రచయిత్రిగా తెలుగు సాహిత్యానికి సుపరిచితులే. వారు మొదటి పుస్తకం “గుండెలోంచి అరుణోదయం”. ఉమ్మెతల సాహీతి పురస్కారం 1986లో లభించిన  ఈ పుస్తకానికి అద్దెపల్లి గారు, రాథేయా గారు, ఎస్వీ సత్యనారాయణ గారు విలువైన ముందుమాటలు రాశారు. అలాగే ప్రముఖ రచయిత్రి శ్రీమతి శిలాలోలిత గారు వారి phd సిద్ధాంత గ్రంధమైన “కవయిత్రుల కవితా మార్గం” లో “గుండెలోంచి అరుణోదయం” కవితా సంపుటిని ఉద్దేశిస్తూ “ ఈనాటి సామాజిక సమస్యలైన నిరుద్యోగం, దారిద్ర్యం, శ్రమ దోపిడి, స్త్రీల సమస్యలపై కవితలు తీవ్రరూపంలో కనిపిస్తాయని, అయితే ఆవేశాన్ని కవితాత్మకంగా వెలువరించడం వల్ల కవితా సంపుటికి ప్రత్యేకతను చేకూర్చిందని, అంగలూరి అంజనీ దేవి గారిది పోరాట శీలమైన రచనా ధోరణి అని పేర్కొన్నారు.  
1986 ప్రాంతంలో తెలుగు సాహిత్యానికి వ్యాపార యుగమని. అందుకే రీడర్స్ యొక్క అధమ ప్రవృత్తుల్ని రెచ్చగొట్టే సాహిత్యం సమాజం నిండా వ్యాపిస్తోందని, అలాంటి సాహిత్యం వ్యాపారానికి బాగా ఉపయోగపడుతోంది కనుక రచయితలు పోటీ పడి అటువంటి సాహిత్యాన్ని సృష్టించారని అద్దేపల్లి రామమోహనరావు గారు అభిప్రాయపడ్డారు. సాహిత్యం సమాజ పురోగమనానికి ఉపయోగపడాలి కానీ సమాజాన్ని తిరోగమనం వైపు నడిపించకూడదు. సాహిత్యం వాస్తవాలను బహిర్గతం చేయాలి. అలా కాకుండా ఊహలు, కల్పనలు, అసత్యాలు, పురోగమనం భావాలు రాయడం వల్లే అద్దేపల్లి గారు అలాంటి వాక్య చేసారు.    
వచన కవిత్వంలో వస్తువు ఎంత గొప్పదైన శిల్పం తేలిపోతే రీడర్స్ చదవరు. కవిత్వం హృదయానికి హత్తుకోడానికి ముఖ్య కారణం శైలి. అందుకే కవులు ఆ శైలిపై దృష్టి పెట్టాలి. తమదంటూ ఒక ప్రత్యేకమైన శైలిని నిర్మించుకోవాలి. శ్రీశ్రీ, సినారె, శివారెడ్డి లాంటి వారు ఎందుకు గొప్ప, మహా కవులుగా పేరొందాలంటే కారణం వారికి ఉన్న ప్రత్యేకమైన శైలే. అద్దేపల్లి గారు శైలి గురించి నాలుగు ముఖ్యమైన విషయాలు తెలియజేశారు.
1.కవి చెప్పాలనుకున్న భావన యొక్క గమనానికి శైలి అతికినట్లు ఉండాలి. అసలు కవి భావాన్ని ఏ కృత్రిమ లక్షణాలు లేకుండా సూటిగా చెప్పడానికి వచన కవిత అవతరించింది. కవి వస్తువు తీసుకున్న తర్వాత ఆ వస్తువును ఎలా ప్రెజెంట్ చేస్తున్నారో అన్నది కూడా ముఖ్యమే. వస్తువుకు సరితూగని ప్రతీకలు, ఊహలు, మెటాఫర్, పోలికలు జోడించడం వల్ల కవిత్వం తేలిపోతుంది. రైతు వస్తువు అయితే రైతుకు సంబంధించిన భావాలే కవిత్వంలో రావాలి. అలాకాకుండా వస్తువు నుండి పక్కకు జరిగి వేరే విషయాలపై కవిత్వం నడుస్తే వస్తు భంగం చేసినట్లే అవుతుంది. వచన కవిత్వంలో ఉన్న సౌలభ్యం సూటిగా సుత్తి లేకుండా విషయాన్ని రీడర్స్ కి చేరవేసే సదుపాయం ఉన్నది. అలాంటప్పుడు అర్థంలేని, అర్థం కాని భాషలో కవిత్వాన్ని రాస్తే కవి రీడర్స్ కి దూరం అయినట్టే. కవిత్వంలో ఉపయోగించే, పద బంధాలు, భావ చిత్రాలు, దృశ్యాలు, ఇమేజెస్ వస్తువుకు, శైలికి అతుక్కుపోవాలి. కవితలో ఒక పదాన్ని తీసివేస్తే మొత్తం కవిత అసంపూర్ణం అవుతుంది అనేలా పదాలను ఉపయోగించాలి.
2.కవిత్వంలో భాషా సౌలభ్యం గురించి గురజాడ గారు ఇలా అన్నారు. “గుత్తునా ముత్యాల సరములు, కూర్చుకొని తేటైన మాటలు” అంటే కవిత్వం ముత్యాల సారం లాగా కూర్చబడాలి. ప్రజా కవిత్వం లక్షణం తేలికైన భాష ఉండటం, సులభంగా అర్థం కావడం. అలా కాకుండా కొంతమంది కవులు, కవుల సమూహాలు అర్థం కాని కవిత్వాని రాస్తూ దానినే పొగుడుతూ అదే కవిత్వాన్ని ప్రచారం చేస్తున్నారు. మరి వీరు సీనియర్ కవులను చదువుకున్నారో లేదో తెలియదు. పోస్ట్ మాడరన్ కవిత్వం పేరుతో ఊహకు అందని కవిత్వాన్ని రాయడం వల్ల ప్రజలకు కవిత్వం దూరం అవుతోంది. ఈ మధ్య కాలంలో కొందరు కవులు కవిత్వాన్ని రాసి ఆ కవిత్వం అర్థం కాకపోతే దాని యొక్క భావాన్ని విడమర్చి చెప్పుతున్నారు. మునుపు పద్యం రాసి పద్య భావాన్ని రాసినట్లుగా కవిత రాసి కవిత్వ భావాన్ని కూడా రాయాల్సిన స్థితిని తీసుకు వస్తున్నారు. ఇలాంటి కవిత్వం తిరోగమనం కాకుండా ఇంకేం అవుతుంది. దీనినే అద్దేపల్లి గారు వ్యతిరేకించారు. అలాంటి కవిత్వం రాయడానికి గల కారణాలు.
1.కష్టమైనా భాషను రాయడం వల్ల కవిత్వానికి ఏదో ఉదాత్తత కలుగుతుందనే అభిప్రాయం ఉండటం.
2.ఏంతో గాఢమైన శిల్పాన్ని రాస్తున్నాము అనే భావనలో ఉండటం. 
3.అందరికంటే భిన్నంగా ఉన్నామనే భ్రమలో తేలిపోవడం.
4.అదే మంచి కవిత్వమని అలా రాస్తేనే గుర్తింపు వస్తుందని అనుకోవడం.

