'త్రిమతాచార్యుల్లో ప్రధములు..!'
-సుజాత.పి.వి.ఎల్
త్రిమతాచార్యులు ఆదిశంకరులు, రామాచార్యులు, మధ్వాచార్యులు. ఈ త్రయంలో ప్రధములు, గురువు, మహాకవి శ్రీశంకరాచార్యులు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని 'అద్వైతం' అంటారు.
శంకరాచార్యులు కారణ జన్ములు. మనమంతా పూర్వ జన్మ పాపపుణ్యాల ఫలితాలను అనుభవించటం కోసం జన్మిస్తాం. కానీ, ఆయన అలా జన్మించిన వారుకాదు. ఆయన సాక్షాత్తు శివరూపం. కైలాసవాసియైన శంకరుడికి, కాలుడి యందు జన్మించిన శంకరునికి అభేదం. ఇద్దరూ ఒక్కటే. ఎలాగంటే, వైశాఖ శుద్ధ పంచమి నాడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రలో, శంకర భగవత్పాదులు జన్మించారు. మహాజ్ఞాని, పరమకారుణ్యులు. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురు దంపతులకు కేరళలో 'కాలుడి' అనే గ్రామంలో పుట్టారు.
ఒకసారి కాశీ పట్టణంలో శంకరాచార్యుల వారు వెళుతుంటే కుక్కల్ని వెంట బెట్టుకుని ఒక చండాలుడు వచ్చాడు. శంకరుల శిష్యులు 'తొలగు తొలగు' అని అన్నారు. ‘శంకరులు వారు స్నానానికి వస్తున్నారు నువ్వు ఎదురొస్తావా? పక్కకెళ్ళు పక్కకెళ్ళు’ అన్నారు. ఆ రోజుల్లో శంకరాచార్యులవారు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతం ఎంత ప్రాచూర్యం పొందిందంటే.. ఒక చండాలుడికి కూడా సులభంగా అర్థమైపోయింది. అందుకని అతను ఇలా అన్నాడు ''ఏమయ్యా నువ్వే చెప్పావు కదా! అంతటా పరివ్యాప్తమైనది ఆత్మ తప్ప వేరొకటి లేదని, నన్ను (శరీరాన్ని) తప్పుకోమంటావా? లేక ఆత్మని తప్పుకోమంటావా? దేన్నీ తప్పుకోమంటావు?'' అని అడిగితే శంకరులు వచ్చినవాడు శంకరుడే అని గుర్తుపట్టారు, వినమ్రులై శిరసు వంచి స్తోత్రం చేశారు. అదీ ఆదిశంకరుల వైభవం. శంకరుల వంటి గురువు ఈ ప్రపంచంలోనే ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. వారికి వారే సాటి.
హిందూ మతంపై శంకరుల ప్రభావం అద్వితీయమైనది. హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడంలో దేశదేశాలు తిరుగుతూ ఘన పండితులతో ఆధ్యాత్మిక వాదన సాగించి విషయావగాహనతో ఒప్పించి, మెప్పించిన విద్వన్మణి ఆది శంకరులు. ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మ సూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యం చెప్పిన మహాజ్ఞాని. శంకరాచార్యులను అనుగమించిన వారికి, విభేదించిన వారికి కూడా ఇవి మౌలిక వ్యాఖ్య గ్రంథాలుగా ఉపయుక్తమయ్యాయి.
శంకరులవారు చతుర్మఠ వ్యవస్థాపకులు. ఆయన కర్ణాటకలో 'శృంగేరి' , గుజరాత్ లో 'ద్వారక' , పూరీలో 'పూరి' , బదరీనాథ్ లో 'జ్యోతిర్మఠం' నాలుగు మఠాలను స్థాపించారు. అవి, శంకరుల హైందవ ధర్మ ప్రచారానికి నాలుగు దిక్కులా సమన్వయ దీప స్తంభాలలా నిలిచి పని చేశాయి. సమకాలీన హిందూ మతస్తుల ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం చూపిన సిద్ధాంతవేత్త ఆదిశంకారాచార్యులు.
నేటి ఆధునిక పద్ధతులను శంకరుడు ఆనాడే మఠాల నిర్వహణ కోసం ప్రవేశ పెట్టడం జరిగింది. మఠ నిర్వహణ కోసం శంకరుడు నియమించబడే సన్యాసుల నామాంతరం, యోగ పట్టము అనే దానిని ప్రవేశ పెట్టాడు. హిందూధర్మం ప్రకారం సన్యాసం తీసుకొన్న వ్యక్తి పాత పేరును తొలగించుకొని ‘సన్యాసి’ అని సూచించే కొత్త పేరును తీసుకుంటాడు. అటువంటి పది పేర్లను శంకరుడు నిర్దేశించాడు. అవి- తీర్థ, ఆశ్రమ, వన, గిరి, అరణ్య, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పురి అనేవి. హిందూ సన్యాసుల పేర్ల చివర ఇలాంటివి కనిపిస్తాయి. ఉదాహరణకి ఆనందతీర్థ, విద్యారణ్య, సత్యవృతసామాశ్రమ, విద్యాప్రకాశానందగిరి, చంద్రశేఖర సరస్వతి, నృసింహభారతి, తోతాపురి అనే పేర్లు సుప్రసిద్దాలు.
ధర్మాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒఒక్కరికి బాధ్యత ఉందని ప్రజలకి తెలియ చెప్పిన దిశా నిర్దేశకుడు 'శంకరుడు'.
*****
No comments:
Post a Comment