నెత్తుటి పువ్వు - 21
మహీధర శేషారత్నం
(జరిగిన కధ : రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన సరోజ అనే అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు. రాజు చెల్లెలు వసంత అతని ఇంటికి వచ్చి వెళ్తుంది. జ్వరంతో ఉన్న సరోజకు సపర్యలు చేస్తాడు రాజు. బట్టల కొట్లో పనిచెయ్యనని చెప్పేస్తుంది సరోజ. కడుపుతో ఉన్న పార్వతికి సాయంగా బయలుదేరుతుంది సరోజ. )
“రాజా! ఆ మూలకూచుంది ఓ ఆడాది చూసావా!...” వేలెత్తి చూపాడు భాస్కర్. అతను ఈ మధ్యే కొత్తగా చేరాడు కానిస్టేబుల్గా మనిషి చురుకైనవాడు. మంచివాడు.
“ఎవరు?”.... భాస్కర్ చూపించిన వైపు చూసాడు.
పాతికేళ్ళ పడుచు... చెదిరిన జుట్టు, పిచ్చిగా ముడేసి మోకాళ్ళ మీద తలెట్టి నిశ్శబ్దంగా కూర్చుంది. ముఖం కనపడడంలేదు. కాని చిన్న వయసుగా తెలుస్తూనే ఉంది.
“ఏం కేసు?” కాజువల్గా అడిగాడు రాజు.
“మర్డర్ కేసు.”
“మర్దరా! .... ఉలిక్కి పడ్డాడు రాజు.
“ఊఁ! మదమెక్కి అక్రమ సంబంధం పెట్టుకుంది. పిల్ల అడ్డుగా ఉందని గొంతు పిసికి చంపేసింది....” కసిగా అంటూ లాఠీతో డొక్కలో ఒకపోటు పొడిచాడు ఆమెని భాస్కర్.
నాగరాజు ముఖం పాలిపోయింది. నోటమాట రాలేదు. కాసేపటికి బలవంతంగా నవ్వు తెచ్చుకుని... “ఊఁ! ఈ మధ్య ఈ కేసులు ఎక్కువయి పోయాయి.” అన్నాడు.
“అవును రాజా! తెల్లారిలేస్తే ఇవే కేసులు ప్రియుడి సాయంతో భర్తను చంపిన భార్య, ప్రియురాలి సాయంతో... భార్యను చంపిన భర్త, అడ్డుగా ఉన్న పిల్లలను చంపడం.. ఇదొక జబ్బేమో.”
“ఊఁ! నిన్న పేపర్లో చూసావా! పెద్ద ఆఫీసరు గారి భార్యట, చక్కగా ఇద్దరు పిల్లలు, బాగా చదువుకుంటున్నారు. భర్తకు తెలియకుండా కారు డ్రైవరుతో సంబంధం పెట్టుకుంది. వాడు వాడుకుని గుంజాల్సినంత డబ్బు గుంజుకొని చంపి పడేసాడు. పోలీసు ఇన్వెస్టిగేషన్లో కథంతా లోకానికి వెల్లడయింది. భర్త అవమానం భరించలేక, తలెత్తుకు తిరగలేనని రైలుకింద పడి ప్రాణం తీసుకున్నాడు. ఇప్పుడు ఆ పిల్లలు బిక్కుబిక్కుమంటూ భయంభయంగా బ్రతుకుతున్నారు. వీళ్ళకు శరీరం తప్ప మనసుండదేమో” నిట్టూర్చేడు భాస్కర్.
నాగరాజుకి తననే వేలెత్తి చూపెడుతున్నట్టుంది.
జరిగిన తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. పదేపదే మనసుకునచ్చచెప్పుకున్నాడు. ఇదొక ఊబి. అక్రమ సంబంధం ఊబిలో కూరుకుపోతే పైకి ఎప్పటికీ రాలేము. కానీ ఈ లోకంలో ఎంతో మంది ఇద్దరు భార్యలతో ఉన్నవాళ్ళు ఉన్నారు. అంతెందుకు తమ పోలీసులలోనే తనకు తెలిసినవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు.ఇద్దరు భార్యలతో ఉన్న గొప్ప గొప్ప కళాకారులెందరో ఉన్నారు. కాని వాళ్ళెవరూ తనలా ఇంత మథన పడరేమో. ఎవరయినా దొరికితే దొంగ లేకపోతే దొర ఏమైనా కాని తను రోజావైపు మళ్ళీ తలెత్తి చూడకూడదు. అలా ఒక నెలాళ్ళు పంతంగా గడిపాడు. ఒకరోజు టీ.వీ.లో మహిళా మండలి వాళ్ళతో చర్చ. ప్రేమంటే ఏమిటి? ఆడపిల్లలు ఎలా మోసపోతున్నారు అంటూ. ఒకావిడ మాత్రం గట్టిగా వాదించింది.” మోసపోవడమేముంది! ఎవరిని చూస్తే మనస్సు స్పందిస్తుందో ఎలా తెలుస్తుంది. ఎక్ మారిటల్ రిలేషన్స్ ఇల్లీగల్ కాదు. పెళ్ళయిందా? అవలేదా? కులమేమిటి? బాగా సంపాదన ఉందా? ఇలాంటివన్నీ చూసుకుని మనసు స్పందించదు. సహజ స్పందన ఎవరిని చూస్తే కలుగుతుందో ఆ రిలేషన్ మంచిదే” అని.
కాని మిగిలిన వాళ్ళెవరూ దానిని సమర్థించలేదు.
(సశేషం)
No comments:
Post a Comment