విరుద్ధ పదబంధాలు, వక్ర అన్వయాలు, అసత్యమైన భవనాలు, అనుభూతికి లొంగని ఊహలు, సాధ్యం కానీ కల్పితాలు, సంస్కృత పదాలను వాడటం, పొంతన లేని కవిత్వ పాదాలు రాస్తున్నవారి కవిత్వం ప్రజలకు ఉపయోగకరం కాదు. సమాజ నిర్మాణానికి ఎంతమాత్రం ఉపయోగపడదు.

3.కవిత్వంలో అనుప్రాసల్ని, అంత్య ప్రాసల్ని మానివేయకుండా. ప్రాస కోసం పాదాలను వెతుక్కుంటూ భావాన్ని చంపడం సరైంది కాదు. వచన కవుల్లో మొదటి , తరువాతి తరం వారు వీటిని పాటించారు కానీ కాలం ఋజువు చేసిన సత్యం వచన కవిత పూర్తి భావ గమనానికి ప్రతిబింబంగా ఉండాలని. అందుకే నేడు చాలా మంది వచన కవులు ప్రాసను వదిలివేశారు. ఇంకా కొంతమంది కవులు ప్రాసలను రాయడం వల్ల భావాన్ని చంపిన వారే అవుతారు. కవులు ప్రాసల్ని కాకుండా భావాన్ని, శిల్పాన్ని, వస్తువును, పద బంధాలను, వాక్య నిర్మాణానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాలి.

4. కవిత్వంలో పంక్తి వెంట మరో పంక్తి ఊపుతూ సాగాలి. మొదటి పంక్తి రెండో పంక్తిని చదివింపచేయాలి. అలా కాకుండా పేలవంగా నడిచే పంక్తులు వల్ల రీడర్స్ కవిత్వాన్ని పూర్తిగా చదవడానికి ఇష్టపడరు. కవిత్వం ప్రవాహమైన సాగాలి. మడుగులా ఉండకూడదు.

అనేక వస్తువులపై కవిత్వాన్ని రాస్తున్న నేటి కవులు కవిత్వంలో అభిప్రాయాలను ప్రకటిస్తున్నారు. ఆ అభిప్రాయాలు సరైనవో కాదో తెలియకుండా ప్రకటించడం వల్ల సమాజాన్ని తప్పుడు మార్గంలో నడిపించిన వారు అవుతారు. అభిప్రాయ ప్రకటన మాత్రమే కాదు పరిష్కార మార్గాలు సూచించాలి. అలా సూచించాలంటే సంఘటనపై పూర్తి పట్టు, అవగాహన ఉండాలి.

ఇక పోతే కొంతమంది కవులు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, అమెరికన్ కవిత్వాన్ని చదివి అదే గొప్ప కవిత్వం అనే ధోరణిలో ఉండిపోయి. ఆ కవిత్వాన్ని దిగుమతి చేయడంలో తలమునకలైన ఉన్నారు. ఇలాంటి కవుల దృష్టిలో మన తెలుగు కవులు సరైన కవిత్వాన్ని రాయలేదు అనే భావన ఉంటుంది. అయోమయానికి గురి చేసే కవిత్వాన్ని సృష్టిస్తూ గొప్ప కవులమని భ్రమ పడుతూ ఉంటారు. ఎస్వీ సత్యనారాయణ గారు చెప్పినట్టు కవిత్వానికి లక్ష్యం ఉండాలి. లక్ష్యం వైపు నడిపించే తపన ఉండాలి. ఆ గమ్యం వైపు ప్రజలని నడిపించగలగాలి.

ఇక అంజనీ దేవి గారి కవిత్వాన్ని పరిశీలిస్తే.
కవి హృదయం శీర్షికతో రాసిన చిన్ని కవితలో విలువైన అభిప్రాయాన్ని ప్రకటించారు.

“బాధను వర్ణించకు
గాయాల గతాన్ని
బయటకు లాగు” 
రచయిత్రి చేసిన పై వాక్యాని విశ్లేషించుకుంటే. అనంతమైన భాధను ప్రకటించడం వల్ల ప్రయోజనం లేదు. ఆ బాధకు సంబంధించిన మూలాలను బయటకు లాగు అప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పడమే. అలా కాకుండా బాధను వర్ణించి వదిలేస్తే సమస్యకు పరిష్కారం లభించదు. సమస్య మూలాలలోకి వెళ్ళమని అంజనీ దేవి గారు కవులకు హితభోద చేశారు. కవిత చివర్లో ఒక చురక కూడా వేశారు.
“చెత్త కవిగా కాకుండా
చైతన్య కవిగా రాణించు” 
అంజనీ దేవి గారు ఊసుపోక కవిత్వం రాయలేదు. సమాజం కోసం, సమాజంలో జరిగే స్త్రీ వివక్షపై, అన్యాయాలపై, అవినీతి వ్యవస్థలపై వారి కవితా పంక్తులను సంధించారు. ప్రతి కవిత సమాజాన్ని మెరుగు పరచాలనే తపనతో రాసారు. గత సమాజం కంటే నేటి సమాజం మెరుగైంది. ఇప్పుడున్న సమాజం గంటే రాబోయే సమాజం మంచిగా ఉండాలనే తపనతోనే కవులు కవిత్వాన్ని రాస్తున్నారు. కవి ఆశావాదిగా ఉండాలి. సమాజం మెరుగుపడుతుందని, మెరుగుపడాలనే కవిత్వాన్ని రాయాలి. నిరాశను, నిస్ప్రూహను, చైతన్యాన్ని, భావ వాదాన్ని, మూఢనమ్మకాలను, అసత్యాలను పేర్చి కవిత్వాన్ని అల్లకూడదు. అంజనీ దేవి గారి కవిత్వం సత్యాలను బహిర్గతం చేసింది. మంచి సమాజం కోసం కలకలంటూ రాసిన కవిత్వమే పుస్తకంలో మెండుగా ఉన్నది.

ఇక అంజనీ దీవి గారి కవిత్వంలో అరుదైన పద బంధాలు పుష్కలంగా లభిస్తాయి. కరువు చలికి, ఆకలి ఎండకు, హక్కుల కుక్కి మంచంలో, బాధ్యతల దుప్పటి, స్వప్నాల మంచు, దౌర్భాగ్య మగత, మాటల మట్టి, చెరచబడ్డ చట్టం లాంటి పద బంధాలు కవిత్వాన్ని మరింత ఇష్టంగా చదివించేలా చేస్తాయి. పుస్తకంలో ఎక్కువగా స్త్రీ సమస్యలపై కవిత్వం ఉన్నది. స్త్రీ ఏమి కోల్పోయింది, ఎలా అన్యాయానికి గురి అయ్యింది, స్త్రీ మానసిక సంఘర్షణ, శారీరక హింస, అసమానతల సమాజం స్త్రీని ఎలా వంచన చేసిందో తెలిపేదే అంజనీ దేవి గారి కవిత్వం. ముప్పై సంవత్సరాల ముందు వచ్చిన కవిత్వ సంపుటి నేటికి నిలబడటానికి కారణం కవయిత్రి గారు తీసుకున్న వస్తువులే. నేడు రాసే ఎంతో మంది కవిత్వం కన్నా మంచి కవిత్వాన్ని అప్పటికే రాసిన అంజనీ దేవి గారు ప్రశంసనీయులు.
వాక్య నిర్మాణం, ప్రాసలు, ఒక భావాన్ని తెలపడానికి అనేక పదాలను వాడటం, కొన్ని కవితల్లో శిల్పం కొరవడటం, అభ్యుదయ కవిత్వం రాస్తూ భావ వాద దృక్పథంతో ఉండటం లాంటి విషయాలపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉన్నది. 

No comments:

Post a Comment

Pages